చైనా అభివృద్ధి శిధిలాలు ప్రాణాలు మింగేస్తున్న వేళ… -ఫోటోలు


దేశంలోని సకల సంపదలు కొద్ది మంది వద్దనే కుప్పబడినప్పుడు ఆ సంపదలని వెలికి తీసే బీద ప్రాణాలు కుప్పలుగా సమాధి కావలసిందే. ఆర్ధిక అభివృద్ధిలో అమెరికాను అధిగమించడానికి శరవేగంగా దూసుకుపోతున్న చైనాలో అభివృద్ధి పక్కనే అభివృద్ధి శిధిలాలు కుప్పలై పోగుబడి కొండలై పెరిగిపోయి చివరికి అమాంతం కూలిపోయి శ్రామికుల ప్రాణాల్ని నిలువునా కప్పేస్తున్నాయి.

డిసెంబర్ 20 తేదీన అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన షెన్ జెన్ నగరంలో ఓ కొండ ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో మట్టి, భవన శిధిలాలు, ఇంకా అనేక వృధాలు వరదలా తన్నుకువచ్చి విశాలమైన ప్రాంతాన్ని సమాధి చేసేసింది. ఈ శిధిలాల కింద వందల మంది చిక్కుకుపోయారు. 10 మంది శవాలను వెలికి తీశారు. కానీ కనపడనివారి సంఖ్య 80 నుండి 100 వరకు లెక్కిస్తున్నారు. వారు బతికి ఉండడానికి ఇక అవకాశాలు లేవు.  శిధిలాల కింద కప్పబడిన భవనాల్లో కార్మికులు మూకుమ్మడిగా నివసించే డార్మీటరీలు మూడు ఉన్నాయి. దానితో మృతుల సంఖ్య ఎక్కువ ఉండవచ్చని భావిస్తున్నారు.

‘విరిగిపడ్డ కొండ చరియలు’ తరహా దుర్ఘటనలు చైనాలో ఇప్పుడు నిత్య కృత్యం అయ్యాయి. ఈ దుర్ఘటనలకు తక్షణ కారణం గా ప్రకృతి కనిపిస్తుంది. రోజుల తరబడి కురిసే వర్షంలో కొండ చరియలు నాని కూలిపోయినట్లు వార్తలు చెబుతాయి. కానీ తరచి చూస్తే అసలు సంగతి తెలుస్తుంది. కొద్ది మందికి సంపదల వర్షం కురిపిస్తున్న చైనా ఆర్ధిక వృద్ధి మెజారిటీ శ్రామిక ప్రజల పాలిట ప్రకృతి దుర్ఘటనలుగా మారి వారి ఉసురు తీస్తోందని అర్ధం అవుతుంది.

ఈ రోజుల్లో అభివృద్ధి అంటే తెలుసా! పెద్ద పెద్ద పొడవైన లోతైన ఎత్తైన… వంతెనలు, వెడల్పాటి 10, 12 ఇంకా ఎన్ని వీలైతే అన్ని లేన్ల రోడ్లు, మేఘాల్ని ఆకాశాల్నీ తాకే ఎత్తైన భవనాలు, ఇంకా ఎప్పటికప్పుడు రికార్డులు తిరగరాస్తూ పోయే భారీ అతి భారీ ఇంకా పెద్ద భారీ నిర్మాణాలు… ఇవే అభివృద్ధి  అవి జిగేల్ జిగేల్ మని మెరుస్తూ ఉంటే అది ఇంకా మరింత అభివృద్ధి. అభివృద్ధి ఫలితాల్ని జనం అంతా అనుభవించకపోతే అదేం అభివృద్ధి అని ఎవరన్నా ప్రశ్నిస్తే వాడు పిచ్చోడన్నమాటే!

ఓ చిన్న ఇల్లు కట్టుకుంటేనే బోలెడు వృధా మట్టి, వృధా నిర్మాణ సామాగ్రి, ఇతర వృధా శిధిలాలు కళ్లెదుట పేరుకుపోయి భయపెడుతూ ఉంటాయి. అలాంటిది పెద్ద పెద్ద భవనాలు, భారీ వంతెనలు, ఖాళీ లేకుండా కట్టే వేల కొద్దీ కంపెనీలు విరామం లేకుండా కడుతూ పోతే ఇంకెంత వృధా పేరుకు పోతుంది?

షెన్ జెన్, గువాంగ్ మింగ్ న్యూ డిస్ట్రిక్ట్ లోని లియిషీ ఇండస్ట్రియల్ పార్క్ లో చోటు చేసుకున్న దుర్ఘటన అలా జరిగిందే. చైనాలో అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లోని పై వరుసలో షెన్ జెన్ నగరాన్ని చూపిస్తారు. ఈ నగరం నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది. నిరంతరం కంపెనీలు స్ధాపిస్తూ ఉంటారు. అనేక అంతస్ధుల భవనాలు కట్టెయ్యడం, అందులో అనేక డజన్ల కంపెనీలు పెట్టెయ్యడం… నిత్యం జరిగిపోతూ ఉంటుంది. అనేక కంపెనీలు మూత పడుతూ ఉండగానే ఇంకా అనేకం పుట్టుకొస్తూ ఉంటాయి.

ఇలా నిర్మించిన భవనాల వృధాను పారవేసే చోటు లేక పక్కనే ఉన్న కొండపై పోస్తూ వచ్చారు. అనేక యేళ్లుగా ఇది జరుగుతూ వస్తోంది. ఇలా పోసిన వృధాలో పునాదుల కోసం పెళ్లగించిన మట్టి ఎక్కువ భాగం ఉంటుంది. ఇలా తవ్వి పోసిన మట్టి గట్టిగా నిలబడి ఉండదు కదా. గట్టి పడి స్ధిరపడడానికి అది నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. కూలిపోకుండా పెట్టిన తాత్కాలిక అడ్డంకుల బలాన్ని స్ధిరత్వాన్ని ఎక్కువ అంచనా వేసి మరింత మట్టి, శిధిలాలు తవ్విపోశారు.

డిసెంబర్ 19 తేదీన వర్షం కురిసి వెలిసింది. అదేమంత పెద్ద వర్షం కాదు. కాసింత పెద్ద వర్షమే గానీ కొండలు కూలే వర్షం కాదు. ఆ శిధిలాల కుప్ప కూలిపోవచ్చని రెండేళ్లుగా నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ వినలేదు. ముందు కావాల్సింది అభివృద్ధి కదా! కాబట్టి పట్టించుకోవాల్సిన వాళ్ళు కూడా పట్టించుకోలేదు. లేదా చూసీ చూడనట్లు వదిలేశారు.

చివరికి డిసెంబర్ 20 తేదీన సదరు శిధిల సమూహానికి ఓపిక నశించింది. ఉగ్గబట్టిన సమతూకం సరిపోక ఒక్కసారిగా ఒళ్ళు విదిల్చింది. ఇంకేముంది ప్రళయమే. తవ్విపోసిన మట్టి అంతా ఒక్కసారిగా కిందకు దూకింది. అదేదో నీటి ప్రవాహం మల్లెనే ఎత్తైన భవనాల మీదికి ప్రవహించింది. దాదాపు 15 ఫుట్ బాల్ మైదానాల పాటి చేసే ఏరియాలోని భవనాలు అందులోని మనుషులు అందరూ ఆ మట్టి కిందా, నిర్మాణ శిధిలాల కింద కప్పబడిపోయారు.  అనేక కంపెనీలు పనిచేసే  30 భారీ భవనాలు పూర్తిగా మట్టి కింద మునిగిపోయాయని షెన్ జెన్ నగర అధికారులు చెప్పారు.

ఈ కంపెనీలను నిర్మించింది శ్రామికులు. వాటిలో పని చేసేది కార్మికులే. వారికి దక్కేది నెల వేతనాలు మాత్రమే. కానీ కంపెనీల లాభాలు మాత్రం కొద్ది మంది సంపన్నుల చేతుల్లోకి మాత్రమే పేరుకుంటుంది. ఇప్పుడు ఈ దుర్ఘటనలో చిక్కుకుపోయింది వారే. కంపెనీల్లో పని చేయడానికి గ్రామాల నుండి లోతట్టు రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులను పెద్ద పెద్ద డార్మీటరీల్లో ఉంచడం చైనాలో రివాజు. అనేక చోట్ల నిర్దిష్ట సమయం దాటాక -కార్మికులు బైటికి వెళ్లకుండా-తాళాలు వేస్తారు. దాదాపు జైలు తరహాలో నిర్వహించే డార్మిటరీల్లో పరిస్ధితులకు తట్టుకోలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతుంది.

ఇంత దుర్భర పరిస్ధితుల్లో పని చేసే కార్మికులు అభివృద్ధి ఫలితాన్ని అనుభవించకపోగా అభివృద్ధి దుష్ఫలితాల్ని అనుభవించడంలో మాత్రం ముందు ఉండవలసి వస్తోంది. ప్రకృతిని నానా హింసలు పెట్టి సాధిస్తున్న అభివృద్ధి ధనిక వర్గాలకు చేరుతుండగా ఆ ఆభివృద్ధిపై ప్రకృతి సాధిస్తున్న ప్రతీకారానికి కార్మికులు బలవుతున్నారు.

భూమిని ప్రకృతిని విచక్షణా రహితంగా కొల్లగొట్టి సాగిస్తున్న సో-కాల్డ్ అభివృద్ధి చర్యల ఫలితం ఎలా ఉంటుందో షెన్ జెన్ దుర్ఘటన శాంపిల్ గా మాత్రమే తెలియజేస్తోంది.  ఇలాంటివి ఇటీవలి కాలంలోనే చైనాలో అనేకం జరిగాయి. ఉదాహరణకి గత నెలలో తూర్పు చైనాలోని ఝెజియాంగ్ రాష్ట్రంలో వర్షాలకి కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 38 మంది చనిపోయారు. అదే నెలలో ఈశాన్య చైనాలో వర్షాలకి కొండ విరిగిపడి డజను మంది చనిపోయారు. ఆగస్టులో తీయాంజిన్ లో పారిశ్రామిక వృధా పదార్ధాలు నిల్వ చేసిన ఎత్తైన చోటు కూలిపోయి 173 మంది చనిపోయారు. 2010లో వాయవ్య చైనాలోని గాంసు రాష్ట్రంలో కొండ వాలు విరిగిపడి ఏకంగా 1500 మంది సమాధి అయ్యారు.

షెన్ జెన్ ఘటనలో మట్టి చరియలు కూలిపోనున్న సంగతి కాస్త ముందుగా గ్రహించడంతో భారీ మరణాలు తప్పాయి. అప్పటికప్పుడు 900 మందిని ఖాళీ చేయించడంతో మట్టి ప్రవాహం వారిని చేరేలోపు తప్పించుకున్నారు. సమీపంలో ఉన్నవారు తప్పించుకోలేక చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటన వల్ల 2 లక్షల చదరపు మీటర్ల పారిశ్రామిక ప్రాంతం మట్టి పెళ్లలకింద సమాధి అయిందని అధికారులు వాపోవడం కొసమెరుపు.

 

5 thoughts on “చైనా అభివృద్ధి శిధిలాలు ప్రాణాలు మింగేస్తున్న వేళ… -ఫోటోలు

  1. ఈ మద్య చైనా మంత్రి ఇండియా వచ్చిన సందర్భంగా అభివ్రుద్దికి ఆటంకం పెట్టుబడిదారీ సమాజమనీ, సొంత ఆస్తి అని అన్నారట. దాన్ని ప్రజాశక్తి పత్రిక మెయిన్ హెడ్డింగా వేసింది. పులి వేటాడి తినగా మిగిలిన దానికొసం అక్కడే తొడేళ్ళ గుంపు ఎదురుచుస్తూ వుంటాయి. అలాగే ఈ బుర్జువా కమ్యునిస్టు పార్టీలు. చైనాలొ వున్నది కమ్యునిస్టు పార్టిలని వాళ్ళు నమ్మి ఇతరులను కుడా నమ్మమంటారు. బూర్జువా పార్టిలాగానే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని గావుకేకలు పెడుతూ వుంటారు.అక్కడికి ఇక్కడేదో ప్రజాస్వామ్యం వున్నట్టు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s