అరుణ్ జైట్లీ బీరువాలో దాచిపెట్టిన అవినీతి కంకాళాలు ఒక్కొక్కటిగా బైటికి వస్తున్నాయి.
ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా జైట్లీ సాగించిన అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్లు ఓ పక్క మిన్నంటుతుండగా మరో పక్క హాకీ ఇండియా ఫెడరేషన్ బోర్డు సభ్యుడుగా ఆయన పాల్పడిన అవినీతిaపై కూడా విచారణ చేయాలంటూ డిమాండ్లు చేసే గొంతులు పెరుగుతున్నాయి.
ఈసారి ఏకంగా హాకీ ఫెడరేషన్ మాజీ అధికారి స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాస్తూ జైట్లీపై విచారణకు డిమాండ్ చేయడం విశేషం.
కన్వర్ పాల్ సింగ్ గిల్ అంటే తెలియదు గానీ కె పి ఎస్ గిల్ అంటే తెలియనివారు బహుశా తక్కువగానే ఉండవచ్చు. పంజాబ్ లో టెర్రరిజం భారతం పట్టిన గండరగండడుగా ఆయనకు కీర్తి ప్రఖ్యాతులు ఉన్నాయి.
అదే సమయంలో పౌర హక్కులను తీవ్రంగా అణచివేసిన అపఖ్యాతి కూడా ఆయన ఖాతాలో ఉన్నది. ఒక మహిళా ఐఏఎస్ అధికారిని లైంగికంగా వేధించిన ఖ్యాతి కూడా ఆయన సొంతమే. (గిట్టనివారు ఆయనపై కేసు పెట్టించారని కూడా అంటుంటారు).
రెండు సార్లు పంజాబ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా గిల్ పని చేశాడు. ఐపిఎస్ సేవల నుండి 1995లో పదవీ విరమణ చేసిన కె పి ఎస్ గిల్ 14 సం.ల పాటు ఇండియన్ హాకీ ఫెడరేషన్ గా పని చేశాడు.
ఇండియన్ హాకీ ఫెడరేషన్ ఇప్పుడు ఉనికిలో లేదు. ఫెడరేషన్ కార్యదర్శి కందస్వామి జ్యోతి కుమారన్ అవినీతికి పాల్పడ్డాడని తీవ్ర ఆరోపణలు రావడంతో 2008లో హాకీ ఫెడరేషన్ ను ఐఓఏ (ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్) సస్పెండ్ చేసింది. ఫలితంగా కె పి ఎస్ గిల్ తన పదవిని కోల్పోయారు.
ఆ తర్వాత హాకీ ఇండియా పేరుతో మరో సంస్ధను స్ధాపించారు. దీనిని కొన్ని రాష్ట్రాల హాకీ సంస్ధలు గుర్తించ లేదు. రెండున్నర సం.ల పాటు ఇండియన్ హాకీ ఫెడరేషన్, హాకీ ఇండియా రెండూ ఉనికిలో కొనసాగాయి. చివరికి 2011లో అప్పటి కేంద్ర క్రీడా మంత్రి అజయ్ మాకేన్ మధ్యవర్తిత్వంలో ఈ రెండు సంస్ధలు చర్చలు జరిపి ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేశాయి.
హాకీ ఫెడరేషన్ రద్దు తర్వాత హాకీ ఇండియా పెత్తనం జైట్లీ చేతుల్లోకి వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. కె పి ఎస్ గిల్ నుండి హాకీ ఫెడరేషన్ ను లాక్కోవడానికి జరిగిన ప్రయత్నాల్లో భాగంగానే హాకీ ఫెడరేషన్ ను సస్పెండ్ చేశారన్న ఆరోపణ కూడా వ్యాప్తిలో ఉన్నది.
ఈ నేపధ్యంలో హాకీ ఇండియాలో అరుణ్ జైట్లీ అవినీతి, ఆశ్రిత పక్షపాతంలకు పాల్పడ్డారని, జైట్లీ సాగించిన అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ కె పి ఎస్ గిల్ ఢిల్లీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
హాకీ ఇండియాలో కూడా జైట్లీ అవినీతికి పాల్పడ్డారని ఇప్పటికే ఏఏపి నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఏఏపి నేతలు ఢిల్లీలో విలేఖరుల సమావేశం జరిపి జైట్లీకి నిర్దిష్టంగా 5 ఆరోపణలు చేస్తూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిడిసిఏ అవినీతి ఒక్కటే కాదని హాకీ ఇండియాలో సైతం జైట్లీ అవినీతికి పాల్పడ్డారని వారు ఆరోపించారు.
ఏఏపి నేతల ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి బదులు జైట్లీ, అరవింద్ ఇతర ఏఏపి నేతలపై పరువు నష్టం దావా వేశారు. 10 కోట్ల నష్టపరిహారాన్ని ఆయన దావాలో కోరారు. కానీ ఆయన అవే ఆరోపణలు చేసిన కీర్తి ఆజాద్ పేరును దావాలో పేర్కొనలేదు. కీర్తి ఆజాద్ ఆరోపణల వల్ల పోనీ పరువు ఏఏపి ఆరోపణల వల్ల పోయిందని ఆ విధంగా జైట్లీ చెప్పారు. ఏఏపి నేతల ఆరోపణలను జనం నమ్ముతారని భావించినందునే జైట్లీ ఆజాద్ ను వదిలి ఏఏపి నేతలపై దావా వేశారా అన్నది ఆసక్తికర ప్రశ్న.
“ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జైట్లీ మంత్రిగా రాజీనామా చేయాలి లేదా హాకీ ఇండియా లీగ్ అడ్వైజరీ బోర్డు సభ్యుడుగా నైనా రాజీనామా చేయాలి” అని కె పి ఎస్ గిల్ ఢిల్లీ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు.
“శిక్షణా శిబిరాల్లో నాణ్యమైన ఆహారం ఇవ్వాలని కొరినందుకు ఒక ఆటగాడిని సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన కోర్టుకు వెళ్లవలసి వచ్చింది. కానీ టీం లో ఆయనకు ఎప్పటికీ చోటు దొరకదు. దీనినంతటినీ ఏమనాలి? సహనమా లేక అసహనమా?” అని గిల్ తన లేఖలో ప్రశ్నించారని ది హిందు తెలిపింది.
తన కూతురు సోనాల్ జైట్లీకి హాకీ ఇండియాకు లీగల్ అడ్వైజర్ గా పదవి కట్టబెట్టి భారీ మొత్తాల్లో ఆమెకు ఫీజులు చెల్లించేలా ప్రభావితం చేశారని కె పి ఎస్ గిల్ తన లేఖలో ఆరోపించారు.
గిల్ లేఖ ఆయుధంగా చేబూనిన ఏఏపి నేతలు మరోసారి జైట్లీ అవినీతిపై విరుచుకు పడ్డారు. ఆర్ధిక మంత్రి జైట్లీ హాకీ ఇండియా లోని కలిగి ఉన్న పదవి ద్వారా తన కుటుంబ సభ్యులకు లబ్ది చేకూర్చుతున్నారని గిల్ లేఖ ద్వారా స్పష్టం అయిందని ఏఏపి నేత సంజయ్ సింగ్ ఆరోపించారు.
“ఆయన అబద్ధాలు వెలుగులోకి వచ్చాయి. స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ వ్యాపారంలో తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధము లేదని ఆయన చెప్పుకున్నారు. కానీ ఆయన కూతురు లీగల్ కమిటీలో పాత్ర వహిస్తున్నార్రు. ఆమెకు భారీ మొత్తంలో చెల్లింపులు జరుగుతున్నాయి” అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
ఇలా ఉండగా జైట్లీ రాజీనామా డిమాండ్ చేస్తూ ఏఏపి ఉద్యమ బాట పట్టింది. ఈ రోజు ఢిల్లీలో ఏఏపి కార్యకర్తలు జైట్లీ ఇంటి ముందు ప్రదర్శన నిర్వహించారు. వారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. నీటి ఫిరంగులతో చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
ఆందోళనలో పాల్గొన్న ఏఏపి నేత సోమ్ నాధ్ భారతి మాట్లాడుతూ “ఆయన అమాయకుడో నేరస్ధుడో రుజువు చేసే పత్రాలు ఉన్న ప్రభుత్వ విభాగాలు ఆయన ఆధ్వర్యంలో ఉన్నందున ఆయన దయచేసి గద్దె దిగాలని అడిగేందుకు మేము ఇక్కడికి వచ్చాము. మంచి పౌరుడుగా, సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ గా ఎల్ కె అద్వానీ అడుగు జాడల్లో నడవడం ఆయన విధి” అని కోరారు.
జైట్లీ అవినీతి వ్యవహారంలో జరిగిన మరో పరిణామం కీర్తి ఆజాద్ సస్పెన్షన్. పార్టీ ఆదేశాలను ధిక్కరించారని చెబుతూ కీర్తి ఆజాద్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు బిజేపి ప్రకటించింది. కాగా ప్రధాని నరేంద్ర మోడి విదేశం వెళ్ళేందుకు మరోమారు విమానం ఎక్కారు.