పునరావాసం కల్పించగల న్యాయం (తీర్పు)! -ది హిందు


Juvenile

[డిసెంబర్ 21, 2015 తేదీన ది హిందు “Justice that is rehabilitative” శీర్షికన ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.]

*******

పరిపక్వ సమాజం జనం పెడబొబ్బలకు లొంగి తన న్యాయ వ్యవస్ధకు ఆధారభూతమైన పటుతర న్యాయ సూత్రాలను, సామాజిక నియమాలను తలకిందులు చేయదు. ప్రత్యేక శిక్షణా గృహంలో 3 సంవత్సరాల పాటు గడపాలని విధించిన శిక్ష ముగిశాక డిసెంబర్ 2012 నాటి ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులోని బాల నేరస్ధుడిని విడుదల చేసిన విషయంలో పెల్లుబుకిన ప్రజాగ్రహం అర్ధం చేసుకోదగినది, కానీ అతని ఖైదును కొనసాగించాలన్న డిమాండు శుద్ధ తప్పు. చట్టం దృష్టిలో యుక్త వయసుకు కొద్ది నెలల దూరంలో ఉన్నవారు హత్య, అత్యాచారం లాంటి ఏహ్యమైన నేరాలకు పాల్పడ్డారని రుజువైనప్పుడు వారిని యుక్తవయసువారిగానే భావిస్తూ శిక్షలు వేయాలన్న వాదన దురవగాహనతో కూడినది. సంస్కరణ పొందని దోషిని బాల నేరస్ధుల గృహంలో గరిష్టంగా అనుమతించబడిన కాలం ముగిశాక సమాజంలోకి విడుదల చేయరాదన్న చట్టబద్ధంగా ఆచరణ సాధ్యం కాదు కూడా.

నిజానికి, సంస్కరణ కోసం ఉద్దేశించిన గృహాల్లో పెరిగి యుక్త వయసుకు చేరుకునే బాల దోషులు పునరావాసం కల్పించబడేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రత్యేక గృహాల్లో మరింత కాలం గడపమని గానీ, లేదా పెద్ద వయసు నేరస్ధులతో పాటుగా జైలులో ఉండమని గానీ వారిని బలవంతపెట్టడమే పెద్ద నేరం కాగలదు. ఇప్పుడు విడుదల అయిన అప్పటి బాల నేరస్ధుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డవారిలో అత్యంత క్రూరంగా వ్యవహరించాడని రుజువు చేయబూనుకోవడం వృధా ప్రయాస. ఇలా చెప్పడం అంటే తీవ్ర దుఃఖంలో ఉన్న బాధిత, ఆ తర్వాత మరణించిన, యువతి తల్లిదండ్రుల పట్ల సహానుభూతి లేకపోవడం కాదు. గతంలో ఎన్నడూ ఎరగని రీతిలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తి మొత్తం దేశాన్నే తాను తన స్త్రీల పట్ల వ్యవహరించే తీరుపై అంతర్మధనం కావించుకునేట్లు చేసిన నేరాన్ని మరిచిపోవడం ఎవరికీ సాధ్యం కానిది.

Nirbhaya's mother Asha Deviదోషి విడుదలపై స్టే విధించడానికి నిరాకరించడం ద్వారా ఢిల్లీ హై కోర్టు సరైన అవగాహననే చేపట్టింది. విడుదలానంతర పునరావాసానికి గల అవకాశాలను, ముఖ్యంగా అతను తిరిగి సమాజంలో మిళితం కావడానికి వ్యక్తిగత సంరక్షణ పధకం ద్వారా పునరావాసం కల్పించే అవకాశాలను, అది గుర్తించింది. బాల సంరక్షణ అధికారి, ప్రొబేషన్ అధికారి లేదా సంబంధిత ప్రభుత్వేతర సంస్ధ (ఎన్‌జి‌ఓ) నుండి వరుస నివేదికలను ప్రతి మూడు నెలలకు ఒకసారి జువెనైల్ జస్టిస్ బోర్డు తెప్పించుకోవలసి ఉంది. ప్రత్యేక గృహంలో గడిపిన కాలం అతనిపై ఎలాంటి ప్రభావం చూపలేదని, ఆ గృహంలో బంధింపబడిన కాలంలో తీవ్రవాదిగా మారాడనీ వస్తున్న వాదనలు, సంతృప్తి పొందని సమాజం అతని విడుదలను ఆపడానికి నిస్పృహతో చేస్తున్నవిగా కనిపిస్తున్నాయి.

పిల్లలు చట్టం దృష్టిలో తప్పుడువారుగా తేలడం అన్నది ప్రధానంగా నిర్లక్ష్యం, దుర్భాషలు, దరిద్రం వల్ల సంభవిస్తుంది. గంధర్వ పుత్రులను మంత్రం వేసినట్లుగా విమోచనకు అతీతమైన పునరుజ్జీవరహితం కావించే స్వాభావిక మానవ ప్రవృత్తులు ఏమీ ఇలలో లేవు. పునరావాసం కల్పించబడే అవకాశాన్ని భద్రం చేసి తిరిగి నేర ప్రవృత్తిలోకి వెళ్లకుండా నిరోధించడమే భారత దేశంలోని బాల నేర చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. తీవ్ర నేరాలకు పాల్పడ్డ 16-18 సం.ల వయసు గ్రూపులోని బాల నేరస్ధులను ప్రత్యేక వర్గంగా చేసి వారిని రెగ్యులర్ క్రిమినల్ కోర్టులలో విచారించాలని ప్రతిపాదించిన బిల్లు ఒకటి పార్లమెంటులో ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. రక్షణ మరియు సంరక్షణ కోసం ఎదురు చూస్తున్న పిల్లలకు సంబంధించి ఈ బిల్లులో పలు ఇతర ప్రగతిశీల అంశాలు ఉన్నప్పటికీ సరిగ్గా ఈ అంశాన్ని చట్టంగా మార్చడం అత్యంత ప్రగతి నిరోధక చర్య కాగలదు. బాల నేరస్ధులకు పునరావాస న్యాయం కల్పించి వారిని బాధ్యతాయుతమైన పెద్దలుగా మార్పు చెందించడమే విస్తృత సమాజానికి నిజమైన మేలు చేకూర్చినట్లవుతుంది.

*******

[నిర్భయతో అత్యంత క్రూరంగా వ్యవహరించింది ఇతనే అని ఢిల్లీ పోలీసులు చెప్పిన బాల నేరస్ధుడిని ఒక వైపు, ఇష్టంగా 22 సంవత్సరాలు పెంచుకున్న కన్న కూతురిని అత్యంత దారుణమైన నేర చర్య వల్ల పోగొట్టుకున్న తల్లి దండ్రులను మరొకవైపు ఉంచి తరాజులో పెట్టి చూస్తూ చదివితే ఈ సంపాదకీయం మనసుకు పట్టకపోవచ్చు. కాస్త నెమ్మది వహించి సమాజానికి దీర్ఘకాలికంగా ఏది మంచిది అన్న అంశాన్ని సాలోచనా దృష్టితో పరికిస్తూ చదివితే మనసుకు పట్టే అవకాశం ఉన్నది. -విశేఖర్]

One thought on “పునరావాసం కల్పించగల న్యాయం (తీర్పు)! -ది హిందు

వ్యాఖ్యానించండి