సల్మాన్ కో న్యాయం, అఫ్జల్ కో న్యాయం! -2


Salman Khan after acquittal

“అప్పీలుదారు ఎలాంటి అనుమానం లేకుండా దోషియే అని నిర్ధారించ గల స్ధాయిలో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యం, ఈ కోర్టు దృష్టిలో, లేదు. అనుమానం అన్నది, అది ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎవరినైనా సరే దోషిగా నిర్ధారించడానికి సరిపోదు.

“కీలక సాక్ష్యాలను నమోదు చేయక పోవడంలో ప్రాసిక్యూషన్ లో లోపాలు ఉన్నాయి. గాయపడిన వారి సాక్ష్యాలలో విడుపులు (omissions), వైరుధ్యాలు ఉన్నాయి. సాక్ష్యాల సేకరణలో దొర్లినట్లుగా కనిపిస్తున్న లొసుగులు నిందితునికే లాభం చేకూర్చుతాయి.

“ప్రజల అభిప్రాయం ఏమిటో మాకు తెలుసు. కానీ కోర్టులు చట్ట నిర్దేశన ప్రకారమే నడుచుకోవాలన్నది నిర్ధారిత సూత్రం. నిందితుని దోషిత్వాన్ని నిర్ధారించడంలో మనవిదారు (appellant) వృత్తిని బట్టి, (సంఘంలో) ఆయన స్ధాయిని బట్టీ కోర్టు ఊగిసలాడజాలదు.

“ట్రయల్ కోర్టు సాక్ష్యాలను గుర్తించిన పద్ధతి నేర న్యాయశాస్త్ర సూత్రాలకు అనుగుణంగా, చట్టబద్ధంగా లేదు. మనవిదారు (సల్మాన్ ఖాన్) కు వ్యతిరేకంగా అన్ని నేరారోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలం అయింది. కనుక ఈ తరహా సాక్షాలపై ఆధారపడి మనవిదారును దోషిగా నిర్ధారించడం సాధ్యం కాదు.”

ఇప్పుడు అఫ్జల్ గురు కేసు చూద్దాం. అఫ్జల్ గురుకు కింది కోర్టులు విధించిన మరణ శిక్షను ఖాయం చేస్తూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల్లో కొన్ని భాగాలు ఇలా ఉన్నాయి.

“…we hold that the laptop found in the custody of the appellants and the results of analysis thereof would amply demonstrate that the laptop was the one used by the deceased terrorists contemporaneous to the date of incident and it should have passed hands on the day of the incident or the previous day. The accused carrying the same with him soon after the incident furnishes cogent evidence pointing towards his involvement.”

“…ఘటన జరిగిన సమయంలో విగత ఉగ్రవాదుల చేత వినియోగించబడిన ల్యాప్ టాపే ఇదని  మనవిదారుల స్వాధీనంలో కనుగొన్న ఒడి గణన యంత్రం (laptop computer), ఆ యంత్రం (పోలీసుల) స్వాధీనం దరిమిలా నిర్వహించబడిన విశ్లేషణ ఫలితాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఆ ల్యాప్ టాప్ ఘటన జరిగిన రోజు గానీ, అంతకు ముందు రోజు గానీ చేతులు మారి (అఫ్జల్ చేతికి వచ్చి) ఉండాలి. ఘటన జరిగిన తదుపరి కాలంలో అదే ల్యాప్ టాప్ ను నిందితుడు చేత ధరించి ఉన్నందున (నేరంలో) ఆయన పాల్గొన్నాడన్న అంశం వైపు అది సూచిస్తోంది.”

“As is the case with most of the conspiracies, there is and could be no direct evidence of the agreement amounting to criminal conspiracy.”

[“కుట్రలను నిరూపించడానికి ఎక్కువ కేసుల్లో సాక్ష్యాధారాలు ఉండనట్లుగానే ఈ కేసులో కూడా నేర పూరిత కుట్ర జరిగిందనడానికి నేరుగా సాక్ష్యాలు లేవు మరియు ఉండజాలవు… ]

“The incident, which resulted in heavy casualties had shaken the entire nation, and the collective conscience of society will only be satisfied if capital punishment is awarded to the offender.”

[భారీ స్ధాయిలో ప్రాణ నష్టం జరిగిన ఈ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసింది. నేరస్థుడికి మరణ శిక్ష విధిస్తేనే సమాజం యొక్క ఉమ్మడి ఆత్మకు సంతృప్తి లభిస్తుంది…”]

{అఫ్జల్ గురు కేసులో మరిన్ని వివరాల కోసం అరుంధతీ రాయ్ రాసిన ఆర్టికల్ అనువాదాన్ని కింది లంకెలో చూడగలరు.

ప్రజాస్వామ్యానికి నిఖార్సయిన రోజు (అరుంధతీ రాయ్ రచన) …}

అఫ్జల్ గురు నేర నిర్ధారణను నేరుగా రుజువు చేసే ఒకే ఒక్క భౌతిక సాక్ష్యం ల్యాప్ టాప్. అది సరిగ్గా దాడి జరిగిన మరుసటి రోజే అఫ్జల్ గురు చేతికి వచ్చేలా ముందే ఏర్పాటు చేయబడిందని, పార్లమెంటుపై దాడి సందర్భంగా ఎదురు కాల్పుల్లో మరణించిన నిందితులకు కారును అఫ్జల్ గురుయే మాట్లాడి పెట్టడం కూడా పోలీసుల ఒత్తిడి ద్వారానే జరిగిందని రుజువు చేసే సాక్ష్యాలు పత్రికల ద్వారా వెల్లడి అయ్యాయి. కానీ ఈ సాక్ష్యాలను అఫ్జల్ గురు డిఫెన్స్ కోసం ప్రవేశపెట్టేందుకు ఆయనకు అసలు లాయర్ సౌకర్యమే మొదట ఇవ్వలేదు. తర్వాత కాలంలో ప్రభుత్వం సమకూర్చిన లాయర్ ఏనాడూ అఫ్జల్ గురును కలవలేదు. సాక్ష్యాలు ప్రవేశపెట్టలేదు. కనీసం ప్రాసిక్యూషన్ సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ కూడా చేయలేదు.

(అఫ్జల్ గురు కేసులో సుప్రీం కోర్టు తీర్పు పూర్తి పాఠం చూస్తే అందులోనే ఆయన నిర్దోషి అని తీర్మానించగల వాదనలు ఉన్నట్లు అర్ధం అవుతుంది. ఎవరికన్నా ఓపిక ఉంటే తీర్పు పాఠం కోసం ఈ లంకెలోకి వెళ్ళండి.)

ఇన్ని అవకతవకల మధ్య కేవలం పరిస్ధితుల సాక్షాల (circumstantial evidences) పై ఆధారపడి ‘భారత సమాజం యొక్క ఉమ్మడి ఆత్మను సంతృప్తిపరిచేందుకు’ అఫ్జల్ గురును చట్టబద్ధంగా చంపేశారు.

సల్మాన్ కేసు విషయంలో ముంబై హై కోర్టు ఏమంటోంది?

“ఆయనకు వ్యతిరేకంగా కేసు ఉన్నట్లు రుజువు చేసే భౌతిక (మెటీరీయల్) సాక్ష్యం దేనినీ ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు. ఈ కేసులో ఖచ్చితమైన తీర్పు ఇచ్చి తీరాలన్న ప్రజల దృష్టికోణాన్ని (perception) కోర్టు విస్మరించడం లేదు. కానీ చట్టబద్ధ ప్రక్రియల ప్రకారం సాక్ష్యంగా ప్రవేశపెట్టదగిన మెటీరీయల్ ఆధారంగా మాత్రమే కేసులో నిర్ణయాలు చేయాలన్నది (ఇప్పటికే) స్ధిరపడిపోయిన సూత్రం.”

అని అంటోంది. దానితో పాటు…

“సాధారణ ప్రజల అభిప్రాయానికి సాక్ష్యాల చట్టం (Law of Evidence) లో స్ధానం లేదు…”

అని కూడా అంటోంది.

కానీ ఈ దేశ అత్యున్నత న్యాయ స్ధానం మాత్రం “సమాజ ఉమ్మడి ఆత్మను సంతృప్తిపరిచేందుకు, నేరుగా ఎలాంటి భౌతిక సాక్ష్యాలు లేకపోయినా కూడా, నేరపూరిత కుట్రలో పాల్గొన్నాడని సూచించే పరిస్ధుతులు మాత్రమే సాక్ష్యంగా ఉన్నప్పటికి కూడా ఉరి తీసి చంపేయొచ్చని” నిర్ధారించింది.

ఎందుకు ఇంత తేడా?

సల్మాన్ ఖాన్ కేసులో 5 సం.ల కారాగార శిక్ష వేయడానికి కూడా పనికిరాని పరిస్ధితుల సాక్షాలు అఫ్జల్ గురును ఉరి తీసి చంపడానికి ఎలా పనికొస్తాయి?

పత్రికల సమాచారం బట్టి సల్మాన్ ఖాన్ జయలుకి వెళ్తే ఆయనపై ఆధారపడిన 200 కోట్ల సినిమా పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. నిజానికి ఇది పైకి మాత్రమే కనబడిన చాలా చిన్న మొత్తం. Just tip of the iceberg! పైకి కనపడకుండా వేల కోట్ల వ్యాపారం ఆయన వెనుక ఉంటుంది. ఆ వ్యాపారంలో కేంద్ర, రాష్ట్రాల మంత్రుల నుండి బడా బడా దళారీ పెట్టుబడిదారుల వరకు భాగస్వామ్యం కలిగి ఉన్నారు.

అఫ్జల్ గురు పరిస్ధితి అది కాదు. ఆయన పేదవాడు. అందునా కాశ్మీరీ ముస్లిం. పైగా లొంగి పోయిన మిలిటెంటు. లొంగిపోయాక ఆయన క్రమం తప్పకుండా పోలీసుల పర్యవేక్షణలోనే ఉంటే మాత్రమేం? ఆయన ‘లొంగుబాటు’ను అడ్డం పెట్టుకుని పోలీసులు, సైన్యాధికారులు లక్షల సొమ్ము దోచుకుంటే మాత్రమేం? ఆయన లొంగిపోయిన మిలిటెంటు. దశాబ్దాల తరబడి శ్రమపడి తయారు చేయబడిన కాశ్మీర్ సంబంధిత భావోద్వేగాలకు ఆయన ప్రతినిధి. ఆయనను బంధించి చంపేస్తే పాకిస్తాన్ పోషిస్తున్న సీమంతర ఉగ్రవాదాన్ని మట్టుబెట్టిన ఖ్యాతి పాలకులకు ఆయాచితంగా లభిస్తుంది. ఉరి శిక్ష వేసిన వెంటనే చంపనవసరం లేదు. తగిన ఫలితం వచ్చే పరిస్ధితులు ఏర్పడే వరకు ఎదురు చూసి, ఎప్పుడు ఉరితీస్తే ఓట్లు రాలుతాయో, ప్రత్యర్ధుల ఎత్తుగడలను తిప్పికొట్టగల సమాధానంగా ఆయన ఉరి ఎప్పుడు అవుతుందో అప్పుడు ఉరి తీసి పారేసే సౌలభ్యం ఉన్నది.

భారతీయ కోర్టుల దృష్టిలో పౌరులందరూ నిఝంగా సమానమేనా?!

3 thoughts on “సల్మాన్ కో న్యాయం, అఫ్జల్ కో న్యాయం! -2

  1. భారతదేశ శిక్షాసృతిలో
    శిక్షనుండి తప్పించుకోవడంలో సాధారణ ప్రజల అభిప్రాయానికి విలువలేదు.
    అదే శిక్షవిదింపబడడంలో భారత సమాజం యొక్క ఉమ్మడి ఆత్మకు ఎనలేని విలువకలిగియుంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s