అసహనంపై రువ్విన అస్త్రం ‘బుక్కెడు బువ్వ’ కధ!


Beggar

” సోదరులారా…మనది ఎంతో సంపన్న దేశం….”

” మూడురోజులైంది బాబూ అన్నం తిని… ఒక్క రూపాయి దరమం చేయి బాబూ……” బిచ్చగాడూ దీనంగా వేడుకుంటున్నాడు.

” సోదరులారా మనది ఎంతో విశిష్ట సంస్కృతి, ఘనమైన వారసత్వం గల దేశం మనది.”

” సచ్చి మీ కడుపున పుడతాను బాబూ…ఒక్క రూపాయి ధర్మ చేయండి బాబూ…”

” ఎంతో సహనశీలత గల దేశం మనది….”

” ఏరా దొంగ నా కొడుకా. అడుక్కోవడానికి నీకు ఈ మీటింగే కనపడిందా. పో బే…పో సాలె…ఛల్”

ఎవరో బలంగా నెట్టేయడంతో బిచ్చగాడు కిందపడిపోయాడు.

గడ్డం నాయకుడు చెపుతూనే ఉన్నాడు. ” ఇంతటి మన సంస్కృతికి ఆపదవచ్చింది. రేపు జరిగే సమావేశానికి పై దేశం నుంచి గొప్ప స్వామీజీ వస్తున్నారు. కాబట్టి అందరూ తరలిరండి….దేశాన్ని కాపాడటానికి సిద్ధం కండి…..” అంటూ పిలుపునిచ్చాడు.కాసేపటికి ఆ జీపు అక్కన్నుంచి వెళ్లిపోయింది.

**************************

ఇది జర్నలిస్టు చందుతులసి రాసిన కధలోని ఒక భాగం.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న అసహన పరిస్ధితులను ఎవరికీ పనికిరాని ఓ బిచ్చగాడి ఆకలిలో కుదేసిన కధ ‘బుక్కెడు బువ్వ!’

హిందూ సమాజంలో పంచములుగా, పాదాల నుండి పుట్టిన శూద్రుల కంటే హీనులైన చండాలురుగా వందల సంవత్సరాలు కిందికి, పాతాళంలోకి తొక్కివేయబడిన శ్రామిక కులాల ప్రజల ఆహారపు అలవాట్లపై గత రెండు మూడేళ్లుగా జరుగుతున్న దాడిపై ఎక్కుపెట్టిన అస్త్రం చందుతులసి రాసిన ‘బుక్కెడు బువ్వ’.

గత కొన్ని నెలలుగా దేశంలో పెచ్చరిల్లుతున్న అసహన రాజకీయ-మత-ఆర్ధిక భావజాల ప్రవాహంలో కొట్టుకుపోవద్దని చేసిన హెచ్చరిక ‘బుక్కెడు బువ్వ!’

అస్త్రం అనగానే ఆగ్నేయాస్త్రమా, పాశుపతాస్త్రమా అని అడగొద్దు. ఇది జనాన్ని ఊచకోత కోసి నెత్తురు పారించే అస్త్రం కాదు. ఊళ్లను బుగ్గి చేసే అస్త్రం కాదు. రాజ్య సరిహద్దులు విస్తరింపజేసే అస్త్రం కాదు. అర్ధం కాని సంస్కృత మంత్రాలు అవసరం లేని అస్త్రం.

ఇది అలజడి అస్త్రం. ఆందోళన అస్త్రం. ప్రశ్నాస్త్రం. గల్లా పట్టి నిలదీసే అస్త్రం.

ఉన్మాదంలో బందీలై అదే లోకంగా భ్రమిస్తూ పంచేంద్రియాలను కట్టేసుకున్న కరకు మెదళ్ళను కరకరమని కోసి కాసిన్ని ఆలోచనల ఎరువును పోసే కధ ‘బుక్కెడు బువ్వ!’

మతం మత్తులో జోగుతూ ప్రాచీన సంస్కృతి పేర, ఆధునిక నేల మీద కుమ్మరిస్తున్న మధ్య యుగాలనాటి చెత్తను యాసిడ్ లాంటి కధనంతో కడిగేందుకు ప్రయత్నించిన కధ ‘బుక్కెడు బువ్వ!’

భారత సమాజాన్ని శాసిస్తున్న మత రాజకీయం, సామాజిక అణచివేత, ఆర్ధిక దోపిడి, సాంస్కృతిక పరిహాసం, … ఇలా అన్నింటినీ ఎక్కువా, తక్కువా కాకుండా తగిన పాళ్లలో పేర్చి కూర్చిన కధ ‘బుక్కెడు బువ్వ!’

ఈ కధను అందరూ చదివి తీరాలి.

తిట్టుకోండి, మెచ్చుకోండి, పొగడండి, తెగడండి, కోపగించుకోండి, కానీ ఉన్నది ఉన్నట్లుగా చదవండి. సొంత అర్ధాలు ఇవ్వకుండా చదవండి. సొంత ముద్రలు వేయకుండా చదవండి. మళ్ళీ చెబుతున్నా, ఉన్నది ఉన్నట్లుగా చదవండి. చివరికంటా చదవండి.

సాహిత్య వారపత్రిక ‘సారంగ’ లో ప్రచురితం అయిన ఈ కధను చదవడానికి కింది లంకెలోకి వెళ్ళండి.

సారంగ: బుక్కెడు బువ్వ

 

 

 

2 thoughts on “అసహనంపై రువ్విన అస్త్రం ‘బుక్కెడు బువ్వ’ కధ!

  1. విశాఖపట్నంలో ఆవు మాంసం తినేవాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ ముసలైపోయి పాలు ఇవ్వలేని ఆవుల్ని సింహాచలం గోశాలకి అప్పగిస్తారు. ఆర్థిక కారణాల వల్ల ఆ గోశాల నిర్వాహకులు ఆ ఆవుల్ని తీసుకోకపోతే అవి roadల మీదకి వదిలెయ్యబడతాయి. సీతమ్మధార రైతు బజార్ పక్కనే, చెత్త కుండీలో పారెయ్యబడ్డ కూరగాయల తొక్కల్ని తింటూ ఆవులు కనిపిస్తాయి. మిగితా చోట్ల అవి road పక్కన కాగితాలు తింటాయి. వీళ్ళు పవిత్ర జంతువు చేత తినిపించేది చెత్తకుండీలో దొరికే ఆహారాన్నీ & road పక్కన చిత్తు కాగిరాల్నీ! చిత్తశుద్ధి లేని శివపూజల కంటే ఈ గోపూజలు అద్వాన్నం.

    Read my views on beef consumption: http://blog.marxistleninist.in/2015/11/blog-post_18.html

  2. విశేఖర్ గారూ.. మొదట నేను మీకు సారీ చెప్పాలి. అటు ఉద్యోగం, ఇటు రకరకాల పని వత్తిళ్లలో మీరు రాసిన పోస్టు ఇప్పటిదాకా చూడలేకపోయాను….
    నా కథను మీరు ప్రోత్సహించడం నేను ఊహించనిది.
    ఈ కత గురించి నేను చెప్పాల్సిందేమీ లేదు. మీరే అంతా చెప్పారు. ప్రవీణ్ గారికి, తిరుపాలు గారికి, రామయ్యగారికీ
    ధన్యవాదాలు. మీ ప్రోత్సాహానికి మరొక్క సారి కృతజ్ఞతలు.

వ్యాఖ్యానించండి