“పిల్లలు దైవ స్వరూపులు” అని పెద్దరికం నెత్తిన వేసుకున్న పెద్దలు అంటుంటే మనం వింటుంటాం. దైవానికి లక్షోప లక్షల రూపాలు ఇచ్చుకున్న మనుషులు అందులో ఏ రూపాన్ని తమ తమ పిల్లలకు ఇచ్చుకుంటారో ఊహించడం కష్టం.
‘అసలు దైవానికి రూపం ఏమిటి? అదొక భావన’ అనేవాళ్లూ ఉన్నారు. వారు కూడా ‘పిల్లలు-దేవుళ్ళ’ సామెతను వల్లించడం కద్దు. వారి ఉద్దేశ్యంలోనేమో పిల్లలు రూపరహితులు అన్న పెడార్ధం వచ్చే ప్రమాదం ఉన్నది.
ఇలా ఏ విధంగా చూసినా ‘పిల్లలు దైవ స్వరూపులు’ అన్న సామెతకు అర్ధం లేదని లాజికల్ గా ఆలోచించేవారికి తోస్తుంది.
ఇంతకీ ఈ సామెత ఎలా పుట్టింది? చిన్న పిల్లలకు లోకం తెలియదు. అనుభవం లేనందున తెల్లనివన్నీ పాలు అనుకుంటూ ఉంటారు. సమాజంలో నెలకొన్న వివిధ అపసవ్య ధోరణుల గురించిన అవగాహన ఉండదు కనుక కల్లా కపటం తెలియని వారుగా, మాయా మర్మం ఎరుగని వారుగా ఉంటారు. ఈ అవగాహనతోనే ‘పిల్లలు దైవ స్వరూపులు’ అన్న నానుడి వాడుకలోకి వచ్చింది.
ఈ లెక్కన దేవుడు కల్లా కపటం తెలియని వాడై ఉండాలి. తెలియకపోతే పాపుల్ని ఎలా శిక్షిస్తాడు? పాపుల్ని శిక్షించాలంటే పాపం ఏమిటో తెలిసి ఉండాలి కదా! (పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ చెయ్యాలంటే కంప్యూటర్ లో పి.డి.ఎఫ్ రీడింగ్ సాఫ్ట్ వేర్ ఉండాలి కదా!) ఇవన్నీ లాజిక్ కి అందని దేవుడి ఉనికి పైన తలెత్తే లాజికల్ ప్రశ్నలు.
బ్రిటిష్ పాలనపై చిన్నతనంలోనే కత్తి కట్టిన సర్దార్ భగత్సింగ్ దేవుడి ఉనికి గురించి ఓ ప్రశ్న వేసేవాడని ఆయనతో కలిసి పని చేసిన యోధుడు యశ్ పాల్ సింగ్, తాను రాసిన పుస్తకం “సింహావలోకనం”లో (హిందీ మూలం: సిన్హావలోకన్; ఆంగ్లం: A Lion’s Eye View; తెలుగు అనువాదం: ఆలూరి భుజంగరావు) చెప్పారు.
“దేవుడు తాను మోయలేని బరువుని సృష్టించగలడా?” అన్నది ఆ ప్రశ్న. ఏ సమాధానం చెప్పినా దేవుడ్ని తక్కువ చేసినట్లుగా ఉండే ప్రశ్న అది. “సృష్టించగలడు” అని సమాధానం ఇస్తే.. “అయితే దేవుడు మోయలేని బరువు ఒకటి ఉంది” అని ఒప్పుకున్నట్లే. ఆ విధంగా దేవుడు సర్వశక్తిమంతుడు అన్న స్టేట్ మెంట్ కరెక్ట్ కాదని తేలుతుంది. పోనీ “సృష్టించలేడు” అని సమాధానం ఇస్తేనేమో “అయితే దేవుడు సృష్టించలేనిది ఒకటి ఉంది” అని ఒప్పుకున్నట్లవుతుంది. ఆ విధంగా కూడా దేవుడు సర్వశక్తిమంతుడు కాడు అని చెప్పినట్లే.
భగత్ సింగ్ వేసింది కిరికిరి ప్రశ్న అని వాదించవచ్చు. నిజానికి కిరికిరి(తనం) ఏమన్నా ఉంటే అది ఆయన వేసిన ప్రశ్నలో లేదు. ‘దైవత్వం ఉనికి’ లోనే కిరికిరి ఉన్నది కనుక ఆస్తికులకు కిరికిరి సంకటం వచ్చిపడింది అని భగత్ సింగ్ అనుయాయులు చెబుతారు.
దేవుడు ఉండడమా, మానడమా అన్న సంశయం అటుంచితే మతం విషయంలో పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయన్న ప్రశ్న ఆసక్తికరం. అమెరికా పత్రిక హఫింగ్టన్ పోస్ట్ ఈ ప్రశ్న కొందరు భారతీయ పిల్లల్ని అడిగి వారినుండి సమాధానాల్ని రాబట్టింది. వారి సమాధానాల్ని వారి ఫోటోలతో సహా ప్రచురించింది. వాటిని కింద చూడండి.
What does religion means to you? (మీ దృష్టిలో మతం అంటే ఏమిటి?)
What is your religion? (నీ మతం ఏమిటి?)
Do you find them any different from yourself? (ఇతర మతస్ధులకూ నీకూ ఉన్న తేడా ఏమిటి?)
What purpose does religion serve? (మతం లక్ష్యం ఏమిటి?)
అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి సీరియస్ ప్రయత్నాలు మొదలు పెట్టాలని ఆర్.ఎస్.ఎస్ అధినాయకులు మోహన్ భగవత్ ఈ రోజే పిలుపు ఇచ్చారు. అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం చనిపోయిన అశోక్ సింఘాల్ (విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు) స్మృత్యర్ధం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ పిలుపు ఇచ్చారు. రామ మందిర నిర్మాణమే సింఘాల్ కు నిజమైన నివాళి అని ఆయన వాకృచ్చారు.
మరోవైపు ఈ పిల్లల్ని చూస్తే మతానికి సంబంధించిన ఎలాంటి భావోద్వేగాలను దరి చేరనీయకపోగా ఇతర మతాల పట్లా, ఇతర మతాలను అనుసరించేవారి పట్లా సహోదర భావాన్ని, సహనశీలతనూ కలిగి ఉన్నారు. మతం పేరుతో జరుగుతున్న పేలుళ్లను ప్రస్తావించిన పిల్లాడు కూడా హింసను ప్రేరేపిస్తున్న మతాలు నాకు వద్దు అన్నాడే గానీ హింసకు పాల్పడుతున్న వారి మతం పైన ద్వేషం మాత్రం వ్యక్తం చేయలేదు. తల్లిదండ్రులు ఏది చెబితే అదే నా మతం అని ఒకరు అమాయకంగా చెబితే మతం అంటే ఏమిటో ఆ దేవుడికే తెలియాలి అని నిరసనాత్మక నిస్పృహను వ్యక్తం చేశాడు మరో గడుగ్గాయి. మరీ ముఖ్యంగా మతాల మధ్య భాష తప్ప మరో తేడా లేదని ఒకరు చెబితే ‘దేవుడి ఉనికిని గుర్తించే (ఊహించే) పద్ధతిలోనే తేడా’ ఇంకొకరు తేల్చేశారు.
ఇంతటి మానవతాత్మక మానసిక ప్రశాంతతను ప్రదర్శించిన పిల్లలను ఆర్.ఎస్.ఎస్ అధినాయకులు పరిగణనలోకి తీసుకుంటారా? ‘పిల్లలు దైవ స్వరూపులే’ అయితే గనక పరిగణించి తీరాలి. లేక “ఆ, పిల్లలకేం తెలుసు? హిందూ మతం గొప్పతనం ఏమిటో!” అని తేల్చేస్తారా, అలనాడు ఆదిశంకరునికి పరమాత్మ మర్మాన్ని బోధించిన ఛండాలునికి మల్లే ఈ పిల్లకాయలే పూనుకుని మతంలోని మర్మాన్ని బోధించాల్సి వస్తుందేమో!
పిల్లలను దైవస్వరూపంగా చెప్పడంలో అర్ధం-దైవం నా,తన తేడాలను చూపడు,అందరినీ సమానంగా చూస్తాడనే అర్ధంలో దేవుడును పిల్లలతో పోల్చారు(నా దృష్టిలో దేవుడునే పిల్లలతో పోల్చడం సరైనది!)
ఊహ తెలిసిన వారు స్వార్ధ పరమైన ఆలోచనలను కలిగి ఉంటారు.కానీ,పిల్లలు సెల్ఫ్ ఇగో సెంట్రిక్ స్వభావంలో ఉంటారు.స్వార్ధానికీ,సెల్ఫ్ ఇగో సెంట్రిక్ కీ తేడా ఉన్నది.
మతం గురించి పిల్లలకు ఏమీ తెలియదని చెప్పడం సరైనదికాదేమో-ఎందుకంటే నేను 2010 నుండి గిరిజన ఆవాసంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను.మతం,దేవుడి గురించి ఆ లేలేతచిన్నారులు(5-10 సం,, వయసు పిల్లలు) తెలిపిన అభిప్రాయాలు నన్ను ధిగ్బ్రాంతికి గురిచేశాయి.
పిల్లలంటే ఎంతో ఇష్టం కలిగిన నేను వారి అభిప్రాయలు విని అటువంటి అభిప్రాయలను వారిలో కలిగించిన వారి మతప్రబోధకులమీద ఏహ్యభావం ఏర్పడింది.