సిరియాలో ఎగదోసిన మంటలు ఫ్రాన్స్ లోకి!


ISIS attacks France!

ISIS attacks France!

ఉగ్రవాద పెనుభూతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాని ఫలితంగానే ప్యారిస్ పైన టెర్రరిస్టు దాడి జరిగిపోయింది. మానవత్వం మరిచిపోయిన కిరాతక ఉగ్రవాదులు అత్యంత సుందర నగరం ప్యారిస్ పై దాడి చేసి రక్తపాతం సృష్టించారు. 130 మందిని పొట్టన బెట్టుకున్నారు. సంగీత తరంగంలో మునిగిన వారిని, క్రీదానందంలో ఉన్నవారినీ, షాపింగ్ కు వచ్చినవారిని… వారూ వీరు అని లేకుండా అమాయకుల రక్తాన్ని చవిచూచారు. సోషలిస్టు భావ తరంగం ఊపిరి పోసుకున్న నేల ఉగ్ర మూకల పదఘట్టనలతో మైలపడిపోయింది! రక్తం మరిగిన ఇసిస్ మూకలే ఈ దారణానికి కర్తలు. ఇది నేటి మాట!

ఇరాక్, సిరియాలలో విస్తార ప్రాంతాలను ఆక్రమించిన అత్యంతాత్యంత తీవ్రంగా కరుడుగట్టిన ముస్లిం ఉగ్రవాదులు ఇస్లామిక్ కాలిఫేట్ ను ఏర్పరిచారు. దానిపేరు ఇస్లామిక్ స్టేట్! దీనిని నిన్నటివరకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఇసిస్) అనీ, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంత్ అనీ పిలవబడింది. ప్రపంచంలోని ముస్లిం దేశాల నుండి ముస్లిం యువత కుప్పలు తెప్పలుగా ఇసిస్ రాజ్య నిర్మాణానికీ, ఇస్లామిక్ రాజ్య రక్షణకు కంకణబద్ధులై ఐ.ఎస్ లో చేరేందుకు వలసలు కట్టారు. చివరికి అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ తదితర పశ్చిమ రాజ్యాల నుండి కూడా ముస్లిం యువతరం వందలు, వేలుగా వలస వెళ్తున్నారు. వీరంతా మళ్ళీ వెనుదిరిగి వచ్చి తమ తమ దేశాలకు (ఎక్కడి నుండైతే వలస వచ్చారో ఆ దేశాల్లో) తిరిగి వచ్చి ఐ.ఎస్ లో పొందిన శిక్షణను ఉగ్ర శిక్షణను సొంత దేశాల్లో ప్రయోగిస్తారేమోనని భయపడుతున్నారు. ఇది నిన్నటి మాట!!

సిరియా ప్రజలు తిరగబడుతున్నారు. క్రూర నియంత బషర్ ఆల్-అస్సాద్ తిరిగబడుతున్న ప్రజలపై దారుణ నిర్బంధం ప్రయోగిస్తున్నాడు. తన ప్రజలను తానే చంపుకు తింటున్నాడు. ప్రజల స్వేచ్ఛా కాంక్షలను అణచివేస్తున్నాడు. ఊళ్లను, పట్నాలను చుట్టుముట్టి బాంబులు వేస్తున్నాడు. ట్యాంకులతో కుళ్లబొడుస్తున్నాడు. భవనాల మీదికి ఎక్కి వీధుల్లో ప్రజలను కాల్చి చంపుతున్నాడు. పసి పిల్లలు, స్త్రీలను కూడా చంపేస్తున్నాడు. ఆల్-అస్సాద్ పై తిరిగబడి పోరాడుతున్న వీరోచిత ఆల్-నూస్రా, ఫ్రీ సిరియన్ ఆర్మీ, ఆల్-షబాబ్, ఆల్-థవీద్ బ్రిగేడ్, ఆన్సర్ ఆల్-షామ్ లకు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ మొ.న పశ్చిమ దేశాలు, టర్కీ, సౌదీ అరేబియా,  కతార్, యు.ఎ.ఇ ఇత్యాది అరబ్-ముస్లిం దేశాలు కంకణం కట్టుకున్నాయి. పోరాట వీరులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. బిలియన్ల సొమ్ము కుమ్మరిస్తున్నాయి. వారి లక్ష్యం ఒక్కటే అస్సాద్ నియంతృత్వం నుండి సిరియా ప్రజలు విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చడం! ఇది మొన్నటి మాట!!!

వలయం (సర్కిల్) పూర్తయింది! ఎవరు ఎవరో స్పష్టం కావడం లేదా? ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతున్న పశ్చిమ పెట్టుబడిదారీ ప్రపంచానికి మరిన్ని మార్కెట్లు కావాలి. చైనా, రష్యాల మార్కెట్లు కూడా కావాలి. పశ్చిమ ఆధిపత్యానికి లొంగని ఇరాన్, వెనిజులా, ఈక్వడార్, అర్జెంటీనా, లిబియా లాంటి రాజ్యాల చమురు వనరులు, మార్కెట్లు కూడా తమకే కావాలి. కానీ ఇరాన్ లొంగి రావడం లేదు. వెనిజులా ఏకంగా తన పెరట్లోనే కూటములు కడుతోంది. ఎన్ని చర్చలు చేసి, ఎన్ని ఆశలు చూపినా రష్యా మాట వినడం లేదు. చైనా తిరుగులేని ఆర్ధిక శక్తిగా ఎదిగిపోయింది. ఇది మారాలి. ఏదో చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేసి సద్దాం ని అంతం చేయడానికి ఒసామా బిన్-లాడెన్ మహ బాగా అందివచ్చాడు. అలాంటిదే ఇంకొక సాకు కావాలి.

సైతాన్ రాజ్యాలు కుట్రలు పన్నాయి. పాచికలు విసిరాయి. చతురంగ బలాలకు బదులు అటు నుంచి నరుక్కు వచ్చే వ్యూహాలు రచించబడ్డాయి. ఫలితంగా లిబియాలో హఠాత్తుగా తిరుగుబాటు మొదలయింది. వారికి సహాయం అవసరం అయింది. ఐరాస తీర్మానం చేసింది. పశ్చిమ రాజ్యాలు రెచ్చి పోయాయి. ‘రక్షించే బాధ్యత’ (Responsibility to protect) ను తమకు తామే అప్పగించుకున్నాయి. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా అత్యంత నగ్నంగా, సిగ్గు విడిచి, నీతి మరిచి లిబియాపై బాంబులు కురిపించాయి. దేశాధినేత గడాఫీని చంపేశాయి. ఇప్పుడు లిబియా కుక్కలు చింపిన విస్తరి. దొంగలు పంచుకున్న ఊరు. ఆటవిక న్యాయమే అక్కడ సమ న్యాయం!

ఈజిప్టులో ముస్లిం బ్రదర్ హుడ్ నిరాశపరిచింది. పాలస్తీనా హమాస్ కు తోడు వస్తోంది. నమ్మిన బంటు ఇజ్రాయెల్ సంతోషంగా లేదు. ఫలితంగా అక్కడ అరబ్ వసంతం పిచ్చి మొలకలు వేసింది. సైనిక కుట్ర ప్రశాంతంగా జరిగింది. రక్తపాతం కూడా ప్రశాంతంగానే ముగిసిపోయింది. ముప్ఫై యేళ్ళ తర్వాత జరిగిన ఎన్నికల దరిమిలా ఏర్పడ్డ పీస్ అండ్ జస్టిస్ పార్టీ హఠాత్తుగా కూలిపోయింది. సైన్యం పగ్గాలు చేపట్టింది.  పశ్చిమ ప్రాపకంలో వసంతం ముసుగు ధరించి వచ్చిన సైనిక నియంతృత్వం ముసుగు వీడి వికటాట్టహాసం చేసింది.

ఇక ఇరాన్ పని పట్టాలి. ఇరాన్ బలహీనపడాలంటే ఇరాన్ మద్దతు పొందుతూ ఇరాన్ కు మద్దతు వస్తున్న బషర్ ఆల్-అస్సాద్ కూలిపోవాలి. వాడికి కూడా గడాఫీకి పట్టిన గతే పట్టాలి. కానీ అదంత తేలిక కాదు. ప్రతిఘటనాక్షం (Axis of Resistance) హిజ్బొల్లా-సిరియా (అస్సాద్)-ఇరాన్ మధ్య ప్రాచ్యంలో పెట్టని కోట. [ఈ కోట పడిపోకుండా ఉండడం రష్యా, చైనాల అవసరం.  రష్యాని బిజీగా ఉంచడానికి ఉక్రెయిన్ లో ప్రజలకు తెలియని ప్రజల తిరుగుబాటు నాటబడింది. కానీ పశ్చిమ సామ్రాజ్యవాదులు విసిరిన ఉక్రెయిన్ ఉచ్చులోకి రావడానికి రష్యా (పుతిన్) అంత తెలివితక్కువగా లేదు.] నేరుగా ఇరాన్ మీదికి వెళ్లడానికి (ప్రపంచానికి నచ్చజెప్పగల) కారణాలు లేవు. బహుళ జాతులు, మతాల నిలయం అయిన సిరియా అందుకు తగిన చోటు.

ఫలితంగా సిరియాలో హఠాత్తుగా జనానికి తెలియని జన ప్రతిఘటన మొదలై పోయింది. కుర్దుల పోరాటాన్ని అణచివేయడానికి అప్పటివరకూ మూసి ఉంచిన టర్కీ-సిరియా సరిహద్దు హఠాత్తుగా -టర్కీ వైపు నుండి- తెరుచుకుంది. ఆయుధాలు ప్రవహించాయి. బాంబులు ప్రవేశించాయి. శతఘ్నులు మోగాయి. సిరియా రావణ కాష్టమే అయింది. అస్సాద్ చంపేశాడని హఠాత్తుగా వందల మంది పిల్లలు తెల్ల పొత్తిళ్లలో శవాలై పడి ఉన్న ఫోటోలు దర్శనం ఇస్తాయి. వాళ్లెవరో ఎప్పటికీ తెలియదు. హౌలా  హత్యాకాండ, ఆ హత్యా కాండ, ఈ హత్యా కాండ అంటూ ఫోటోలు, ఫోటోల వీడియోలు ఎవరో అందివ్వగా పశ్చిమ పత్రికలు ప్రచురిస్తాయి. ఆ విధంగా అస్సాద్ క్రూరుడు అని ప్రపంచం నమ్మాలి. అస్సాద్ కు సాయం చేయొద్దని రష్యా, చైనా లపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తేవాలి.

కానీ ఇవేవీ పని చేయలేదు. అస్సాద్ ఒంటరి కాలేదు. సిరియా ప్రజలు అతని వెంటే నిలిచారు. ఆయుధాలు పట్టుకుని సిరియాలో మారణహోమం సృష్టిస్తున్నది అస్సాద్ బలగాలు కాదని, పశ్చిమ దేశాల ధన, ఆయుధ సాయంతో గల్ఫ్ రాజ్యాలు ప్రవేశపెట్టిన కిరాయి మూకలే సామూహిక జనహననానికి కారణమని వాస్తవాలు వెలికి వచ్చాయి. ఆల్-ఖైదా ప్రవేశపెట్టిన ఆల్-నూస్రా బలగాలకే పశ్చిమ సాయం అందుతోందని స్వతంత్ర వార్తా సంస్ధలు వెల్లడి చేశాయి. పశ్చిమ పత్రికలు సైతం ఈ సంగతిని ఇతర మాటల్లో వెల్లడి చేశాయి.

ఆ విధంగా మరో కొత్త టెర్రరిస్టు సంస్ధ, ఆల్-ఖైదా ను మించిన ఉగ్రవాద సంస్ధ అంటూ సరికొత్త టెర్రరిస్టు సంస్ధ ‘ఇసిస్’ కు పురుడు పోశారు. ఇక ఇంటర్నెట్ నిండా వీడియోలు, తమ బందీల తలలను కోసేస్తున్న ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. జీహాదీ జాన్ అంటూ రకరకాల కేరక్టర్లు పత్రికల పతాక శీర్షకల్లో నాని నాని కరిగిపోయారు. పశ్చిమ దేశాలు ఆయుధాలు ఇచ్చి, శిక్షణ గరిపి ప్రవేశపెట్టిన ఆల్-నూస్రా లాంటి డజన్ల కొద్దీ ఉన్న కిరాయి మూకలే మోడరేట్ ఉగ్రవాదులుగా సహాయం అందుకోవడం కొనసాగుతూనే ఉంది. ఆ ఆయుధాలే ఇసిస్ బలగాలకు అందుతున్న సంగతి ఇప్పుడు అంత రహస్యం ఏమి కాదు.

ఎన్ని చేసినా అస్సాద్ నిలబడే ఉన్నాడు. హిజ్బొల్లా, ఇరాన్, రష్యా దేశాల సహాయంతో అస్సాద్ శక్తివంతంగానే నిలిచాడు. సో కాల్డ్ జిహాదీలు / కిరాయి మూకలే నీరసించాయి. చివరికి పశ్చిమ దేశాలు మొదలు పెట్టిన ఆటనే రష్యా/పుతిన్ ఆడడం మొదలయింది. ఇసిస్ పై బాంబులు కురిపిస్తున్నాం అంటూ అమెరికా ప్రారంభించిన వాయు దాడులకు మద్దతుగా రష్యా కూడా విమాన దాడులు కొనసాగించింది. కానీ అమెరికా ఎవరూ లేని నేలపై బాంబులు వేస్తూ, బాంబు దాడుల పేరుతో ఆయుధాలు జారవిడుస్తూ ఇసిస్ కు సాయం చేస్తుంటే రష్యా మాత్రం అస్సాద్ బలగాలకు మద్దతుగా ఇసిస్ ముసుగులో ఉన్న పశ్చిమ ప్రేరేపిత కిరాయి మూకలపై నేరుగా దాడులు చేస్తోంది. దానితో కిరాయి మూకలు పలాయనం చిత్తగిస్తుండగా, అస్సాద్ బలగాలు మరిన్ని ప్రాంతాలను ఇసిస్ కిరాయి  మూకల నుండి విముక్తి చేస్తోంది. ఈ దాడులను తమ మద్దతు ఉన్న మోడరేట్ లపై జరుగుతున్న దాడులని అమెరికా హీన స్వరంతో ఖండిస్తోంది. గట్టిగా ఖండిస్తే అసలు టెర్రరిస్టుల్లో మోడరేట్ లు ఎలా ఉంటారన్న ప్రశ్న గట్టిగా వెనక్కి వినపడుతుంది కదా!

ఈ నేపధ్యంలో ప్యారిస్ దాడులకు ఎవరిని తప్పు పట్టాలి? సిరియాలో మారణ హోమం సృష్టించి 2.5 లక్షల మంది ప్రాణాలు తీసిన కిరాయి మూకలను స్వేచ్చా వాయువుల కోసం పరితపిస్తున్న తిరుగుబాటుదారులని శ్లాఘించిన ఫ్రాన్స్ నేత ఫ్రాంషా ఒలాండే ఈ రోజు ప్యారిస్ దాడిని చూపుతూ ధర్మపన్నాలు పన్నడం ఏ విధంగా ధర్మ సమ్మతం?

అసలు ప్యారిస్ దాడులకు ఒడిగట్టిన కిరాతకులు అనేక యేళ్లుగా ఫ్రాన్స్ ఇంటలిజెన్స్ నిఘాలో ఉన్నవారే అన్న వాస్తవాన్ని ఒలాండే ఎందుకు చెప్పడు? మొన్నటి వరకూ ఉగ్రవాదం వైపు ఆకర్షితులు అయినవారనో, ఆకర్షితులు కావచ్చనో ఎవరి మీదనైతే నిఘా పెట్టి ఉంచారో వారే హఠాత్తుగా సచ్ఛీలురుగా ఇంటలిజెన్స్ సంస్ధల చేత ముద్ర పొంది క్లీన్ చిట్ పొందడం, ఆ మరుసటి రోజుల్లోనే వారు బాంబులు ధరించి ఆత్మాహుతి దాడులకు ఒడిగట్టడం ఎలా సాధ్యం? సంవత్సరాల తరబడి తమకు తెలిసిన ఉగ్రవాదులే, తమ నిఘాలో ఉన్న అనుమానితులే తమ కన్నుగప్పి ఇంత భారీ స్ధాయి ఘాతుకానికి తెగబడినా ఫ్రాన్స్ ఇంటలిజెన్స్ వర్గాలకు తెలియకుండా పోవడం సాధ్యమేనా?

ఇన్ని ప్రశ్నల నేపధ్యంలో అర్జెంటీనా కార్టూనిస్టు కార్లోస్ లాతుఫ్ ప్రచురించిన పై కార్టూన్ కి అర్ధం ఏమిటో ఇట్టే గ్రహించవచ్చు. సిరియాలో తాను ఎగదోసిన మంటలే తమ దేశానికి పాకగా మ్రాన్పడి చూస్తున్న ఫ్రాంషా ఒలాండే ప్యారిస్ ప్రజలకు సమాధానాలు ఇవ్వవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కానీ తాము వేయవలసిన ప్రశ్నలు ఏమిటో ప్యారిస్ ప్రజలకు ఎప్పటికీ తెలిసేను?

5 thoughts on “సిరియాలో ఎగదోసిన మంటలు ఫ్రాన్స్ లోకి!

 1. పోలీస్ ఇంటలిజెన్స్ లిస్టు లో ఉండి కూడా వదిలేసారు అనే విషయానికి వస్తే , యూరోప్ లో మనవ హక్కుల చట్టాలు కొంచెం కఠినం అందువల్ల సరి అయినా కారణం లేకుండా అదుపు లోకి తీసుకోవడం కష్టం .

 2. రెండేళ్ల క్రితం తొట్టెన్ హామ్ లో జరిగిన అల్లర్లను గుర్తు చేసుకోండి. సరైన విచారణ లేకుండా అతి వేగంగా బ్లాక్ యువకులకి సుదీర్ఘ కాలం జైలు శిక్ష వేశారు. బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలతో జడ్జిలు ఆగమేఘాల మీద ఆ శిక్షలు వేశారు. జులియన్ ఆసాంజేను సం.ల తరబడి ఈక్వడార్ ఎంబసీలో ఖైదు చేయడం, అది కూడా ఛార్జీలు నమోదు చేయని కేసులో కేవలం ప్రశ్నించాలన్న నెపంతో, ఏ మానవ హక్కుల చట్టాల కోవలోకి వస్తుంది?

  ఏ మానవ హక్కుల చట్టాల ప్రకారం ఐరోపా దేశాలు ఆఫ్ఘన్ ను దురాక్రమించడానికి సైన్యాలు పంపాయి? ఏ చట్టాల ప్రకారం సద్దాంపైన అబద్ధపు నేరాలు మోపి ఇరాక్ పై దాడి చేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేశారు? సద్దాంపై విధించిన ఆంక్షల వల్ల లక్షల మంది ఇరాకీ పసిపిల్లలు పాల డబ్బాలు లేక చనిపోతున్నా పట్టించుకోని ఐరోపా మానవ హక్కుల చట్టాలు నిజంగా అంత కఠినమా?

  ప్రపంచానికి చూపడానికి కొన్ని చట్టాలు, తాము అమలు చేయడానికి వేరు చట్టాలు ఐరోపా దేశాలకు ఉంటాయి. ఎటొచ్చీ ఆ సంగతిని అర్ధం చేసుకోవడమే అవసరం.

  వివిధ అంశాలను విడిగా చూడడంతో పాటు కలిపి కూడా చూడాలి. అప్పుడే సమగ్ర అవగాహనకి రాగలం.

 3. పెట్టుబడిదారి వ్యవస్థ దాని అత్యంత వైవిధ్యపూరితరూపంలో ఒక సజీవ,సాంఘీకమూర్తిగా ఆవిర్భవించి,అభివృద్ధిచెంది,చివరకు తన సొంత వైరుధ్యాలభారంతోనే తను కూలిపోవలసిందే-కార్ల్ మార్క్స్.
  తన సొంతవైరుధ్యాలలో భాగంగానే అమెరికాలో మఒదలైన వాల్ స్ట్రీట్ ఉద్యమం-దాని వ్యాప్తి(మిగత పెట్టుబడీదారి దేశాలలో);కుచించుకుపోతున్న కొనుగోలుసామర్ధ్యంతో ఐరోపాలో పెల్లుబికిన అసంతృప్తులు,వాటిని కప్పిపుచ్చుకోవడానికి సామ్రాజ్యవాదులు సాంస్కృతికంగా జడత్వాన్నికలిగియున్న ఇస్లామిక్ దేశాలలో కొనసాగిస్తున్న మారణహోమం-దానికి ప్రతిగా పెట్టుబడిదారీ దేశాలలో(ప్రజలపై) టెర్రరిస్ట్ దాడులు ఇవన్నీ చూడడానికి కూలిపోవడానికి సిద్ధపడుతున్న పెట్టుబడిదారీవ్యవస్థ మరణశాసనంగా కనిపిస్తున్నప్పటికీ; సామాన్యప్రజలలో ఉన్నటువంటి ఈ చైతన్యం వారిని ముందుండినడిపించవలసిన ఉద్యమకారులలో కొరవడడం వైపరీత్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s