ట్విట్టరై వెళ్ళి కాకిలా తిరిగొచ్చింది -కార్టూన్


జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించాలని మోడి ప్రభుత్వం కోరడం వెనుక యోగాను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే ఉద్దేశ్యం మాత్రమే ఉన్నదని ఆర్.ఎస్.ఎస్ మాజీ ప్రతినిధి (spoksperson), బి.జె.పి జనరల్ సెక్రటరీ ప్రచురించిన ట్వీట్ తో స్పష్టం అయింది.

జూన్ 21 తేదీన రాజ్ పధ్ లో జరిగిన సామూహిక యోగా ప్రదర్శనకు ప్రధాని నరేంద్ర మోడి ముఖ్య అతిధిగా హాజరై యోగాసనాలు వేశారు. “ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హమీద్ అన్సారీ పాల్గొనకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?” అని ప్రశ్నిస్తూ బి.జె.పి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ట్విట్టర్ పోస్ట్ ద్వారా ప్రశ్నించారు.

ఆయన ట్విట్టర్ పోస్ట్ ఇలా ఉంది:

Two questions. Did RS TV dat runs on tax payers money completely blackout Yoga Day event? While President participated d VP gave a miss?

ఢిల్లీలో యోగా డే ప్రదర్శనను రాజ్యసభ టి.వి ప్రసారం చేయలేదని ఎత్తి చూపిన రామ్ మాధవ్, రాష్ట్రపతి గారే యోగా దినోత్సవంలో పాల్గొంటే ఉప రాష్ట్రపతి ఎందుకు పాల్గొనలేదు? అని తన ట్విట్టర్ పోస్ట్ లో ప్రశ్నించారు.

రామ్ మాధవ్ ప్రశ్నకు ఉపరాష్ట్రపతి వెంటనే బదులిచ్చారు. ప్రధాని కార్యక్రమంలో పాల్గొనాలని తనకు ఆహ్వానమే అందలేదని ఆయన వెల్లడించారు. ఉన్నత స్ధానాల్లో ఉన్నవారు పిలవని పేరంటానికి రావడం ఎంతమాత్రం సమ్మతం కాదు గనక అన్సారీ గైర్హాజరులో తప్పు వెతకడానికి ఏమీ లేదు.

అయితే అసలు విషయం ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ క్షమాపణ ప్రకటనలో తెలిసి వచ్చింది. “ప్రధాన మంత్రి ముఖ్య అతిధిగా ఉన్నపుడు ఉపాధ్యక్షుడిని ఆహ్వానించడం సబబు కాదు. అందుకే మేము ఆయనకు ఆహ్వానం పంపలేదు. (అధికార) ప్రాధామ్యతా వరుస ప్రకారం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఇరువురు ప్రధాన మంత్రికి పైన ఉంటారు. కనుక వారిని మేము ఆహ్వానించలేము” అని శ్రీపాద్ అసలు విషయం చెప్పారు.

రామ్ మాధవ్ ట్వీట్ లో పేర్కొన్నట్లు రాష్ట్రపతి/దేశాధ్యక్షులు యోగా దినోత్సవంలో పాల్గొన్నది నిజమే కానీ అది నరేంద్ర మోడి హాజరైన చోట కాదు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఉత్సవంలో మాత్రమే ఆయన పాల్గొన్నారు.

ఇక హమీద్ అన్సారీ విషయానికి వస్తే ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చి యోగా ప్రాశస్త్యం గురించి డప్పు కొట్టడానికి ముందు నుండే యోగాను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన ఎప్పటి నుండో క్రమం తప్పకుండా యోగా ఆచరిస్తున్నారు. జూన్ 21 రోజు నాడు కూడా యోగా చేశారు, తన అధికార నివాసంలో. రామ్ మాధవ్ గారు యోగా చేస్తారో లేదో మరి!

ఈ సంగతి తెలుసుకున్న రామ్ మాధవ్ అర్జెంట్ గా తన ట్వీట్ ను తొలగించేశారు. హమీద్ అన్సారీకి ఆపాలజీ కూడా చెప్పారని కొన్ని పత్రికలు తెలిపాయి. కానీ అప్పటికే ట్విట్టర్ లో అనేకమంది రామ్ మాధవ్ ట్వీట్ ను ఉతికి ఆరేశారు.

ట్విట్టర్ కూతల ద్వారా ఉప రాష్ట్రపతిని బద్నామ్ చేసి తద్వారా రాజకీయ లబ్ది పొందుదామని తొందరపడిన రామ్ మాధవ్ చివరికి తన ట్విట్టర్ కూతలు విమర్శల తాకిడికి మసిబారి వెనక్కి తన్నిన పరిస్ధితిని చవి చూశారు.

తొందర పడి కోయిల ముందే కూస్తే ఏమవుతుందో రామ్ మాధవ్ కూసిన ట్విట్టర్ కూత ద్వారా తెలుసుకోవచ్చు. ముందూ వెనకా చూడకుండా కూయడం ఎందుకు, ఆ తర్వాత ‘తూఛ్!’ అంటూ నాలిక కరుచుకోవడం ఎందుకు?

ఎందుకంటే వారు హిందూత్వ కనుక! ముస్లిం వ్యతిరేకతే రాజకీయ ప్రాణ వాయువుగా బతికే హిందూత్వ నేతలకు అత్యున్నత స్ధానాల్లో ఉన్న ముస్లిం వ్యక్తులన్నా చిన్న చూపే అని ఈ ఉదంతం చెబుతోంది. కాగా ఇంటర్నేషనల్ యోగా డే ప్రకటన, నిర్వహణ వెనుక ఫక్తు రాజకీయ కారణాలే తప్ప ఇంకే కారణమూ లేదని రామ్ మాధవ్ వెల్లడించుకున్నారు.

 

వ్యాఖ్యానించండి