ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ నుండి ఒక్క పూటలో ముగిసిపోయే టి20 మ్యాచ్ ల వరకు క్రికెట్ ఆట ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఆట గమ్యం ఏమిటన్నది చూస్తే జనుల మానసికోల్లాసం కాకుండా డబ్బు సంపాదనే అని స్పష్టం అవుతుంది.
ఏ ఆట అయినా మనిషి యొక్క శారీరక, మానసిక, మేధో శక్తులను మెరుగుపరచడానికి, దైనందిన జీవనం నుండి కాసింత బైటపడి సేద తీరడానికీ, ఆరోగ్యం పెంపొందించడానికి పుట్టినదే.
కానీ సమాజం డబ్బు జబ్బుతో బాధపడడం పెరిగే కొద్దీ, మనిషి జీవనంలోని ప్రతి అంశమూ వ్యాపారీకరణ చెందే కొలదీ ఆట కూడా డబ్బులో మునిగి తేలడం తీవ్రం అవుతూ వస్తోంది.
ఏ సమాజంలోనైనా పాలక వర్గాలే సమస్త అంశాలను శాసిస్తుంటాయి. మనిషి సాంస్కృతిక జీవనం అప్పటి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగానే నడుస్తూ ఉంటుంది. పాలితులు కూడా పాలకుల సంస్కృతినే అనుకరిస్తూ తామూ పాలకులలో భాగమేనన్న సంతృప్తిని పొందుతుంటారు.
ఆ విధంగా ఒకప్పుడు తెల్ల పాలకుల ఆటవిడుపు ఆటగా ఉన్న క్రికెట్ ఆటను వారి పాలితులైన వలస దేశాలు కూడా తమ ఆటగా చేసుకున్నాయి. ఒకప్పటి బ్రిటిష్ వలస దేశాలలో మాత్రమే క్రికెట్ ఆట ప్రాచుర్యం పొందడం కాకతాళీయం ఏమీ కాదు.
1983లో మొదటిసారి క్రికెట్ ప్రపంచ కప్పును ఇండియా గెలుచుకున్న తర్వాత దేశంలో క్రమేణా క్రికెట్ కు ఆదరణ పెరిగింది. ప్రధాన నగరాల్లో ఉండే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను దాటి ప్రభుత్వ పాఠశాలలోనూ అడుగు పెట్టింది. 90ల ఆరంభంలో ఉపఖండంలో ప్రపంచ కప్పు ఆటలు నిర్వహించాక నగరాలు, పట్టణాలను దాటి పల్లెలకూ వ్యాపించింది క్రికెట్! చివరికది జ్వరంగా మారిపోయింది.
ఈలోపు నూతన ఆర్ధిక విధానాల ఫలితంగా ప్రపంచం అంతటా విస్తరించిన శాటిలైట్ ఛానెళ్లు క్రికెట్ ఆదరణను వెర్రిగా మార్చివేశాయి. రేడియో కామెంటరీ అప్పటివరకూ భాషా పరిమితులను ఎదుర్కొంటూ ఉండేది. ఆంగ్లం, హిందీల్లో మాత్రమే కామెంటరీ ప్రసారం అయ్యేది.
ఛానెళ్ల ప్రవేశంతో గట్టు తెగిపోయింది. బ్యాట్ తో బాల్ ని కొట్టడం, అది బౌండరీ లైన్ దాటిపోయి స్కోరు వేగంగా కదలడం, ఆటగాళ్లు పట్టలేని ఆనందంతో గెంతులు వేయడం… అన్నీ ఆకర్షణీయ దృశ్యమై ‘నట్టింట్లో ఇడియట్ బాక్స్’ లో ప్రత్యక్షం అయ్యాయి. ఫలితంగా క్రికెట్ ఇక అర్ధం కాని ఆట కాదు.
ఎప్పుడైతే క్రికెట్ జ్వరంగా మారిందో అప్పుడే దానిని సొమ్ము చేసుకోవడానికి తగిన భూమిక ఏర్పడిపోయింది. జాతీయ క్రికెట్ ఆటగాళ్లకు జనాదరణ పెరగడంతో వారిని వ్యాపార సంస్ధలు చుట్టుముట్టాయి. ప్రకటనల వెర్రి రాజుకుని ఆటగాళ్ల ఇంట సిరులు కురిపించింది.
ఆటగాళ్లకు సిరులు పండే కొలదీ వెర్రి మరింత తీవ్రం అయింది. క్రికెట్ ప్రతిభావంతులు క్రికెట్ గాడ్ లు గా అవతరించారు. ఈ మాయ అంతా అత్యవసరంగా మార్కెట్ సృష్టించిన మాయ. డబ్బు మిల్లులు సృష్టించిన ఘోష. జనాన్ని వెర్రివాళ్లని చేసి లోబరుచుకునే క్రీడ. ఈ క్రీడలో రాజకీయాలు, డబ్బు జమిలిగా పెనవేసుకుని ఉంటాయి.
క్రికెట్ అంటే డబ్బే కాకపోతే ఇప్పటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, నిన్నటి వ్యవసాయ మంత్రి శరద్ పవార్, సిమెంటు పరిశ్రమ అధిపతి శ్రీనివాసన్ ఇంకా అనేకానేక మంది ఎం.పిలు, ఎమ్మేల్యేలు, పారిశ్రామికాధిపతులు, వ్యాపారులు క్రికెట్ లోకి ఆబగా ఎందుకు జొరబడతారు?
గత 30 యేళ్ళ నుండి బి.సి.సి.ఐ ని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారని ఐ.పి.ఎల్ రూపకర్త లలిత్ మోడి నిన్న ఆరోపించారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ఐ.పి.ఎల్ మొదలైన రెండు మూడేళ్ళలోనే అప్పటి ఐ.పి.ఎల్ సి.ఈ.ఓ కూడా అయిన లలిత్ మోడి 700 కోట్లకు పైగా దేశం దాటించారంటే ఏమిటి అర్ధం?
మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) విచారణ నుండి తప్పించుకోవడానికి బ్రిటన్ పారిపోయిన లలిత్ మోడీకి సాక్ష్యాత్తు విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ యే రికమెండ్ చేసి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇప్పించారు. లలిత్ మోడి కేసును వాదిస్తున్నది సుష్మా భర్త, కూతుళ్ళు.
రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తనకు కుటుంబ స్నేహితులు అని లలిత్ మోడీయే స్వయంగా చాటుకున్నారు. భారత ప్రభుత్వానికి తెలియకుండా లలిత్ మోడి వలసకు (పారిపోయెందుకు) సహకరించడానికి వసుంధర ఒప్పుకున్న సంగతి లలిత్ మోడీయే బైటపెట్టారు. యు.పి.ఏ మంత్రులు శరద్ పవార్, రాజీవ్ శుక్లా, ప్రఫుల్ పటేల్ లు కూడా తనకు సహాయం చేశారని లలిత్ మోడి వెల్లడించడం గమనార్హం.
కనుక క్రికెట్ అనే భారీ డబ్బు కేకు పంపకంలో నా, నీ తేడా లేదు. తరతమ తేడాలు లేవు. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న వివక్ష లేదు. ఇదో పెద్ద గుంపు. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న దోపిడీ దొంగల గుంపు. అధికారం ఎవరి చేతుల్లో ఉందన్న దానిపై ఆధారపడి కర్త, కర్మ క్రియలు మారుతాయి; ఎవరికి ఎంత అన్నది మారుతుంది తప్ప పాత్రధారులంతా ఒకటే జాతి. అది దోపిడీ జాతి!
దొందూ-దొందే!
సర్,కార్టూన్ ఎక్కడుందీ కనిపించలేదు!