విచిత్ర అసాధారణ గృహాలు -ఫోటోలు


వెనకటికో పెద్దాయన పని లేక పిల్లి తల గొరగడం మొదలు పెట్టాట్ట. పని లేని పెద్దలు తల పైన జుట్టుని, మొఖం మీద వెంట్రుకల్ని విచిత్రమైన షేపులతో కత్తిరించే ఫ్యాషన్ ని కనిపెట్టారేమో ఎవరన్నా పరిశోధించి కనిపెట్టాలి.

పనే లేదో, తెలివి ప్రదర్శనకు మరో మార్గమే దొరక లేదో తెలియదు గానీ కొందరు తాము నివసించే ఇళ్లను సైతం వినూత్నంగా నిర్మించి ప్రదర్శిస్తున్నారు. వారూ వీరని కాకుండా ఈ బాపతు మేధావులు లేదా కళా కారులు ప్రపంచం నిండా ఉన్నారు మరి!

ఈ కింది ఫొటోల్లోని ఇళ్లను చూస్తే ఔరా అనుకోక మానం. చేతి నిండా డబ్బు, జీవితం నిండా టైము ఉన్న పెద్ద మనుషులు ఖరీదైన వింత ఇళ్లను కట్టుకుంటే అవి లేని వారు తమకు తెలిసిన జ్ఞానంతోనే చవకైన వింత ఇళ్ళు కట్టుకుని ప్రదర్శిస్తున్నారు లేదా నివసిస్తున్నారు.

ఆ చివర అమెరికా, స్వీడన్ ల నుండి ఈ చివర జపాన్ వరకూ అనేక దేశాల్లో ఈ వింత గృహాల పద్ధతిని అనుసరించే పెద్దలు ఉన్నారని ఈ ఫోటోల ద్వారా అర్ధం అవుతోంది.

ఒకరు కారు షేప్ లో ఇల్లు కడితే మరొకరు మొసలి షేప్ లో ఇల్లు కట్టేశారు. ఒకరు నది ప్రవాహం మధ్యలో రాతి పైన ఇల్లు కడితే మరొకరు ఏకంగా చెట్లపైనే అందమైన కళాత్మక కేబిన్ ను నిర్మించేశారు. ఓ పెద్దాయన తన ఇంటిని తన అవసరానికి అనుగుణంగా భూమికి దగ్గరగా, ఎత్తుగా జరుపుకుని ఉండేట్లు కట్టుకుని ఆనందిస్తున్నారు.

ఒకాయన చక్రాలపై ఇల్లు నిర్మించి షికార్లు చేస్తుంటే ఇంకోకాయన అంత డబ్బు లేక చీప్ గా నడిచే ఇల్లును కట్టుకుని సంతోషిస్తున్నాడు. నడవడం అంటే ఇల్లు నడవదు. ఆయనే నడుస్తూ ఇంటిని మోస్తూ తిరుగుతాడు.

చైనాలో ఓ వ్యక్తి చట్ట విరుద్ధంగా, అనుమతి లేకుండా 18వ అంతస్ధు కట్టుకుని అది కనపడకుండా చెట్లతో కప్పేసిన వింతని కింద చూడవచ్చు. సదరు గృహ యజమాని ఎవరో ఇంతవరకు అధికారులకు అంతుబట్టలేదట.

ఈ ఫోటోల్ని ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.

2 thoughts on “విచిత్ర అసాధారణ గృహాలు -ఫోటోలు

  1. అరుణ్ గారు పత్రికలు ఏమిటో ఆర్టికల్స్ లో రాస్తున్నాను కదా. బహుశా మీ ప్రశ్న ‘ఫలానా సమాచారం కోసం ఫలానా పత్రిక చూడాలని మీకు ఎలా తెలుసు’ అని అయి ఉంటుంది. మీ ప్రశ్న అదే అయితే నా సమాధానం: నాకు అలాంటి ప్రత్యేక జ్ఞానం ఏమీ లేదని. విషయాసక్తి ఉన్నపుడు వెతుకులాటకు దిగుతాం కదా. అలా వెతికి సమాచారం సేకరిస్తాను.

    అవకాశం వచ్చినపుడు వ్యక్తిగత సమాచారం ఎలాగూ తెలుస్తుంది. మనం కలుసుకునే అవకాశం వస్తుందని ఆశిద్దాం.

వ్యాఖ్యానించండి