ఢిల్లీ ఎ.సి.బి అదుపుకు కేంద్రం ప్రయత్నాలు!


Arvind Kejriwal

అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిత్వంలో, ఎ.ఎ.పి-1 పాలనలో, భారత దేశంలో అత్యధిక ధనికుడైన ముఖేష్ అంబానీపై ఢిల్లీ ఎ.సి.బి అవినీతి కేసు నమోదు చేసింది. అప్పటి కేంద్ర చమురు మంత్రి వీరప్ప మొయిలీ, ఇంకా ఇతర అధికారులపై కూడా అప్పటి ప్రభుత్వం అవినీతి కేసు నమోదు చేసింది. పలువురు ప్రముఖులు చేసిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి ఎ.ఎ.పి ప్రభుత్వం ముఖేష్ అంబానీ, వీరప్ప మొయిలీ, మురళి దియోరా, వి.కె.సిబాల్ లపై నమోదు చేసిన కేసు వివరాల కోసం కింది లింక్ కు వెళ్లగలరు.

అనూహ్యం: అంబానీ, మొయిలీలపై ఎఫ్.ఐ.ఆర్

ఢిల్లీని వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఏలిన మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పైన కూడా అప్పటి ఎఎపి ప్రభుత్వం ఆధ్వర్యం లోని ఎ.సి.బి అవినీతి కేసు పెట్టింది. కేంద్ర అవినీతి నిరోధక, విచారణ సంస్ధలు సి.వి.సి, సి.బి.ఐ లు కూడా విచారణ చేసి ఏమీ లేదని చేతులు దులుపుకున్న కేసును ఎఎపి ప్రభుత్వం చేపట్టి షుంగ్లు కమిటీ నివేదిక ఆధారంగా ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసింది. ఈ వివరాలను కింద లంకెలో చూడవచ్చు.

ఎఎపి పాలన: షీలాపై ఎఫ్.ఐ.ఆర్

ఈ నేపధ్యం ఇప్పటి కేంద్ర సచివులను తీవ్రంగా భయపెడుతుండడంతో ఢిల్లీ ప్రభుత్వం నుండి ఎ.సి.బి (అవినీతి నిరోధక విభాగం) ని, వీలయితే సకల అధికారాలను లాక్కోవడానికి, ఢిల్లీ ప్రభుత్వాన్ని డమ్మీగా మార్చడానికి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోందని గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

కాంగ్రెస్ అవినీతిపై దాడి చేసేటప్పుడు బి.జె.పి ఏ చిన్న రాయిని కూడా వదిలిపెట్టదు. కాంగ్రెస్ అవినీతి పక్కన తమను తాము నిలబెట్టుకుని తమంతటి నీతివంతమైన పార్టీ మరొకటి లేదని గొప్పలు చెప్పుకోవడానికి ఆ పార్టీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టదు. స్వయంగా ఆ పార్టీ నాయకులు, మంత్రులు కూడా అనేక అవినీతి కేసుల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అవినీతిని దునుమాడేందుకే తాము పుట్టాం అన్నట్లుగా బి.జె.పి చెబుతుంది.

అన్నా హజారే నేతృత్వంలో దేశవ్యాపితంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని భారత పత్రికలు జనానికి చెప్పాయి. ఈ ఉద్యమానికి హిందూత్వ సంస్ధలు కేడర్ ను సమకూర్చాయని ఉద్యమానికి మద్దతు ఇచ్చాయని కూడా పత్రికలు చెప్పాయి. తీరా లోక్ పాల్ చట్టం ఆమోదం పొందే సమయాన కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ కుమ్మక్కై కోరలు లేని చట్టాన్ని ఆమోదించి ‘మమ’ అనిపించుకున్నాయి.

అన్నా హజారే-కేజ్రీవాల్ బృందం నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం చివరి రోజుల్లోనే కాంగ్రెస్ తో కుమ్మక్కైన బి.జె.పి అధికారం లోకి వచ్చాక తన అవినీతి వ్యతిరేకత యొక్క అసలు రంగును స్పష్టంగా బయటపెట్టుకుంటోంది. అందుకు అత్యంత స్పష్టమైన రుజువు ఢిల్లీ ప్రభుత్వం అధికారాలను కురచన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా, స్ధిరంగా, తెంపు లేకుండా సాగిస్తున్న వరుస ప్రయత్నాలే.

Mukesh Kumar Meena

Mukesh Kumar Meena

ఢిల్లీ ప్రభుత్వం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం లోని ఉన్నత అధికారుల స్ధానాలను తమ మనుషులతో నింపేసి ఎఎపి ప్రభుత్వం చేతులు కట్టివేసే ఏకైక లక్ష్యంతో నియామకాలు సాగిస్తున్న కేంద్ర హోమ్ శాఖ తాజాగా ఢిల్లీ ఎ.సి.బికి తమకు నమ్మకమైన పోలీసు అధికారిని అడిషనల్ కమిషనల్ ఆఫ్ పోలీస్ గా నియమించింది. ఈ పోస్టులో అప్పటికే సమాన అధికారాలు కలిగిన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారి పనిచేస్తున్నప్పటికీ కేంద్ర హోమ్ శాఖ గుడ్డిగా ఉత్తర్వులు జారీ చేసి విమర్శలు ఎదుర్కొంటోంది.

అప్పటికే ఒక అధికారి పని చేస్తున్న స్ధానంలోకే కేంద్రం తాజాగా మరో అధికారిని నియమించిన సంగతిని ది హిందు వెలికి తీసింది. ది హిందు ప్రకారం జనవరి 6, 1984 తేదీతో వెలువడిన ఆదేశాల ద్వారా ఢిల్లీ ఎ.సి.బి మరియు విజిలెన్స్ విభాగాలను విలీనం చేస్తూ ‘డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్’ ను ఏర్పాటు చేశారు. మళ్ళీ 1998 ఆగస్టు 19 తేదీన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ‘డైరెక్టర్ (విజిలెన్స్)’ ను ఎ.సి.బికి ‘ఎక్స్-అఫీషియో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఢిల్లీ’ ను నియమించారు. ఈ అధికారి ఎ.సి.బి అధికారులను నియంత్రిస్తారని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం డైరెక్టర్ (విజిలెన్స్) పోస్టులో ఉన్న అధికారి ఆటోమేటిక్ గా ఎ.సి.బి కి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సంగతి పట్టని కేంద్ర హోమ్ శాఖ ఢిల్లీ ఎ.సి.బి కి జాయింట్ కమిషనర్ గా ముఖేష్ కుమార్ మీనా అనే పోలీసు అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ముఖేష్ కుమార్ మీనా ఎవరో కాదు.  జంతర్ మంతర్ వద్ద ఎఎపి నేతృత్వంలో మోడి ప్రభుత్వ భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నపుడు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. సదరు రైతు ఆత్మహత్యను ఎఎపి నేత మనీష్ సిసోడియా దగ్గరుండి ప్రోత్సహించారని కేసు నమోదు చేసిన పోలీసు అధికారే ముఖేష్ కుమార్ మీనా. ఇలాంటి నమ్మిన బంటును ఎ.సి.బి అధిపతిగా నియమించడం వెనుక, అదీ ఏక పక్షంగా ఢిల్లీ ప్రభుత్వానికి చెప్పకుండా నియమించడం వెనుక బి.జె.పి ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో ఇట్టే ఊహించవచ్చు.

కేంద్ర హోమ్ శాఖ చేసిన నియామకం ఇటీవల ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పుకు కూడా వ్యతిరేకం కావడం గమనార్హం. ఢిల్లీ హై కోర్టు తీర్పులోని 44 వ పేరాకు విరుద్ధంగా హోమ్ శాఖ నియామకం చేసిందని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. “ఢిల్లీ ప్రభుత్వం ఎ.సి.బి ద్వారా నేర చట్టం (క్రిమినల్ లా) ను అమలు చేసే అధికారం కలిగి ఉంది. క్రిమినల్ లా అమలుకు సంబంధించి రాష్ట్రపతి అధికారాలకు పార్లమెంటు చేసిన GNCTD చట్టమే బంధనాలు విధించింది” అని ఢిల్లీ అధికారి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బి.జె.పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేయాలని, తద్వారా కేంద్ర సచివులు, అధికారుల అవినీతిపై ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని కేంద్రం చర్యలు చెబుతున్నాయి. చట్టాలను నిజంగా అమలు చేసేందుకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్ధ పరిధిలోనైనా సరే, ఎవరైనా పూనుకుంటే వ్యవస్ధను అదుపు చేసే ధనిక దోపిడీ వర్గాలు చేతులు ముడుచుకు కూర్చోబోవని ఢిల్లీ ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వం ల మధ్య జరుగుతున్న ఘర్షణ స్పష్టం చేస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s