ది హిందులో పరస్పర విరుద్ధ కార్టూన్లు


టాపిక్ ఒకటే. కార్టూనిస్టు కూడా ఒకరే. కానీ మూడు రోజుల వ్యవధిలో రెండు పరస్పర విరుద్ధ కార్టూన్లను ది హిందు పత్రిక ప్రచురించింది.

సల్మాన్ ఖాన్ జైలు పాలు కావడం కార్టూన్ లలోని అంశం. ఒక కార్టూన్ సల్మాన్ ఖాన్ కు విధించిన శిక్ష గురించి వ్యాఖ్యానిస్తే, మరొక కార్టూన్ ఆయన బెయిలుపై విడుదల కావడంపై వ్యాఖ్యానించింది.

మొదటి కార్టూన్ చూడండి. ఇది మే 7 తేదీన ప్రచురితం అయింది.

Salman Khan jailed 01

ఇందులో భారత దేశ న్యాయ వ్యవస్ధ చాలా గొప్పదని నిరూపించుకున్నట్లుగా కార్టూనిస్టు వివరించారు. సల్మాన్ ఖాన్ ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినప్పటికీ ఆయన కూడా అతి పేద పౌరులపైకి నిర్లక్ష్యంగా కారు నడిపి భారత కోర్టుల నుండి తప్పించుకోలేకపోయారని ఈ కార్టూన్ వివరించింది. కండలు తిరిగిన సల్మాన్ ఖాన్ కంటే ఆయన వల్ల చనిపోయిన అతి పేద సామాన్యుడే ఎక్కువ బరువు తూగినట్లు చూపిస్తూ ఈ ఘనత భారత న్యాయ వ్యవస్ధదే అని కార్టూన్ చెప్పింది.

రెండో కార్టూన్ చూడండి. ఇది మే 9 తేదీన ప్రచురితం అయింది.

Salman Khan jailed 02

సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పడడం అంతా పెద్ద డ్రామా అని ఈ కార్టూన్ విమర్శించింది. పరిమిత దృష్టితో చూస్తే ధనిక సల్మాన్ తాను పాల్పడిన నేరానికి జైలుపాలయినట్లు కనిపించిందని కానీ కాస్త వెనక్కి వచ్చి నింపాదిగా చూస్తే అదంతా సినిమా షూటింగ్ లో భాగం అని అర్ధం అవుతోందని వివరించింది. అనగా సల్మాన్ ఖాన్ కు విధించిన శిక్ష ఒక పెద్ద నాటకంలో భాగం అనీ, కధ సుఖాంతం కావడమే ఈ నాటకంలో ప్రధాన అంశమని కార్టూన్ చెబుతోంది.

ఈ రెండు కార్టూన్ లు గీసింది ది హిందు పత్రిక కార్టూనిస్టు సురేంద్ర గారే. కింది కోర్టులో సల్మాన్ ఖాన్ కు పడిన శిక్ష భారత న్యాయ వ్యవస్ధ గౌరవాన్ని కాపాడితే హై కోర్టులో ఆయనకు లభించిన ఊరట (శిక్ష సస్పెన్షన్, బెయిల్ పై విడుదల) న్యాయ ప్రక్రియ బూటకత్వాన్ని  వెల్లడి చేసిందని కార్టూనిస్టు భావన కావచ్చా?

లేక సల్మాన్ కు శిక్ష పడడాన్ని పొరబాటుగా అర్ధం చేసుకుని దాన్ని రెండో కార్టూన్ ద్వారా సవరించుకునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చా? పొరబాటు పడడం అంటూ జరిగితే అది కేవలం కార్టూనిస్టు వరకే పరిమితం కాదు. ప్రచురణకర్తగా ది హిందు కూడా అందుకు బాధ్యత వహించాలి. బహుశా అందుకే సవరణ కార్టూన్ ని పత్రిక ప్రచురించి ఉండవచ్చు.

అసలు అదేమీ కాదు, అప్పుడు ఆ కార్టూన్ కరెక్టే, ఇప్పుడు ఈ కార్టూనూ కరెక్టే అంటే చేసేదేముంది?

4 thoughts on “ది హిందులో పరస్పర విరుద్ధ కార్టూన్లు

  1. శేఖర్ గారు,
    ఇలా కూడా అనుకోవచ్చేమో చూడండి! మొదటీ కార్టున్ న్యాయ వ్యవస్తను ఉల్లేఖిస్తే రెండవది పాలనా (ఎగ్జికుటివ్) వ్యవస్తను ఉటంకి మ్చిమ్దని?

  2. రెండో నిర్ణయం కూడా కోర్టుదే కదా. పైగా ఉన్నత కోర్టుది! బహుశా మీ ఉద్దేశ్యం ఉన్నత కోర్టు నిర్ణయం పాలనా వ్యవస్ధ ప్రేరేపితమ్ అయి ఉంటుందనా? అందుకు అవకాశం లేకపోలేదు. కానీ పాలన, కోర్టు వ్యవస్ధలను విడివిడిగా చూసే అవగాహన కార్టూనిస్టుకు ఉంటుందా అన్నది అనుమానం.

  3. ముంబైకి చెందిన భాజపా నాయకుడు ఒకడు సల్మాన్ ఖాన్‌ని బహిరంగంగా సమర్థిస్తున్నాడు. రేపు ఆ భాజపా నాయకుని కొడుకు ఏ రేప్ కేస్‌లోనో ఇరుక్కుంటే, రాజకీయ నాయకుని కొడుకు కదా అని అతన్ని వదిలేసేవాళ్ళు ఉండాలి కదా.

వ్యాఖ్యానించండి