(Mikes in the time of disaster శీర్షికన ఈ రోజు -మే 8- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం.)
**********
“If it bleeds, it leads” (వివరణకు ఆర్టికల్ చివర చూడండి.) అని న్యూస్ రూమ్ లో ఒక వాడుక. దురదృష్టవశాత్తూ, ఇది మీడియా సంస్ధలకు ఉండవలసిన మర్యాద, సభ్యత, నైతికతల నుండి వడకట్టబడి కూడా బైటకువస్తున్న సంగతిని భారతీయ ప్రసార జర్నలిజం దాదాపు క్రమం తప్పకుండా విస్మరిస్తోంది. ఇందుకు నేపాల్ తాజా ఉదాహరణ. అక్కడ భూకంపం దరిమిలా సంభవించిన పెను విషాదాన్ని టెలివిజన్ కెమెరాలు టి.ఆర్.పి రేటింగుల రేసులో గెలవడం కోసం చివరికంటా వినియోగించుకున్నాయి. విపత్తులు సంభవించినప్పుడు మీడియా (పోషించవలసిన) పాత్ర చాలా ముఖ్యమైనది. వినాశకర విపత్తుకు ముందు అవి ప్రజలను హెచ్చరించి (తగిన విధంగా ఎదుర్కోవడానికి) ముందుగానే సిద్ధం చేయగలవు. విపత్తు అనంతరం వరుసబెట్టి నివేదించడం ద్వారా బతికిబైటపడ్డవారు ఎవ్వరూ విస్మరణకు గురి కాకుండా, సహాయ కార్యక్రమాల నుండి నెత్తివేయబడకుండా చూడగలవు.
అయితే విపత్తు సంభవిస్తున్న సమయంలోనే మీడియా పాత్ర మరింత కీలకం అవుతుంది. హెల్ప్ లైన్లు, సహాయ పంపిణీ శిబిరాలు, అత్యవసర సేవల ఫోన్ నెంబర్లు, బాధితులకు అవసరమైన సరఫరాలు… మున్నగు అంశాల సమాచారానికి సమర్ధవంతమైన ప్రవాహమార్గాలుగా మీడియా సంస్ధలు పని చేయగలవు. సరైన వాస్తవాలు, అంకెలను త్వరితగతిన వ్యాపింపజేయడం ద్వారా పుకార్లు వ్యాపించకుండా నిరోధించడంలో అవి సహాయపడగలవు. ఉత్పాతం సంభవించిన ప్రదేశాలకు ఆవల నుండి డబ్బు, సరఫరాలు, స్వచ్ఛంద కార్యకర్తలను సమీకరించడానికి మీడియా కవరేజి సహాయపడగలదు. చివరిగా, ఒక విపత్తుపై కేంద్రీకరించడం ద్వారా మరింతమందికి అది దృగ్గోచరం అవడానికి, తద్వారా ప్రభుత్వాల అజెండాలో సహాయ కార్యక్రమాల అంశాన్ని పైకి జరపడానికి మీడియా దోహదం చేయగలదు. భారత దేశ టెలివిజన్ సిబ్బంది వీటిలో అధికభాగాన్ని నిర్వహించినప్పటికీ, తరచుగా వారు తమ సరిహద్దులను దాటిపోతున్నారు. ఎంత నాటకీయంగానంటే, నేపాలీ ప్రజలు ఇక భరించలేక వారికి వ్యతిరేకంగా తిరగబడి ‘ఇక వెళ్లిపొమ్మని’ దాదాపుగా శాసించారు.
నిజానికి నేపాల్ ను మొట్టమొదటిసారి చేరుకుని అత్యంత అభినందనీయకర పాత్రను పోషించింది భారతీయ రక్షణ బృందాలే అయిన నేపధ్యంలో, నేపాల్ విపత్తుకు సంబందించిన మొట్టమొదటి దృశ్యాలను భారత మీడియానే ప్రసారం చేసిన నేపధ్యంలో ఇలాంటిది (చోటుచేసుకోవడం) చాలా దురదృష్టకరం. కానీ విపత్తులను నివేదించేటప్పుడు జర్నలిజం నైతిక విలువలకు సంబంధించిన మౌలిక సూత్రాలను టెలివిజన్ సిబ్బంది పునర్దర్శనం చేయడం తప్పనిసరి అవసరంగా ముందుకు వచ్చింది. వీక్షకుల నుండి భావోద్వేగపూర్వక ప్రతిస్పందనను పిండుకోవడం ఎంత ముఖ్యమో వారు భావిస్తున్నదానితో సంబంధం లేకుండా, (విపత్తులో) సర్వం కోల్పోయి ఎలాగో బతికి బైటపడ్డవారి మొఖాలలో మైక్రోఫోన్ లను జొనపకుండా మాత్రం వారు సంయమనం పాటించి తీరాలి. ‘ప్రజల తెలుసుకునే హక్కు’ ఇక్కడ వర్తించదుగాక వర్తించదు. ఇతరులు ఎవరైనా ఎంత తీవ్రంగా దుఃఖపీడితులుగా మిగిలారో తెలుసుకునే హక్కు ఎవరికీ లేదు. పైగా, ఏకాంత హక్కును సంపూర్ణంగా అనుభవించే హక్కు దుఃఖపీడితుల సొంతం.
తమ నివేదన (రిపోర్టింగ్) కు మానవ కోణాన్ని సంపాదించేందుకు ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే (విపత్తు పీడితుల) సమ్మతికై విజ్ఞప్తి చేయడం, తమ కవరేజి ఎక్కడ, ఎలా ప్రసారం అవుతుందో పూర్తిగా వెల్లడి చేయడం, ప్రశ్నలను క్లుప్తంగా వేయడం, భావోద్వేగం బద్దలయ్యేటట్లుగా బాధితులను ప్రేరేపించకుండా సంయమనం పాటించడం. ఇంకా, రక్షణ హెలికాప్టర్లు కిందికి దిగినప్పుడు అందులో సహాయ సామాగ్రికి ఉండవలసిన స్ధానంలో టి.వి సిబ్బంది ఆక్రమించి ఉండడం చూసి బాధితులు విస్మయానికి గురయ్యారన్నది వాస్తవం. ఒక విపత్తు సంభవించినప్పుడు మీడియా విశేషవకాశాల కంటే బాధితుల ఉపశమనానికే ప్రాధామ్యత ఉండాలి. నిజానికి అదే మొదట జరిగేలా చూసి తీరాలి. ఇంతటి భారీ వినాశనం ఆరంభ దశలోనే సర్వస్వాన్ని తటాలున కోల్పోయిన కుటుంబాలను అవశేషాలుగా మిగుల్చుతుంది. జర్నలిజం నైతికత మానవతను ఎల్లప్పుడూ వృత్తిగత ఆవశ్యకతకు పైనే నిలపాలి.
[If it bleeds, it leads – హింస, రక్తపాతం ఎంత తీవ్రంగా ఉంటే టి.ఆర్.పి రేటింగుల్లో అంత ముందు ఉంటామని మీడియా నమ్ముతుందని దీని అర్ధం. ఈ సూత్రాన్ని మీడియా నమ్మి అమలు చేస్తుంది కూడా. లాభార్జనకు, ప్రచార విలువకు అమిత ప్రాధాన్యత ఇచ్చే కార్పొరేట్ కంపెనీలు మీడియాలో జొరబడ్డాక ఈ నానుడి మరింత తీవ్రంగా అమలవుతోంది. ‘నేరాలు-ఘోరాలు’ లాంటి కార్యక్రమాల వల్ల చానెళ్ల రేటింగులు పెరిగిపోయి ఇతర చానెళ్లు కూడా మరింత హింసా ప్రదర్శనతో అదే తరహా కార్యక్రమాలు చూపడానికి ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ జరిగిన సంగతిని ఈ సందర్భంగా మననం చేసుకోవచ్చు. చివరికి సదరు కార్యక్రమాల్లో చూసి అదే తరహాలో నేరాలకు పాల్పడిన ఘటనలు జరగడంతో ప్రభుత్వం పూనుకుని అలాంటి కార్యక్రమాలను అదుపు చేయాల్సి వచ్చింది.]