ముస్లిం హిందువులు మళ్ళీ ముస్లిం మతం లోకి…


Ghar Vapasi

సంఘ పరివార్ గణాలు ఆగ్రాలో అట్టహాసంగా నిర్వహించిన ముస్లిం మత మార్పిడి మూన్నాళ్ల ముచ్చటగా ముగిసింది. భూములు ఇస్తామని మాయ మాటలు చెప్పి ముస్లిం మతం నుండి కొందరిని హిందు మతంలోకి మార్చినట్లు తతంగం నడిపారని మోసం గ్రహించి తిరిగి ముస్లిం మతంలోకి వచ్చామని సదరు ముస్లింలు చెప్పడం విశేషం.

ఆగ్రాలోని నాట్ కమ్యూనిటీకి చెందిన ముస్లింలు అత్యంత పేదవారు. వారికి తమది అని చెప్పుకునే ఆస్తులు దాదాపు లేవు. ప్రభుత్వానికి చెందిన వృధా భూముల్లోనే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని బతికేస్తుంటారు. వారు ఒకప్పుడు హిందూ మతానికి చెందినవారేనని, తమ పూర్వీకుల తప్పు సవరించుకుని సొంత ఇల్లు లాంటి హిందు మతం లోకి వారు తిరిగి వచ్చారని విశ్వ హిందూ పరిషత్ తదితర సంఘ్ పరివార్ సంస్ధలు గత డిసెంబర్ లో ప్రకటించాయి.

తీరా చూస్తే పత్రికల పరిశోధనలో అసలు సంగతి వెల్లడి అయింది. రేషన్ కార్డులు ఇప్పిస్తామని, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు కూడా ఇప్పిస్తామని ముస్లింలకు ఆశ చూపి సంఘ్ పరివార్ సంస్ధలు -ధర్మ జాగరణ్ మంచ్, భజరంగ దళ్- ‘పుర్ఖోంకి ఘర్ వాపసి’ తతంగం నిర్వహించారని పత్రికలు గుట్టు రట్టు చేశాయి.

బి.జె.పి అధికారం లోకి వచ్చింది లగాయితు మత మార్పిడులపై నిషేధం విధించేందుకు సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మతమార్పిడి నిషేధ చట్టం తేవాలని ఆర్.ఎస్.ఎస్ అగ్రనాయకత్వం పదే పదే డిమాండ్ చేస్తున్నారు. చర్చిలపై దాడి జరిగినప్పుడల్లా ఈ డిమాండ్ ను సంఘ్ పరివార్ నేతలు ముందుకు తెచ్చారు. ఘర్ వాపసి అంటూ కార్యక్రమాలు మొదలు పెట్టి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ‘అయితే మత మార్పిడి నిషేధ చట్టం చేయండి’ అని బేరాలు సాగించారు. వారి డిమాండ్లకు బి.జె.పి నేతలు సైతం మద్దతు పలికారు.

ఎన్ని ఒత్తిడిలు తెచ్చినా మత మార్పిడి పై నిషేధం విధించాలన్న డిమాండ్ కు మద్దతు అందలేదు. ఇతర రాజకీయ పార్టీలన్నీ ఆ ఆలోచనను తిరస్కరించాయి. సంఘ్ పరివార్ తలపెట్టిన ‘ఘర్ వాపసి’ కార్యక్రమాలను కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఈ నేపధ్యంలో ఆగ్రాలో ఘర్ వాపసి అంటూ నాట్ ముస్లింలకు వివిధ ఆశలు చూపి వేద మంత్రోచ్చారణాల మధ్య మతం మారినట్లు, సొంత గూటికి తిరిగి చేరినాటు ప్రకటించారు. హిందువులుగా బతకడం ఎలాగో నేర్వడానికి నెలరోజులు శిక్షణ ఇస్తామని కూడా సంఘ్ సంస్ధల నేతలు తెలిపారు. హిందూ మతంలోకి వచ్చిన ముస్లింలు వారికి ఇష్టమైన కులంలో చేరవచ్చని కూడా ఆర్.ఎస్.ఎస్ నేతలు ప్రకటించారు. ఇంతకీ ఇప్పటికే హిందూమతంలో ఉన్నవారు కూడా తాము కోరిన కులంలోకి చేరవచ్చా అన్న అనుమానాలు వచ్చినా వాటిని నివృత్తి చేసినవారు లేరు.

సొ కాల్డ్ ఘర్ వాపసి ఒట్ఠి బూటకమే అని ఈ రోజు మరోసారి రుజువయింది. ముస్లిం నుండి హిందువులుగా మారినట్లు సంఘ్ సంస్ధలు చెప్పిన వారిలో 17 మంది తాము తిరిగి ముస్లిం మతంలో చేరినట్లు ప్రకటించారు. అష్నెరా బ్లాక్ లోని మహౌర్ లతియా గ్రామానికి చెందిన 17 మంది సభ్యులా కుటుంబం ఈ మేరకు పత్రికలకు సమాచారం ఇచ్చారు. “ఆలీ మహమ్మద్ మా పైన ఒత్తిడి తెచ్చాడు. హిందుత్వ నాయకుడొకరు వారికి కాస్తంత భూమి ఇస్తామని చెప్పడంతో ఆశ పడ్డాము. కానీ అప్పటి నుండి మా తోటివారు మమ్మల్ని బహిష్కరించారు. పెళ్లిళ్లకు పిలవడం లేదు. ఇతర సంబరాలకు కూడా పిలవడం మానేశారు” అని ముస్లిం మతంలోకి వెనక్కి వచ్చినవారిలో పెద్దవాడైన రహమత్ చెప్పాడు.

రహమత్ మాటల్లోని అంతరార్ధం ప్రత్యేకంగా గమనించాలి. వారు ముస్లిం మతం నుండి బైటికి వచ్చినందుకు పెళ్లిళ్లకు, పండగలు-పబ్బాలకు పిలవడం మానేశారు. అనగా సాంస్కృతిక జీవన బంధాల్ని నిరాకరించారు.

సంఘ్ సంస్ధలు, బి.జె.పి నేతలు ఎప్పుడూ చెప్పే మాట ‘హిందూమతం మతం కాదు, ఒక జీవన విధానం’ అని. రహమత్ మాటల్ని బట్టి ఒక ప్రశ్న తలెత్తుతోంది. “అసలు ఏ మతం (జీవన విధానం) కాదు? జీవన విధానం కాని మతం ఎక్కడుంది? ఏ పేరుతో ఉంది?”

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s