2013లో జరిగిన మిలట్రీ కుట్ర ద్వారా అధికారం నుండి కూల్చివేయబడిన ముస్లిం బ్రదర్ హుడ్ (ద ఇఖ్వాన్) నాయకులపై మోపిన ప్రధాన క్రిమినల్ కేసుల నుండి వెలువడతాయని భావిస్తున్న అనేక తీర్పుల్లో ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మొర్సీ, ఆయన సహ ప్రతివాదులపై గత వారం వెలువడిన దోషిత్వ నిర్ధారణ తీర్పు మొదటిది. డిసెంబర్ 2012లో అధ్యక్ష భవనం వెలుపల నిరసనకారులపై అల్లర్లు రెచ్చగొట్టినందుకు గాను మోర్సీకి 20 యేళ్ళ కారాగారవాస శిక్ష విధించారు. నూతన రాజ్యాంగ శాసనపత్రం తయారయ్యేవరకు తాను తీసుకునే చర్యలపై న్యాయస్ధానాల పర్యవేక్షణ లేకుండా చేసుకుంటూ అధ్యక్షుడు తెచ్చిన డిక్రీకి వ్యతిరేకంగా ఆనాడు నిరసనకారులు ఉద్యమిస్తున్నారు.
మోర్సీ, ఆయన సహ బంధితుల పట్ల (అక్కడ) అంత సానుభూతి ఏమీ లేదు. అధికారంలో ఉండగా ఈజిప్టు వ్యవస్ధలన్నింటినీ ఇస్లామిక్ పంధాలో పునర్నిర్మాణం కావించేందుకు ముస్లిం బ్రదర్ హుడ్ విచ్ఛిన్నకర ప్రయత్నాలు సాగించడం వల్ల కూడా 2013లో (ఉదారులు) లిబరల్ వాదులు, సెక్యులర్ స్వభావులు అయిన ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఇది చివరికి మిలట్రీ తిరిగి తన నియంత్రణను పునఃస్ధాపించడానికి మార్గం సుగమం చేసింది. ఇందుకు కొందరు ఉదారవాదులు మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ అది న్యాయబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూలదోసిన కుట్ర అనడంలో ఎలాంటి సందేహము లేదు. ముస్లిం బ్రదర్ హుడ్ అనుబంధ సంస్ధ అయిన ఫ్రీడం అండ్ జస్టిస్ పార్టీ 2011, 2012 లలో జరిగిన పార్లమెంటరీ మరియు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించింది మరి! సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ కి చెందిన జనరల్ అబ్దెల్ ఫతా ఆల్-సిసి నేతృత్వంలో నూతన మిలట్రీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుండి (బ్రదర్ హుడ్) ఉద్యమాన్ని వెంటాడి వేటాడడానికే నిర్ణయించుకుని ఉద్యమ నాయకత్వంపై ఒకదాని తర్వాత మరొకటి కేసులు నమోదు చేస్తూ వచ్చింది.
డిసెంబర్ 2012 నిరసనల సందర్భంగా చనిపోయినవారిలో అత్యధికులు బ్రదర్ హుడ్ సభ్యులే. ఆ రోజుల్లో నిజంగా ఏం జరిగింది ఇంతవరకు స్పష్టత లేదు. మోర్సీ మరియు ఆయన మద్దతుదారులపై మోపిన కేసులు రాజకీయ ప్రేరేపితంగానూ, అరబ్ వసంతం అనంతరం తన బలాన్ని సుస్ధిరం చేసుకునేందుకు ప్రయత్నించిన బ్రదర్ హుడ్ కు ప్రతి జవాబు ఇచ్చేందుకు ఉద్దేశించినవిగానూ కనిపిస్తాయి. సిసి పాలన ఇప్పుడు హోస్నీ ముబారక్ నియంతృత్వాన్ని తలపిస్తోంది. ఒక్క ముస్లిం బ్రదర్ హుడ్ మాత్రమే కాదు; వసంతం నాటి నిరసనల్లో పాలు పంచుకున్న ప్రజల్లోని ఉదారవాద, సెక్యులర్ స్వభావ సెక్షన్ లను కూడా ఆల్-సిసి ప్రభుత్వం వేటాడి వేధిస్తోంది. మీడియాపై అణచివేత కొనసాగుతోంది. అన్ని రకాల అసమ్మతుల గొంతులను నొక్కివేస్తున్నారు.
మరోవైపు పశ్చిమ దేశాలు, వారి మిత్రులైన సౌదీ అరేబియా లాంటి దేశాల నుండి మిలట్రీ సహాయం అందడం కొనసాగుతోంది. బ్రదర్ హుడ్ అధికారం రాక మునుపు దేశంలో అమలులో ఉన్న స్వదేశీ, విదేశీ విధానాల పంధాలోనే మిలట్రీ ప్రభుత్వ పాలన నడుస్తోంది. బ్రదర్ హుడ్ కొద్దికాలం పాటు సాగించిన పాలన సమస్యాపూరితమే. కానీ ప్రజల నిరసనలు అందజేసిన అవకాశాన్ని నియంతృత్వాన్ని పునరుద్ధరించేందుకు ఉపయోగపెట్టడంతో 2011 నాటి ‘విప్లవం’ సాధించినదానినంతటిని తుడిచిపెట్టినట్లు అయింది. ఫలితంగా ఈజిప్టు తిరిగి యధాతధ స్ధితికి చేరుకుని దీర్ఘకాలికంగా ఆ దేశానికి భారంగా పరిణమించగల సమస్యను అదనంగా ఎదుర్కొంటోంది -అసంతృప్తితో నిండిన బ్రదర్ హుడ్ నిర్భంధం పదఘట్టనల కింద నలుగుతూ ఉండడమే ఆ సమస్య!
*** *** ***
[తీవ్ర స్ధాయికి చేరిన ప్రజల అసంతృప్తిని సైతం సామ్రాజ్యవాదులు దారి మళ్లించి చల్లరచడంలో సామ్రాజ్యవాదులు ఎంతగా పండిపోయారో ఈజిప్టు విప్లవం రుజువు చేస్తుంది. అమెరికా తదితర పశ్చిమ సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు పోషించే ఎన్.జి.ఓలు -ప్రభుత్వేతర సంస్ధలు- మూడో ప్రపంచ దేశాల్లోని ప్రజల న్యాయమైన ఆగ్రహాన్ని పక్కదారి పట్టించి ఆ ప్రజలకు ఎలాంటి ఫలితం ఇవ్వకుండా బహుళజాతి కంపెనీల దోపిడి యధాతధంగా కొనసాగడానికి ఎలా పని చేస్తాయో కూడా ఈజిప్టులో సాగిన ‘అరబ్ వసంతం’ స్పష్టం చేసింది. సంపాదకీయంలో చెప్పిన లిబరల్, సెక్యులర్ సంస్ధలన్నీ -వీటిలో కొన్నింటిని వామపక్షాలుగా కూడా కొందరు చెప్పారు- అమెరికా, ఐరోపా రాజ్యాలు పోషించిన ఎన్.జి.ఓ సంస్ధలే. వారి వెనుక ఉన్న ప్రజలు మాత్రం న్యాయమైన అసంతృప్తితో వేగిపోతున్న ప్రజలు! ప్రపంచ వ్యాపితంగా దాదాపు అన్ని దేశాల్లోనూ పుట్టగొడుగుల్లా మొలిచి విస్తరిస్తున్న ఎన్.జి.ఓ ల పనల్లా స్ధానిక ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న సామ్రాజ్యవాద దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని తమ వెనుక సమీకరించి భద్రంగా తీసుకెళ్లి సముద్రంలో కలిపేయడం. కనుక ఎన్.జి.ఓ సంస్ధలను -అవి ఎన్ని కబుర్లు చెప్పినా- నమ్మలేము, నమ్మరాదు.]
అసలు రహస్యం బయట పెట్టారు శేఖర్ గారు. దేన్నైనా వ్యాపారం చేయగల పెట్టుబడి దారీ శక్తులు ఆఖరికి సంఘసేవను కూడా వ్యాపారం చేశాయన్న మాట
ఎన్.జి.ఓ సంస్ధలను -అవి ఎన్ని కబుర్లు చెప్పినా- నమ్మలేము, నమ్మరాదు.
అంటే వాళ్ళు చేసే ఉధ్యమాల్లో పాల్గొనడం శుద్ధదండుగా!అటువంటప్పుడు సామాన్యప్రజలలో కలిగే అసంతృప్తిని ప్రకటించుకోవడం ఎలా? వాళ్ళకు నాయకత్వం వహించేది ఎవరు?ఎంకెంతకాలం మనం ఎదురుచూడాలి?
అది ఒక ఖిలాఫత్ ఉద్యమం కావచ్చు. బెంగాల్ లో తెభాగా రైతుల పోరాటం కావచ్చు. బిర్సా-ముండా గిరిజన ఉద్యమం (1899), 1772 సన్యాసి తిరుగుబాటు, 1830-40 ల నాటి పాగల్ పంతి ఉద్యమం, 1855 లోని సంతాల్ ఉద్యమం, 1860 నాటి ఇండిగో (నల్ల మందు పంట వ్యతిరేక ఉద్యమం), భిల్ (1817), రైత్వారీ (1820), రామోసి(1822), మోప్లా (1922), వీరోచిత తెలంగాణ రైతాంగ ఉద్యమం (1940లు);మొన్న జరిగిన సోంపేట ఘటన,కకరాపల్లి ఘటన,బెంగల్ లో టాటాలకు ఎదురైన పరాభవం,పెరుందరై ఘటన,అన్నా హజరే నాయకత్వంలో జరిగిన అవినీతివ్యతిరేఖ ఉధ్యమం,నిర్భయ ఘటన తరువాత వెల్లువడిన ప్రజల ఆగ్రహం,తెలంగాణా ఉధ్యమం మొ,,పోరాటాలు/విజయాలు ఇవన్నీ మిణుగుపురుగులు వెదజల్లే వెలుతురులాంటి విజయాలు.
ఈ విజయాలు పెనుచీకటిని తరమగలవా?