కోకోకోలాపై పెరుందురై ప్రజల విజయం


ప్రజలు ఎక్కడ తిరగబడుతున్నారు అని ప్రశ్నిస్తున్న అమాయక బుద్ధి జీవులకు తమిళనాడులోని పెరుందురై ప్రజలు సమయానుకూల సమాధానం ఇచ్చారు. నీటి వనరులను పీల్చి పంటల్ని పిప్పి చేసే కోకోకోలా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడడంతో కోకోకోలాకు ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కోకోకోలాకు భూములపై ఇచ్చిన లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పెరుందురై ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక సంస్ధ (సిప్కాట్), హిందూస్తాన్ కోకోకోలా బెవరేజెస్ కంపెనీకి 71.34 ఎకరాల భూముల్ని లీజు ఒప్పందం ద్వారా కట్టబెట్టింది. ఈ లీజును రద్దు చేస్తూ సిప్ కాట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.సెల్వరాజ్ ఏప్రిల్ 20 తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు చేయడానికి కారణం ఏమిటో తన ఉత్తర్వుల్లో సిప్కాట్ చెప్పలేదు. కోకోకోలా కంపెనీకి ఇచ్చిన రద్దు సమాచారంలో కూడా కారణం ఏమిటో సిప్కాట్ చెప్పలేదని ది హిందు అందించిన సమాచారం.

హిందూస్ధాన్ టైమ్స్ ప్రకారం రైతుల ప్రతిఘటన వల్లనే తమిళనాడు ప్రభుత్వం రద్దు నిర్ణయం తీసుకుంది. చెన్నై నుండి 500 కి.మీ దూరంలో, ఈరోడ్ జిల్లాలో ఉన్న పెరుందురైలో కోకోకోలా కంపెనీ స్ధాపనకు వ్యతిరేకంగా రైతులతో పాటు ఇతర అన్నివర్గాల ప్రజలు ఉద్యమించగా, ఉద్యమానికి అన్నీ పార్టీలు మద్దతు ఇచ్చాయి, ఒక్క పాలక ఏ.ఐ.ఏ.డి.ఏం.కె తప్ప. ఆందోళన నానాటికీ తీవ్రం కావడంతో తమిళనాడు ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కోకోకోలాకు ఇవ్వవలసిన వివిధ అనుమతులను ఆలస్యం చేసింది.

అయితే ఒప్పందం ప్రకారం 6 నెలల లోపు కంపెనీ ప్రారంభించవలసి ఉండగా కోకోకోలా అందుకు విఫలం అయిందని తెలుస్తోంది. ప్రజల ఆందోళనల నేపధ్యంలో ప్లాంట్ సాధ్యనీయత, లాభదాయకత ప్రతికూలంగా ఉండవచ్చన్న అంచనాతో కోకోకోలా కూడా ప్రాజెక్టు నుండి వెనక్కి తగ్గిందని కూడా వినిపిస్తోంది. విదేశీ పెట్టుబడుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పంచెలు ఊడుతున్నా పట్టించుకోకుండా పరుగులు పెడుతున్న నేపధ్యంలో కోకోకోలా అంగీకారం లేనిదే భూముల లీజు రద్దు సాధ్యం కావడం అనుమానమే.

కోకోకోలా కంపెనీకి వ్యతిరేకంగా భారత ప్రజలు ఉద్యమించడం ఇదే మొదటిసారి కాదు. పదేళ్ళ క్రితం కేరళ ప్రజలు కోకోకోలా ప్లాంటుకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రజల మొర, ఆందోళన వినకుండా ప్లాంటు స్ధాపన వైపుకు అక్కడి ప్రభుత్వం ముందుకు పోవడంతో ప్లాంటును స్ధాపించారు కూడా. అనతికాలంలోనే ఆ ప్లాంటు చుట్టూ ఉన్న పొలాలు ఎండిపోవడం మొదలయింది. గ్రామాలకు తాగడానికి నీటి చుక్క కరువైంది. భూజల మట్టం యంత్ర భూతముల గొట్టాలకు సైతం అందకుండా పడిపోయింది.

అయినా సరే, కోకోకోలా ప్లాంటుల స్ధాపనకు అనుమతులు ఇస్తూ పోవడం ప్రభుత్వాలు మానలేదు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతితో వారణాసి లోని మెహిదీ గంజ్ లో కోకోకోలా కంపెనీని నిర్మించగా దానికి వ్యతిరేకంగా స్ధానిక ప్రజలు ఉద్యమించారు. సుదీర్ఘ కాలం వారి నిరసనలు కొనసాగినా ప్రభుత్వాలు వినలేదు. తాము భూగర్భ జలాల్ని వాడబోమని కోకోకోలా కంపెనీ హామీ ఇచ్చిందని చెప్పాయి. ప్లాంటు వల్ల కాలుష్యం ఉండదని చెప్పాయి. చివరికి సదరు హామీకి విరుద్ధంగా భూగర్భ జలాల్ని పెద్ద ఎత్తున తోడేస్తున్నట్లు అనంతర పరిణామాలు స్పష్టం చేశాయి. చివరికి ఉత్తర ప్రదేశ్ కాలుష్య నివారణ సంస్ధ సదరు కంపెనీని మూసివేయమని గత యేడు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది.

ఈరోడ్ లో నెలకొల్పదలచిన ప్లాంటు కూడా స్ధానిక భూగర్భ జలాల్ని వెలికి తీయబోమని కోకోకోలా నమ్మబలికింది. కానీ ప్రజలు నమ్మలేదు. తమ పొలాలు ఎండిపోతాయని రైతులు ఆందోళనలు చేశారు. తమ పట్టణానికి నీరు కరువవుతుందని ఈరోడ్ ప్రజలు సైతం ఆందోళన చెందారు. వ్యాపార యజమానులు కూడా తమ దుకాణాల్ని మూసివేసి ఆందోళనలు నిర్వహించారు. ఫలితంగా తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రజల ఆందోళన విజయవంతం అయింది.

పెప్సీ, కోకోకోలా లాంటి కంపెనీలు అందించే పానీయాలు ఆరోగ్యానికి తీవ్ర హానికరమని రెండు దశాబ్దాల క్రితమే ఢిల్లీలోని పరిశోధనా సంస్ధ తేల్చి చెప్పింది. దానితో యువజన సంఘాలు, విద్యార్ధి, మహిళా సంఘాలు ఈ కంపెనీల పానీయాలను బహిష్కరించాలని పిలుపులు ఇచ్చాయి.

ఈ జనమా ఆందోళనలు చేసేది అంటూ ఈసడించేవారు కాస్త కళ్ళు తెరిచి లోకాన్ని చూడాలి. మన కంటికి, బుద్ధికి తెలియని అనేక పరిణామాలు మన చుట్టూ జరుగుతున్నాయని గుర్తెరగాలి. వాటిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. తెలుసుకోకుండా తమకు తెలిసిందే లోకం అనుకుంటే తప్పుడు అవగాహనలకు రావలసివస్తుంది.

3 thoughts on “కోకోకోలాపై పెరుందురై ప్రజల విజయం

వ్యాఖ్యానించండి