ఎర్ర చందనానికి శవపేటికల కాపలా!


RIP red sander woodcutters

చాలా అద్భుతమైన కార్టూన్!

ఆంద్ర ప్రదేశ్ పోలీసుల వికృత రక్త కేళీ పిపాసకు ప్రత్యక్ష సాక్ష్యం శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్. ఇది నిజమైన ఎన్ కౌంటరే అని ఎ.పి పోలీసులు, ఎ.పి రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలుకుతున్నారు. పోలీసులు చాలా మంచి పని చేశారని ముద్దు కృష్ణమ నాయుడు గారి లాంటి పెద్ద మనుషులు పోలీసులను పత్రికలు, ఛానెళ్ల సాక్షిగా మెచ్చుకున్నారు.

కొన్ని ఛానెళ్లు, పత్రికలు కూడా ‘ఖతమ్’, ‘హతం’ అంటూ మనుషుల ప్రాణాలకు తాము ఇచ్చే విలువ ఏమిటో చాటుకుంటున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్ధకు నాలుగవ స్తంభంగా పని చేయవలసిన పత్రికా వ్యవస్ధ మిగతా మూడు స్తంభాల పలుకులనే చిలకలా వల్లిస్తుండడంతో నాలుగో స్తంభం ఉండీ లేనిదయింది. భారత ప్రజాస్వామ్య నడక కుంటి కాలి నడక మాత్రమేనని స్పష్టంగా ఎర్ర (చందనం) ఎన్ కౌంటర్ రుజువు చేసింది.

ఒక తెలుగు పత్రిక 20 మంది కోత కూలీలను చంపిపారవేయడం ఎంత కరెక్టో చెప్పేందుకు బ్యానర్ హెడ్డింగులు పెట్టి మరీ శ్రమిస్తోంది. చనిపోయిన కూలీలందరూ ఏదో ఒక నేర చరిత్ర ఉన్నవారేనని పోలీసులకు అర్జెంటుగా తెలిసిపోయిందట. అందులో ఇద్దరు కూలీలకు ఖాయంగా నేర చరిత్ర ఉందని పోలీసులు తాజాగా, ప్రాణం  తీశాక, కనిపెట్టారట. చాలా కాలం క్రితమే తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించారట. తీవ్ర చర్యలు తీసుకుంటామని తెలిపారట. అసలు తమిళనాడు ప్రభుత్వమే స్వయంగా ‘మన తప్పు కూడా ఉందిలే’ అని పశ్చాత్తాప పడుతున్నారట!

ఈ నిర్ధాక్షిణ్య, హృదయ విహీన, రక్తదాహ సమర్ధింపులన్నీ పచ్చినెత్తురు హత్యలను సమర్ధించుకునేందుకు చేస్తున్న బుకాయింపులే తప్ప మరొకటి కాదు. ఒకవేళ కూలీలకు నేర చరిత్ర ఉందనుకుందాం. అయితే చంపేసేయాలని చట్టాలు చెబుతున్నాయా? తమిళనాడును హెచ్చరించారు సరే, తీవ్ర చర్య తీసుకుంటాం అని చెప్పారు సరే. అయితే నిండు ప్రాణాల్ని నిర్ధాక్షిణ్యంగా నులిమివేస్తారా? వారి భార్యా పిల్లలను అనాధలుగా మిగుల్చుతారా? వారి కుటుంబాలకు ఆధారాన్ని నిర్మూలిస్తారా?

నిన్నటి ది హిందు సంపాదకీయం చెప్పినట్లుగా ఎర్ర చందనం చెట్లను నరికేవారూ, కోసేవారూ అందరూ కూలీలే. స్మగ్లర్లు ఎక్కువ కూలీ మొత్తాలను ఆశచూపితే కాసిన్ని డబ్బులు ఎక్కువ వస్తాయి కదాని ధైర్యం చేసి వచ్చే కూలీలు వాళ్ళు. అసలు నేరస్ధులు స్మగ్లర్లు గానీ కూలీలు కాదు గదా.

ఎర్రచందనం స్మగ్లర్ గా నిర్ధారించిన గంగిరెడ్డి గారు ఎన్ని సెక్యూరీటీ చర్యలున్నా ప్రభుత్వాలు, పోలీసులు, సుశిక్షిత కమెండోల కళ్ళు గప్పి ఎంచక్కా విదేశాలకు పారిపోతారు. మళ్ళీ అరెస్టు చూపడానికి ఆయన్ను సకల మర్యాదలతో దేశాన్ని రప్పించి జైలులో ఆతిధ్యమ్ ఇప్పిస్తారు. ఆయన వద్ద తుపాకులు, ఇంకా అవీ ఇవీ గన్ లూ ఉంటాయి. అయినా సరే గంగి రెడ్డిలు ఎందుకు ఎన్ కౌంటర్ కారు? కేవలం కడుపు మాత్రమే నిండుగా నింపుకోవడానికి భార్యా పిల్లల కడుపులు నింపడానికి, ఆశగా తెగించే పేద కూలీలు మాత్రమే ఎన్ కౌంటర్ లకు ఎందుకు లక్ష్యం అవుతారు? వాళ్ళే ఎప్పుడూ ఎందుకు ప్రాణాలు కోల్పోతారు?

కొన్ని సంవత్సరాలు అయ్యాక ఈ గంగిరెడ్డిలు ధోవతీలు ధరించి చట్ట సభల్లో కూర్చొని శాసనాలు చేస్తుంటారు. ఇప్పుడు శాసనాలు చేస్తున్నవాళ్లలో చాలా మంది ఆ బాపతే అని ఎవరో కాదు, కోర్టులు, ఎన్నికల కమిషన్లు, జె.పి లాంటి పెద్ద మనుషులు సాక్ష్యాలతో సహా చెబుతున్నారు. హత్యా నేరాల కన్నా ఆర్ధిక నేరాలు మరింత తీవ్రమైనవనీ, అవి దేశ ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తాయని సుప్రీం కోర్టు, హై కోర్టులు పదే పదే తమ తీర్పుల్లో చెబుతున్నాయి. ఎర్ర చందనం చెట్టు నరికినందుకు కాల్చి చంపేస్తే చర్లపల్లి, తీహార్ జైళ్ల చుట్టూ తిరుగుతున్న ఆర్ధిక నేరగాళ్లను ఇంకేం చేయాలి?

ఎర్ర చందనం చెట్టు ఒక సరుకు. ఆ సరుకు ఒకటి పోతే మరొకటి తయారు చేసుకోవచ్చు (పెంచుకోవచ్చు). వాటిని కోసేవారు హత్యలు చేయలేదు. కేవలం కడుపు నింపుకునే పనిలో మాత్రమే ఉన్నారు. ఆ చర్యను చట్టవిరుద్ధం అన్నారు. ఎవరు? చట్ట సభల్లో కూర్చున్న సభ్యులే. పత్రికలు సరిగ్గా మనసు పెట్టి విచారిస్తే చట్ట సభల్లో కూర్చుని ఉన్నవారిలో ఎంతమంది స్మగ్లర్లు ఉన్నారో, ఎంతమంది స్మగ్లర్లను కాపాడుతూ లబ్ది పొందుతున్నారో తెలియకుండా పోదు. (పోలీసులు ఆ పని ఎలాగూ చేయరు కనుక కనీసం నాలుగో స్తంభం అయినా ఆ పని చేయాలని చెప్పడం!) వారిని అలానే వదిలి కూలీలను కాల్చి చంపేస్తే ‘శభాష్ బాగా చేశారు’ అని మెచ్చుకుంటారా? చట్ట సభల సభ్యులు అంటారు, వారికి వారి కారణాలు ఉంటాయి. కానీ పత్రికలు కూడా శభాష్ అంటాయా? పత్రికలకు అప్పగించిన నాలుగో స్తంభం పని ఆదేనా?

స్మగ్లింగ్ చేస్తుంటే దేశ సంపద నాశనం చేస్తుంటే ఊరుకోవాలా అని తెలివిమంతులు అడగొచ్చు. వద్దు, ఊరుకోనే వద్దు. ప్రతి నేరానికీ సంబంధిత సెక్షన్లు ఉంటాయి. వివిధ సెక్షన్లతో కూడిన అనేక చట్టాలు ప్రభుత్వాలు, పోలీసులు, కోర్టుల చేతుల్లో ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారమే వారిని శిక్షించొద్దని అన్నదెవరు? ‘ఆ! చట్టాల ప్రకారం పోతే ఎప్పటికి తేలేను?’ అని అడుగుతారా? అది అడగాల్సింది ఎవర్ని? జనం ఓట్లు కొల్లగొట్టి గద్దెపై కూర్చున్నవారిని కాదా? కాల్చిపారేసేదానికి చట్టాలు ఎందుకని?

పోనీ దేశ సంపద నాశనం చేస్తుంటే కాల్చిపారేయాల్సిందే అనుకుందాం. మరి భారత దేశ అవతార్ అయిన నియమగిరి అటవీ సంపదను నేలమట్టం చేస్తున్న వేదాంతను ఎందుకు వదిలిపెట్టారు? వదిలి పెట్టడమే కాదు, మరిన్ని అటవీ భూముల్ని ఎందుకు అప్పగిస్తున్నారు? ఒడిషాలో గిరిజన ప్రజల తమలపాకు తోటల్ని నాశనం చేసేసిన పోస్కో పెద్దలను, దానికి అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలి? మన రాష్ట్రంలో మన కొత్త రాజధాని తుళ్ళూరులో సంవత్సరంలో 365 రోజులూ బంగారం పండే భూముల్ని లాగేసుకుని, ఆ భూములపై ఆధారపడ్డ ఇతర కుటుంబాలకు తీరని నష్టం చేస్తున్నారు కదా?! దీని గురించి పత్రికలు ఎందుకు ఒక్క ముక్క అడగవు. జనం స్వచ్ఛందగా ఇస్తున్నారు అంటూ కధలూ, కధనాలు ప్రసారం చేసి ప్రచురిస్తారే గానీ బలవంతపు భూస్వాధీనానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వార్త ఒక్కటీ ఎందుకు కనపడవు, పత్రికల్లో, ఛానెళ్లలో?

ఎర్ర చందనం తినేదేమీ కాదు. డబ్బు పేరుకు పోయిన బడా బడా సంపన్నుల హోదాలను, దర్పాలను, సంపదల మందాన్నీ తెలిపే సరుకుల తయారీకి మాత్రమే అవి ఉపయోగపడేది. ఇంకా ఒకటీ ఆరా ఉపయోగాలున్నా, రక్తపాతానికి కూడా తెగించవలసిన ఉపయోగం ఏమీ కాదు కదా? తుళ్ళూరు, నియమగిరి, జగత్ సింగ్ పూర్, సింగూరు, నందిగ్రామ్ ఇవన్నీ మన జనానికి అన్నం పళ్లేలు. అక్కడ విత్తు నాటితే వందల కాయలు కాసి వేలాది మంది పొట్ట నింపుతాయి. సంవత్సరానికి మూడు, నాలుగు పంటలు పండుతూ దేశం గాదెల్ని నింపుతాయి. ఆ భూముల్ని కార్ల కంపెనీలకీ, ఉక్కు కడ్డీల తయారీకీ, అల్యూమినియం రేకుల ఉత్పత్తికీ అప్పగిస్తే మరి కడుపు నిండేది ఎలా? దేశంలో యారబుల్ లాండ్ (వ్యవసాయ యోగ్యమైన భూమి) తగ్గిపోతోందని త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక నివేదికలు తయారు చేసి మరీ చాటేది వారే. ఆ వ్యవసాయ భూముల్నే కాంక్రీటు వనాలుగా, ఉక్కు తొక్కుగా, అల్యూమినియం మలినంగా మార్చేందుకు అనుమతించేదీ వారే.

అసలు తిండి పండే భూమిని మసి చేసి కాసుల విషం పండిస్తామని చెప్పే ఈ పాలకుల ధైర్యం ఏమిటని? కడుపు నింపుకోవడానికి కడుపు కోసుకుని పేగులు తినేస్తామా? కోట్లాది దళారీ సొమ్ము కోసం లాభార్జనాపరులైన విదేశీ బహుళజాతి కంపెనీలకి స్వజనుల తిండి భూమిని ఇచ్చేస్తామా? ఇలాంటి నాసిరకం పాలనను తెగనాడడం మాని వంత పాడగల దిగనాసితనం మన పేరు గొప్ప తెలుగు పత్రికలకే చెల్లింది.

ఆంద్ర ప్రదేశ్ పోలీసులు ఎన్ కౌంటర్ లకు సుప్రసిద్ధులు. ఇప్పుడు కాదు, 1970ల నుండే వారీ రక్తపాత యజ్ఞంలో మునిగితేలుతున్నారు. వారి సామర్ధ్యం దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ఆదర్శప్రాయం అయేంతగా వారు నిష్ణాతులయ్యారు. కొందరు పోలీసులు తమను తాము ఎన్ కౌంటర్ స్పెషలిస్టులుగా జబ్బ చరుచుకుంటున్నారు కూడా. చివరికి సినిమాల్లో కూడా వారి సామర్ధ్యం పాకిపోయి ఎన్ కౌంటర్ స్పెషలిస్టులు హీరోలుగా తెరల మీద నిస్సిగ్గుగా డైలాగులు వల్లిస్తున్నారు.

నక్సలైట్ల పేరుతో అయినవారినీ, కానీ వారినీ బూటకపు ఎన్ కౌంటర్లలో చంపేస్తే అది మొత్తం సమాజానికే నష్టం అనీ, రక్తం రుచి మరిగిన దోపిడీ పాలకులు అన్నీ రంగాల్లో ఎన్ కౌంటర్ సంస్కృతిని విస్తరిస్తారనీ గత యాభై యేళ్లుగా పౌరహక్కుల సంస్ధలు, ప్రజా సంఘాలు మోత్తుకుంటూ వచ్చాయి. ఈ రోజు జరిగింది సరిగ్గా అదే. అక్రమంగా చెట్టు నరికిన పాపానికి మరణ శిక్ష వేసే చోటు ఎక్కడన్నా ఉన్నదా? అసలు విచారణే లేకుండా అక్కడికక్కడే అనుకున్న తీర్పు అమలు చేసేసే వ్యవస్ధల రోజులేనా ఇప్పటివి? బోరు బావిలో పిల్లాడు పడి చనిపోతే రోజుల తరబడి ప్రసారం చేస్తారు బాగుంది, 20 మందిని అక్రమంగా చంపిపాతరేస్తే నిలదీసి అడగకపోగా హతం, ఖతం అని ఆనందం ప్రకటిస్తారేమీ? ఈ వైరుధ్యం ఎందుకు? ఈ శాడిస్టిక్ మనస్తత్వాలు ఉండాల్సింది ఎక్కడ? పత్రికలు, ప్రభుత్వాల్లోనైతే ఖచ్చితంగా కాదు.

10 thoughts on “ఎర్ర చందనానికి శవపేటికల కాపలా!

 1. ఎందుకంటే….ఆ దోపిడి దారులే ఛానళ్ళు కూడా పెట్టి…దయ్యాలు వేదాలు పలికినట్లు వార్తలు అందిస్తున్నారు కాబట్టి.

 2. ఆ చెక్కలు విదేశీ మార్కెత్‌లో కోట్లు ఖరీదు చేస్తాయి. ఎర్రచందనం చెట్లని నరకడమే కాదు, ఇంటిలో పెంచడం కూడా నిషిద్ధమే. గంగిరెడ్డి లాంటివాళ్ళని వదిలేసి కూలీలని చంపడం అంటే తిమింగలాలని వదిలి చేపల్ని పట్టినట్టు ఉంటుంది. ఈ ఘటనలో చనిపోయినవాళ్ళ దగ్గర నిజంగా తుపాకులు ఉన్నాయా, లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ కాల్పులు జరిపింది స్పెషల్ తాస్క్ ఫోర్సే కానీ అటవీ శాఖ ఉద్యోగులు కాదు. మావోయిస్త్‌లు ఆయుధాలు ఎత్తుకుపోతున్నారని ప్రభుత్వం అటవీ శాఖ & ఎక్సైజ్ ఉద్యోగులకి ఆయుధాలు ఇవ్వడం లేదు. ఇందు వల్ల నేరస్తులు అటవీ శాఖ & ఎక్సైజ్ ఉద్యోగులని చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటవీ శాఖ ఉద్యోగులకి ఆయుధాలు ఇవ్వకుండా స్పెషల్ తాస్క్ ఫోర్స్‌ని మాత్రమే పంపిస్తే ఆ కొద్ది మంది తాస్క్ ఫోర్స్ ఉద్యోగులూ వందల సంఖ్యలో ఉండే స్మగ్లర్లని ఏమి చెయ్యాలో తెలియక దొరికినవాళ్ళని దొరికినట్టే చంపెయ్యడం జరుగుతుంది. అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలనలో నేరాలు ఎలా పెరిగినాయో, ఈ ఆంధ్ర తుగ్లక్‌ల పాలనలో కూడా నేరాలు అలాగే పెరిగినాయి.

 3. మరి ఇదీ కూలీలు విదులు నిర్వర్తించే ఫారెస్ట్ ఆఫీసర్స్ పైన దాడులుకు తెగబడి చంపినప్పుడు మరియు మకుమ్మడి దాడి చేసినప్పుడు ….?

 4. ఒక దొంగ కు సహకరించిన వారు కూడా దొంగలే అని చిన్నప్పుడు చెప్పిన చదువు ఇక్కడ పనికిరాదా…?
  నువ్వు చేసే పని తప్పు అని నీకు తెలిసినప్పుడు దొరికితే పోలిసిలు పట్టుకుని జైలో పెడతారు అని తెలిసినప్పుడు కూడా ఇంకా కూలీలు ఏంటి వారు దొంగ కూలీలు కదా (పోలీసులు ఎన్కౌంటర్ తప్పే కానీ కూలీలు అందరు స్ముగ్లింగ్ గురించి తెలియని అమాయకులెం కాదు కదా )

 5. ప్రవీణ్ గారూ కూలీలు హత్యలకు పాల్పడిన వార్తకు లింక్ ఉంటే ఇవ్వండి. హత్యలు కూలీల ముసుగులో ఉన్న మాఫియాలు చేస్తారు గానీ కూలీలు చేయరు. ఒకవేళ కూలీలే చేశారని వార్తలు వచ్చినా అవి అనుమానించవలసినవే. కూలీలకు హత్యల సంస్కృతి ఉండదు. హత్యల సంస్కృతి మాఫియాలది, వారిని సాకే పాలకవర్గాలది. ఈ తరహా వర్గ దృక్పధం మీ వ్యాఖ్యాల్లో తరచుగా లోపిస్తోంది. ఒకటి రెండూ ఉదాహరణలు చూడడం, ఆ అంశాలను జనరలైజ్ చేయడం సరైన పరిశీలన అవదు. కార్మికవర్గ దృక్పధం ఉందని మీరు చెప్పుకుంటారు. అలాంటి మీరు కూలీల పైన అభాండాలు వేస్తే అవి నిజమేనని ఇతర పాఠకులు భావించే ప్రమాదం ఉంటుంది. దోపిడీ భావజాల సమర్ధకులు కూడా మీ వాదనల్ని తమకు మద్దతుగా తెచ్చుకుంటారు. కాబట్టి కాస్త జాగ్రత్త పాటించండి.

 6. నేను చెప్పినా, చెప్పకపోయినా నిజాలు అనేవి మారవు. పేదవాళ్ళు హత్యలు చెయ్యరు అని చెపితే కోర్త్ నమ్మదు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు రైల్వే పోలీసులకి కూడా తుపాకులు ఇవ్వడం లేదు. రైలులో ప్రయాణికుల దగ్గర డబ్బులు వసూలు చేసే హిజ్రాలు రైల్వే పోలీసుల్ని కొట్టినా ఆశ్చర్యం లేదు. ఆ ఎన్‌కౌంతర్ నిజమా, బూటకమా అనేదాని మీద విచారణ జరగాలి కానీ పేదవాళ్ళు హత్యలు చెయ్యరు అని చెపితే సరిపోదు. తాము గాంధీతాత లాంటివాళ్ళమని చెప్పుకోవడానికి ప్రతి ఏడాదీ స్వాతంత్ర్య దినోత్సవం & గణతంత్ర దినోత్సవం నాడు సత్‌ప్రవర్తన పేరుతో అనేక మంది నేరస్తుల్ని వదిలేసే పద్దతి మొదలుపెట్టినప్పుడే మనం పాలకుల్ని నిలదీసి ఉంటే నేరాలు ఇలా పెరిగేవి కాదు. మావోయిస్త్‌లు & SC/ST Atrocities Act కింద అరెస్త్ అయినవాళ్ళు తప్ప ఎవరినైనా సత్‌ప్రవర్తన పేరుతో వదిలెయ్యొచ్చని ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక విధానం ఉంది. మావోయిస్త్‌లది ప్రవర్తనకి సంబంధించిన సమస్య కాదు. ప్రైవేత్ ఆస్తిని రద్దు చెయ్యాలని చెపితే పాలకవర్గంవాళ్ళు ఒప్పుకోరు కనుక ఆస్తి సంబంధాలు కదలకుండా పాలకవర్గంవాళ్ళు జాగ్రత్తపడతారు. అందువల్ల వాళ్ళు మావోయిస్త్‌లని సత్‌ప్రవర్తన పేరుతో విడుదల చెయ్యలేరు. సత్‌ప్రవర్తన పేరుతో ఇతర నేరస్తుల్ని వదిలేస్తే మాత్రం నేరాలు పెరగవా? ఈ సెన్సే పాలకవర్గంవాళ్ళకి లోపించింది. మీరు నా వ్యాఖ్యలు ప్రచురించకపోతే నాకు నష్టం లేదు. సమాజం ఎలా నడుస్తుందో నాకు తెలుసు కాబట్టి. విశాఖపట్నం సీతమ్మధారలో రాజమండ్రికి చెందిన ఒక వికలాంగ యువతి తాను దారి తప్పిపోయానని చెప్పి డబ్బులు అడుగుతోంటే ఆమెకి సీతమ్మధార నుంచి రైల్వే స్తేషన్‌కి వెళ్ళడానికి సరిపడా బస్ తికెత్ చార్జి మాత్రమే ఇచ్చి, రైలులో తికెత్ లేకుండా వెళ్ళిపొమ్మని ఆమెకి సలహా ఇచ్చాను. వేరేవాళ్ళైతే అది కూడా ఇవ్వరు. నేను ఆమెకి 9 రూపాయలు ఇచ్చినట్టు గుర్తుంది. 9 రూపాయలు పోతే జీవితం ఏమీ మారదులే అనుకుని అలా ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు, సమాజం ఎప్పటికైనా మారుతుందని భావించే నా లాంటి ఆశావాదులు తప్ప? కోట్లు ధర చేసే ప్రకృతి సంపద కోసం పోలీసులు ఎర్రచందనం కూలీలని హత్య చేసినప్పుడు “మనుషుల ప్రాణాల కంటే చెట్లు ముఖ్యమా?” అని మన లాంటివాళ్ళు అడుగుతారు కానీ ఎన్‌కౌంతర్‌ల వల్ల నేరాలు తగ్గవని తెలియని సాధారణ జనం అడుగుతారా?

 7. ప్రవీణ్, నేను రాసింది అర్ధం చేసుకునే ప్రయత్నం కూడా మీరు చేసినట్లు లేదు. వీలైతే మరోసారి నా సమాధానం చూడండి.

  “మీరు నా వ్యాఖ్యలు ప్రచురించకపోతే నాకు నష్టం లేదు”

  భేషైన మాట! ఆ మాటకు కట్టుబడి ఉండండి.

 8. మీ వ్యాఖ్యలు మీకైనా అర్థమవుతున్నాయా? మాఫియా నాయకులు చెట్లు నరికే స్థలంలో ఉండరు. వాళ్ళు పట్టణాల్లో ఉంటూ పల్లెటూర్లలో కూలీల చేత పనులు చెయ్యిస్తారు. హత్యలు చెయ్యించేది మాఫియా నాయకులే. మరి చేసేది ఎవరో మీరు చెప్పండి. మీ వ్యాఖ్యలు మీకే అర్థం కాలేదు కనుకనే మీరు నావి ప్రచురించకపోతే నాకు నష్టం లేదన్నాను. మీరు మిమ్మల్నే కన్విన్స్ చేసుకోలేనప్పుడు జనాన్ని ఎలా కన్విన్స్ చేస్తారు?

  మన దేశంలో డబ్బున్నవాని కొడుకు ఏ ప్రభుత్వ ఉద్యోగంలోనో చేరుతాడు తప్ప మాఫియా నాయకుని దగ్గర పనివానిగా చేరడు. ఆ మాఫియా నాయకుల అనుచరులు పేద కుటుంబాల నుంచి వచ్చినవాళ్ళే అయ్యుంటారు. హత్యలు చేసే సంస్కృతి పేదవాళ్ళది కాదు కానీ డబ్బులు ఆశ చూపి పేదవాని చేత హత్య చెయ్యించడం సాధ్యమే కదా.

  అనారోగ్యకరమైన సంస్కృతిలో కూడా డబ్బున్నవాళ్ళ సంస్కృతి భిన్నంగా ఉంటుంది. వాళ్ళు పిల్లల్ని కొట్టి చదివించి ప్రభుత్వ ఉద్యోగాలకి పంపుతారు. ఆ పిల్లలు కూడా పెద్దైన తరువాత తమ పిల్లల్ని కొట్టి చదివిస్తారు. అదంతా పరువు మర్యాదల ముసుగు వేసుకుని ఇంటిలో రహస్యంగా చేసేది. పొట్ట కూటి కోసం స్మగ్లర్ దగ్గర పని చేసేవాళ్ళు తమ బాస్ ఏది చెపితే అది చేస్తారు. దానికి పరువు మర్యాదల ముసుగు ఉండదు. మార్క్సిస్త్ అయిన మీకు, ఆ పేదవాళ్ళ ఆర్థిక బలహీనతని ఉపయోగించుకుమి వాళ్ళ చేత హత్యలు చెయ్యించడం స్మగ్లర్లకి సాధ్యమే అనే విషయం కూడా అర్థమవ్వాలి.

  మీకే అస్పష్టంగా ఉన్న మీ వ్యాఖ్యల్ని కొందరు అంగీకరించొచ్చు. ఆ వందిమాగధుల్లో నేను ఒకణ్ణి కాదు కదా.

 9. దీనికి పెద్ద చర్చ అనవసరం. మీ ఇంటిలో దొంగతనం చేసిన బాలనేరస్తుడు పేదవాడు కదా అని అతన్ని పోలీసులకి అప్పజెప్పకుండా వదిలేస్తారా? నిరాయుధులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని వ్యతిరేకించాల్సిందే. దాని కోసం హత్యలు చేసే సంస్కృతి పేదవాళ్ళది కాదు అంటూ కారణాలు వెతకక్కరలేదు. ఆ కూలీలలో ఏడుగురు బస్సులో దొరికారంటే దాని అర్థం వాళ్ళు నిరాయుధులే అయ్యుంటారని. ఆ ఒక్క కారణం చాలు, ఆ ఎన్‌కౌంతర్‌ని వ్యతిరేకించడానికి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s