[“Secularism is not a policy option” శీర్షికన ఈ రోజు -ఫిబ్రవరి 19- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. ఇది చాలా విలువైన ఆర్టికల్. ముఖ్యంగా (ఆంగ్లం ఒరిజినల్ లో) రెండవ పేరాలో (అనువాదంలో చివరి పేరాలో) ప్రస్తావించిన అంశాలు కలకాలం గుర్తు పెట్టుకోవలసినవి. పాఠకులు వీలయితే బట్టీయం వేసి సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల రీ ప్రొడ్యూస్ చేసినా తప్పు లేదు. -విశేఖర్]
**********
మతం ప్రాతిపదికన హింసా, విద్వేషాలను రెచ్చగొట్టడానికి వ్యతిరేకంగా గళం విప్పడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, తన ప్రభుత్వం దేశంలోని మత మైనారిటీలపై భౌతిక మరియు దూషణ దాడులు చేయడంలో నిమగ్నం అయిన హిందూత్వ గ్రూపులను పరోక్షంగా ప్రోత్సహిస్తోందన్న భావన నానాటికీ పెరిగిపోతుండడానికి అడ్డు కట్ట వేయాలని ఆకాంక్షించారు. విద్వేషం రెచ్చగొడుతున్న వారిపై చర్య తీసుకుంటామని హామీ ఇస్తూ ప్రధాన మంత్రి ‘మెజారిటీ’ మరియు ‘మైనారిటీ’ మత గ్రూపుల మధ్య తేడాను గుర్తించడాన్ని దాటవేయడంలో ఆయన జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ హిందూత్వ గ్రూపుల రెచ్చగొట్టుడు నేపధ్యంలో మత మైనారిటీలకు ధైర్యం ఇచ్చేందుకు ఒక ప్రయత్నం చేశారనడంలో సందేహం లేదు. నిజానికి, ఆయన తన ప్రసంగం వెలువరించిన వేదిక మరియు కార్యక్రమాలే తగిన సందర్భాన్ని సమకూర్చాయి: ఇటీవలి వారాల్లో చర్చిలు దాడులకు గురయిన న్యూ ఢిల్లీ లోని కేధలిక్ సైరో-మలబార్ చర్చి వారు నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
కానీ హామీలు అన్నవి వాటంతట అవే ఎలాంటి ప్రయోజనం కలిగి ఉండవు. తన పార్టీకి చెందిన మంత్రులు, ఎం.పి లు మత మైనారిటీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు దంచేస్తూ రాజకీయ మర్యాదకు సంబంధించిన పరిమితులను దాటిపోయినప్పటికీ వారిని బహిరంగంగా చీవాట్లు పెట్టేందుకు గానీ, అదుపులో ఉంచేందుకు గానీ మోడి ఇప్పటివరకూ అయిష్టంగా ఉన్నట్లు కనిపించారు. ఆయన మాటలు చర్యలుగా మారకపోయినట్లయితే, తన మంత్రులను, పార్టీ సహచరులను మత విద్వేషం రెచ్చగొట్టేందుకు అనుమతించడం కొనసాగినట్లయితే ఆయన ఇచ్చిన హామీలు తమ అర్ధాన్ని కోల్పోతాయి. గత కొద్ది నెలలుగా మోడి ప్రభుత్వం అయోమయంతో కూడిన సంకేతాలు పంపుతోంది. ప్రభుత్వంలో ఉన్నత స్ధాయిలో ఉన్నవారు తమ ప్రసంగాలలో జాగ్రత్తగా, సరైన విధంగా వ్యవహరిస్తుండగా, మధ్య మరియు కింది స్ధాయి నాయకులు మాత్రం చట్టం మరియు మర్యాదల పరిమితులను పరీక్షిస్తున్నారు. ఒక పార్టీగా, భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుత పాలక పార్టీగా నిర్వహించవలసిన పాత్రకు మరియు తన హిందూత్వ ఓటు బ్యాంకుకు అనుగుణంగా స్పందించవలసిన అవసరానికి మధ్య నలుగుతున్నట్లుగా కనిపించింది.
బి.జె.పిలో అనేకమంది భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నట్లుగా ఒక ప్రభుత్వానికి లౌకికవాదం అన్నది ఒక విధాన ఎంపిక కాదు, రాజ్యాంగం గురించి తెలియజేసే అసలైన (ఒరిజినల్) సూత్రాలలో అది ఒకటి. భారత రిపబ్లిక్కును నిర్వచించే ఒక పదంగా ‘సెక్యులర్’ ను రాజ్యాంగ పీఠికకు 1976లో చేర్చి ఉండవచ్చు గాక, కానీ ఆర్టికల్ 25 కింద మనస్సాక్షిని కలిగి ఉండే స్వేచ్ఛ, మత విశ్వాసం కలిగి ఉండి దానిని వృత్తిగా స్వీకరించి, ఆచరించి, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం హామీ ఇచ్చిన మౌలిక హక్కులలో ఒకటి. ప్రజలందరి మత స్వేచ్ఛ హక్కును కాపాడవలసిన బాధ్యత ఆనాటి ప్రభుత్వం యొక్క రాజ్యాంగ విధి. నిజానికి మత స్వేచ్ఛ ఏ ప్రజాస్వామిక వ్యవస్ధలోనైనా సమగ్ర భాగం. ఇండియా, తన నిర్వచనానుసారం, తన పౌరులకు తమకు నచ్చిన మతాన్ని అనుసరించేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్య వ్యవస్ధగా మనజాలదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన మౌలిక హక్కులను పౌరులందరికీ సమానంగా వర్తింపజేయని ప్రభుత్వం అత్యంత త్వరగా తన రాజకీయ సమంజసత్వాన్ని, (ప్రజా) ప్రాతినిధ్య స్వభావాన్ని కోల్పోతుంది. మోడి తన ప్రభుత్వం అలాంటి మార్గంలో తోసుకుంటూ ప్రయాణించాలని ఖచ్చితంగా కోరుకుని ఉండరు.
కౌటిల్యుని రాజ ధర్మం ఎవరికి అనుకూలం?