అమెరికాలో హిందూ ఆలయంపై విద్వేష దాడి


Get Out

హిందూ జాతీయవాద నేత భారత ప్రధానిగా ఉండగా దేశ రాజధాని ఢిల్లీ లోనే అనేక చర్చిలపై దాడులు జరుగుతున్న నేపధ్యంలో అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన ఓ హిందు ఆలయంపై విద్వేషపూరిత దాడి జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ నుండి వెళ్తూ వెళ్తూ మైనారిటీ మతావలంబకుల హక్కులను కాపాడాలని హిత బోధ చేసి వెళ్లారు. ఆయన సందేశానికి కొనసాగింపుగానా అన్నట్లుగా ఇప్పుడు ఆయన అధ్యక్షరికంలో ఇక్కడి చర్చిలపై దాడికి ప్రతి చర్య అమెరికా నేలపై చోటు చేసుకుంది.

అమెరికా పశ్చిమ తీరంలోని వాషింగ్టన్ రాష్ట్రంలో (రాజధాని వాషింగ్టన్ డి.సి కాదు) సియాటిల్ మెట్రోపాలిటన్ ఏరియాలో ఈ దాడి జరిగింది. దాడి అంటే ధ్వంసం చేయడం, కొట్టడం, కాల్చడం లాంటివి ఏమీ జరగలేదు. ఆలయ గోడలపై స్వస్తిక్ గుర్తును స్ప్రే పెయింట్ చేసారు. పెద్ద అక్షరాలలో ‘Get Out’ అని స్ప్రే చేశారు. ఈ పని చేసింది ఎవరో ఇంకా గుర్తించలేదు. ఈ ఘటనను ఖండించేందుకు ఇండియాలో పలువురు నేతలు పోటీ పడ్డారు. అమెరికాలో పని చేసే ‘హిందు అమెరికన్ ఫౌండేషన్’ (హెచ్.ఎఎఫ్) సంస్ధ నేతలు ఘటనను ప్రముఖంగా ఖండించారు.

ఘటన జరిగిన బోతేల్ ఆలయం ‘హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్’ ట్రస్టీ ఛైర్మన్ నిత్యా నిరంజన్ ఈ చర్యపై ఘాటుగా స్పందించాడు. “అమెరికాలో ఇలాంటిది అసలు జరగనే కూడదు. గెట్ ఔట్ అనటానికి అసలు మీరెవరు? ఇది వలస ప్రజల దేశం” అని నిరంజన్ ఆగ్రహం ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ నేత పి.సి.చాకో దాదాపు ఇదే తరహాలో స్పందించారు. “వాళ్ళు తమను తాము ఎప్పుడూ బహుళ (జాతుల, ధోరణుల, మతాల etc…) దేశంగా చెప్పుకుంటారు. తమది అందరినీ కలుపుకు పోయే సమాజం అని చెబుతారు. ఇప్పుడు జరిగింది ఎ విధంగానూ ఆమోదనీయం కాదు. ఈ చర్యకు పాల్పడినవారిపై అమెరికా అధికారులు కఠిన చర్య తీసుకోవాలి” అని చాకో డిమాండ్ చేశారు. ఘటనపై ప్రధాని ఇంతవరకూ స్పందించలేదు.

“ప్రార్ధనా స్ధలాలు ప్రజలు భద్రంగా, శాంతిగా ఉండవలసిన చొట్లు. పరులకు సేవ చేసేందుకు స్ఫూర్తిని ఇవ్వాల్సిన చోట్లు. దానికి బదులు గత కొద్ది రోజుల్లోనే సియాటిల్ లో హిందూ ఆలయం పై దాడి, బోస్టన్ లో మసీదు విధ్వంసం జరగడంతో వివిధ కమ్యూనిటీల ప్రజల మధ్య అపనమ్మకం పెరగడానికి, భయాందోళనలు రెచ్చగొట్టడానికి కారణం అయ్యాయి” అని హెచ్.ఎ.ఎఫ్ బోర్డు సభ్యుడు పద్మ కుప్ప అన్నారని ది హిందు తెలిపింది.

అమెరికాలో హిందూ ప్రార్ధనా స్ధలాలపై దాడులు పెరుగుతున్నాయని పత్రికలు చెబుతున్నాయి.  గత యేడు ఆగస్టులో జార్జియాలోని విశ్వ భవన్ హిందూ మందిర్ లోని శివుడి విగ్రహానికి నల్లరంగు పూశారు. మన్రో లోని ఆలయానికి వెళ్ళే ఫోన్ లైన్ ను కత్తిరించారు. ఆలయంపై విద్వేషపూరిత సందేశాలు రాశారు. జులై-అక్టోబర్ కాలంలో వర్జీనియా రాష్ట్రంలోని లౌడన్ కౌంటీ పోలీసులు 17 హిందూ విద్వేష ఘటనలు నమోదు చేశారు. ఈ ఘటనలకు స్పందనగా ఇలాంటి హిందూ వ్యతిరేక ఘటనలను విద్వేష పూరిత నేరాలుగా (హేట్ క్రైంస్) పరిగణించాలని అమెరికా జస్టిస్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ చర్యలను ఖండించాలి, వ్యతిరేకించాలి. అందులో అనుమానం లేదు. ఈ సందర్భంగా ఇండియాలో జరుగుతున్న దాడులను గూర్చి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్క ఆలయంపై నాలుగు అక్షరాలు రాస్తేనే “ఇది వలస వచ్చిన ప్రజల దేశం” అని ప్రకటించెంతవరకూ వెళ్ళిన పెద్దలు ఇండియాలో ముస్లిం విద్వేషంపైనే ఆధారపడి నడుస్తున్న రాజకీయ పార్టీ, సాంస్కృతిక సంస్ధల కార్యకర్తలు సాగించిన, సాగిస్తున్న అరాచకాలను, హత్యాకాండలను ఏ స్ధాయిలో ఖండించాలి? భారత దేశంలో లెక్కకు మిక్కిలిగా హిందూ మతోన్మాద సంస్ధలు సాగిస్తున్న దాడులను, విధ్వంసాలను, హత్యలను, ప్రచారాన్ని, సాహిత్యాన్ని హెచ్.ఏ.ఎఫ్ గానీ నిత్యా నిరంజన్ లాంటివారు గానీ పట్టించుకున్నారా? ఎప్పుడన్నా ఖండించారా? అమెరికాలో తప్పైన ఒక ఘటన ఇండియాలో ఒప్పు కాదు కదా.

అమెరికా వలస ప్రజల దేశం అని అమెరికన్ హిందువుల నమ్మకం. నిజం కూడా అదే. స్ధానిక ప్రజలను తన్ని, తరిమి, ఊచకోత కోసి వారి నేలను యూరోపియన్లు ఆక్రమించారు. ఆనక భారతీయులు కూడా పోలోమని తరలి వెళ్లారు. సరిగ్గా ఇదే అభిప్రాయం ఇండియాకు వర్తిస్తుందని సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ మార్కండేయ కట్జు అనేక సార్లు చెప్పారు. అడవులు, కొండల్లో నివసించే గిరిజన ప్రజలు, ఆదివాసీలు, ఈశాన్య ప్రజలు తప్ప ఇతరులు అందరూ ఇతర చోట్ల నుండి ఎప్పుడో ఒకప్పుడు వలస వచ్చిన ప్రజల వారసులేనని ఆయన ససాక్షరంగా అనేక వ్యాసాల్లో వివరించారు. అలాంటి దేశం కేవలం హిందువులదేనని, వారు తప్ప ఇతరులంతా హిందువులకు లొంగి బతకాలని సిద్ధాంతాలు రాసుకుని, దానినే నమ్ముతూ ఇతర మతాల ప్రజలపై హంతక దాడులు చేస్తున్న ఉన్మాదులు ఇప్పుడు అమెరికాలో జరిగిన, జరగబోయే దాడులకు సరైన సమాధానం ఇవ్వగలరా?

వర్తమానంలో సైతం ఢిల్లీలో వరుస పెట్టి చర్చిలపై దాడులు జరిగాయి. అయినా రెండు రోజుల క్రితం వరకూ దేశ ప్రధాని నోరెత్తి ఖండించిన పాపాన పోలేదు. ఢిల్లీ ఎన్నికలు అయ్యాక, దాడుల వల్ల ఒనగూరే ఓటు ప్రయోజనం ఇక లేదు గనక, ఆ తర్వాత మాత్రమే ఆయన ఢిల్లీ పోలీసు అధిపతిని పిలిపించి ఆదేశాలు ఇచ్చారని పత్రికలు చెబుతున్నాయి. ఈ పాలన ఏ తరహా ప్రజాస్వామ్యం కిందకు వస్తుంది? ఏ తరహా జాతీయవాదం ఇది? ఇప్పటికీ నిమ్న కులాల ప్రజలపై సాగుతున్న అనేకానేక వివక్షలకు వారిదగ్గర ఎలాగూ సమాధానం లేదు.

హిందు అనగానే ఉన్మాదం ఆవహించిపోయే కార్యకర్తలు ఇప్పుడన్నా సరిగ్గా తిన్నగా ఆలోచించాలి. “తనదాకా వస్తే గాని…” అన్న సామెతనైనా తమకు వర్తింపజేసుకోవాలి. ఆ విధంగానన్నా వారి ఆలోచన తిన్ననైతే సంతోషమే!

4 thoughts on “అమెరికాలో హిందూ ఆలయంపై విద్వేష దాడి

  1. నరేంద్ర మోదీకి విదేశీ పెట్టుబడులూ కావాలి, హిందువుల వోత్‌లూ కావాలి. చర్చ్‌లపై దాడులు చేస్తే అమెరికాతో మన సంబంధాలు దెబ్బతింటాయని హిందువులకి చెప్పే ధైర్యం మోదీకి ఎంత వరకు ఉందో చూద్దాం. మతం పేరు చెప్పుకోకుండానే సామ్రాజ్యవాదుల దళారీగా వ్యవహరించడం మన్మోహన్ సింగ్ కూడా చెయ్యగలడు. ఈ మాత్రం దానికి నరేంద్ర మోదీని మాత్రమే నమ్ముకోవడం అవసరమా అనే సందేహం వస్తుంది.

  2. హెచ్.ఏ.ఎఫ్ గానీ నిత్యా నిరంజన్ లాంటివారు గానీ ఇక్కడ జరిగే దాడులను పట్టించుకోవలసిన అవసరం ఉందా? ఖండించాలా?
    వారు ఉండేది అమెరికాలో అక్కడ దాడిజరిగితే వారిప్రతిస్పందిస్తే పరిగనలోకు తీసుకోవచ్చు! ఇక్కడ దాడి జరిగితే వారు ఎందుకు స్పందించాలి?(నా ఉద్దేష్యం ఇక్కడ జరిగే దాడులను నేను సమర్ధిస్తున్నట్లు కాదు)
    కట్జు గారు చెప్పారని కాదు ఇక్కడ జీవిస్తుండే వారందరూ(మెజారిటీ ప్రజలు) పరాయిగడ్డనుండి వచ్చారని ఎంతమంది విస్వసిస్తున్నారు?
    అదే అమెరికాకు వలస వచ్చినవారు(మెజారిటీ ఐరోపానుండి వలసవచ్చినవారని అందరీకీ తెలుసుకదా!)
    రాజకీయాలను పక్కన పెట్టండి అక్కడ ఉంటున్న ప్రవాసభారతీయులు ఎక్కువమంది హిందువులు అటువంటప్పుడు ఇక్కడివారు స్పందించడంలో తప్పులేదుకదా!

  3. మీరు గమనించారో లేదో, మీ వాదనలో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి.

    మనుషుల్ని వదిలేసి మత పరిశీలనకు పరిమితమై చూస్తే ఇలాంటి వాదనలే వస్తాయి.

    మతం వరకు తీసుకుంటే, అక్కడా, ఇక్కడా హిందువులే. కనుక అక్కడ దాడి జరిగితే ఇక్కడివారు స్పందించాలి. ఇక్కడ దాడి జరిగితే అక్కడి వారు స్పందించాలి. ఇది పరస్పరం సహాయం చేసుకునే సాధారణ అవగాహన. సాధారణ న్యాయం కూడా.

    మీరేమంటున్నారు! అక్కడ దాడి జరిగితే ఇక్కడి వారు స్పందించడం న్యాయబద్ధమే గానీ ఇక్కడ దాడి జరిగితే అక్కడి వారు స్పందించడం అసంబద్ధం అంటున్నారు. స్పందించాలని కోరడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ద్వంద్వ ప్రమాణం.

    ద్వంద్వ ప్రమాణం అయితే మాత్రం ఏమిటి? అని అడిగితే నా వద్ద సమాధానం లేదు మరి.

    విషయం కట్జు చెప్పారా, మరొకరు చెప్పారా అన్నది ముఖ్యం కాదు. మీరు అంటున్నట్లు ఎంతమంది విశ్వసిస్తున్నారు అన్నది కూడా ముఖ్యం కాదు. అది వాస్తవమా కాదా అన్నదే ముఖ్యం.

    ఏమిటా వాస్తవం? అమెరికా లాగే ఇండియా కూడా వలస ప్రజల దేశమే అన్నది వాస్తవం. ఆ సంగతి చరిత్రకారులు నిరూపించారు. కాకపోతే కాలంలో తేడా. కొన్ని శతాబ్దాల క్రితం, కొన్ని సహస్రాబ్దాల క్రితం ఇక్కడికి వలసలు జరిగితే, అక్కడికి ఇటీవల లేదా ఐదారు దశాబ్దాల నుండి వలసలు జరుగుతున్నాయి. కొందరికో లేదా ఎక్కువమందికో ఇష్టం లేనంత మాత్రాన ఈ వాస్తవం మారదు.

    వలసలు వెళ్ళడం అన్నది సహజ ప్రక్రియ. ఎక్కడ ఎక్కువ జీవన అవకాశాలు, సానుకూల పరిస్ధితులు ఉంటే అక్కడికి వలసలు జరుగుతాయి. ఇందులోకి మతాల్ని చొప్పించి ‘ఇది నాది’ అని బల ప్రయోగం చేయడమే అసలు సమస్య. ఈ సమస్యని అమెరికాలో ఒక విధంగా, ఇండియాలో మరొక విధంగా చూడాలని కోరడం అసంబద్ధం. న్యాయం అందరికీ ఒకే విధంగా పని చేయాలని కోరడం న్యాయం కాదా?

    ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజంగా చేయడం మోసం. ఒక నిజం ఎన్నేళ్ళ తర్వాత బైటపడినా దాన్ని నిలబెట్టడం నిజాయితీ. మనం ఎటు వైపు నిలబడతాం అన్నది మన ఎంపిక. దాన్ని ఎవరూ రుద్దలేరు.

  4. నేను స్పస్టంగా నా అభిప్రాయాన్ని చెప్పలేదని గ్రహించాను!
    ప్రవాస భారతీయులలో అత్యధికులకు ఉమ్మడి పౌరసత్వం ఉన్నది గనుక అక్కడ భారతీయులకు ఏమైన ఇబ్బందులు కలిగితే ఇక్కడి వారు స్పంధించడం సమంజసముగా నాకు తోచింది!
    ఇక్కడ చర్చ్ లలపై దాడిజరిగినా,వారెందుకు(ప్రవాసభారతీయులు గానీ,సంస్థలుగానీ) స్పంధించాలి? ఈ దేశంలో అమెరిక నుండి వలస వచ్చినవారు(శ్వేత వర్ణం)కి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే(ముఖ్యంగా మతపరంగా) మొన్న ఒబామా చెప్పినట్లు ఉచిత సలహా ఇచ్చి వెలిపోయేవారుకదుకదా!
    ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోమని ఈ దేశ పాలకులపై ఒత్తిడితెచ్చిఉండేవారుకదా!
    ముఖ్యంగా నా ప్రశ్న ఏమిటంటే ఇక్కడ చర్చ్ లపై దాడి జరిగితే అక్కడివారు స్పందిచమని ఎందుకు కోరుతున్నారు?
    ముందుగా ఇక్కడ ఉంటున్న హిందు మత సంస్థలు స్పందించడంలేదని మదనపడితే సమంజసంగా ఉంటుందని నాకు తోచింది!ఇక్కడివారే పెదవి విప్పకపోతే బయట ఉంటున్న హిందూ మతసంస్థలు పెదవివిప్పాలని కోరడం ఎందుకు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s