నాజీ హత్యాక్షేత్రం ‘ఆష్విజ్’ విముక్తికి 70 యేళ్ళు -ఫోటోలు


జనవరి 26 తేదీ మనకి రిపబ్లిక్ దినంగా తెలుసు. ఆ తేదీకి ప్రపంచం గుర్తుంచుకునే ప్రాముఖ్యత కూడా మరొకటి ఉన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు.

నాజీ సైన్యం దెబ్బకి మహా ఘనత వహించిన ఐరోపా రాజ్యాలన్నీ తోకముడిచి పారిపోవడమో, చేతులెత్తి లొంగిపోవడమో చేస్తున్న దశలో ఆ హంతక సైన్యానికి ఎదురొడ్డి పోరాడి నిలిచిన ఒకే ఒక్క దేశం  సోవియెట్ రష్యా.

బోల్శివిక్ సైన్యం ధాటికి నాజీ సైన్యమే కకావికలై పరుగులు తీస్తుంటే వారిని వెన్నంటి తరుముతూ వెళ్ళిన సోవియట్ సైన్యం 1947 జనవరి 26, 27 తేదీల్లో పోలండ్ లో జర్మనీ నెలకొల్పిన హత్యా క్షేత్రం ఆష్విజ్ ను విముక్తం చేసింది.

ఆష్విజ్ అన్నది పోలండ్ ను ఆక్రమించుకున్న నాజీ సేనలు/జర్మనీ/హిట్లర్ ప్రభుత్వం ఆ దేశంలో నెలకొల్పిన కాన్సంట్రేషన్ క్యాంపుల నెట్ వర్క్. రెండో ప్రపంచ యుద్ధంలో నెలకొల్పిన ఈ శిబిరాల్లో నాజీ సైన్యం తన జాత్యంకారాన్ని, యూదు విద్వేషాన్ని, రోమాలపై అసహ్యాన్ని… ఇలా ఎన్ని అవలక్షణాలైతే వారికి ఉన్నాయో వాటన్నింటిని ఈ శిబిరాల్లో కాన్సంట్రేట్ చేసింది.

ఆష్విజ్ శిబిరాల్లో కుప్పబడిన నాజీ మురికిని ఆంగ్లో-సాక్సన్ పెట్టుబడిదారీ ప్రపంచం మ్యూజియంలో పెట్టి ప్రదర్శించడం ఒక అభాస. ఏ వ్యవస్ధ అయితే ఆష్విజ్ ను సృష్టించిందో ఆ వ్యవస్ధే తన మరికిని తనది కానట్లుగా ప్రదర్శించడం అభాస. అభాసే అయినా అది అవసరం. అది చూపేందుకు మరో వ్యవస్ధ లేదు ఉనికిలో లేదు కనుక.

సోవియట్ సోషలిస్టు రష్యా అన్న ప్రత్యామ్న్యాయ వ్యవస్ధ ఈ ఇలపై వెలిసి ఉండకపోతే ఈ రోజు ఆ మ్యూజియం కూడా ఉండేది కాదు. పెట్టుబడిదారీ వ్యవస్ధ విశ్వరూపమైన నాజీ/హిట్లర్ నియంతృత్వం పారించిన నెత్తురుటేరుల చరితను ఇప్పటికీ ఇలా ఫొటోల్లో చూసే అవకాశం దక్కి ఉండేది కాదు.

తక్కువలో తక్కువ 1.1 మిలియన్ల మందిని హిట్లర్ ప్రభుత్వం ఆష్విజ్ శిబిరాల్లో బంధించి నరకయాతనలు పెట్టింది. గ్యాస్ చాంబర్లలోకి నెట్టి చంపేసింది. బలవంతంగా చాకిరీ చేయించింది. ఒక పద్ధతి ప్రకారం ఆకలికి గురి చేసి ఉసురు తీసింది. వ్యాధులు అంటించి పరీక్షలు జరిపింది. వైద్య ప్రయోగాలు నిర్వహించి వారి ఖర్మానికి వదిలేసింది.

వీరిలో అత్యధికులు యూరోపియన్లే. తాను ఆక్రమించిన ఐరోపా దేశాల నుండి పట్టుకువచ్చిన కమ్యూనిస్టులు, యూదులు, రోమాలు, స్వలింగ సంపర్కులు, యుద్ధ ఖైదీలు, రాజకీయ శత్రువులు… ఇలా తనకు నచ్చని, తమకు ఎదురు నిలిచిన ప్రతి ఒక్కరినీ ఆష్విజ్ శిబిరాలకు తరలించాయి నాజీ సేనలు.

హిట్లర్ ఆనాడు ఎన్ని పాపకార్యాలకు పాల్పడ్డాడో అంతకంటే అనేక రెట్లు ఎక్కువ పాపకార్యాలకు నేటి అమెరికన్, యూరోపియన్ సామ్రాజ్యవాదులు పాల్పడుతున్నారు. సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం దేశాలపై రసాయనక ఆయుధాలను కుమ్మరించిన నిన్న మొన్నటి చరిత్ర అమెరికా, ఐరోపా రాజ్యాలది. కాన్సర్ ను కలిగించే డిప్లిటెడ్ యురేనియంను జల్లిన వర్తమాన చరిత్ర అమెరికా, ఐరోపాలది. ఆ రాజ్యాలే జనవరి 27 తేదీని ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే ని ప్రతి యేడూ పాటించడం అభాస కాక ఏమిటి?

మరో ఘోరం ఏమిటంటే ఆష్విజ్ క్యాంపులను మోసిన పోలండ్ దేశపు ఈ నాటి పాలకులు పక్కనే ఉన్న ఉక్రెయిన్ లో నాజీ వారసులకు మద్దతు ప్రకటించి అన్నీ విధాలా సహాయ సహకారాలు అందించడం. ఉక్రెయిన్ లో అమెరికా, ఐరోపా రాజ్యాలు సాగిస్తున్న దుష్కృత్యాలకు పోలండ్ పాలకులు (ప్రజలు కాదు) ప్రధాన మద్దతుదారులు.

నాజీయిజం అంతమైందనుకుంటే అది పొరపాటు. అది వివిధ రూపాల్లో వివిధ పేర్లతో ఇప్పటికీ బతికే ఉంది. పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినపుడు అది ఫాసిజాన్ని ఆశ్రయిస్తుంది. దేశ ప్రజలను/కార్మిక వర్గాన్ని (శారీరక, మేధో శ్రమల తేడా లేకుండా)  నిర్బంధం కావిస్తుంది. క్రమ శిక్షణ పేరుతో, జాతి ప్రతిష్ట పేరుతో అణచివేతను అమలు చేస్తుంది. అదే నాజీలు చేసింది. ఈ రోజు అది చేయని పెట్టుబడిదారీ దేశం ఉన్నదా? ఇండియాలో సైతం ఓసారి ఎమర్జెన్సీని గుర్తు తెచ్చుకోండి! అది కేవలం శాంపిల్ మాత్రమే అయినా గాని.

వరుస సంక్షోభాలకు నెలవైన పెట్టుబడిదారీ వ్యవస్ధ కొనసాగినంత కాలం ఫాసిజం ప్రమాదం తొలగిపోదు. నానాటికీ మిలట్రీకరణ చెందుతున్న అమెరికా పోలీసు చట్టాలు అందుకు సాక్ష్యం. ఉక్రెయిన్ ప్రభుత్వంలో భాగం వహిస్తున్న స్వోబోడా పార్టీ, దానికి లభిస్తున్న అమెరికా, ఐరోపాల మద్దతూ ప్రత్యక్ష సాక్ష్యమే. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని అనేక నియంతృత్వ ప్రభుత్వాలకు అమెరికా, ఐరోపాలు అందించిన అండదండలు వేరే చెప్పాలా?

కింద ఉన్న ఫోటోల గురించిన నెంబర్ల వారీ వివరణ కింద ఇవ్వడమైనది. ఫోటోలను The Atlantic పత్రిక ప్రచురించింది.

 1. గేటు పైన జర్మనీ భాషలో ఉన్న తోరణానికి అర్ధం “Work Will Set You Free” అని. ఆష్విజ్ I హత్యల శిబిరంలో మెయిన్ గేట్ ఇది.
 2. ఈ ఫోటోలో కనిపిస్తున్నవి ఆష్విజ్ లోని డెత్ గెట్ కు దారి తీసే పట్టాలు. ఆశ్విజ్ II బిర్కెన్యూ ఎక్స్ టర్మినేషన్ క్యాంప్ గా పిలిచే శిబిరంలో ఈ డెత్ గెట్ ఉంది.
 3. గ్యాస్ ఛాంబర్ లకు తోవ తీసే దారి ఇది. చంపడం కోసం ఎంచిన ఖైదీలను ఈ దారి గుండా నడిపిస్తూ తీసుకెళ్లి గ్యాస్ చాంబర్లలోకి తోసి చంపేవారు. రైళ్లలో ఖైదీలను ఆష్విజ్ II శిబిరానికి తెచ్చేవారు. వారిలో వెంటనే చంపాలనుకున్నవారు ఎవరన్నా ఉంటే ఇక్కడికి తరలించేవారు.
 4. ఇది శిశిర ఋతువు మిగిల్చిన ఆకుల కార్పెట్. ‘ద లిటిల్ వరల్డ్’ గా పిలిచే ఈ చోటులో గ్యాస్ ఛాంబర్ లోకి పంపాలనుకున్న ఖైదీలను ఉంచేవారు. ఒకేసారి అంతమందిని చంపడం కుదరదు. విడతలు విడతలు గా ఛాంబర్ లోకి పంపుతూ చావు (చంపబడడం) కోసం వేచి ఉన్నవారిని ఉంచిన చోటు.
 5. కాన్సంట్రేషన్ క్యాంపు చుట్టూ ఉన్న ముళ్ళ కంచె. ఆ మధ్యలో ఉన్నది ఖైదీలను కాపలా కాసే వాచ్ టవర్. ఈ ఫోటోలన్నీ మ్యూజియంగా మార్చిన ఆయా శిబిరాలవి.
 6. డెత్ గేట్ కు దారి తీసే రైల్వే పట్టాలకు చెందిన మరో ఫోటో ఇది.
 7. ఈ సెక్యూరిటీ లైట్ అప్పటిదే. ముళ్ళ కంచేకు పక్కగా నిర్మించారు. ఆష్విజ్ I శిబిరంను ఈ కంచె కాపలా కాస్తుంది.
 8. బిర్చ్ చెట్ల మధ్య కనపడుతున్న వాచ్ టవర్ ని చూడండి. ఆష్విజ్ II క్యాంప్ వద్ద ఉన్న చెట్లను కూడా వదలకుండా కాపలా కాశారు.
 9. ఆష్విజ్ శిబిరాల నుండి బతికి బట్టకట్టినవారు. ఆనాడు సోవియట్ రష్యా సేనల చలవతో విడుదల అయ్యాక ముళ్ళ కంచె వద్ద గ్రూపు ఫోటో దిగారు. ఆనాడు తాము ఫోటోలో ఎక్కడ ఉందో వారే చూపిస్తున్నారు. ఇప్పుడు వారి వయసు వరుసగా 79, 81, 85, 80 యేళ్ళు. అనగా అప్పటి వయసు 9, 11, 15, 10 యేళ్ళన్నట్లు! ఫోటో తేదీ జనవరి 26, 2015.
 10. ఆష్విజ్ డెత్ క్యాంప్ నుండి బైటపడిన జద్విగా బొగుకా అప్పటి తన ఫోటోను చూపుతోంది. ఈ ఫోటో తీసింది జనవరి 12, 2015 తేదీన.
 11. ఆష్విజ్ డెత్ క్యాంప్ నుండి బైటపడిన లాస్జో బెర్నాత్ ఈ ఫోటోను చూపుతున్నారు. ఇప్పుడు 87 సం.ల వయసులో ఉన్న ఆమె అప్పటి ఫోటోలో నాజీల చేతుల్లో మరణించిన తన కుటుంబ సభ్యులను చూపుతున్నారు.
 12. ఆష్విజ్ శిబిరాలకు 20 యేళ్ళ వయసులో తరలించబడ్డ హై అబ్రహాం తన లెదర్ బుక్ లో రాసుకున్న వివిధ ఆష్విజ్ శిబిరాల పేర్లను చూపుతున్నారు. ఈయన్ని అనేక సార్లు వివిధ శిబిరాల మధ్య మార్చారు. తాను ఉన్న శిబిరాల పేర్లను ఈ చిన్న పుస్తకంలో రాసుకున్నారట. ఆయన నాజీలు అరెస్ట్ చేసిన అమెరికన్. 
 13. ఒక యూదు యువకుడు ఆష్విజ్ శిబిరం చుట్టూ ఉన్న ముళ్ళ కంచెను చూస్తున్నాడు. నవంబర్ 13, 2014 తీసిన ఫోటో ఇది. ఈ కంచెలో ఎప్పుడూ విద్యుత్ సరఫరా ఉండేలా నాజీలు ఏర్పాటు చేశారు.
 14. ఆష్విజ్ శిబిరాల్లోని ఖైదీల ఫోటోలు. అప్పటి ఒక క్యాంప్ ని ఇలా ఫోటోలు ప్రదర్శించే మ్యూజియంగా మార్చారు. ఇతర చోట్లు కూడా మ్యూజియంలో భాగమే. ఇది ఫోటోలకు ప్రత్యేకం.
 15. నాజీ శిబిరంలో ఖైదీలు పడుకున్న చెక్క బంక్ లు ఇవి. క్షీణ దశలో ఉన్న బ్యారాక్స్ లో వీటిని ఉంచారు.
 16. ఇవి కూడా ఆష్విజ్ ఖైదీల ఫోటోలు. ఇందులో పసి పిల్లల ఫోటోలను కూడా చూడవచ్చు.
 17. ఆష్విజ్ బందీలకు చెందిన వేలాది కళ్లజోళ్ళు.
 18. ఆష్విజ్ ఖైదీల నుండి లాక్కున్న చెప్పులు. వీటిలో పిల్లల చెప్పులూ ఉన్నాయి.
 19. ఖైదీలను చంపడానికి ఉపయోగించిన Zyklon B వాయువును ఈ క్యానిస్టర్ లలో భద్రపరిచారు. వాడి పారేసిన గ్యాస్ కానిస్టర్లను ఇలా ప్రదర్శనకు ఉంచారు. జనవరి 19, 2015 తేదీన తీసిన ఫోటో ఇది.
 20. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆష్విజ్ శిబిరాలకు చెందిన ఒక చారిత్రక ఫోటో ముందు నిలబడి జనవరి 26, 2015 తేదీన ప్రసంగిస్తున్న దృశ్యం ఇది. ఇంటర్నేషనల్ ఆష్విజ్ కమిటీ 70వ ఆష్విజ్ విముక్తి వార్షికోత్సవం నిర్వహించగా అందులో ఆమె ప్రసంగిస్తున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s