టి.సి.ఎస్ లే-ఆఫ్ కు సీనియర్ల అధిక వేతనాలే కారణం -2


TCS, Hyderabad

TCS, Hyderabad

భారత వ్యాపార, ఐ.టి రంగాలను ట్రాక్ చేసే Track.in అనే బిజినెస్ వెబ్ సైట్ ప్రకారం మధ్య స్ధాయి మేనేజర్లను, కన్సల్టెంట్లను తన లే-ఆఫ్ (ఉద్యోగాల తొలగింపు) కు టి.సి.ఎస్ లక్ష్యంగా చేసుకుంది. టి.సి.ఎస్ లో ఇలా ఎన్నడూ జరగలేదనీ ఉద్యోగ భద్రతకు పేరు గాంచిన టి.సి.ఎస్ ఇప్పుడు తన ఏ, బి, సి, డి, ఇ రేటింగులలో చివరి 3 రేటింగుల వారిని అందరినీ తొలగించాలని లక్ష్యంగా చేసుకుందని ట్రాకిన్ తెలిపింది.

మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను కూడా ఈ వెబ్ సైట్ తెలిపింది. టి.సి.ఎస్ కి గతంలో ఇలా ఎన్నడూ సామూహికంగా తొలగించిన చరిత్ర లేదు. టి.సి.ఎస్ చర్యలతో వ్యాపార పరిశీలకులు, టి.సి.ఎస్ ఉద్యోగులు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారట. డజన్ల సంఖ్యలో గానీ, ఇంకా అయితే కొద్ది వందల మందిని గానీ నాన్-పెర్ఫార్మర్స్ పేరుతో తొలగించడం నమ్మవచ్చేమో గానీ ఏకంగా 25,000 నుండి 30,000 వరకూ ఉద్యోగులను తొలగించడం, దానికి నాన్-పెఫార్మేన్స్ కారణం అని చెప్పడం నమ్మదగ్గదిగా లేదని పరిశీలకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వారు అలా అభిప్రాయపడడానికి బలమైన కారణాలే ఉన్నాయి. టి.సి.ఎస్ లో ఇంకా పని చేస్తున్న ఉద్యోగులు అందించిన సమాచారం ప్రకారం భారీ వేతనాలు పొందుతున్న మధ్య స్ధాయి మేనేజర్లను, కన్సల్టెంట్ లను తొలగించి వారి స్ధానంలో కొత్తవారిని రిక్రూట్ చేసుకోవడానికి టి.సి.ఎస్ నిర్ణయించుకుంది. కొత్తవారికి తగిన శిక్షణ ఇచ్చి ఖాళీ అయిన స్ధానాల్లో చేర్చుకోవాలని టి.సి.ఎస్ యాజమాన్యం భావిస్తోందని ఉద్యోగులు చెబుతున్న వాస్తవం.

మరో సీనియర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారం ప్రకారం (ది హిందు చెప్పినట్లుగా) 8 సంవత్సరాల పైన సర్వీస్ ఉన్న ఉద్యోగులను టి.సి.ఎస్ లక్ష్యం చేసుకుంది. లక్ష్యిత ఉద్యోగులను మొదట ప్రాజెక్టు నుండి తప్పించి ఖాళీగా పెట్టడం, ఆ తర్వాత ఖాళీగా ఉన్నారన్న సాకుతో ‘నాన్-పెర్ఫార్మర్’ ముద్ర వేసి సాగనంపడం టి.సి.ఎస్ అనుసరిస్తున్న ఎత్తుగడ. వీరికి గంటకు 70 నుండి 100 డాలర్ల వరకు వేతనం చెల్లిస్తారు. లేదా సంవత్సరానికి సగటున 20 లక్షల రూపాయలు పైన వారికి చెల్లిస్తారు. వారి స్ధానంలో వచ్చే కొత్తవారికి ఇస్తున్న ప్రారంభ ప్యాకేజీ సం.కి రు. 3 లక్షలు. ఇది వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో 10 లక్షలకు పెరగవచ్చు. మారిన రాజకీయ, ఆర్ధిక ప్రాధామ్యాల రీత్యాను, మారిన చట్టాల రీత్యాను అంతకు తక్కువ పెరిగినా ఆశ్చర్యం లేదు.

ట్రాకిన్ ప్రకారం టి.సి.ఎస్ లే-ఆఫ్ చర్యల సరళిని బట్టి చూస్తే ఉద్యోగుల తొలగింపుకు ప్రాజెక్టులకు సంబంధం లేదు. ఇందులో కేవలం ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశ్యం మాత్రమే కనిపిస్తోంది. వెబ్ సైట్ నుంచి సంగ్రహించిన ఈ పెరాను చూడండి:

Another source informed us that broadly speaking, all those employees with more than 8 years of experience (with $70-100 / hour billing rates) and with no assigned projects are immediately fired. Infact, if we believe this source, then there is no issue of projects with TCS; but with costs-cutting as they have decided to get away with ‘excess fat’ and hire freshers on a mass scale to ‘keep the balance’.

టి.సి.ఎస్ లో తొలగింపుకు గురవుతున్న ఉద్యోగులు సంవత్సరానికి 20 లక్షలకు పైనే సంపాదిస్తున్నారు. వారు 8 నుండి 12 సంవత్సరాల అనుభవం సంపాదించి ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు ఉన్నారు. తీర్చవలసిన బాకీలు, విడిపించుకోవలసిన తనఖాలు వారికి ఉన్నాయి. ఇలాంటి వారు ఒక్కసారికి తమ వేతనాలను కోల్పోతే రోడ్డున పడడమే మిగులుతుంది.

టి.సి.ఎస్ చర్య వలన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మార్కెట్ లో ఒక ఉపద్రవం సంభవిస్తోంది. ఇది ఉద్యోగులకు మాత్రమే ఉపద్రవం. సాఫ్ట్ వేర్ కంపెనీలకు మాత్రం అది సువర్ణావకాశం. ఎందుకంటే టి.సి.ఎస్ మాస్ లే-ఆఫ్ వల్ల సాఫ్ట్ వేర్ మార్కెట్ లో నిపుణుల సప్లై పెరిగింది. కానీ ఆ సప్లైకు సరిపడా డిమాండ్ లేదు. ఐ.బి.ఎం, యాహూ లాంటి కంపెనీలు కూడా లే-ఆఫ్ చర్యలు తీసుకున్నాయి. కానీ వారి సంఖ్య కొన్ని వందల్లోనే ఉంది. మహా అయితే కొద్ది వేలు. వారిని ఇతర కంపెనీలు వెంటనే ఇముడ్చుకున్నాయి. కనుక నిరుద్యోగం సమస్య తలెత్తలేదు. ఐ.బి.ఎం కంపెనీ బెంగుళూరులో గత ఫిబ్రవరిలో ఒక ప్రాజెక్ట్ ను లెనోవో కంపెనీకి అమ్మేసి ఉద్యోగులను 2 గంటల్లో ల్యాప్ టాప్ లు అప్పగించి కంపెనీ పరిసరాలు వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యను అంతర్జాతీయ పరిశీలకులు సైతం ‘ఊచకోత’ (slaughter), ‘రక్తపాతం’ (bloodbath) గా అభివర్ణించారు. ఇక 25,000-30,000 మందిని తొలగించడాన్ని ఏమనాలి? ఏ మాటలూ మిగిలి లేవు. 

TCS employee Termination letter

TCS employee Termination letter

టి.సి.ఎస్ లో ఉద్యోగం కోల్పోయినవారు అధిక వేతనాల నిపుణులు కావడం వలన ఇతర బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపవు. స్టార్టప్ కంపెనీలు చేర్చుకోవచ్చు గానీ టి.సి.ఎస్ ఇచ్చిన వేతనాలు ఇవ్వవు. వారి శ్రమ, అనుభవం అన్నీ ఈ విధంగా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఇప్పుడు వారు చచ్చినట్లు అతి తక్కువ వేతనాలకు, బహుశా సగం వేతనాలకు కూడా చిన్న కంపెనీల్లో చేరాలి లేదా నిరుద్యోగులుగా ఉండాలి. ఇది అనివార్యంగా ఆయా కుటుంబాల్లో సంక్షోభానికి దారి తీస్తుంది. పిల్లలు పేరు పొందిన స్కూళ్ళు వదిలి సాపేక్షికంగా పేరు లేని స్కూళ్ళలో చేరాలి. ఇంట్లో ఆర్ధిక జీవన స్ధాయి ఒక్కసారిగా పడిపోతుంది. ప్రతి చిన్న అవసరానికి కార్లు తీసినవారు, మరీ అవసరం అయితే తప్ప తీయలేని పరిస్ధితి వస్తుంది. ఇది చిన్న పిల్లలపైన పడవేసే ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రారంభంలో కుటుంబ సంక్షోభంగా ఉన్నది కాస్తా క్రమంగా సామాజిక సంక్షోభానికి దారి తీస్తుంది. జీవన స్ధాయిని పైనే కొనసాగించుకోవడానికి కొందరు అవకతవక చర్యలకు దిగవచ్చు.

పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే శిక్షణ ఇచ్చి వారిని మెరుగుపరచవచ్చు. ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీ చేసే పనే ఇది. ప్రభుత్వ రంగ కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు అడపా దడపా శిక్షణలు ఇస్తూ మారుతున్న ఉత్పత్తులకు అనుగుణంగా సిబ్బంది పరిజ్ఞానాన్ని మెరుగుపరుస్తాయి. ఆ పని టి.సి.ఎస్ ఎందుకు చేయలేదు?

తగిన విధంగా సామర్ధ్యం చూపని ఉద్యోగులను తొలగించడం ఐ.టి కంపెనీల్లో సాధారణం కావచ్చు గానీ, కొద్ది నెలల్లో ఏకంగా 30,000 మందిని ఆ పేరుతో తొలగించడం (అది కూడా మొదట ప్రాజెక్టు నుండి తప్పించి ఆ తర్వాత నాన్-పెర్ఫార్మర్ అని చెప్పి తొలగించడం) బొత్తిగా అతకని విషయం.

ఏ పరిశ్రమలోని స్ధితిగతులు చూసినా ఎప్పుడూ స్ధిరంగా ఉండవు. సరఫరా, డిమాండ్ లలో ఎప్పుడూ తేడాలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ పేరు చెప్పి ఉద్యోగుల పొట్ట కొట్టడం దానికి ‘కఠిన నిర్ణయాలు తప్పవు’ అని బోధలు చేసి ఊరుకోవడం ఎలా సమర్ధనియం. అలా అయితే ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ ప్రకృతి, ఈ వనరులు కేవలం టాటా, బిర్లా, వాల్ స్ట్రీట్, ద సిటీ లాంటి కుబేరులది మాత్రమేనా? వారికి కాస్త నష్టం వచ్చినప్పుడు వేలాది కుటుంబాలు నిలువునా కూలిపోవాలా? కొద్ది మంది వ్యాపార సామ్రాజ్యాలు చల్లగా ఉండడానికి వేలాది, లక్షలాది కుటుంబాలు వీధిన పడాల్సిందేనా?

సం.కి 20 లక్షలు సంపాదించే ఉద్యోగిని తొలగించి వారి స్ధానంలో 3 లక్షలు సంపాదించే ఉద్యోగిని చేర్చుకోవడంలో అంతరార్ధం ఇంకా వివరించాలా? ఖర్చు తగ్గించుకుని లాభం పెంచుకోవడమే పరమావధిగా ఉంటే తప్ప 30,000 మందిని తొలగించి మరో 55,000 మందిని కొత్తగా చేర్చుకోవడం సాధ్యపడుతుందా? విషయం ఇంత స్పష్టంగా ఉంటే దానికి ఐ.టి పరిశ్రమ స్ధితిగతులని కారణాలకు చెప్పడం అంటే కుబేరులకు అక్కర్లేని సానుభూతిని అప్పనంగా ఇస్తూ, అవసరం అయిన వేలాది మంది కార్మికులకు లేదా ఉద్యోగులకు కనీస మానవ స్పందన కరువైపోవడం. ఐ.టి కంపెనీలను నడపలేకపోతే శుభ్రంగా వాటిని కార్మికులకు/ఉద్యోగులకు/సాఫ్ట్ వేర్ కార్మికులకు ఇచ్చేస్తే ఘనంగా నిర్వహించగలరు. కానీ కారణం అది కాదు. కంపెనీ లాభాల మార్జిన్ పెంచుకోవడమే అసలు కారణం. లాభాలు పెంచి, ఇన్వెస్టర్లను నిలుపుకోవడం టి.సి.ఎస్ లక్ష్యం. టి.సి.ఎస్ లో టాటా కుటుంబానికి 51 శాతం వాటా ఉంది. కనుక లాభాలు పెరిగితే సంతోషించే మొదటి ఇన్వెస్టర్ టాటా కుటుంబమే. సి గ్రేడ్ పైన మాత్రమే కాకుండా బి గ్రేడ్ వచ్చినవారికి కూడా లే-ఆఫ్ ఉత్తరాలు రావడం ఇదే సూచిస్తోంది.

ఇది సరైందే అయితే మోడి ఇచ్చిన వాగ్దానాలు కేవలం ఎన్నికల కోసమే అని నిర్ధారించుకోవచ్చా? దేశానికి ‘అభివృద్ధి’ తెస్తానని, జనానికి ‘ఉద్యోగాలు’ ఇస్తానని మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. వాస్తవంలో చేస్తున్నది శ్రామికులకు బిరుదులు ఇవ్వడం, కుబేరులకు వనరులు దోచి పెట్టడం.

(ట్రాకిన్ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్త కింద అనేకమంది టి.సి.ఎస్ ఉద్యోగులు వాస్తవాలతో వ్యాఖ్యలు రాశారు. ఆ వ్యాఖ్యలు చూస్తే టి.సి.ఎస్ లే-ఆఫ్ నిజ స్వరూపం ఇట్టే అర్ధం అవుతుంది. ఈ వ్యాఖ్యల్లో కంపెనీలోని అనేక అంతర్గత పరిస్ధితులపై అసంతృప్తి కనిపించినప్పటికీ అవి ప్రధానం కాదు. ఉద్యోగుల తొలగింపుకు పెర్ఫార్మెన్స్ ఎంత మాత్రం కాదని మార్జిన్ లు పెంచుకోవడం కోసమే తొలగింపు అనీ అనేకమంది రాశారు. ఆర్టికల్ కోసం ఈ కింది లింక్ లోకి వెళ్ళండి)

TCS Firing Big Time. Upto 30,000 Employees May Face Axe

9 thoughts on “టి.సి.ఎస్ లే-ఆఫ్ కు సీనియర్ల అధిక వేతనాలే కారణం -2

  1. *ఐ.టి కంపెనీలను నడపలేకపోతే శుభ్రంగా వాటిని కార్మికులకు/ఉద్యోగులకు/సాఫ్ట్ వేర్ కార్మికులకు ఇచ్చేస్తే ఘనంగా నిర్వహించగలరు*

    ఇంఫొసిస్ వారు ఇటువంటి ప్రయోగమేగదా చేసింది. ఆ కంపేనిలో ఒకపుడు ఉద్యోగులకు షేర్లు ఇచ్చేవారు. ఇంఫి వ్యవస్థాపకులలోవ్యాకరణం ఆంజనేయ శాస్రి అనే తెలుగాయన (ఆర్.ఇ.సి. వరంగల్ చదివాడు ) అతని 1500కోట్ల వాటాను,పనిచేసే ఉద్యోగులకు పంచాడు. మొదట్లో చేరినవారు కంపెని ఇచ్చిన షేర్లు, ఇటువంటి ఉదార వాదులుఇచ్చిన వాటిని తీసుకొని లాభపడినవారెందారో ఉన్నారు. కొన్నేళ్ళ తరువాత ఈ సినియర్ ఉద్యోగుల షేర్ విలువ,సంపాదనా పెరిగి ఆస్థి కోట్లలోకి చేరింది. భార్యా భర్త లిద్దరు ఐ.టి. లో పనిచేస్తే ఇక చెప్పనవసరంలేదు. కనీసం ఐదారు కోట్లు ఇండియాలోనే సంపాదించుకొని, ఒక విల్లా, మంచి కారు కొనుకొని హాయిగా సెటిల్ అయ్యేవారు. ఒక్కరు ఊరుకదలరు, ప్రాజేక్ట్ వదలరు. సీనియారిటివలన కంపెనిలో పైనవారందరు తెలుసు. సీనియర్ చేసే ఉద్యోగాలలో ఎక్కువగా మేనెజ్ మెంట్ ఉంట్టుంది. అంటే మీటీంగ్ లు పెట్టటం, కో ఆర్డినేట్ చేయటం, వీటికి టెక్నికల్ నాలేడ్జ్ అవసరం పెద్దగా ఉండదు. జూనియర్లు కష్టపడి పనిచేస్తున్నా వారికి ప్రమోషన్ లు ఉండవు. కారణం సీనియర్ పోస్ట్ లో ఎవరో ఒక పాత ఉద్యోగి కొనసాగుతూండటం. ఇలా కొన్నేళ్ళు గడిచిన తరువాత కంపెని ప్రోగ్రెస్ బాగా దెబ్బతిన్నది.

    మాస్ గా చేసే ఏ లే ఆఫ్ కూడా పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని చేయరు. అది ఒట్టి మాటలు. ఐ.టి. ఉద్యోగులులకి కంపెని ఇస్తే,ఇంతకు మునుపు పది మంది బోర్డ్ మెంబర్లు ఉండేచోట, ఇప్పుడు వంద, వేలమంది తయారౌతారు. సమస్య మరింత జఠిలం అవుతుంది. ఉద్యోగులను తొలగించే టప్పుడు మంచి కాంపెన్సేషన్ పేకేజ్, విదేశాలలో ఇచ్చినట్లు ఇవ్వవలసిన అవసరం ఉంది. మనవారు మూడునెలల బేసిక్ శాలరి ఇస్తారు. అది మరీ అన్యాయం.

    మీరు ఐ.టి.వారి మీద మరీ ఎక్కువ జాలి చూపిస్తున్నరు. మంచి అనుభవం ఉన్నవారు, విదేశాలలో పనిచేస్తున్నవారు సైతం ఈ లే ఆఫ్ లిస్ట్ లో ఉన్నారు.వీళ్ళె మీ పూట గడవని పేదోళ్ళుకాదు. నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకులు అంతకన్నా కాదు! వీరు కేపిటలిజాన్ని సమర్ధించినవారే, దెబ్బతగిలితే ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూడాలి.
    http://articles.economictimes.indiatimes.com/2014-06-30/news/50974647_1_infosys-board-v-balakrishnan-bonus-shares

  2. It is expected of employers to notify the Labour Department of the lay offs which TCS never did. The IT sector does not fall under the Industrial Employment Act. That leaves laid off employees in the same category as other unrecognised labourers in the country. This also keeps them out of legal protection against unjustified termination. Also, long work-hours, lack of a redress mechanism and stagnation, are other issues that employees can’t do anything about due to the fear of being blacklisted.

    http://www.dnaindia.com/money/report-tcs-lays-off-over-1500-employees-stung-employees-to-petition-pm-narendra-modi-2049290

  3. మన దేశంలో వ్యాపారవేత్తలకు ఎంత లాభం కావాలో ప్రజలకు చెప్పాలి. ఐ.టి. కంపేనీలనే తీసుకొంటే ప్రతి క్వార్టర్ కి సుమారు మూడు వేల కోట్లు లాభం కళ్లకి కనపడాలి. అంటే సంవత్సరానికి దాదాపు పది వేల కోట్ల నుంచి పన్నెండు వేలకోట్లు రావాలి. అదే ట్రెండ్ దశాబ్దాలుగా కొనసాగించాలి. ఇది అయ్యేపనేనా? ఒక్కొక్క పెద్ద కంపెనీలో సుమారు యాభై వేల నుంచి లక్ష కోట్ల ధనం బాంక్ లలో పడి మూలుగుతోంది దానిమీద వచ్చే వడ్డి ఎక్కడికిపోతున్నాది? ఇటువంటి వివరాలు ఎక్కడ పేపర్లలో కనపడవు. ఒక్క క్వార్టర్ లో వచ్చే డబ్బులు తగ్గితే కంపేని దగ్గర పైసా లేనట్లు, వెంటనే ఉద్యోగులమీద పడతారు
    మీకొక ఉచిత బోడి సలహా . వింటారో వినరో తెలియదు. ఈ మధ్య ది కేపిటల్ అనే పుస్తకాన్ని థామస్ పికెటి రాశాడు. అతనికి ఈసారి నోబుల్ ప్రైజ్ వచ్చినా వస్తుంది. అతనిని ఆధునిక మార్క్స్ అని అభివర్ణించిన వారున్నారు. వీలైతే ఆ పుస్తకం చదవండి. యుట్యుబ్లో వీడియోలు ఉంటాయి చూడండి.

  4. Q:ఇక 25,000-30,000 మందిని తొలగించడాన్ని ఏమనాలి?
    మీరు ఇంతపెద్ద సంఖ్య చెబుతున్నారు. ఆలోచించదగ్గ విషయమే. కంపెనీ పరిస్థితి బాగుండకపోతే తప్ప ఇలా చేయరు. మీ సంఖ్యకు, ఊహాగానమూ గాలివార్తా కాని సరైన ఆధారం దయచేసి చూపకలరా నేను నిర్థారించుకుందుకు?

    Q: Another source informed us that broadly speaking, all those employees with more than 8 years of experience (with $70-100 / hour billing rates) and with no assigned projects are immediately fired.

    ఒక ఉద్యోగికు ఏటా 20లక్షల పేకేజీ అనుకుంటే, నెలకు 1.6666 లక్షలు. నెలకు 22రోజులుగా రోజుకు 8పని గంటలుగా లెక్కిస్తే గంటకు ఆ ఉద్యోగికి ముట్టేది 947 రూపయలు లేదా రమారమి US$15.78మాత్రమే 60రూపాయలకు ఒక డాలరు చొప్పున. మరొక మాట, గంటకు 70డాలర్ల జీతగాడికి ఏటా పేకేజీగా రూ88,70,400 ఉంటుంది. $100 చొప్పున అంటె పేకేజీ రూ.1,26,72,000 ఉంటుంది. పరిస్థితి ఇలా ఉన్న ఉద్యోగులెంతమంది ఉంటారు, మీరన్నట్లుగా అందులో 30వేలమందికి జాబులు పోవటానికి? ఇదంతా నమ్మశక్యంగా లేదు. మీరు ఏటా కోటి రూపాయల ఆర్జనకల పేద కార్మికుల బాధలూ హక్కులూ గురించా ఇంతకూ మీరు ప్రస్తావిస్తున్నది?

  5. IT కంపెనీలలో పెద్దవి మాత్రమే ఉద్యోగులకి ఎక్కువ జీతాలు ఇస్తాయి. చిన్న కంపెనీలు తమ ఉద్యోగులకి ఇచ్చేది పది వేలు లేదా ఇరవై వేలు జీతమే. ఆ ఉద్యోగం కూడా దొరక్క ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఎనిమిది వేలు లేదా తొమ్మిది వేలు జీతానికి పని చేసేవాళ్ళు ఉన్నారు.

  6. My brother’s friend worked as a faculty in an engineering college for salary of Rs 8,000. He left that job and joined as a PO in a public sector bank for salary of Rs 20,000. Most of the engineering colleges run for the money showered in the name of fees reimbursement. They cannot guarantee employment for everyone who study in those colleges. 85% of the students who have studied in those colleges are not proficient in English and thus not employable. Some of them are not even proficient in their native languages. This is the standard of education in India.

  7. ప్రవీణ్ గారూ, చదవేస్తే ఉన్న మతి పోయినట్లుగా ఉంది మీ వ్యాఖ్య. ఆంగ్ల పరిజ్ఞానంతో సంబంధం లేకుండానే జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ దేశాలు అభివృద్ధి చెందలేదా? ఇప్పుడు చైనా వృద్ధి వెనుక కూడా ఆంగ్ల భాష లేదు. ఈ దేశాలన్నీ తమ భాషల్లోనే శాస్త్రాలు అధ్యయనం చేసే అవకాశం తమ ప్రజలకు కల్పించాయి. మన పాలకులు ఆ పని చేయలేకపోయారు. అంతే తేడా తప్ప ఇందులో ఆంగ్లానికి ఉన్న ప్రాధాన్యత ఏమీ లేదని నా అభిప్రాయం.

  8. The government of India is fooling people in the name of English medium education. 25% of Indians use Hindi in their day-to-day life and 16% of Indians use Hindi to communicate with other tribes/regions. Thus 41% of Indians are able to speak Hindi. Our government still uses English as medium of instruction in schools.

వ్యాఖ్యానించండి