గాజాపై అత్యాధునిక క్షిపణులతో నరహంతక దాడులు చేసి 2016 మందిని ఇజ్రాయెల్ బలి గొన్న రోజుల్లో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య సమాన దూరం పాటించడం తమ విధానం అని ప్రకటించి మోడి ప్రభుత్వం తన అంతర్జాతీయ దివాళాకోరుతనం చాటుకుంది. ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ పక్షాన చేరిపోయి, అనాదిగా ఆక్రమిత పాలస్తీనాకు ఇస్తున్న మద్దతును ఏకపక్షంగా ఉపసంహరించుకునేందుకు మోడి ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోందని పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే భారత విదేశాంగ విధానాన్ని అత్యంత హీనమైన, ప్రగతి విహీనమైన మలుపు తిప్పిన ఘనత మోడి ప్రభుత్వం సొంతం కావడం ఖాయం.
కేంద్ర ప్రభుత్వంలోని రెండు వనరుల నుండి అందిన సమాచారం ద్వారా ఈ సంగతి తెలిసిందని ది హిందూ పత్రిక నేడు తెలిపింది. అలీన కూటమికి నాయకత్వం వహిస్తూ ప్రపంచంలో పీడిత జాతులకు, దేశాలకు, దురాక్రమణలో ఉన్న జాతుల పోరాటాలకు మద్దతు ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ ప్రతిష్టను సంపాదించిన ఇండియా మోడి ప్రభుత్వం చేయబోయే నిర్ణయం ద్వారా ప్రపంచంలోనే అత్యంత దురహంకార, దురాక్రమణ పూరిత దేశంతో స్నేహం కట్టిన దేశాల్లో ఒకటిగా చీత్కరింపులను, తిరస్కారాలను ఎదుర్కోనుంది.
“ఇతర విదేశాంగ విధాన అంశాలకు మల్లెనే ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా సమస్యపై ఇండియాకు ఉన్న ఓటింగు చరిత్రను సమీక్షించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది” అని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారని ది హిందు తెలిపింది. పాలస్తీనా-ఇజ్రాయెల్ విధానంలో మార్పు చేయాలంటే ప్రభుత్వపరమైన నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని సదరు అధికారి చెప్పినట్లు తెలుస్తోంది.
పాలస్తీనా స్వతంత్ర రాజ్యంగా అవతరించేందుకు అనేక దేశాలు మద్దతు ఇవ్వడం పెరుగుతున్న దశలో ఇండియా ఈ విధంగా ప్రగతి విహీనమైన, అభివృద్ధి నిరోధక చర్యకు పాల్పడడం వల్ల ఇండియా ప్రతిష్ట దారుణంగా మసకబారడం ఖాయం. 200 యేళ్ళ పాటు బ్రిటిష్ జాత్యహంకారాన్ని, వలస అణచివేతనను ఎదుర్కొన్న దేశంగా అణచివేతకు గురవుతున్న జాతుల, దేశాల పోరాటాలకు సహజ మద్దతుదారుగా భారత దేశం నిలబడాల్సి ఉండగా తద్విరుద్ధమైన నిర్ణయాలను మోడి ప్రభుత్వం తీసుకోవడం వల్ల భారత పౌరులకు విదేశాల్లో తల ఎత్తుకోలేని పరిస్ధితి దాపురించవచ్చు.
పాలస్తీనా స్వతంత్రానికి మన పాత వలస దేశమే (బ్రిటన్) ఇటీవల మద్దతు ప్రకటించింది. ఆ మేరకు బ్రిటిష్ పార్లమెంటు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ వెంటనే నార్డిక్ దేశాలలో ఒకటయిన స్వీడన్ కూడా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు మద్దతుగా తీర్మానం చేసింది. త్వరలో నార్వే సైతం స్వీడన్ ను అనుసరించనుంది. అతి త్వరలో యూరోపియన్ యూనియన్ పార్లమెంటు కూడా స్వతంత్ర పాలస్తీనాకు మద్దతుగా తీర్మానం ఆమోదించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో దురాక్రమణదారు ఇజ్రాయెల్ ను సంతృప్తిపరచడానికి, పాలస్తీనాకు మద్దతు ఉపసంహరించడానికి మోడి ప్రభుత్వం నిర్ణయించడం రాజకీయ దివాళాకోరుతనం తప్ప మరొకటి కాదు. ఈ దెబ్బతో అంతర్జాతీయంగా భారత రాజకీయ ప్రతిష్ట నేలబారు స్ధాయికి పడిపోతుంది.
ఎన్.డి.ఏ నేతృత్వంలోని మొదటి ప్రభుత్వం కూడా ఇంత నీచమైన విదేశాంగ విధానాన్ని అనుసరించలేదు. ఆనాటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరాన్ ను ఇండియా పర్యటనకు ఆహ్వానించడం ద్వారా అప్పటి ప్రధాని వాజ్ పేయి, అనాదిగా పీడిత జాతులకు మద్దతు నిచ్చిన ఘనతర ఇండియా చరిత్రకు మచ్చ తెచ్చారు. కానీ ఆయన కూడా పాలస్తీనా పోరాటానికి మద్దతు ఉపసంహరించలేదు. ఆ పనికి ఇప్పుడు కరడుగట్టిన హిందూత్వ మతవాది మోడి నేతృత్వంలోని ప్రభుత్వం పూనుకుంటోంది. ప్రగతి వైపు సాగాల్సిన భారత దేశ రాజకీయ నడక వెనక్కి మళ్ళీ పాతాళంవైపు సాగడం అత్యంత దురదృష్టం, దౌర్భాగ్యం, దుర్మార్గం.
తమతో వాణిజ్య సంబంధాలు నెరుపుతూనే ఇరు దేశాల స్నేహ సంబంధాలను బహిరంగంగా ప్రకటించడానికి ఇండియా వినుకాడుతోందని ఇజ్రాయెల్ కొద్ది సంవత్సరాలుగా విమర్శిస్తోంది. ఇంటికి పరిమితం చేసే భార్యగా ఇండియా తమను చూస్తోందని ఇజ్రాయెల్ విమర్శించింది. పాలస్తీనా సమస్యపై ఐరాసలో జరిగే వివిధ తీర్మానాల విషయంలో తమకు వ్యతిరేకంగా ఓటు వేయడమో లేదా ఓటింగ్ లో పాల్గొనకపోవడమో ఇండియా చేయడాన్ని ఉద్దేశించి ఇజ్రాయెల్ ఈ విమర్శలు చేసింది. ఈ మేరకు అమెరికా నుండి కూడా ఇండియా ఒత్తిడిని ఎదుర్కొంది.
ఇజ్రాయెల్, అమెరికాల ఒత్తిడిలకు అప్పుడప్పుడూ లొంగుతున్నప్పటికీ తమ విధానాన్ని మొత్తంగా ఇండియా ఎప్పుడూ తిరగదోడే దుస్సాహసానికి పూనుకోలేదు. అటువంటి దుస్సాహసానికి మోడి ప్రభుత్వం పూనుకుంటోంది. గుజరాత్ లో మోడి పాలనా చరిత్ర తెలిసినవారికి పాలస్తీనా విషయంలో తీసుకోబోయే చర్య ఆశ్చర్యం కలిగించకపోవచ్చు గానీ, అంతర్జాతీయ స్ధాయిలో దేశం యొక్క పేరు ప్రతిష్టలు ఇమిడి ఉన్న అంశాల్లో ఇంత త్వరగా తిరోగమన చర్యకు పాల్పడుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
ఈ నిర్ణయంతో అరబ్, ముస్లిం దేశాలలో భారత్ పేరు ప్రతిష్టలు కొడిగట్టడమే కాకుండా ఇస్లామిక్ ఉగ్రవాదానికి మరింత కఠినమైన లక్ష్యంగా ఇండియా మారిపోవడం ఖాయం. ప్రపంచంలో పలుచోట్ల కొనసాగుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదానికి ప్రధాన వనరు పాలస్తీనా సమస్య మాత్రమే. ఈ సమస్య పరిష్కారం కాకుండా నిరంతరం కొనసాగించడం ద్వారా తాను పోషించే ముస్లిం ఉగ్రవాద సంస్ధలకు కార్యకర్తల సైన్యం తగ్గిపోకుండా అమెరికా సామ్రాజ్యవాదం చూసుకుంటోంది. ఈ పరిస్ధితుల్లో పాలస్తీనాకు మద్దతు ఉపసంహరించడం అంటే ఉగ్రవాద పోషణలో ఇండియా కూడా భాగం పంచుకోవడమే అవుతుంది. ఆ తర్వాత ముస్లిం ఉగ్రవాదం పై పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉండకపోగా అమెరికా వలె ద్వంద్వ విధానాన్ని అనుసరించే దేశంగా ఇండియా అప్రతిష్ట మూటగట్టుకుంటుంది. ఇది ఉగ్రవాదాన్ని కోరి కోరి మరింత తీవ్ర స్ధాయిలో భారత గడ్డ మీదికి ఆహ్వానించడమే.
ముస్లిం ఉగ్రవాదాన్ని మరింత తీవ్రతతో ఇండియాకు ఆహ్వానించడమే మోడి ప్రభుత్వం లక్ష్యం అయితే, ఆ లక్ష్యం నెరవేరడం ఖాయం. ఉగ్రవాద భయం చూపుతూ అమెరికా, అనేక యూరప్ రాజ్యాలతో పాటు అనేక మధ్య ప్రాచ్యం దేశాలు అత్యంత కఠినమైన, కర్కశమైన, దుర్మార్గమైన ప్రజావ్యతిరేక చట్టాలను చేసుకుని న్యాయమైన ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు ఆ చట్టాలను వినియోగిస్తున్నాయి. మోడి ప్రభుత్వం లక్ష్యం కూడా ఇదే అయితే, తాను వేగవంతం చేస్తున్న నూతన ఆర్ధిక విధానాలకు, సంస్కరణ విధానాలకు ఎదురయ్యే ప్రజా ప్రతిఘటనను ఉక్కు పాదంతో అణచివేసేందుకే పాలస్తీనా సమస్యను ఒక ఆయుధంగా మోడి ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లయితే భారత ప్రజలకు మునుముందు అత్యంత గడ్డు కాలం ఎదురు కానుందని నిస్సందేహంగా భావించవచ్చు.
కార్పొరేట్ ప్రభుత్వం నుండీ ఇంతకంటే ఎక్కువ ఏమి అశించగలం.నరహంతక ఇజ్రయాల్ అమాయకమైన పాలస్తినా ప్రజల భూభాగాన్ని ఏలా కబళీంచింది మరియు వారి ప్రాణాలను ఈ ఏలా హరించిందొ ఈ ప్రపంచం చుస్తునె ఉంది . అలీన రాజ్యాల తరుపున పెద్దన్న పాత్ర పొశీస్తున్న భారత్ ఈ వైఖరితొ తన పరువును మరియు పెద్దరికాన్ని కొల్పొవలసి వస్తుంది .
భహూశా మోడీ ప్రభుత్వానికి పాలస్తినా ప్రజల మరణాల కన్నా వారి ప్రాణాలను తిసిన మిస్సైళ్ళే కనిపించయెమో ( ఇజ్రయాల్ తొ సైనిక ఒప్పందం ద్రుష్టీతొ)
భారత ప్రజలకు మునుముందు అత్యంత గడ్డు కాలం ఎదురు కానుందని నిస్సందేహంగా భావించవచ్చు.
ఇదే నిజమైతే మోదీ తన సమాధిని తానే తవ్వుకున్నవాడవుతాడు!
నెపోలియన్ బొనపార్త్ తనకి విప్లవకారులూ, విప్లవ వ్యతిరేకులూ రెండు వర్గాలూ సమానమే అని చెప్పుకున్నాడు. చివరికి అతను ఏ వర్గం పక్షాన నిలిచాడో మనకి తెలుసు కదా!
ఇంత బతుకూ బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు…..
ఇండియా కాస్తా ఇజ్రాయిల్ కు మద్దతు పలుకుతుందన్న మాట.
అంటే బలవంతుడు ఎలాగైనా బలహీనుడిని దోపిడీ చేసుకోవచ్చు…అని మోడీ బృందం అంగీకరిస్తున్నారన్నమాట.
ఆయుధ వ్యాపారులు…మంత్రులకు లంచాలు మేపి ఆయుధాలు కొనుగోలు చేయించడం అన్నది కొత్త సంగతేమీ కాదు. కానీ ఆఖరికి విదేశాంగ విధానాల విషయంలోనూ జోక్యం చేసుకునే దుస్థితి వచ్చిందన్న మాట.
ఏ గూటి పక్షి ఆ గూటికి చేరినట్టు.
ఎన్ డి ఏ 1 లోనే అది జరిగి పోయింది. ఇప్పుడు కొత్తగా చేసే దేముంది?