లేలేత ప్రాయపు చిన్న పిల్లలు సున్నిత శరీరాలను కలిగి ఉంటారు. వారి అవయవాలు తేలికగా వంగిపోయే విధంగా ఉంటాయి. ఈ కారణం తోనే చిన్న పిల్లలను పూలతో పోల్చడం కద్దు. పూల రెమ్మలు ఎంత మెత్తగా, సున్నితంగా ఉంటాయో చిన్న పిల్లల శరీరాలు, హృదయాలు కూడా అంతే మెత్తగా, సున్నితంగా ఉంటాయి.
పెషావర్ లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై పాకిస్తాన్ తాలిబాన్ చేసిన పైశాచిక దాడి నేపధ్యంలో కార్టూనిస్టు తాలిబాన్ స్వభావాన్ని ఈ విధంగా సున్నితంగా చెప్పారు. తుపాకి శిక్షణ తీసుకునేవారు ఒకదానిలో ఒకటి ఇమిడి ఉండే వృత్తాలను చిత్రించి ఉన్న బొమ్మలను లక్ష్యంగా చేసుకుని శిక్షణ పొందుతారు. ఆర్చరీ శిక్షణ కూడా అదే విధంగా లక్ష్యాలను ఎంచుకుని శిక్షణ ఇస్తారు.
కానీ తాలిబాన్ మాత్రం తన స్వభావానికి తగినట్లుగా శిక్షణలో సైతం సున్నితమైన పూలను లక్ష్యంగా ఎంచుకుంటారని సంకేతాత్మకంగా కార్టూనిస్టు చూపారు. సున్నితమైన పూలను లక్ష్యం చేసుకుని శిక్షణ పొందినవారే, అభం శుభం తెలియని చిన్నారులను మూకుమ్మడిగా కరకు తుపాకి గుళ్ళకు బలి చేయగలరని ఈ కార్టూన్ సూచిస్తోంది.