వేల కోట్ల నౌకా విధ్వంసక వ్యాపారం -ఫోటోలు


ఎంత భారీ నిర్మాణానికయినా ఏదో ఒక నాడు కాలం తీరిపోక తప్పదు. రాబట్టుకోదగిన విలువను అంతటినీ రాబట్టుకున్నాక గాని పెద్ద పెద్ద నిర్మాణాలను మనుషులు వదిలి పెట్టరు. ఇలా కాలం తీరిపోయిన భారీ నౌకలు, భవనాలు, కర్మాగారాలు.. మొదలయిన మౌలిక నిర్మాణాలను ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం రీ సైక్లింగ్!

పర్యావరణం గురించిన స్పృహ పెరిగాక వాడిన వస్తువులను రీ సైక్లింగ్ చేసి మరో కొత్త వస్తువు తయారు చేయడం మనిషి పారంభించాడు. రీ సైక్లింగ్ చేయడానికి ముందు నిర్వర్తించవలసిన అత్యంత కష్టమైన పని మరొకటి ఉంటుంది. అదే విధ్వంసం. ఇంట్లో వాడుకునే చిన్న చిన్న వస్తువులైతే తీసుకెళ్లి చెత్త కుండీలోనో, దిబ్బలోనో వేసేస్తాము. విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలైతే వాడినాక ఎలాగంటే అలాగ పారవేయొద్దని, తగు విధంగా జాగ్రత్తలు తీసుకుని పారవేయాలని సూచనలు కూడా ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు.

అత్యంత భారీ సరుకుల్లో నౌకలు, బస్సులు, రైళ్లు, ట్రక్కులు… ఇలాంటివి వస్తాయి. వీటిలో నౌకలు అన్నింటికి మించిన సైజుల్లో తయారు చేస్తున్నారు. యుద్ధ వాహక నౌకలతో పాటు వేల సంఖ్యలో ప్రయాణీకుల్ని మోసుకుపోయే భారీ విహార యాత్ర నౌకలను కూడా కంపెనీలు తయారు చేస్తున్నాయి. నీటిలో తప్ప పనికిరాని నౌకల కాలం తీరిపోయాక ఏం చేస్తారని ఏదో ఒకనాడు మనం అనుకుంటాము. ఈ అనుమానానికి సమాధానమే కింది ఫోటోలు.

ఆకాశ హర్మ్యాలను సైతం క్షణాల్లో ఉన్న చోటనే కూల్చివేయగల ‘డిమాలిషన్ టెక్నాలజీ’ పశ్చిమ దేశాల్లో విస్తృతంగా వాడుకలో ఉంది. ఇటువంటి టెక్నాలజీ ద్వారానే సో కాల్డ్ 9/11 టెర్రరిస్టు దాడుల్లో కూలిపోయాయని చెప్పిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను కూల్చివేశారని, పశ్చిమ పత్రికలు, అమెరికా ప్రభుత్వము చెప్పినట్లుగా విమానాలు ఢీ కొట్టడం ద్వారా కాదని ఇప్పుడు పలు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రోజు అసలు విమానాలు ఏవీ WTC టవర్లను ఢీ కొట్టలేదని, కంట్రోల్డ్ డిమాలిషన్ ద్వారా వాటిని కూల్చివేశారని చెబుతూ మాజీ సి.ఐ.ఏ గూఢచారి ఒకరు అమెరికా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ ను నిర్ణీత సమయం లోగా తగిన ప్రతి వాదనలతో సవాలు చేయకపోతే ఆ సి.ఐ.ఏ ఉద్యోగి చెప్పిందే అఫిడవిట్ ద్వారా వాస్తవంగా మారుతుంది.

భారీ నౌకలు డిమాలిషన్ టెక్నాలజీతో కూల్చివేయగలవి కావు. అలా చేస్తే నౌకలోని భాగాలు బహుశా పునర్వినియోగానికి పనికిరాక పోవచ్చు. నౌకా విధ్వంసక కంపెనీల ప్రధాన వ్యాపారం కాలం తీరిన పాత నౌకలను కొనుగోలు చేసి అందులోని వివిధ విడి భాగాలను పునర్వినియోగానికి పనికి వచ్చేలా ధ్వంసం చేసి అమ్ముకోవడం. నౌకా విధ్వంసంలో వర్కర్లు ఒక పద్ధతి ప్రకారం విధ్వంసం చేయాల్సి ఉంటుంది. తద్వారా నౌకా తయారీలో వినియోగించే కలప, ఇనుము, ఆస్ బెస్టాస్ తదితర విడి భాగాలు రీ సైక్లింగ్ కి అనువుగా విడదీస్తారు.

ఆధునిక నౌకల హల్ (నీరు చొరబడడానికి వీలు లేని కింది భాగం) లను ఇప్పుడు ప్రధానంగా ఉక్కుతో తయారు చేస్తున్నారు. ఈ నౌకలను దశాబ్దాల తరబడి వాడుకునే విధంగా తయారు చేస్తున్నప్పటికీ కాలం గడిచే కొద్దీ రిపేర్లు కూడా ఎక్కువ వస్తాయి. కొన్నాళ్ళకి రిపేర్లు చేయడం కూడా వృధా ఖర్చుగా తయారయ్యే పరిస్ధితి వస్తుంది. అనగా ఇక రిపేర్లు చేసినా, ఆ తర్వాత వచ్చే ఆదాయం రిపేర్ల ఖర్చు కంటే తక్కువగా ఉండదు. అనగా ఆర్ధికంగా లాభదాయకంగా ఉండదు. ఆ దశలో నౌకలను కొనుగోలు చేసే కంపెనీలు ఇప్పుడు అనేకం ఉన్నాయి.

నౌకా విధ్వంసక ప్రక్రియ ఎక్కువగా దక్షిణాసియాలోనే జరుగుతుందని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా… ఈ నాలుగు దేశాలలోనే నౌకా విధ్వంసక కంపెనీలు కేంద్రీకృతం అయి ఉన్నాయి. ప్రపంచంలోని నౌకా విధ్వంసక పరిశ్రమల్లో 90 శాతం ఈ నాలుగు దేశాల్లోనే ఉన్నాయని ఒక అంచనా. ఈ దేశాల్లో మానవ శ్రమ అత్యంత చౌకగా లభిస్తుంది గనకనే ఎక్కడెక్కడి కంపెనీలు ఇక్కడికి వచ్చి షాపులు తెరిచాయి. నౌకా విధ్వంసం కేపిటల్-ఇన్సెంటివ్’ కాదు, ‘లేబర్-ఇన్సెంటివ్’. అదీకాక ఇక్కడ పర్యావరణ చట్టాలు బలంగా లేవు. ఉక్కుకు డిమాండ్ కూడా చాలా ఎక్కువ. అందువలన దక్షిణాసియా తీరాలు నౌకాల విధ్వంసానికి ఆకర్షణ అయ్యాయి.

నౌకా విధ్వంసంలో కొన్ని దశలు ప్రమాదంతో కూడుకుని ఉంటాయి. ఆజ్ బెస్టాస్, భార లోహాలు నౌకలకు వినియోగిస్తారు. సుత్తులు, బ్లో టార్చ్ లను వినియోగించి నౌకలను పగల గొట్టే సమయంలో మనిషి ఆరోగ్యానికి హానికరమైన వాయువులు వెలువడతాయి. పర్యావరణానికి కూడా హానీ చేసే ప్రక్రియ నౌకా విధ్వంసంలో ఇమిడి ఉంటుంది. బ్లో టార్చ్ లతో శక్తివంత మైన ఉక్కు పలకలను కోస్తూ, భారీ సుత్తులతో మోదుతూ నౌకలను దశల వారీగా విడదీస్తారు.  తిరిగి ఉపయోగ పెట్టగల భాగాలను ప్రతి ఒక్కటి వేరు చేసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

పాకిస్తాన్ లోని గద్దాని రేవులో వందకు పైగా షిప్ బ్రేకింగ్ కంపెనీలు పని చేస్తున్నాయి. ఈ కంపెనీల్లో వెల్డింగ్, క్లీనింగ్, క్రేన్ ఆపరేటింగ్, సూపర్ వైజింగ్ పనుల నిమిత్తం 10,000 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఇండియా, బంగ్లాడేస్ లతో పోటీ పడేంత భారీ కార్యకలాపాలు ఇక్కడ నడుస్తాయి. 40,000 టన్నుల బరువు ఉండే మధ్య సైజు నౌకను ధ్వంసం చేయడానికి 50 మంది కార్మికులు 3 నెలలు కృషి చేస్తారు. పాకిస్తాన్ ఉక్కు అవసరాలను ప్రధానంగా ఈ షిప్ బ్రేకింగ్ పరిశ్రమే తీర్చుతుందని తెలుస్తోంది.

బంగ్లాడేస్ కూడా తన ఉక్కు అవసరాలను ఎక్కువగా షిప్ బ్రేకింగ్ ద్వారా తీర్చుకుంటోంది. అక్కడ చిట్టగాంగ్ లో ఉన్న షిప్ బ్రేకింగ్ యూనిట్ ప్రపంచంలో అత్యధిక కలుషిత షిప్ యార్డ్ గా పేరు పొందింది. ఇక్కడ ప్రమాదాలు, గాయాలబారిన పడడం కూడా ఎక్కువేనని తెలుస్తోంది. ఇండియాలో గుజరాత్ లోని అలాంగ్, ముంబై (మహా రాష్ట్ర), విశాఖ పట్నం (ఆంధ్ర ప్రదేశ్) లలో షిప్ బ్రేకింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి.

షిప్ బ్రేకింగ్ లో పని చేసే కార్మికులకు అతి తక్కువ వేతనాలు (నెలకు 300 డాలర్లు లేదా రు. 18,000/-) ఇస్తారు. పైగా ఆరోగ్యానికి హానికరం. ఈ కారణాల వల్ల షిప్ బ్రేకింగ్ కార్యకలాపాలను ఈ దేశాల నుండి తరలించాలని పర్యావరణ ఉద్యమకారులు డిమాండ్ చేస్తారు. కానీ ఈ ఉద్యమాలను సైతం కంపెనీలు పోషించే ఎన్.జి.ఓ లే నిర్వహించడం వల్ల కార్మికులకు న్యాయం జరిగే అవకాశం లేకుండా పోతోంది.

ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s