మరో వైట్ పోలీసు ఆధిపత్యం, మరో నల్లజాతి పౌరుడి హత్య, చివరికి మరో గ్రాండ్ జ్యూరీ గుడ్డి తీర్పు!
గత జులైలో డ్రగ్స్ అమ్ముతున్నాడని అనుమానంతో పోలీసులు ఓ నల్లజాతి పౌరుడిని అదుపులోకి తీసుకోవాలని భావించారు. అతడి గొంతు చుట్టూ చేయి బిగించి పట్టుకుని బరబరా పోలీసు వ్యాన్ దగ్గరికి ఈడ్చుకెళ్లారు. మరో ముగ్గురు, నలుగురు పోలీసులు గొంతు బిగించిన పోలీసుకు సహకరించారు. ఈడ్చుతున్నప్పుడే ఆ బాధితుడు అరుస్తూనే ఉన్నాడు, ‘నాకు ఊపిరి అందడం లేదు’ అని. వ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళేసరికి ఆ బాధితుడు చనిపోయాడు.
ఈ కధనంలో గ్రాండ్ జ్యూరీకి అనుమానాలు తలెత్తడానికి అవకాశమే లేదు. నిజంగా గొంతు బిగించాడా? అందుకు సాక్షులు ఎవరు? సాక్ష్యాలు నమ్మశక్యమేనా? అన్న ప్రశ్నలకు ఈ కేసులో తావు లేదు. ఎందుకంటే మరో పౌరుడు ఈ దురాగతాన్ని చక్కగా వీడియో తీశాడు. ‘నాకు ఊపిరి ఆడడం లేదు’ అన్న బాధితుడు అరుపులు వీడియోలో పదే పదే వినిపించాయి. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు కూడా గొంతు, ఛాతీ బిగించడం వల్ల చనిపోయాడని స్పష్టం చేశారు. అయినాసరే, గ్రాండ్ జ్యూరీ ‘తెల్ల’ పోలీసుపై కేసు మోపేందుకు అవకాశం లేదని తీర్పు ఇచ్చేసింది.
ఆ నల్ల బాధితుడి పేరు ఎరిక్ గార్నర్. తెల్ల పోలీసు పేరు డేనియల్ పాంటాలియో. రాజ్య హత్య జరిగింది న్యూయార్క్ మహా నగరంలో.
ఆగస్టు నెలలో జరిగిన ఫెర్గూసన్ (మిస్సోరీ రాష్ట్రం) ఘటనలో వీడియో సాక్ష్యం లేదు. నల్లజాతి టీనేజర్ మైఖేల్ బ్రౌన్ మరో మిత్రుడితో కలిసి రోడ్డు మధ్యలో నడుస్తున్నందుకు పక్కకు వెళ్లాలని పోలీసులు ఆజ్ఞాపించారు. అందుకు బ్రౌన్ త్వరగా స్పందించలేదు. వాదన జరిగింది. తిట్టుకున్నారు. తెల్ల పోలీసు తుపాకి తీశాడు. నల్ల పౌరుడు లొంగిపోతున్నట్లు చేతులు ఎత్తి పెట్టి మోకాళ్ళ మీద కూర్చుంటూ కిందకు వంగాడు. ఈ లోపే తెల్ల తుపాకి పేలింది. ఒకసారి కాదు తొమ్మిదిసార్లు. బ్రౌన్ కుప్పకులాడు. ఈ కేసు విచారించిన గ్రాండ్ జ్యూరీ తెల్ల పోలీసు పైన కేసు మోపేందుకు (శిక్షించడానికి కాదు) తగిన సాక్ష్యం లేదని తీర్పు చెప్పేసింది. ఆ జ్యూరీ సభ్యుల్లో 75 శాతం తెల్ల సభ్యులే. ఫెర్గూసన్ పోలీసుల్లోనూ 75 శాతం తెల్లవారే. కానీ ఫెర్గూసన్ లో 75 శాతం నల్ల ప్రజలే.
ఎరిక్ గార్నర్ కేసులో గ్రాండ్ జ్యూరీ తీర్పుకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు మళ్ళీ వీధుల్లో కదం తొక్కుతున్నారు. రెండు రోజులుగా అమెరికాలో అనేక నగరాల్లో ప్రజలు ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బ్రౌన్ హత్య తీర్పుపై ఎగసిపడిన నిరసన జ్వాలలను స్ఫురింపజేస్తూ తెల్ల, నల్ల జాతి ప్రజలు ఇరువురూ ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
న్యూయార్క్ నగరంలో ట్రాఫిక్ ను స్తంభింపజేసేందుకు ప్రదర్శకులు వినూత్న మార్గం ఎంచుకున్నారు. రోడ్డుపై ఉండే కార్లు, ట్రక్కులు తదితర వాహనాల మధ్య నడుస్తూ ప్రదర్శన చేస్తూ ట్రాఫిక్ ను కూడా తమ ఆందోళనలో భాగం కావించారు. దారి మధ్యలో మరింత మంది ఆందోళనకారులను కలుపుకుంటూ, దిశలు మార్చుతూ, విడిపోతూ, మళ్ళీ కలిసిపోతూ ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. వరుసగా రెండు రోజులు, రెండు రాత్రుల పాటు ప్రదర్శనలు కొనసాగాయి.
ప్రఖ్యాతి చెందిన టైమ్స్ స్క్వేర్ లో అర్ధరాత్రి సమయానికి 3,000 మంది ఆందోళనలో మిగిలారు. సెవెన్త్ ఎవెన్యూలో అత్యంత రద్దీగా ఉండే 42వ రోడ్డు క్రాసింగ్ లో నిలబడి పోలీసులను ఉద్దేశిస్తూ “మీరు కాపాడేది ఎవరిని?” అని నినాదాలు ఇచ్చారు. పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి వారిని తోసుకుంటూ, నెట్టుకుంటూ రోడ్డు పక్కలకు జరిపారని రాయిటర్స్ పత్రిక తెలిపింది. పదుల సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసినవారి సంఖ్య చెప్పడానికి పోలీసులు నిరాకరించారు.
మన్ హట్టన్ లో కొన్ని వందల మంది చేరి ఆందోళనకారులు ధర్నా నిర్వహించారు. అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో కొందరు తప్పుకోగా మిగిలినవారు అరెస్టు అయ్యారు. మన్ హట్టన్, బ్రూక్లిన్ వంతెనల మధ్య కూడా ట్రాఫిక్ స్తంభింపజేశారు. వీరిలోనూ అనేకమంది అరెస్టు అయ్యారు. కొద్ది మంది పోలీసులతో తలపడ్డారు. తాము హింసకు పాల్పడడం లేదని పోలీసులకు అరుస్తూ చెప్పారు. ప్రదర్శకుల్లో కొందరు ఎరిక్ గార్నర్ మరణానంతర క్షణాలను తలపిస్తూ రోడ్డుపై చచ్చిపడిపోయినట్లు నటించారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి. లోనూ ఆందోళనలు చెలరేగాయి. న్యాయం లేనిదే శాంతి లేదని, జాత్యహంకార పోలీసులను తొలగించాలని నినాదాలు ఇచ్చారు. మిన్నెయాపులిస్, చికాగో నగరాల్లోనూ ఆందోళనలు జరిగాయి. ఒక్లాండ్, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్ సిస్కో నగరాల్లో ట్రాఫిక్ ను స్తంభింపజేసే ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు ట్రాఫిక్ ను ఇతర రూట్లలోకి మళ్లించారని పత్రికలు తెలిపాయి.
ఎరిక్ గార్నర్ గొంతు బిగించి చంపిన పోలీసు డేనియల్ పైన పోలీసు శాఖ అంతర్గత చర్యలు తీసుకోవచ్చని పత్రికలు ఊహాగానాలు చేస్తున్నాయి. నేరస్ధులను అదుపులోకి తీసుకునేప్పుడు గొంతు చుట్టూ చేతులు బిగించకుండా జాగ్రత్త వహించాలని పోలీసు మాన్యువల్ సూత్రాలు నిర్దేశిస్తున్నాయి. కానీ కొన్ని అత్యవసర పరిస్ధితుల్లో గొంతు బిగించే పరిస్ధితి రావచ్చని అనిర్ధిష్టంగా సూత్రాలు పేర్కొన్నాయని ఇది పోలీసులకు కలిసి వచ్చిందని కొన్ని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి.
కానీ ఇక్కడ అసలు విషయం గొంతు బిగించడం కాదు. గొంతు బిగించడం అనుమతించవచ్చా లేదా అన్నది సమస్య కాదు. కేసు పెట్టే అవకాశం లేదని గ్రాండ్ జ్యూరీ నిర్ధారించాక డిపార్టుమెంటల్ చర్య మాత్రం ఎలా సాధ్యం అవుతుంది? గ్రాండ్ జ్యూరీకి, డిపార్టుమెంటల్ చర్యకు తేడా ఎందుకు?
ఎందుకంటే గ్రాండ్ జ్యూరీ అన్నది రాజ్యం యొక్క ప్రధాన అంగం. అది దేశవ్యాపితంగా ఉదాహరణలుగా నిలిచే తీర్పులు ఇవ్వగలదు. ఈ అంశాన్ని మరోలా చెప్పాలంటే ఒక గ్రాండ్ జ్యూరీ ఇచ్చిన తీర్పు దేశంలోని ఇతర జ్యూరీలు ఆదర్శంగా, ప్రిసిడెంట్ గా తీసుకునే అవకాశం ఉంది. కనుక న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ పోలీసుపై కేసు పెట్టవచ్చని తీర్పు ఇస్తే అది ప్రజల ఆందోళనలను అణచివేయడానికి రాజ్యం ప్రయోగించే పోలీసు బలగాన్ని బలహీనపరచడం అవుతుంది. పోలీసు అధికారాన్ని బలహీనపరిస్తే రాజ్య వ్యతిరేక ప్రజల ఆగ్రహాన్ని అణచివేయడం రాజ్యానికి ఎంతో కొంత శక్తి తగ్గుతుంది. అలా కాకుండా డిపార్ట్ మెంటల్ చర్య పేరుతో పోలీసుపై చర్య తీసుకుంటే అది అక్కడితో ఆగిపోతుంది. పైగా పోలీసు డిపార్టుమెంట్ లోని స్వయం సూత్రాలను ఎప్పుడైనా మార్చుకోవచ్చు. గ్రాండ్ జ్యూరీ తీర్పు మాత్రం శాశ్వతంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది.
మైఖేల్ బ్రౌన్ కేసులో కూడా పోలీసుపై కేసు పెట్టే అవకాశం లేదని గ్రాండ్ జ్యూరీ నుండి తీర్పు వచ్చాక నిందిత పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. బహుశా సరిపడా ఫలితాన్ని ఆయనకు ఇచ్చి ఉండవచ్చు. ఇది పైకి కనపడడానికి నల్ల-తెల్ల జాతి వివక్షగా కనపడుతుంది. ఆ వివక్ష ఉంది కూడా. కానీ అంతకంటే ముఖ్యంగా ఇది రాజ్యానికి, ప్రజలకు మధ్య తగాదా. ఈ తగాదాలో ఎప్పుడూ రాజ్యమే గెలవాలన్నది పాలకవర్గాలు ఏర్పరుచుకునే సూత్రం. ఈ సూత్రం అంతిమంగా ప్రజల న్యాయమైన ఆందోళనలను అణచివేసేందుకు ఉద్దేశించినది మాత్రమే.