మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బి.జె.పిపై శివ సేన చేసిన దాడి అంతా ఇంతా కాదు. ఇక రెండు పార్టీల స్నేహానికి తెరపడినట్లే అన్నంతగా శివసేన దాడి చేసింది. బి.జె.పి మాత్రం వ్యూహాత్మకంగా ‘ధాకరే పైన మాకు ఎనలేని గౌరవం. అందుకే మేము శివసేనను పల్లెత్తు మాట అనం” అంటూ ప్రతి విమర్శకు పూనుకోలేదు.
ఎన్నికల ఫలితాలు వచ్చాక గాని శివ సేన దాడి అసలు స్వరూపం ఏమిటో వ్యక్తం కాలేదు. ఫలితాలు వెలువడుతున్న కాలంలో ఎన్నికల ముందరి వాడినే కొనసాగిస్తున్నట్లుగా శివసేన కనిపించింది. కానీ ఈసారి బి.జె.పి గమ్మున ఊరుకోలేదు. మాటకు మాట జవాబు ఇవ్వడం మొదలు పెట్టింది. బి.జె.పి ప్రతి జవాబులో వాడి పెరిగే కొద్దీ శివసేన విమర్శలో వాడి తగ్గుతూ వచ్చింది. చివరికి మేము సహజ స్నేహితులం అని ప్రకటించుకునే దగ్గరకు వచ్చింది.
ఏమిటి దీనర్ధం? ఈ బ్లాగ్ లో వివిధ సందర్భాల్లో మళ్ళీ మళ్ళీ చెప్పినట్లుగా పాలక వర్గాలు ఎన్నటికీ ప్రజల ప్రయోజనాలకు ప్రతినిధులు కారు. వారు కేవలం తమ ధనిక వర్గ ప్రయోజనాలకు మాత్రమే ప్రతినిధులు. అయితే ధనిక వర్గంలో వివిధ గ్రూపుల మధ్య వైరుధ్యాలు తలెత్తడం సహజం. ఈ వైరుధ్యాలే వివిధ రాజకీయ పార్టీలుగా రూపం ధరిస్తాయి.
ఆర్ధిక వ్యవస్ధలో వాటాల పంపిణీకి తమలో తాము స్నేహపూర్వకంగా ఒక ఒప్పందానికి వచ్చారా సరే సరి. లేకపోతే ఆ వైరుధ్యాలు తీవ్ర రూపం ధరిస్తాయి. అటువంటి తీవ్ర దశలో ఒకానొక పాయింట్ దగ్గర తమ తగవులు తీర్చాలంటూ జనం దగ్గరికి వస్తాయి. అవే ప్రజాస్వామ్యంగా వారు చెప్పే ఎన్నికలు!
బి.జె.పి తదితర హిందూత్వ పార్టీలది ఒక రాజకీయ స్రవంతి. అది రాజకీయంగా మితవాద (right) స్రవంతిగా గుర్తించబడుతోంది. కాంగ్రెస్ తదితర పార్టీలది మధ్యేవాద రాజకీయ స్రవంతి. చారిత్రకంగా, కాంగ్రెస్ పార్టీ మధ్యేవాద స్రవంతిలోనూ ఎడమ వైపు రాజకీయ భావాలకు ప్రతినిధిగా ఉంటూ వచ్చింది. ఈ స్రవంతిని ఆంగ్లంలో Left of the Centre అంటారు. ఇక సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలది వామపక్ష (Left) స్రవంతి. వామపక్ష స్రవంతి లోనూ వివిధ స్రవంతులు ఉన్నాయి. వామపక్షంలో కుడివైపు (Right of the Left) ఈ పార్టీలు ఉంటే మావోయిస్టు పార్టీ (Extreme Left) ఎడమవైపు ఉంటుంది. మధ్యలో న్యూ డెమోక్రసీ, జనశక్తి తదితర పార్టీలు ఉన్నాయని చెప్పవచ్చు.
కనుక మితవాద స్రవంతిని వ్యక్తం చేసే పార్టీలు ఒక గూటి పక్షులు అవుతాయి. ఆ విధంగా శివసేన, బి.జె.పి తదితర పార్టీలు సహజ మిత్రులు. మహా రాష్ట్రలో ఈ రెండు పార్టీల మధ్య ముఖ్యమంత్రి పదవి విషయంలో వివాదం/వైరుధ్యం వచ్చింది. ఈ వివాదం సామరస్యంగా పరిష్కారం కాలేదు. ఇరు పార్టీలు ఎవరికి వారే తమకు ఎక్కువ బలం ఉందని భావించాయి. దానితో అవి జనం వద్దకు వెళ్ళి తగువు పరిష్కారాన్ని కోరాలనుకున్నాయి. ‘శివసేనను పల్లెత్తు మాట అనం’ అని చెబుతూ భవిష్యత్తులో ఆ పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలను అట్టే పెట్టుకునే బాధ్యత బి.జె.పి నెత్తికి ఎత్తుకుంది.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బి.జె.పికే బలం ఎక్కువ అని రుజువైంది. ఇక శివసేన మాట్లాడ్డానికి లేదు. ఇంకా మాట్లాడితే ఎన్.సి.పి బేషరతు మద్దతు ఉండనే ఉంది. ఆ విధంగా శివసేనను బి.జె.పి దారికి తెచ్చుకుంది. ఖచ్చితంగా చెప్పాలంటే బి.జె.పి-శివసేనలు ప్రజల ముందు ఒక నాటకం ఆడాయి. హిందూత్వ పంధాను బి.జె.పి వీడుతోందని ఆరోపిస్తూ శివసేన ఓట్లు అడిగితే, బాల్ ధాకరే పై గౌరవ ప్రకటన ద్వారా తాను హిందూత్వకు కట్టుబడి ఉన్నానని బి.జె.పి చెప్పుకుంది.
జనం అంతా ఈ వాదనకు ఆకర్షితులు కారు. హిందూత్వ ఓటు బ్యాంకును గెలుచుకోవడానికి ఈ నాటకం ప్రదర్శితం అయింది. మిగిలిన ఓటర్లకు హిందూత్వతో పని లేదు. నిజానికి వారి సంఖ్యే ఎక్కువ. వారికి మూడు పర్యాయాలు పాలించి తమ జీవితాలను కష్టాల పాలుచేసిన కాంగ్రెస్ పై పీకల వరకూ కోపం. ఆ కోపాన్ని బి.జె.పి-శివసేనలకు ఓట్లు వేయడం ద్వారా తీర్చుకున్నారు. కోపం తీర్చుకునేందుకు వారికి అంతకంటే మించిన మార్గం ప్రస్తుత రాజకీయార్ధిక వ్యవస్ధ ఇవ్వదు మరి. ఐదేళ్ల నాటికి కాంగ్రెస్ తగిన విధంగా పుంజుకుంటే/జనాన్ని ఆకర్షించే ఎత్తులు వేస్తే ఈ జనం మళ్ళీ కాంగ్రెస్ వైపు మొగ్గుతారు. (మరో మార్గం వారికి ఈ వ్యవస్ధ ఇవ్వదు మరి) లేదంటే చచ్చినట్లు మళ్ళీ బి.జె.పి కూటమికే ఓటు వేస్తారు.
జనం ఇలా తమ మీద బలవంతంగా రుద్దబడిన (అ)రాజకీయ వ్యవస్ధలో అప్పటికి మెరుగ్గా కనిపించే పార్టీకి ఓట్లు వేస్తూ ‘ఏ రాయయితేనేం….’ అనుకుంటూ ఆశ, నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఉంటారు. The last always belongs to affluent people, irrespective of their political allegiance.
గబ్బర్ సింగ్ సినామాలోనో ఇంకో సినిమాలోనో ఒక డైలాగ్ ఉంటుంది. రావుగోపాలరావు గారి తనయుడి పాత్ర ఒక సారి హీరోతో అనేమాట ఇది: “ఎన్నికలు అయ్యేదాకనే ఈ పార్టీల తేడా. ఆ తర్వాత అందరూ ఒకటే.” అందరూ అంటే ఇక్కడ ఎన్నికల్లో వివిధ పార్టీల పేరుతో జనం దగ్గరకు వెళ్ళే ధనికవర్గాలు. బి.జె.పి, శివసేన, ఎన్.సి.పి, కాంగ్రెస్, ఎస్.పి, బి.ఎస్.పి…. ఇలా అనేకానేక పార్టీలన్నీ ఇంతే.