అస్పృశ్యత ఇప్పుడు భారత దేశంలో అసలే లేదని కాదుగానీ, ‘మొలకు ముంత, వీపుకి తాటాకు’ కట్టుకుంటే తప్ప పంచముడిని బైటికి రానీయని గుప్తుల ‘స్వర్ణ యుగం’లో దళితుడి జీవితం ఎలా ఉండేది? ఈ అనుమానం ఎవరికైనా వస్తే పశ్చిమాఫ్రికా దేశాలలో ఎబోలా వ్యాధి పీడితుల బతుకులు గమనిస్తే ఒకింత అవగాహన రావచ్చు.
ఎబోలా సోకినట్లు అనుమానం వచ్చిందా, ఇక ఆ వ్యక్తి చెంతకు ఎవరూ రారు. వారిని ఎవరూ తాకరు. వారి శరీరాన్ని మాత్రమే కాదు, వారి వస్తువులను కూడా ఎవరూ తాకడానికి వీలు లేదు. వారి చెప్పులు, దుస్తులు, వారు వాడిన వస్తువులు… ఏవీ తాకడానికి వీలు లేదు. ఎబోలా సోకినట్లు అనుమానం వచ్చిన ఓ వ్యక్తి చెప్పులను ఎవరూ తాకాకుండా చెప్పుల చుట్టూ రోడ్డుపై రాళ్ళు ఉంచిన దృశ్యాన్ని కింద ఓ ఫోటోలో చూడవచ్చు.
ఎబోలా రోగి ఎంత పసివారైనా సరే, వారి తల్లిదండ్రులు కూడా వారిని ఎత్తుకోరు. ఒంటినిండా రక్షణ దుస్తులు ధరించిన నర్సులు మాత్రమే వారిని చేరి ఎత్తుకుని ఆసుపత్రిలో చేర్చాలి. ఎబోలా సోకినవారి ఇల్లు కూడా అంటరానిది అయిపోతుంది. ఆరోగ్య కార్యకర్తలు కట్టుదిట్టమైన రక్షణల మధ్య ఆ ఇంటిలో ప్రవేశించి ‘శుచి’ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఎబోలా సోకితే ఆ వ్యక్తి పిల్లలు, ఇతర దగ్గరి బంధువులను కూడా అనుమానితులుగా చూస్తారు. వారిని వ్యాధి నిరోధక శిబిరంలో చేర్చి కొన్ని రోజుల పాటు ఇతర ప్రజలకు దూరంగా ఉంచుతారు. వారికి వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించిన తర్వాతనే ఇతరులతో కలవడానికి అనుమతిస్తారు.
ఎబోలా రోగి చనిపోతే ఆ వ్యక్తి శవం కూడా అంటరానిదే. సహజంగా జరిగే అంత్యక్రియలు వారికి జరగవు. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు పూర్తి స్ధాయి రక్షణలు ధరించి వారిని పూడ్చడం చేస్తారు.
ఇన్ని జాగ్రత్తలు అనుసరిస్తున్నా, ప్రజలు క్రైస్తవ ప్రార్ధనలపై ఆధారపడడం మానలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే వైద్యులు పని చేసే పశ్చిమ స్వచ్ఛంద సంస్ధలే ఈ ప్రార్ధనలను ప్రోత్సహించడం. సామూహిక ప్రార్ధనలు నిర్వహిస్తూ ‘బై బై ఎబోలా’ పేరుతో ఒక ప్రార్ధనా ప్రచారాన్ని కూడా ఆ సంస్ధలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఒక స్పానిష్ క్రైస్తవ బోధకుడికి, ఒక అమెరికన్ సిస్టర్ కీ ఎబోలా సోకింది. వారిని హుటాహుటిన అత్యంత భద్రతల మధ్య తమ దేశాలకు తెప్పించుకుని చికిత్స అందిస్తున్నాయి. అనగా దైవ ప్రార్ధనలే ఎబోలా వ్యాధి స్పెయిన్, అమెరికాలకు చేరడానికి కారణం అయిన విపత్కర పరిణామం!
ఇవన్నీ తెలుసుకున్నాక “పగవారికి కూడా వద్దు ఈ ఎబోలా బ్రతుకు!” అనిపించక మానదు.
ఎబోలా! ఆఫ్రికా దేశాలను నిద్రలో కూడా భయపెడుతున్న ఆధునిక దెయ్యంగా అవతరించిన మహా రాక్షసి. అది ఎలా వ్యాపిస్తుందో కూడా ఇంతవరకు మనిషికి అంతుబట్టలేదు. ఎబోలా సోకిన జీవులను తాకినా, వారి వస్తువులను తాకినా వ్యాధి సోకుతుందని ఇప్పటివరకు భావిస్తున్నారు.
కానీ గాలి ద్వారా కూడా వ్యాధి సోకుతోందని, కానీ ఈ అంశాన్ని అధికారికంగా అంగీకరించడానికి వెనుకంజ వేస్తున్నారని విమర్శకులు విమర్శిస్తున్నారు. ఫలితంగా ఎబోలా కేసులు ‘ఇంతై… వటుడింతింతై…’ అన్నట్లుగా వేగంగా వ్యాపిస్తోందని వారు ఎత్తి చూపుతున్నారు.
ఎబోలా వల్ల ఇప్పటి వరకు 3400 మందికి పైగా మరణించారని ఐరాస లెక్కలు చెబుతున్నాయి. అంతకు రెట్టింపు మంది వ్యాధి పీడితులుగా చికిత్స పొందుతున్నారు. ఎబోలా ఫలితంగా ఆఫ్రికా దేశాలు వచ్చే యేడు 32 బిలియన్ డాలర్లు నష్టపోనున్నాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది.
ఎబోలా త్వరలో ఇండియాలో ప్రవేశించడానికి, ప్రవేశించాక అత్యంత వేగంగా విస్తరించడానికీ భారీ అవకాశాలు ఉన్నాయని ఐరాస నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం ఏయే జాగ్రత్తలు తీసుకుందో ఇంతవరకూ తెలియదు. ఏ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే వేగంగా విస్తరిస్తుందని ఐరాస అభిప్రాయం.
our central government is not declaring any measures to create confidence among Indians.
అనగా దైవ ప్రార్ధనలే ఎబోలా వ్యాధి స్పెయిన్, అమెరికాలకు చేరడానికి కారణం అయిన విపత్కర పరిణామం! – ultimate analysis sekhar garu