చమురు ధరల యుద్ధంలో సౌదీ అరేబియా, అమెరికా?


Oil politics

అమెరికాలో షేల్ చమురు ఉత్పత్తి పెరిగేకొద్దీ ప్రపంచ చమురు మార్కెట్ లో సౌదీ అరేబియా, అమెరికాల మధ్య చమురు యుద్ధం తీవ్రం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

మధ్య ప్రాచ్యంలో సిరియా కిరాయి తిరుగుబాటు, సో కాల్డ్ ఇస్లామిక్ స్టేట్ విస్తరణల ఫలితంగా చమురు ధరలు నానాటికీ పడిపోతున్నాయి. చమురు ధరలను తిరిగి యధాస్ధితికి తేవడానికి సౌదీ అరేబియా తన ఉత్పత్తుల్లో కోత పెట్టవచ్చనీ తద్వారా సరఫరా తగ్గించి ధరలు పెరగడానికి దోహదం చేయవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తూ వచ్చాయి.

అయితే సౌదీ అరేబియాకు తమ ఉత్పత్తిని తగ్గించే యోచన ఏదీ లేదని, అమెరికా షేల్ చమురు, గ్యాస్ ల నుండి ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడమే సౌదీకి ఇప్పుడు ప్రధాన లక్ష్యం అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

OPEC దేశాల్లో అత్యధిక మొత్తంలో చమురు ఉత్పత్తి దేశం సౌదీ అరేబియా. OPEC దేశాల మొత్తం ఉత్పత్తిలో మూడో వంతు సౌదీ ఉత్పత్తి చేస్తోంది. ఇది రోజుకు 9.7 మిలియన్ బ్యారెళ్ళకు సమానం. చమురు ధరలు తగ్గితే ఆ సంక్షోభం తాకేది మొదట సౌదీ అరేబియా దేశాన్నే. కనుక గత నాలుగు నెలలుగా దిగజారుతున్న చమురు ధరలను పెంచడానికి సౌదీ అరేబియా తన ఉత్పత్తిని తగ్గించుకోవచ్చని ఇతర OPEC దేశాలు కూడా దానిని అనుసరించవచ్చని మార్కెట్ వర్గాలు భావించాయి.

ఈ మేరకు OPEC సభ్య దేశం వెనిజులా, ఉత్పత్తి తగ్గించాలని ఇతర సభ్య దేశాలను బహిరంగంగానే కోరుతోంది. తాము తోటి చమురు ఉత్పత్తి దేశాలతో (చమురు) ధరల యుద్ధాన్ని కోరుకోవడం లేదని, చమురు మార్కెట్ స్ధిరంగా ఉండాలంటే సరైన నిర్ణయం తీసుకోవాలని వెనిజులా కోరింది.

అయితే సౌదీ అరేబియా ప్రస్తుతానికి తొందరపడడం లేదు. ఇటీవల కాలంలో సౌదీ ప్రతినిధులు న్యూయార్క్ నగరంలో అనధికారిక చర్చల్లో పాగోన్నారని, ఉత్పత్తి తగ్గించే ఉద్దేశం ఏదీ వారికి లేదని ఈ చర్చలలో వారు వ్యక్తం చేసిన అభిప్రాయాల ద్వారా తెలిసిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.

కనీసం మరో సంవత్సరం లేదా రెండు సంవత్సరాల పాటు చమురు ధరలు తక్కువ స్ధాయిలో ఉండడానికే సౌదీ అరేబియా సిద్ధమైందని ఇతర పరిశీలకుల ద్వారా తెలుస్తోంది. ధరలను తక్కువ స్ధాయిలో ఉంచడం ద్వారా మధ్య కాలికంగా వచ్చే నూతన పెట్టుబడులను నిరోధించాలన్నది సౌదీ అభిప్రాయం.

అమెరికాలోని షేల్ డ్రిల్లింగ్, సుదూర సముద్ర జలాల్లో జరిగే డీప్ వాటర్ డ్రిల్లింగ్ తదితర రంగాల్లో నూతన పెట్టుబడులు ప్రవేశిస్తున్న సంగతి సౌదీ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో షేల్ గ్యాస్, చమురు ఉత్పత్తి ఇటీవల బాగా పెరిగింది. దానితో మార్కెట్ లోకి చమురు కొత్త ప్రాంతాల నుండి ప్రవేశించడం పెరిగింది.

అందరూ కోరుతున్నట్లు తన ఉత్పత్తి తగ్గించుకుని ధరలు పెరిగేందుకు దోహదం చేస్తే, లాభాలు పెరిగి మరిన్ని పెట్టుబడులు ప్రవేశించే అవకాశం ఉంది. తద్వారా ప్రపంచ చమురు మార్కెట్ లో సౌదీ వాటా తగ్గిపోతుంది. ఇది సౌదీ అరేబియాకు ఎంతమాత్రం సమ్మతం కాదు. మధ్యకాలికంగా చమురు ధరలను తక్కువ స్ధాయిలో కొనసాగితే లాభాలు తక్కువగా ఉన్నందున నూతన పెట్టుబడులు వెనక్కి తగ్గుతాయి. కొంతకాలం ఓపిక వహించి తగిన అవకాశం చూసుకుని ధరలు పెరిగే ఎత్తులు వేయవచ్చని సౌదీ భావిస్తోంది.

సౌదీ ఎత్తుగడ అమెరికా షేల్ డ్రిల్లింగ్ కంపెనీలకు వ్యతిరేకం. వెనిజులా లాంటి దేశాల నుండి తక్కువ ధరలకు చమురు దిగుమతి చేసుకుంటున్న అమెరికా తన షేల్ ఉత్పత్తులను ఐరోపాకు ఎగుమతి చేయాలని తలపెట్టింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ ద్వారా యూరోప్ కు సరఫరా అయ్యే రష్యా గ్యాస్ కు ఉక్రెయిన్ సంక్షోభం ద్వారా ఆటంకం కలిగించింది.

అయితే రష్యా, ప్రత్యామ్నాయంగా చైనాతో భారీ చమురు, గ్యాస్ విక్రయ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆ దేశంపై అమెరికా ఎత్తుగడ పెద్ద ప్రభావం చూపలేదు. స్వల్పకాలికంగా రష్యా ఎగుమతులు తగ్గినప్పటికీ దీర్ఘకాలికంగా ఇది రష్యాకు వరంగా మారింది. కానీ ఐరోపాకు తేలికపాటి ధరలకు అందుబాటులో ఉండే రష్యా గ్యాస్ దూరం అవుతోంది. ఇది అప్పుడే జర్మనీ జి.డి.పి ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడవేసింది.

తక్కువ స్ధాయి ధరలకు సిద్ధపడి ఉండాలని సౌదీ అరేబియా ఇప్పటికే అనధికారికంగా ఇతర OPEC దేశాలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంక్షోభ పరిస్ధితుల వలన ఇతర OPEC దేశాలు కూడా తమ తమ ఉత్పత్తులను తగ్గించుకునేందుకు సుముఖంగా లేవు. అతి పెద్ద ఉత్పత్తిదారు సౌదీ అరేబియా తగ్గిస్తే లాభపడదామని అవి చూస్తున్నాయి. ఇది గ్రహించిన సౌదీ, ఒకటి రెండేళ్లవరకు తక్కువ ధరలకే సిద్ధంగా ఉండమని చెప్పేస్తోంది.

రష్యా, అమెరికాల నుండి ఉత్పత్తి అంతకంతకూ పెరిగిపోతున్న నేపధ్యంలో OPEC లోని ఇతర దేశాలు ఉత్పత్తిని తగ్గించుకోవడం అంత ఆచరణీయం కాదని కువైట్ పాలకులు ప్రకటించారు. కువైట్ పాలకులు సౌదీ పాలకులకు నమ్మిన మిత్ర బంట్లు. అందువలన కువైట్ చెప్పిన మాటలను సౌదీ అభిప్రాయంగా మార్కెట్ వర్గాలు పరిగణిస్తాయి. చమురు ధరలు ఎంత తగ్గినా బ్యారల్ కు 76 డాలర్ల స్ధాయికి మించి తగ్గడానికి లేదని కువైట్ ప్రతినిధి చెప్పడం బట్టి సౌదీ పాలకుల సంసిద్ధతను అంచనా వేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత జూన్ లో బ్యారల్ కు 115 డాలర్లు పలికిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం 88 డాలర్ల వద్ద ఊగిసలాడుతోంది. (ఈ తగ్గుదల భారత వినియోగదారుడికి అసలు చేరనేలేదు.) 80 డాలర్ల వరకు తగ్గినా సౌదీ అరేబియాకు అభ్యంతరం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అమెరికా షేల్ చమురు, గ్యాస్ ల ఉత్పత్తి ఇతర OPEC దేశాలను కూడా పీడిస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరల కంటే షేల్ ఆయిల్ ధరలు చాలా తక్కువ. త్వరలో అమెరికా మిగులు ఉత్పత్తి దేశంగా అవతరించి ఆసియా, యూరప్ లకు ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు.

దానితో పాటు చమురు మార్కెట్ లో స్పాట్ అమ్మకాలు, చెల్లింపుల ధోరణి పెరుగుతోంది. ముందస్తు కాంట్రాక్టులు లేకుండా చమురు ట్యాంకర్లను సముద్ర జలాల్లో తిప్పుతూ అప్పటికప్పుడు అమ్మకాలు చేసే ధోరణి వల్ల మార్కెట్ లో పాటుకుపోయిన రష్యా, ఇరాన్, సౌదీ, కటార్, కువైట్ లాంటి దేశాలకు మార్కెట్ కుచించుకుపోయే పరిస్ధితి ఏర్పడుతోంది.

ఈ నేపధ్యంలో రష్యా, ఇరాన్, కతార్ దేశాలు ఏర్పరిచిన ‘గ్యాస్ ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ ఫోరం’ (జి.ఇ.సి.ఎఫ్) గత నెలలో మాస్కోలో సమావేశమై చమురు ధరలను స్ధిరీకరించాలని ఒక ఒప్పందానికి వచ్చాయి. జపాన్ తదితర ఆసియా దేశాలతో పాటు ఐరోపా దేశాలకు షేల్ చమురు, గ్యాస్ లు అమెరికా ఎగుమతి చేస్తే చమురు ధరలు మరింత పడిపోతాయా అన్నది ప్రస్తుతం సమాధానం దొరకని ప్రశ్న. అమెరికా కూడా ఇతర OPEC దేశాలతో ఒప్పందానికి వచ్చి తగిన వాటా చేతబుచ్చుకుని ధరలు తగ్గకుండా జాగ్రత్తపడవచ్చు. ఆ లోపు చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడం తధ్యంగా కనిపిస్తోంది.  

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s