ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొంతు రోజు రోజుకి కఠినంగా మారుతోంది. రైతులకు బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చి భూములు తీసుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు “భూములు ఇచ్చారా సరే సరి, లేదా…” అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూముల అభివృద్ధిలో రైతులకు వాటా ఇస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ వైపు మొగ్గు ప్రకటిస్తున్నారు. పూలింగ్ కు ఒప్పుకోకపోతే స్వాధీనం చేసేసుకుంటాం అని హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారి ధోరణి పట్ల రైతులలో వ్యతిరేకత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లూ ల్యాండ్ పూలింగ్ గురించి మాట్లాడి ఇప్పుడు భూములను స్వాధీనం గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం పట్ల రైతు సంఘాలు నిరసన ప్రకటిస్తున్నాయి. భూముల స్వాధీనానికి దిగితే ఆందోళన చేయక తప్పదని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
రాజధాని నిర్మాణం నిమిత్తం భూముల సేకరణకు ల్యాండ్ పూలింగ్ పై ఆధారపడడమా లేక ల్యాండ్ అక్విజిషనా అన్న విషయంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ముఖ్యమంత్రి ముసుగు బెదిరింపు జారీ చేశారని రైతు సంఘాలు భావిస్తున్నాయి. ల్యాండ్ పూలింగ్ కు రైతులు ఒప్పుకోకపోయినట్లయితే భూముల స్వాధీనానికి వెనుదీసేది లేదని చంద్రబాబు నాయుడు గురువారం హెచ్చరించారు.
“ల్యాండ్ పూలింగా లేక ల్యాండ్ అక్విజిషనా అన్నది తేల్చుకోవలసింది రైతులే. పూలింగ్ కి కనుక వారు అంగీకరించకపోతే మేమే భూములను స్వాధీనం చేసుకుంటాం” అని చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి ఎంత భూమి కావాలన్నది మాస్టర్ ప్లాన్ సిద్ధం అయ్యాక ఒక స్పష్టత వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు, ప్రభుత్వానికి ఇరువురికీ లబ్ది చేకూరేలా విధానం ఉండాలని ఆయన తన ఆలోచన వ్యక్తం చేశారు. కానీ ఆయన చేసిన హెచ్చరిక ఆయన ఆలోచనకే భిన్నంగా ఉండడం బట్టి జనం కోసం ఒక ఆలోచన, ఆచరించడానికి మరొక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
రాజధానికి లక్ష ఎకరాలు అవసరం అవుతుందని గతంలో పురపాలక మంత్రి నారాయణ ప్రకటించారు. లక్ష ఎకరాల్లో అత్యధిక భాగం రోడ్లు, వంతెనలకే పోతుందని ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొద్ది వేల ఎకరాలు మాత్రమే మిగులుతుందని ఆయన కొద్ది వారాల క్రితం తెలిపారు. బహుశా కాస్త అటు ఇటుగా ఈ లెక్కే ఫైనల్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ల్యాండ్ పూలింగ్ అంటే రైతుల నుండి స్వాధీనం చేసుకున్న భూమిని అభివృద్ధి చేసిన అనంతరం అందులో కొంత వాటాను రైతుకు తిరిగి అప్పజెప్పడం. 60:40 నిష్పత్తిలో ప్రభుత్వము, రైతులు అభివృద్ధి చేసిన భూమిని పంచుకునే ఏర్పాటు చేస్తామని ఒక ప్రతిపాదనగా మంత్రులు వివిధ సందర్భాల్లో చెప్పారు. కానీ ఈ ప్రతిపాదన నిజంగా ఏ మేరకు అమలవుతుందన్న విషయంపై రైతులకు, ప్రజలకు, రైతు సంఘాలకు పలు అనుమానాలు కలుగుతున్నాయి.
భూస్వాధీనం వైపే మొగ్గు చూపే పనైతే కోర్టుకు వెళ్లడానికి తాము సిద్ధమని సి.పి.ఎం అనుబంధ రైతు సంఘం అధ్యక్షుడు జె.శివ శంకర్ హెచ్చరించారు. “60:40 నిష్పత్తి అభివృద్ధి నమూనాపై మాకు నమ్మకం లేదు. ఈ నమూనా క్రింద రైతుకు 1000 చదరపు గజాల స్ధలం దక్కితే గొప్ప. ప్రభుత్వం భూములను ఎక్కడ ఎవరికి కేటాయిస్తుందో ఎవరికీ నిర్దిష్ట అంచనాలు లేవు. మరీ ముఖ్యంగా ప్రత్యామ్నాయ జీవిక అన్న ప్రశ్నే రైతులకు నిద్ర లేని రాత్రులను మిగుల్చుతోంది” అని రైతు సంఘం నేత చెప్పారని ది హిందు తెలిపింది.
కాంగ్రెస్ హయాంలో ఆమోదించిన భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం రైతులకు ప్రధాన ప్రయోజనం కలిగేలా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. ఇష్టానుసారం స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి లేదు. ఈ ఆటంకాన్ని తొలగించుకోవడానికి విజయవాడ, మంగళగిరి చుట్టు పక్కల గ్రామాలను, పట్టణాలను పంచాయితీ రాజ్ చట్టం పరిధి నుండి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కొద్ది రోజుల క్రితం పత్రికలు తెలిపాయి.
ప్రభుత్వం నిజంగా రైతులకు తగిన వాటా ఇచ్చే ఉద్దేశ్యం లేదని ఏకాడికి రైతు న్యాయమైన హక్కులను, జీవికను, చట్ట బద్ధ వాటాను ఎగవేసేందుకే ఆలోచిస్తోందని ఈ చర్య ద్వారా స్పష్టం అవుతోంది. కనుక రైతులకు తగిన వాటా గానీ లేక కనీసం ప్రత్యామ్నాయ జీవిక కల్పిస్తారని గానీ భావించడం అత్యాశే కాగలదు. తమకు కావలసింది జనం నుండి లాక్కోవడమే ఈ ధనిక వర్గ ప్రభుత్వాలకు తెలిసిన విద్య. అందుకోసం ఎన్ని చట్టాలనైనా ఉల్లంఘిస్తారు, ఎన్ని అణచివేతలకైనా దిగుతారు. ఫలితంగా రైతులకు, కూలీలకు పోరాటం తప్ప మరో దారి ఉండబోదు.
తెలంగాణా నిజంగా రాదనుకుని తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చిన హీరో చంద్రబాబు నాయుడు భూసేకరణ విషయంలో మాత్రం తన మాట మీద నిలబడతాడా?
చంద్రబాబుకు ఒక విన్నపము
కొత్త రాజధాని అంటూ హోరేత్తిస్తున్న చంద్రబాబుకు, ఆయన చుట్టూ ఉన్న మంత్రులకు ఒక విన్నపము.
కేవలం పదమూడు జిల్లాల పరిపాలనకు అవసరమైన రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఇంత రాద్దాంతమెందుకు? కావలసిందల్లా ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప ఇంకేం కావాలి? ప్రతి జిల్లాలోని ప్రతి మనిషి రోజూ రాజధానికి రావలసిఉంటుంది అన్నట్లు లెక్కలు వేసి అందరికీ సమాన దూరంలో ఉండాలి అంటూ అందుకు అనువైనది విజయవాడ ఒక్కటే అంటూ ముక్త కంఠంతో గొంతెత్తి పాడటం ఆపేసి కాస్త స్థిమితంగా ఆలోచించండి!
అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఈ యుగంలో మనిషి కదలకుండా అన్ని పనులు చేసుకుంటున్న వెసులుబాటు ఉంటున్న ఈ రోజుల్లో ఇంకా సమాన దూరం అనే సిద్ధాంతం అవసరం లేదు.
రాజధానికి భూసేకరణ అంటూ రైతులను మభ్యపెడతారెందుకు? ఆది మానవ యుగం నుంచి తరతరాలుగా వస్తున్నది వ్యవసాయం. కూడు, గుడ్డ, గూడు క్రమంలో మొట్టమొదటి కూడు మనందరికీ అందించేది రైతులే ! ఎన్నో తరాలుగా చేస్తున్న ఆ వృత్తిని వారు వదలిపెట్టి మరో వృత్తినో, వ్యాపకాన్నో చేపట్ట గాలుగుతారా? కోట్ల రూపాయలు వస్తాయన్న ఆశలతో వారిని ముంచెత్తి బంగారంలాంటి భూములను కాంక్రీటు అరణ్యాలుగా మార్చదలచారా?
భారత దేశంలోనే అత్యంత సారవంతమైన భూభాగాలలో కోస్తా భూములు ఒకటని మీకు వేరుగా చెప్పనక్కర లేదు. నీటి వసతులు, చక్కటి వాతావరణం, వరదల ద్వారా వచ్చే ఒండ్రు- వీటన్నిటినీ
మించి వ్యవసాయంలో నిష్ణాతులైన రైతులు పండిస్తున్న పంటలను గురించి ఆలోచించండి. రాబోయే ఎన్నో తరాలు వ్యవసాయం చేసి పంటలు పండించాల్సిఉంది. ఆహారం మీద ఖర్చులు పెరుగుతున్న ఈ తరుణంలో కోస్తా భూముల మీద కన్నేసి కోట్లు దండుకోవాలనుకునే వారిని కట్టడి చేసి సాగు భూములను కాపాడండి. భవిష్యత్తులో రాబోయే వారికి తిండి పెట్టండి.
http://baapoojeeyam.blogspot.in/
రాజధాని రాజకీయాలు
భూ బకాసురులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించాలనుకోవడం చాలా బాధాకరంగా వుంది. బంగారం పండించే రైతుల వద్ద నుండి ఏదో రకంగా భూములు లాక్కొని కాంక్రీటు అరణ్యాలు సృష్టించాలనుకోవడంలో ఏం న్యాయం వుంది? వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు భూములు వాడుకోవడంలో అర్థం వుంటుంది. భూములు అమ్ముకున్న రైతులు వారి జీవన విధానాన్ని ఎలా మార్చుకుంటారు? వచ్చిన నడమంత్రపు సిరి వారిని ఎటువంటి ఇబ్బందులకు లోను చేస్తుందో? అసలు ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటున్న కృష్ణా, గుంటూరు జిల్లాలలో కాకుండా దొనకొండ లాంటి ప్రదేశంలో కావలసిన విధంగా రాజధాని నిర్మాణాన్ని చేపట్టి కావలసిన సౌకర్యాలను కాలక్రమేణా ఏర్పాటు చేసుకోవడం మంచిది. కొత్త ప్రాంతాలు కూడా అభివృధ్హి చెందడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది.
Chhattisgarh capital was built in twenty thousand acres near Raipur airport and the high court was built at Bilaspur. Using one lakh acres for Seemandra capital is an extravagance.
చంద్రబాబు నాయుడు తన మాటకి కట్టుబడి ఉండడం గతంలో ఎన్నడూ జరగలేదు కానీ ఈ కథ చదవండి, http://amruthamathanam.blogspot.in/2014/10/blog-post.html Just for fun……
నయా రాయ్‌పుర్ (చత్తీస్‌గడ్ రాజధాని నిర్మించిన ప్రాంతం) అభివృద్ధి చెందలేదని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు. అలా చెప్పి ఇక్కడ లక్ష ఎకరాలలో రాజధాని నిర్మాణాన్ని జస్తిఫై చెయ్యాలనుకుంటున్నాడు. నయా రాయ్‌పుర్ అభివృద్ధి చెందింది. నేను రాయ్‌పుర్ కొన్ని సార్లు వెళ్ళి వచ్చాను. రాయ్‌పుర్ నుంచి ధమ్‌తారి వెళ్ళే బస్సులు నయా రాయ్‌పుర్ మీదుగే వెళ్తాయి. తేలీబంధా – ధమ్‌తారీ నేరోగేజ్ రైలు మార్గం కూడా నయా రాయ్‌పుర్ మీదుగా ఉంది. అటు వైపు వెళ్ళేవాళ్ళందరికీ నయా రాయ్‌పుర్ ఎలా ఉంటుందో తెలుసు.