మోడీకి సమన్లు ఇస్తే $10 వేల బహుమతి


Gurpatwant Pannun

Gurpatwant Pannun

పట్టిస్తే పదివేలు! ఈ పేరుతో పాత తెలుగు సినిమా ఒకటి ఉందనుకుంటా. అమెరికాకు అధికార పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడికి న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జారీ చేసిన సమన్లు అందించేందుకు అక్కడి మానవ హక్కుల సంస్ధ సరిగ్గా ఇలాంటి మార్గాన్నే ఎంచుకుంది. కోర్టు సమన్లను నరేంద్ర మోడీకి అందజేసినవారికి 10,000 డాలర్లు బహుమతిగా ఇస్తామని ఎ.జె.సి తరపు లాయర్ గుర్పత్వంత్ సింగ్ పన్నున్ ప్రకటించారు.

భారత దేశంలో నక్సలైట్ నాయకులను పట్టుకోవడానికి వారి తలలకు వెలలు ప్రకటించడం మన పాలకులకు పరిపాటి. నక్సలైట్ సంస్ధలు లేవనెత్తే ప్రజల మౌలిక సమస్యలను పరిష్కారం చేయడం మాని వారికి అన్నం పెడుతున్నారన్న సాకుతో అడవి బిడ్డలను అరెస్టు చేసి సంవత్సరాల తరబడి విచారణ లేకుండా జైళ్ళలో మగ్గేలా చేయడం కూడా మన పాలకులు అనుసరించే విధానమే. ఈ పద్ధతి తమ దాకా వస్తే ఎలా ఉంటుందో అమెరికా మానవ హక్కుల సంస్ధ ఏ.జె.సి మన పాలకులకు అమెరికా గడ్డపై రుచి చూపిస్తోంది.

సమన్లు జారీ చేయదలిచినవారు సమన్ల పత్రాన్ని మోడీకి తెలిసే విధంగా ఆయన కాళ్ళ వద్ద ఉంచి, ఆ దృశ్యాన్ని వీడియో తీయాలని, వీడియో తమకు అందజేసిన తర్వాత బహుమతి మొత్తాన్ని ఇస్తామని పన్నున్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడి కేవలం 5 రోజులు మాత్రమే అమెరికాలో ఉంటారని అందువల్లనే తాము బహుమతి ప్రకటించవలసి వచ్చిందని పన్నున్ తెలిపారు. ఆయన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా గడుపుతారని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండే మోడీకి సమన్లు ఇవ్వడం దుర్లభం అవుతుందని అందుకే బహుమతి ప్రకటించామని తెలిపారు.

అయితే మోడి ఒక దేశాధినేతగా అమెరికా పర్యటనలో ఉన్నందున ఆయనకు సమన్లు జారీ చేయడం కుదరదని వైట్ హౌస్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా ఆయన దేశాధినేతగానే ఉంటారని కనుక ఐరాస ఆవరణలో కూడా సమన్లు ఇవ్వడం వీలు పడదని వైట్ సీనియర్ అధికారి చెప్పారు. అమెరికా చట్టాల ప్రకారం ఇతర దేశాధినేతలు (Heads of State) సివిల్, క్రిమినల్ ప్రక్రియల నుండి రక్షణ కలిగి ఉంటారని అందువల్ల సమన్ల జారీ చెల్లదని సదరు అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. “ప్రస్తుతం దేశాధినేతలుగా ఉన్నవారు వ్యక్తిగత ఉల్లంఘనల నుండి కూడా రక్షణ కలిగి ఉంటారు. అంటే వారికి వ్యక్తిగతంగా సమన్ల పత్రం ఇవ్వడం గానీ, ఆయన సమీపంలో ఉంచడం గానీ వీలు కాదు” అని సదరు అధికారి చెప్పారని ది హిందు తెలిపింది.

ఈ వాదనకు పన్నున్ వద్ద సమాధానం సిద్ధంగా ఉండడం విశేషం. ఆయన ప్రకారం దేశాధినేతలు కొన్ని పరిస్ధితుల్లో మాత్రమే ఇలాంటి రక్షణ కలిగి ఉంటారు. వారు దేశాధినేతగా ఉన్న కాలంలో వచ్చే ఆరోపణలకు సంబంధించి మాత్రమే రక్షణ కలిగి ఉంటారు. గుజరాత్ మారణకాండ జరిగినప్పుడు నరేంద్ర మోడి భారత దేశాధినేత కారు. కనుక ప్రస్తుతం జారీ అయిన సమన్లను నిస్సందేహంగా మోడీకి అందజేయవచ్చు. చట్టం ప్రకారం అది చెల్లుతుంది. దీనికి సంబంధించి మన్మోహన్ సింగ్ విషయంలో అమెరికా కోర్టు ఒకటి ఇచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు.

“మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విషయంలో నెలకొల్పబడిన పూర్వప్రమాణం (precedence) ప్రకారం ఒక వ్యక్తి దేశాధినేతగా ఉన్న కాలంలో జరిగిన చర్యలకు మాత్రమే రక్షణ ఉంటుంది. ఇప్పటి కేసు నరేంద్ర మోడి 2002 నాటి గుజరాత్ మారణకాండలో భాగస్వామ్యం వహించారన్న ఆరోపణకు సంబంధించినది. అప్పటికాయన కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే” అని పన్నున్ స్పష్టం చేశారు.

ఢిల్లీలో 1984లో సిక్కులపై అమలు జరిగిన మారణకాండ కేసులో నిందితులుగా ఉన్న జగదీష్ టైట్లర్ కు, ఇంకా ఇతరులకు 2004 తర్వాత ప్రధాని మోడి అండదండలు ఇచ్చి కాపాడారని మన్మోహన్ సింగ్ పై ఆరోపణలు చేస్తూ అమెరికా కోర్టులో కేసు వేశారు. అయితే అప్పటికి (నిందితులకు రక్షణ ఇచ్చారని ఆరోపణలు వచ్చిన కాలంలో) మన్మోహన్ ప్రధాని పదవిలో ఉన్నందున పిటిషన్ ను కోర్టు అనుమతించలేదు. అయితే 1991-96 కాలంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న కాలంలో గూఢచార వ్యతిరేక చర్యలలో భాగంగా అనేక చట్ట విరుద్ధ హత్యలకు ఫైనాన్స్ చేశారన్న ఆరోపణలకు మన్మోహన్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు పరిగణించింది. ఈ ఉదాహరణనే పన్నున్ తనకు మద్దతుగా ప్రస్తావిస్తున్నారు.

నరేంద్ర మోడి కార్యక్రమాలలో భారత సంతతి ప్రజలతో సంభాషణలు జరిపే పలు కార్యక్రమాలు ఉన్నాయని ఈ కార్యక్రమాల సందర్భంగా మానవ హక్కుల పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులు ఎవ్వరైనా మోడీకి సమన్లు ఇవ్వగలరని తాము ఆశిస్తున్నామని పన్నున్ తెలిపారు.

పన్నున్ ఇండియాలో ఉంటే ఆయనకు ఈ పాటికి ఎలాంటి దుర్గతి దాపురించి ఉండేదో మరి! చూడడానికి పన్నున్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయన వెనుక ఏయే శక్తులు దాగి ఉన్నాయో ఎప్పటికయినా బహిర్గతం కాక మానదు. ఎందుకంటే అమెరికాలో మానవ హక్కులు కూడా ఒక పెద్ద వ్యాపార వస్తువు; ఒక వ్యూహాత్మక ఆయుధం; ప్రత్యర్ధులను లొంగదీసుకునేందుకు ప్రయోగించే లిటిగెంట్ సాధనం!

వ్యాఖ్యానించండి