–
“సారవంతమైన రాజకీయ వారసత్వం ఇంతగా సాగుకు వీలు కానిదిగా ఎలా మారిపోయింది చెప్మా?”
*********
ఓడలు బండ్లగును, బండ్లు ఓడలగును! ఈ సామెతలోని మొదటి అర్ధ భాగానికి మరో చక్కని ఉదాహరణ ఉత్తర ప్రదేశ్ రాజకీయ నేత అజిత్ సింగ్. ఒకప్పటి లోక్ దళ్ పార్టీ నేత, జనతా హయాంలో చక్రం తిప్పిన చౌదరి చరణ్ సింగ్ తనయుడు అయిన అజిత్ సింగ్ పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో నిన్నటి వరకు తిరుగులేని నేత. జాట్ లకు ప్రత్యామ్నాయం లేని నేతగా భాసిల్లిన ఈ నేత ఇప్పుడు ఢిల్లీలో ఒక విశాల ప్రభుత్వ బంగ్లా కోసం ధర్నాలు చేసుకుంటున్నారు.
సంఘ్ పరివార్ కొట్టిన ముజఫర్ నగర్ అల్లర్ల దెబ్బకు అజిత్ సింగ్ జాట్+ముస్లి పునాది చెల్లా చెదురయింది. ఎలా జరిగిందో తెలియదు గాని ఇద్దరు ముస్లిం యువకులు ఒక జాట్ యువతిని అల్లరి చేసినట్లు ఆరోపణలు రావడం, అందుకా యువకులు హత్యకు గురి కావడం జరిగిపోయింది. ఫలితంగా అనాదిగా మిత్రులుగా మెలిగిన ముస్లింలు, జాట్ ల మధ్య పచ్చగడ్డి క్షణాల్లో భగ్గుమనే పరిస్ధితి రచించబడింది.
ముస్లింలపై ప్రతీకారేచ్చ రెచ్చగొట్టబడిన జాట్ లు అజిత్ సింగ్ నామమాత్రంగా చేసిన సఖ్యత ప్రయత్నాలను మెచ్చలేదు. అసలు అజిత్ సింగ్ మేలుకునేలోపే జరగాల్సింది జరిగిపోయిందని చెప్పేవారూ లేకపోలేదు. చివరికి అజిత్ సింగ్ జేబునుండి జాట్ లు జారిపోయారు.
తాము ఏ తప్పు చేశామో తెలియకుండానే నరమేధం ఎదుర్కొని 50 మందికి పైగా ఆప్తులను కోల్పోయిన ముస్లింలు కూడా అజిత్ సింగ్ తమకు ఏమీ చేయలేదని నమ్ముతూ సమాజ్ వాదీ, కాంగ్రెస్, బి.ఎస్.పిల మధ్య చీలిపోయారు. ఆ విధంగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో సామాన్య ప్రజల కుత్తుకలు ఉత్తరించిన ఓట్ల జాతర అను నరమేధం రాజకీయ బలాబలాలను తిరగరాసింది. తర్వాత కధ తెలిసిందే. జరిగిన అన్యాయానికి ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోండి అని పిలుపు ఇచ్చిన అమిత్ షా ఇప్పుడు బి.జె.పి అధ్యక్షుడు.
రాజకీయ గాలులకు అతీతంగా జాట్ ల హృదయ సామ్రాజ్యాలను ఏలిన అజిత్ సింగ్ మాత్రం తన ఒకప్పటి పచ్చటి రాజకీయ నేలలు గిడసబారి ఓట్ల మొక్కలు మొలిపించలేని ఎడారిగా మారడాన్ని చూసి వలపోతలో మునిగిపోయారు.
కార్మికులు, కర్షకుల పక్షాన నిత్యం పోరాటాలు చేస్తూ….సామాన్య ప్రజల పక్షాన నిలబడ్డ వామపక్ష పార్టీలకు మంచి నీళ్లు పుట్టకుండా చేసిన ఘనత మతతత్వ…. పార్టీలది.
ఇక అజిత్ సింగ్ ఓ లెక్కా. రేపు మమత గారికి…మాయావతి గారికి ఇదే ఎడారిలో ఒయాసిస్సుల వేట తప్పదేమో…
దేశంలోని లౌకిక వాదులంతా మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఏకం కావాలి. లేకుంటే భారత రాజకీయాలు… రెండు మతాల మధ్య ఘర్షణ గా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ( ఆల్ ఖైదా హెచ్చరికలు…హైదరాబాద్ యువకులు సిరియా దళాల్లోకి చేరేందుకు వెళుతూ పట్టుబడటం లాంటివి.) ఆ ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి.