బి.జె.పి, శివ సేనల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరిందిట. ఇరు పార్టీలూ కలిసి తమ కూటమిలోని మిగిలిన పక్షాలకు సీట్లు కత్తిరించడం ద్వారా తమ తగాదా పరిష్కరించుకున్నారు. బి.జె.పి 130 సీట్లకూ, శివసేన 151 సీట్లకూ పోటీ చేస్తాయట. కూటమిలోని ఇతర పార్టీలకు 18 సీట్లు కేటాయించాల్సి ఉండగా ఇప్పుడు 7 మాత్రమే ఇస్తున్నారు. శివసేన తన డిమాండ్ కు ఒక్క సీటూ తగ్గించుకోలేదు. దానితో బి.జె.పి ఇతర పార్టీలకు కేటాయించిన సీట్లలో 11 సీట్లను ఆక్రమించింది.
2009 ఎన్నికల్లో శివసేన 169, బి.జె.పి 119 సీట్లలో పోటీ చేశాయి. కూటమిలోకి వచ్చిన కొత్త పార్టీల కోసం 18 సీట్లను వదులుకుంటానని శివసేన ప్రారంభంలో ప్రకటించింది. బి.జె.పి తనకు మరిన్ని సీట్లు కావాలని కోరడం, అందుకు శివసేన తిరస్కరించడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. నామినేషన్లకు మరో 3 రోజులు మాత్రమే గడువు ఉండగా మంగళవారం (సెప్టెంబర్ 23) ఉదయానికి ఇరు పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చాయి. నూతన ఫార్ములాకు కూటమిలోని మరో 4 పార్టీలు అంగీకరిస్తాయా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఒకవేళ అవి అంగీకరించకపోతే మరో 2 సీట్లు తాను తగ్గించుకుంటామని బి.జె.పి ప్రతినిధులు చెప్పారు.
బి.జె.పి-శివసేనల కుమ్ములాట ఒక పక్క కొనసాగుతుండగానే ఎన్.సి.పి, కాంగ్రెస్ లు తమ మధ్య కూడా విభేదాలు ఉన్నాయని చెప్పేందుకు ప్రయత్నించాయి. కాంగ్రెస్ తో సీట్ల ఒప్పందం ఉండేదీ లేనిదీ రెండు రోజుల్లో తేల్చేస్తాం అంటూ ఎన్.సి.పి సోమవారం ప్రకటించింది. కానీ పత్రికలు వారి ప్రకటనపై ఒక వార్త పడేసి ఊరుకున్నాయి తప్ప బి.జె.పి-శివసేనల కుమ్ములాటపై కనబరిచిన ఆసక్తిని ప్రదర్శించలేదు.
తమకు 144 సీట్లు కావాలని ఎన్.ఎస్.పి చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ నుండి స్పందన లేదు. మంగళవారం తమ పార్టీ కోర్ గ్రూప్ సమావేశం ఉందని, అందులో ఆటో ఇటో తేల్చేస్తామని ఎన్.సి.పి ప్రకటించింది. తాము 174 సీట్లకు అభ్యర్ధులను ఎన్నుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఎన్.సి.పి, కాంగ్రెస్ ల వివాదం మాత్రం పత్రికలు, ఛానెళ్లలో అంతగా చోటు సంపాదించలేదు.
ఈ అంశాన్నే కార్టూన్ సూచిస్తోంది. కార్టూన్ లో కుమ్ములాటలకు ఆకర్షితులవుతున్నవారిగా జనాన్ని చూపారు గానీ వాస్తవానికి అంత ఆతృత, ఆకర్షణ ప్రదర్శిస్తున్నది విలేఖరులు మాత్రమే. జనానికి అంత తీరికా, ఓపికా ఎక్కడివి? ఈ పార్టీలు సృష్టించి పెట్టిన సమస్యల నుండి బైటపడే ప్రయత్నాల్లోనే వారి జీవితాలు గడిచిపోతున్నాయి.