నిద్రాదేవి ఒడిలో… -ఫోటోలు 2


కొందరు ఎంత కోరుకున్నా నిద్ర పట్టి చావదు. కొందరు అలా కన్ను మూస్తే చాలు ఇలా గురక మొదలు పెట్టేస్తారు. మొదటి తరగతి వారు నిద్ర కోసం పరితపిస్తూ అసంతృప్తితోనే జీవితం గడిపేస్తుంటారు. ‘కష్టములెట్లున్నను’ నిద్రాదేవి ఒడిలోకి జారిపోగల అల్ప సంతృప్తిపరుల అదృష్టమే అదృష్టం.

ఈ ఫోటోలు చూడండి. బస్సులో కూర్చోవడానికి సీటు దొరక్క నిలబడే ప్రయాణిస్తూ చేతులు ఎత్తి పట్టుకుని మరీ నిద్ర పోగల లావోస్ పెద్ద మనిషిని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

ఆ జైపూర్ పెద్దాయన! శరీరంలో ముప్పావు భాగం బైటేసుకుని ఎవరు చూస్తే తనకేమిటని హాయిగా కూర్చోనే కునుకు తీసేస్తున్నాడు. బహుశా కస్టమర్ అలికిడైతే చాలు కళ్ళు తెరిచే విద్య కూడా ఈయనకు అబ్బి ఉండాలి.

దేశంలో మెజారిటీ భాగం మంచుతో నిండి ఉండే కెనడాలో ఆ మహిళ తన చుట్టూ మంచు దిబ్బలను పెట్టుకుని కూడా బహిరంగ స్ధాలంలో హాయిగా నిద్ర పోతోంది, మంచులోకి కాళ్ళు జొనిపి కూడా.

వియత్నాం పళ్ల వ్యాపారిదే అదృష్టం అనుకోవాలా లేక ఆయన చూడకుండా పళ్లను ఎగరేసుకుపోగల హస్తలాఘవ కస్టమర్లది అదృష్టం అనుకోవాలా? వియత్నాం రాజధాని హనోయ్ లో ఇద్దరు బార్బర్లు రోడ్డు పక్కనే కునుకు తీస్తూ పని, నిద్రలను ఏకం చేసేసుకున్నారు.

స్పెయిన్ లో రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు డిక్కీ డోర్ ఎత్తి పట్టి హాయిగా నిద్రపోతున్న మహిళ, తన తల్లి కూరగాయలు అమ్ముకుంటుండగా కూరగాయల బాస్కెట్ లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఖాట్మండు బాలిక,

చరిత్రాత్మక మరియు వివాదాస్పద ఆల్-అక్సా మసీదును దర్శించుకునేందుకు ఇజ్రాయెల్ చెక్ పోస్ట్ వద్ద క్యూలో నిలబడ్డ తనతల్లి ఎత్తిపత్తిన బుట్టలోనే నిద్ర పోతున్న పసిపాప, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో పెరిగిపోతున్న స్ధలాల ఖరీదు పట్ల ఆందోళన ప్రకటించేందుకు వచ్చి వీధినే తన నిద్రకు ఆస్తిగా చేసుకున్న యువతి…

బీజింగ్ మాల్ లో మంచం కొనడానికి వచ్చి తమ పాప నిద్రతోనే పరీక్షిస్తున్న యువ చైనీయ జంట, మాడ్రిడ్ (స్పెయిన్) నిరసనకారుల సామూహిక వీధి నిద్రలు, తుఫాను తాకిడికి ఇళ్ళు వదిలి మనీలా ప్రభుత్వ శిబిరంలో అట్టముక్కలనే పరుపులుగా చేసుకుని నిద్రిస్తున్న ఫిలిప్పైన్ పౌరులు, లాహోర్ లో బస్సులపైనే పడక పరుచుకున్న పాకిస్తాన్ డ్రైవర్లు, కండక్టర్లు…

పోలీసుల కాపలా మధ్య గొడుగు చాటు చేసుకుని దర్జాగా నిద్రిస్తున్న హాంగ్ కాంగ్ నిరసనకారుడు, హేఫీ నగర రోడ్డు పక్క తన మోటారు వాహనం లోనే దోమతెరల వెనుక భార్యా పిల్లలతో కలిసి నిద్రిస్తున్న చీనీ మోటారు కార్మికుడు, సెర్బియాలో డాన్యూబ్ నది ఒడ్డున నోవి సాద్ నగర సాంస్కృతిక పండుగలో పాల్గొనేందుకు వచ్చి చెట్లమాధ్య గుడారాలు వేసుకుని నిద్రిస్తున్న ఉత్సాహపరులు…

ఈజిప్టు రాజధాని కైరోలో తాహ్రిరి స్క్వేర్ లో నిరసన కోసం వచ్చి ఫుట్ పాత్ ను తలగడగా మార్చుకున్న నిరసనకారుడు, వలేన్సియా నగరంలో కంప్యూటర్ల సముద్రంలో కాస్త చోటు చేసుకుని విశ్రాంతిలోకి జారిన యువకులు, యెమెన్ రాజధాని సనాలోని తఘీర్ స్క్వేర్ లో తాత్కాలిక గుడారాల్లోనూ ఘనంగా నిద్రపోతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు…

సంవత్సర కాలంగా వరదల పీడితుడుగా మారి పాకిస్ధాన్ ప్రభుత్వం కల్పించిన పునరావాసంలో సేద దీరుతున్న వరద బాధితుడు, భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో ఆలస్యం అయిన తమ తమ రైళ్లకోసం ఎదురు చూస్తూ ప్లాట్ ఫారం పైనే విడిది చేసిన ప్రయాణీకులు….

వీరంతా మన జీవితంలో ఎప్పుడోకప్పుడు మనకు ఎదురైన ఒకానొక దుర్భర పరిస్ధితిని గానీ, పాఠం నేర్పిన అనుభవాన్ని గానీ గుర్తుకు తెస్తున్నట్లే ఉన్నారు కదూ…

ఈ ఫోటోలను బోస్టన్ పత్రిక 2011 సం. ఆగస్టు నెలలో ప్రచురించింది.

 

3 thoughts on “నిద్రాదేవి ఒడిలో… -ఫోటోలు 2

  1. విశేఖర్ గారు మీరు శానా అన్యాయం చేస్తున్నారు.
    మీరు లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించడం లేడు.
    1. ప్రభుత్వ కార్యాలయాల్లో హాయిగా నిద్రపోయే ఉద్యోగస్తుల ఫోటోలను……
    2. పార్లమెంటులో హాయిగా బజ్జున్న రాహుల్ గాంధీ ఫోటోలని కూడా
    వెంటనే జోడించాలని మేం డిమాండ్ చేస్తున్నాం

  2. రాహుల్ గాంధీ ఒంటరి వాడనుకుంటున్నారేమో! ప్రపంచ వ్యాపితంగా ఆయనకు స్నేహితులున్నారు, మన దేవెగౌడ నుండి ఒబామా వరకూ. నిద్ర నేతలకు ప్రత్యేకంగా టపా కేటాయించి న్యాయం చేద్దాం లెండి!

వ్యాఖ్యానించండి