శారదా చిట్ ఫండ్ ఊబిలో మమతా బెనర్జీ! -కార్టూన్


Chitfund Quicksand

శారదా చిట్ ఫండ్ కుంభకోణం క్రమంగా మమతా బెనర్జీని కూడా చుట్టు ముడుతోంది. సి.బి.ఐ విచారణ ఫలితంగా పలువురు త్రిణమూల్ కాంగ్రెస్ నేతలు, మంత్రులు కుంభకోణంలో పాత్రధారులుగా, లబ్దిదారులుగా తేలుతున్నారు. చివరికి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార ఖర్చులను కూడా శారద చిట్ ఫండ్ భరించిందని అరెస్టయిన నేత ఒకరు ఆరోపించడంతో మమతా బెనర్జీని ఊబిలోకి లాగేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం అవుతోంది.

త్రిణమూల్ నేత, మాజీ ఐ.పి.ఎస్ అధికారి రజత్ మజుందార్, ఆ పార్టీ రాఝ్య సభ సభ్యుడు కునాల్ ఘోష్ లను సి.బి.ఐ అరెస్టు చేసింది. పార్టీకి సన్నిహితులుగా భావించే పలువురు ఇతర పెద్దలను కూడా సి.బి.ఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. మనీ లాండరింగ్ నేరాలను విచారించే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) టి.సి.పి కి చెందిన ఎం.పిలను ఒక మంత్రిని విచారించింది.

శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో అతి పెద్ద లబ్దిదారు మమతా బెనర్జీయేనని కునాల్ ఘోష్ ఆరోపించడంతో కుంభకోణం ఒక మలుపు తిరిగినట్లయింది. శారదా చిట్ ఫండ్ మీడియా విభాగానికి అధిపతిగా పని చేసిన కునాల్ ఘోష్, మమతా మీడియా ప్రచారానికి కంపెనీ దండిగా నిధులు ఇచ్చిందని వెల్లడించాడు. కుంభకోణం సూత్రధారి సుదీప్త సేన్, మమతా బెనర్జీలతో కలిపి తనను విచారిస్తే పలు విషయాలు వెల్లడి అవుతాయని ఆయన ప్రకటించాడు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐ.ఆర్.సి.టి.సి (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) లో ఓ కాంట్రాక్టును శారదా సంస్ధకు కట్టబెట్టిందని కునాల్ ఆరోపించాడు.

ఈ ఆరోపణల నేపధ్యంలో మమత రాజీనామా చేయాలని బి.జె.పి డిమాండ్ చేస్తోంది. అయితే మమత బెనర్జీ పాపులారిటీ ఇంకా కొనసాగుతోందని కనుక ఆమె ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలు జరిగితే ఆమెతో పోటీ పడగల స్ధితిలో ప్రతిపక్షాలు లేవని వారి అంచనా.

పెద్దగా పటాటోపాలకు పోనీ సాధారణ జీవన విధానం ద్వారా అవినీతికి పాల్పడని నేతగా పేరున్న మమత బెనర్జీ పై అవినీతి ఆరోపణలు గుప్పించడం ద్వారా ఆమె ప్రభుత్వాన్ని కూలదోయడానికి బడా పారిశ్రామికవేత్తలు పధక రచన చేశాయని కొందరు గుసగుసలు పోతున్నారు. చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐలను వ్యతిరేకించడం లాంటి నిర్ణయాల వల్ల ఆమెపై పశ్చిమ బహుళజాతి కంపెనీలకు సదభిప్రాయం లేదని వారి అభిప్రాయం. అందుకే ఆమెపై ఒక పధకం ప్రకారం అవినీతి ఆరోపణలు గుప్పించడానికి ఆమె పార్టీ నేతలనే వాడుకుంటున్నారని వారు వివరిస్తున్నారు.

కంపెనీలకు అవసరం అయితే గజాన్ని దొంగిలించి పలాయనం చిత్తగించారన్న కధ నిజమై కూర్చుంటుంది. వారికా అవసరం లేకపోయినా లేదా కొత్త అవసరం వచ్చిపడినా ‘గజం మిధ్యే, పలాయనమూ మిధ్యే’ అని నమ్మకమైన ప్రచారం సాగుతుంది. గొప్పవారి గోత్రాలు ఫలానా వారికెరుక అని గొల్ల సుద్దులు పాడినట్లు రాజకీయుల గోత్రాలు కంపెనీలకు, కంపెనీల గోత్రాలు రాజకీయులకూ మాత్రమే ఎరుక. ఇద్దరికీ పడకపోతేనే జనానికి తెలుస్తుంది.

One thought on “శారదా చిట్ ఫండ్ ఊబిలో మమతా బెనర్జీ! -కార్టూన్

వ్యాఖ్యానించండి