కాశ్మీర్ వరదలు: పట్టించుకునేవారు లేరు


“ఒక్క రాయి విసిరినా, ఆ ఒక్క వ్యక్తిని కొట్టడానికి వందల మంది పోలీసులు పరుగెట్టుకుని వస్తారు. వాళ్ళంతా ఇప్పుడేరి? మంత్రులు ఎక్కడ?” కాశ్మీర్ వరదల నుండి బైటపడిన ఒక కాశ్మీరీ టీచర్ వేసిన ప్రశ్నలివి.

“హెలికాప్టర్లు వచ్చాయి, వెళ్ళాయి. మా సహాయం కోసం ఎవ్వరూ రాలేదు. మా ఏరియాలో ఎవ్వరినీ హెలికాప్టర్ల ద్వారా రక్షించలేదు” తాత్కాలిక శిబిరంలో తలదాచుకుంటున్న ఒక కాశ్మీరీ పౌరుడు వెల్లడించిన సత్యం.

“ఈ ప్రభుత్వం ఇచ్చే ఆహారం మాకు అక్కర్లేదనీ జనం నిరాకరిస్తున్నారు. ఇండియా కాశ్మీర్ ని ఆక్రమించింది కనుక తమ విధిలో భాగంగానే ఈ కాస్త సాయం చేస్తున్నారు. మా నేలను మరో దేశం ఆక్రమించినట్లయితే వాళ్ళు కూడా ఇది చేసేవారు” హెలికాప్టర్ల నుండి సైన్యం విసిరిన గడువు ముగిసిన పోట్లాలు వరద నీటిలో తేలడాన్ని చూపిస్తూ మరో కాశ్మీరీ వివరణ.

సైన్యం పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తోందని, లక్షన్నర మందికి పైగా కాపాడామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అయితే కాశ్మీర్ లో వాస్తవ పరిస్ధితి ఇందుకు భిన్నంగా ఉన్నదని కాశ్మీరీల ఆగ్రహావేశాలు తెలియజేస్తున్నాయి.

భారత సైన్యాన్ని ఆక్రమిత సైన్యంగా పరిగణించే పలువురు కాశ్మీరీలు తమకు గడువు ముగిసిన ఆహార పోట్లాలను, ఇతర ఆహార పదార్ధాలను పంపిణీ చేస్తుండడంతో మరింత ఆగ్రహం ప్రకటిస్తున్నారు. వారి ఆగ్రహం ప్రధానంగా స్ధానిక ప్రభుత్వంపై వ్యక్తం అవుతోందని పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం నుండి తమకు ఎటువంటి సహాయమూ అందకపోవడం పట్ల కాశ్మీరీలు నిరసన తెలియజేస్తున్నారు. పోలీసులు తమ ఛాయలకు కూడా రాలేదని వారు చెబుతున్నారు. సైనిక హెలికాప్టర్లు ఎంచుకున్న చోట్లలోనే తిరుగుతున్నాయని, తాము కేకలు వేసి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారని అనేక ప్రాంతాలలో కాశ్మీరీలు ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సౌకర్యాలన్నీ కొన్ని గంటల్లోనే నాశనం అయ్యాయని, ప్రభుత్వ అంగాల కార్యాలన్నీ నీట మునగడంతో ఏమీ చేయలేని పరిస్ధితి నెలకొన్నదని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వివరణ ఇచ్చుకున్నారు.

50 సంవత్సరాల్లోనే కనీవినీ వర్షాలు, వరదలని ప్రకటించిన పత్రికలు ఇప్పుడీ సంఖ్యను 100 సం.లకు పెంచాయి. గత శతాబ్దంలోనే ఇంత భారీ వర్షాలు కురవలేదని, ఈ విధంగా నగరాలు, గ్రామాలు అన్నీ నీట మునిగిన సందర్భం లేదని పౌరులను ఉటంకిస్తూ పత్రికలు వెల్లడించాయి.

సమస్యల పైన ఉద్యమాలు నిర్వహించినప్పుడు భారీ బలగాలను రంగంలోకి దింపి ఉక్కు పాదం మోపే ప్రభుత్వాలు వరదలకు, వర్షాలకు మాత్రం తమను అప్పగించి మిన్నకున్నాయని, తమ రాతకు తమను వదిలిపెట్టారని ప్రజలు ఆరోపించారు.

సైన్యం, పోలీసులు పట్టించుకోకపోవడంతో కాశ్మీరీ యువకులు అనేకమంది స్వచ్ఛంద బృందాలుగా ఏర్పడి ట్రాక్టర్లు, టిప్పర్లు, నాటు పడవలు, డ్రమ్ములు, పెద్ద పెద్ద వంట సామాగ్రిలు ఉపయోగిస్తూ ప్రజలను పొడి ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనేక పత్రికలు, వెబ్ సైట్లు ప్రచురించిన ఫోటోలు కూడా దీనిని ధ్రువపరుస్తున్నాయి.

రాయిటర్స్ పత్రిక ప్రకారం వారం రోజుల అనంతరం కూడా శ్రీనగర్ లో మెజారిటీ ప్రాంతం ఇంకా నీటిలోనే మునిగి ఉండి. అనేకమంది జనం ఇప్పటికీ ఇళ్ల కప్పులపైన నిలిచి సాయం కోసం చూస్తున్నారు. భారత కాశ్మీర్ లో 200 మంది చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటించగా, ఆజాద్ కాశ్మీర్ లో 264 మంది చనిపోయారని పాక్ ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రభుత్వంపై నిరసన ప్రకటిస్తున్నారు. రాజధాని శ్రీనగర్ లో కనీస మౌలిక సౌకర్యాలు మృగ్యం అయ్యాయని వారు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ తగినంత మంది సిబ్బంది లేక సతమతం అవుతున్నాయని ఔషధాలు అటుంచి మౌలిక సరఫరాలే లేవని వైద్యులు చెప్పారు.

“స్ధానిక (రాష్ట్ర) ప్రభుత్వం పూర్తిగా చేష్టలుడిగింది. మా పై అధికారుల నుండి ఎటువంటి ఆదేశాలు లేవు. ప్రతి విభాగము పని చేయడం మానేసింది” అని కార్మిక శాఖ అధికారి చెప్పడాన్ని బట్టి పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వంపై ఆశలు వదులుకున్న ఈ అధికారి పౌరులు నడుపుతున్న స్వచ్ఛంద శిబిరాలలో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు.

చేతనైనంత సాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి చెబుతుండగా ఇతర రాష్ట్రాలు ఉదారంగా ఆడుకోవాలని ప్రధాని పిలుపు ఇస్తున్నారు. కాశ్మీరీలు మాత్రం పట్టించుకునేవారు కానరాక మరింత ఆగ్రహావేశాల్లో ఉడుకుతున్నారు.

Photos: The Atlantic, Indian Express, Daily Mail

2 thoughts on “కాశ్మీర్ వరదలు: పట్టించుకునేవారు లేరు

  1. కాశ్మీరీలకు సహాయసహకారాలు అంధించడానికి కొన్నిసంస్థలు ముందుకు వచ్చినప్పటికీ వారిని సమన్వయపరచవలసిన యంత్రాంగం చేతులెత్తేయడమే విషాదం!!!

  2. అవును శేఖర్ గారు. ఆ మధ్య ఉత్తరాఖండ్ లో వరదలొస్తే…..ఒక్క విమానంలో వేలమందిని రక్షించిన సూపర్ మ్యాన్ లు…..ఇప్పుడెక్కడా కానరాకపోవడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది. అందునా వారు పదోన్నతిని కూడా పొందారు కదా…?

వ్యాఖ్యానించండి