దేశంలో అత్యున్నత స్ధాయి పరిశోధన సంస్ధ సి.బి.ఐ. ప్రభుత్వంలోనూ, బ్యూరోక్రసీలోనూ ఉన్నత స్ధానాలను ఆక్రమించి ఉన్న స్వార్ధపర ఆశపోతులను, దొంగలను పట్టుకుని విచారించి శిక్షపడేలా చూడవలసిన సి.బి.ఐ అధికారులు సదరు ఉన్నత స్ధాయి నేరస్ధులతోనే కుమ్మక్కు అవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.
దేశంలో అవినీతిని ప్రముఖంగా చర్చలోకి తెచ్చిన కుంభకోణం 2జి కుంభకోణం. ఈ కుంభకోణంలో నిందితులైన సీనియర్ బ్యూరోక్రాట్ అధికారులు క్రమం తప్పకుండా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ ఇంటికి వెళ్తున్నారని ఎఎపి నేత, సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ ఇటీవల కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వార్తను ప్రచురించకుండా పత్రికలను కట్టడి చేయాలని రంజిత్ సింగ్ సుప్రీం కోర్టును కోరినప్పటికి అందుకు అనుమతి లభించలేదు.
మాక్సిక్-ఎయిర్ సెల్ అమ్మకం మరియు కొనుగోలు ఒప్పందం విషయంలోనూ తమిళనాడు డి.ఏం.కె నేత, మాజీ కేంద్ర టెలికాం మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు సన్ టి.వి అధినేత కళానిధి మారన్ లపై ఛార్జీ షీటు నమోదు కాకుండా రంజిత్ సింగ్ అడ్డుకున్నారని మళ్ళీ ప్రశాంత్ భూషణ్ గారే కోర్టుకు ఫిర్యాదు చేశారు.
ఇతర సి.బి.ఐ అధికారులు, స్పెషల్ సొలిసిటర్ జనరల్ (ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జి -లలిత్) అందరూ మారన్ సోదరులపైన ఛార్జి షీటు నమోదు చేసేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసినప్పటికీ వారి అభిప్రాయాలని రంజిత్ సింగ్ వీటో చేసేశారు. భూషణ్ ఫిర్యాదుతో మారన్ సోదరుల పైనా అభియోగపత్రం నమోదు చేయక సి.బి.ఐకి తప్పలేదు.
మాక్సిక్, మలేషియాకు చెందిన కంపెనీ. ఎయిర్ సెల్ కంపెనీ తమిళనాడుకు చెందిన శివ శంకరన్ ప్రమోట్ చేసినది. ఎయిర్ సెల్ తో పాటు శివ శంకరన్ కు చెందిన మరో రెండు కంపెనీలను మాక్సిక్ కు అమ్మేయాలని శివ శంకరన్ పై అప్పటి టెలికాం మంత్రి మారన్ ఒత్తిడి తెచ్చారు. ఈ మూడు కంపెనీలకు అవసరమైన అనుమతులు ఇవ్వకుండా తొక్కి పెట్టడం ద్వారా తన కంపెనీలను అమ్ముకోక తప్పని పరిస్ధితిని మారన్ కల్పించారు.
అమ్మకం పూర్తయ్యాక కేంద్రం ఇవ్వవలసిన అనుమతులను ఎయిర్ సెల్, ఇతర రెండు కంపెనీలకు మారన్ జారీ చేశారు. అనుమతులను అమ్మకానికి ముందే ఇచ్చినట్లయితే మాక్సిక్ కంపెనీ బాగా ఎక్కువ ధర చెల్లించవలసి ఉండేది. స్వదేశం, స్వరాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తకు మేలు చేయడానికి బదులు మన దేశ కేంద్ర మంత్రి విదేశీ కంపెనీకి మేలు చేసేవిధంగా ఒత్తిడి తెచ్చారు. అందుకు బదులుగా 650 కోట్ల రూపాయలు మాక్సిక్ కంపెనీ సన్ డైరెక్ట్ టి.విలో పెట్టుబడులు పెట్టింది. ఇది నిజానికి దేశ ద్రోహంతో సమానం.
మారన్ లపై కేసు మోపడానికి తగిన సాక్ష్యాలను సి.బి.ఐ సేకరించింది. భూషణ్ ప్రకారం పక్కా సమాచారాన్ని సి.బి.ఐ సేకరించింది. అయినప్పటికీ సి.బి.ఐ డైరెక్టర్ మరో వంక చూసారే తప్ప సాక్ష్యాల వంక చూడలేదు.
ఇవి పైకి వెల్లడి అయిన కేసులు మాత్రమే. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు, ఇతర పలుకుబడి గలిగిన వ్యక్తులపై నమోదయిన అనేక కేసులు ఇలాగే వక్ర మార్గం పట్టి ఎ ఫలితం లేకుండా ముగిసిపోయాయి.
ఇప్పుడిక సి.బి.ఐ పరిశోధనలపై కూడా సరికొత్త పరిశోధన చేయాల్సిన పరిస్ధితి ఏర్పడిందని కార్టూనిస్టు సూచిస్తున్నారు. నిజంగానే సి.బి.ఐ పైన పరిశోధన చేసే మరో సంస్ధను ఏర్పాటు చేస్తే, దానిపై కూడా పరిశోధన చేయవలసిన అవసరం తప్పకుండా వస్తుంది. దేశంలోని సర్వ వ్యవస్ధలూ ధనిక వర్గాల గుప్పెట్లో ఉన్నందునే ఈ పరిస్ధితి. జనమే పూనుకుని ఈ పరిస్ధితిని మార్చుకోనంతకాలం ఇది ఇంతే.
