భారత ప్రధాని నరేంద్ర మోడి జపాన్ పర్యటనలో ఇండియా-జపాన్ ల మధ్య చరిత్రాత్మక అణు ఒప్పందం ఆమోదం పొందుతుందని పలువురు భావించారు. అందుకే ప్రపంచ అణు పరిశ్రమతో వివిధ రకాలుగా సంబంధం ఉన్నవారందరూ మోడి పర్యటనను ఆసక్తిగా, ఆశగా, భయంగా, ఆందోళనగా తిలకించారు. చివరికి ఒప్పందం కుదరకపోవడంతో పరిశ్రమ వర్గాలు తమ తమ స్ధానాలను బట్టి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ నిట్టూర్చగా ప్రజల తరపున ఆలోచించేవారు ‘పోనీలెమ్మ’ని ఊపిరి పీల్చుకున్నారు.
ఒప్పందం కుదరకపోవడానికి కారణం జపాన్ విధించిన విషమ షరతులే. ఈ షరతులను జపాన్ విధించింది అనడం కంటే జపాన్ ద్వారా అమెరికా విధించింది అనడమే సరైనది. అమెరికా-జపాన్ ల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ అణు పరిజ్ఞానం, అణు పరికరాల విషయంలో అమెరికా మాటను జపాన్ జవదాటదు. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్.ఎస్.జి) లో సభ్య దేశాలన్నీ (రష్యా, చైనా మినహా) అమెరికా గీసిన గీతను పాటిస్తాయి. అందుకే సరిగ్గా అమెరికా విధించిన షరతులనే జపాన్ విధించడం.
తమతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవాలంటే ఇండియా పాటించాలని చెప్పిన షరతులు, నిబంధనలు ఇలా ఉన్నాయి.
-
మళ్ళీ అణు పరీక్షలు జరపబోమని హామీ ఇవ్వాలి.
-
ఇండియా తన అణు పరిశ్రమలలో మరిన్ని అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించాలి.
-
అణు పరిశ్రమల వద్ద విస్తృతంగా కెమెరాలు అమర్చడానికి అనుమతించాలి. తద్వారా అణు ఇంధనం బాంబుల తయారీకి తరలించకుండా చూసేలా అంతర్జాతీయ పరీక్షకులకు అవకాశం ఇవ్వాలి.
ఈ షరతులు భారత ప్రజలకు ఆమోదయోగ్యం కావని మన పాలకులకు తెలుసు. భారత ప్రయోజనాలను తాకట్టుపెట్టి ఒప్పందం చేసుకున్నారన్న అపప్రధ వస్తుంది. అందువలన తమ ఉద్దేశ్యం ఎలా ఉన్నప్పటికీ ఈ తరహా విషమ షరతులను ఆమోదించడానికి వెనకాడుతూ వచ్చారు. కరుడుగట్టిన హిందూ జాతీయవాదిగా పేరుపడిన నరేంద్ర మోడి ఈ షరతులను అంగీకరిస్తే ఆయనను ప్రజల్లో పలుచన చేయడం ప్రత్యర్ధులకు పెద్ద ప్రయాస అవసరం ఉండదు.
పర్యవసానంగా మోడి-షింజో అబే అణు చర్చలు ఎట్టి ఫలితం లేకుండానే ముగిశాయి. అణు వ్యాపారానికి సంబంధించి తమ మధ్య మరింత అవగాహన పెరిగిందని ప్రకటించడంతో ఇరు దేశాధిపతులు సరిపెట్టారు.
అణు ఒప్పందం కుదిరితే 90 బిలియన్ డాలర్ల అణు వాణిజ్యం ఆచరణలోకి వస్తుందని ప్రపంచ అణు పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. జపాన్ లోని అణు కంపెనీలు విస్తృతంగా ఇండియాలో అణు రియాక్టర్లు నెలకొల్పుతాయని, ఇందులో తమకూ వాటా దక్కుతుందని పశ్చిమ అణు కంపెనీలు సైతం ఆశించాయి. రానున్న రెండు దశాబ్దాల్లో 35కు పైగా అణు రియాక్టర్లు నిర్మించాలని ఇండియా, చైనాలు భావిస్తున్నాయని ‘బ్రిక్స్ పోస్ట్’ పత్రిక చెప్పడం గమనార్హం. ఒప్పందం మరింత దూరం కావడంతో ఈ ఆశలు మరోసారి అడియాసలు అయ్యాయి.
స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (SIPRI – సిప్రి) అనే సంస్ధ ప్రకారం ఇండియా నూతన తరహా అణ్వాయుధ వ్యవస్ధలను అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యవస్ధలకు ఆధునిక అణు బాంబులు నిర్మించగల సత్తా ఉంటుంది. మిలట్రీ అవసరాల కోసం అణు ఇంధనాన్ని ప్రత్యేకంగా ఉత్పత్తి చేయగల సామర్ధ్యం కూడా ఈ వ్యవస్ధలకు ఉంటుంది. వైద్య ప్రయోజనాల కోసం అణు ఇంధనం ఉత్పత్తి చేస్తుంటేనే ఇరాన్ పై ఒకటిన్నర దశాబ్దాలుగా క్రూరమైన షరతులను, ఆంక్షలను పశ్చిమ దేశాలు అమలు చేస్తున్నాయి. అలాంటిది ఏకంగా మిలట్రీ ఇంధనాన్నే ఉత్పత్తి చేయడం, అది ఇండియా ఐనా సరే, అమెరికా, జపాన్ లకు ఆమోదయోగ్యం ఎలా అవుతుంది?
2011లో ఫుకుషిమా అణు కర్మాగారంలో జరిగిన ప్రమాదం దరిమిలా అక్కడ ఏర్పడిన అబధ్రతా పరిస్ధితులను చూస్తూ ఇప్పటికీ ప్రపంచం వణుకుతోంది. ఫుకుషిమాలో లీక్ అవుతున్న అణు ఇంధనం రోజు రోజుకూ ప్రమాదకరంగా పరిణమిస్తున్నా, ఆ వార్తను తొక్కిపెట్టి అసలు ప్రమాదం జరగనట్లే నటిస్తున్నాయి ప్రభుత్వాలు, పత్రికలు. అటువంటి జపాన్ తో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవాలని భావించడమే భారత పాలకులు చేస్తున్న తప్పు. ఈ అంశాన్ని భారత అణ్వాయుధ పాటవ సెంటిమెంట్ల కోణంలో చూడడం మరింత పెద్ద తప్పిదం కాగలదు. ఇప్పుడు ప్రపంచానికి కావలసింది అణ్వస్త్రాలు లేని శాంతియుత ప్రపంచం తప్ప మరిన్ని మరిన్ని అణ్వస్త్రాల కోసం పోటీ పడే మరిన్ని రాజ్యాలు కాదు.
