స్కాట్లండ్ రిఫరెండం దగ్గర పడేకొద్దీ బ్రిటన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. స్కాట్లండ్ స్వతంత్రాన్ని కోరేవారు రోజు రోజుకీ పెరుగుతుండమే దానికి కారణం. ఆర్ధిక కారణాలు, చారిత్రక కారణాలు, బెదిరింపులు, బుజ్జగింపులు… ఇలా ఎన్ని ఆశలు పెడుతున్నా యెస్ వోటు పెరుగుతుండగా నో వోటు తగ్గిపోతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. ఫలితంగా ఇంగ్లండ్ పాలకుల్లో గుబులు బయలుదేరింది. స్కాట్లండ్ స్వతంత్రాన్ని వ్యతిరేకిస్తున్న కార్పొరేట్ పత్రికలు సైతం ఆందోళన ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
ఇంగ్లండ్ నేతృత్వంలోని యునైటెడ్ కింగ్ డమ్ (యు.కె) లో భాగంగా ఉన్న స్కాట్లండ్ స్వతంత్రం కోసం సెప్టెంబర్ 18 తేదీన రిఫరెండం జరగనుంది. ఈ రిఫరెండంలో ఓటు వేసేందుకు స్కాట్ ఓటర్లు మొదట రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకునేందుకు గడువు ఈ రోజుతో (సెప్టెంబర్ 2) ముగిసింది.
స్కాట్లండ్ మొదటి నుండీ యు.కె లో భాగం కాదు. 1707లో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ రాజ్యాలు ఒకే రాచరికం కింద విలీనం అయ్యేవరకూ స్కాట్లాండ్ వేరే రాజ్యం. ఇరు రాజ్యాల మధ్యా అనేక యుద్ధాలు జరిగాయి. స్కాట్లాండ్ విలీనం ద్వారా కింగ్ డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఏర్పడి అనంతర కాలంలో ఐర్లాండ్ ను కూడా విలీనం చేసుకుంది. కానీ 1922లో ఐర్లాండ్ మళ్ళీ గ్రేట్ బ్రిటన్ నుండి వేరు పడి రిపబ్లిక్ గా అవతరించింది. అప్పటి నుండి స్కాట్లాండ్ స్వతంత్రం బ్రిటన్ రాజకీయాల్లో ఒక అంశంగా కొనసాగుతోంది.
అనేక యేళ్ళు తర్జన భర్జనలు, ఘర్షణలు ముగిసిన అనంతరం స్కాట్లాండ్ స్వతంత్రం కోసం రిఫరెండం జరపడానికి బ్రిటన్ పార్లమెంటు గత సంవత్సరమే ఆమోదం తెలిపింది. డిసెంబర్ 2013 నాటికి అన్ని పాలనా చర్యలు ముగిశాక సెప్టెంబర్ 18 తేదీన రిఫరెండం జరపాలని నిర్ణయించారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో స్కాట్లాండ్ స్వతంత్రానికి అనుకూలంగా ఉన్నవారి కంటే వ్యతిరేకంగా ఉన్నవారే చాలా ఎక్కువమంది ఉన్నారు. బహుశా ఆ ధైర్యంతోనే రిఫరెండంకు అంగీకరించారేమో తెలియదు. ఏ సంగతీ నిర్ణయించుకోని వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటూ వచ్చింది. అయితే రాను రానూ అనుకూలుర సంఖ్య పెరుగుతోంది.
ఉదాహరణకి YouGov అనే సంస్ధ ఆగస్టు ప్రారంభంలో నిర్వహించిన సర్వేలో యెస్ ఓట్లకూ, నో ఓట్లకు మధ్య వ్యత్యాసం 22 పాయింట్లు ఉన్నది. ఇది ఆగస్టు మధ్య నాటికి 14 పాయింట్లకు తగ్గిపోయింది. ఈ రోజు వెలువడిన మరో సర్వే ఫలితాల్లో ఈ తేడా ఇంకా తగ్గి 6 పాయింట్లకు చేరుకుంది. తాము సర్వే చేసినవారిలే 53 శాతం మంది స్వతంత్రానికి ‘నో’ అని చెప్పగా 47 శాతం మంది ‘యెస్’ అని చెప్పారని సర్వే సంస్ధ తెలిపింది. మరో 3 శాతం ఓటు అటు నుండి ఇటు వస్తే ఇరు పక్షాలూ సమానం అవుతాయి. ఇంకో అర పాయింట్ వస్తే నో కు 1 పాయింట్ మెజారిటీ వస్తుంది.
యెస్ వోటు ఇంత ఎక్కువ సంఖ్యలో గతంలో ఎప్పుడూ నమోదు కాలేదని పత్రికల ద్వారా తెలుస్తోంది. ద సన్, ద టైమ్స్ పత్రికల కోసం YouGov సంస్ధ తాజా సర్వే జరిపింది. స్వతంత్ర కోరుకునేవారు ‘యెస్ స్కాట్లాండ్’ పేరుతో ప్రచారం నిర్వహిస్తుండగా, కలిసి ఉండాలని కోరుకుంటున్నవారు ‘బెటర్ టుగెదర్’ బ్యానర్ కింద ప్రచారం నిర్వహిస్తున్నారు.
స్కాట్లాండ్ లో ప్రస్తుతం 2 లక్షల మంది వరకు నిరుద్యోగులుగా ఉన్నారు. వారిని ఆకర్షించడానికి ఇరు పక్షాల వాళ్ళూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కలిసి ఉంటేనే ఉపాధి ఉంటుందని ‘నో’ ప్రచారకులు చెబుతుంటే, ఇన్నాళ్లూ కలిసి ఉండగానే నిరుద్యోగం ప్రబలిందని ‘యెస్’ వోటు వారు ఎత్తి చూపుతున్నారు.
