పండుగలు ఎలా ప్రారంభం అవుతాయో తెలియజేసే పండగ స్పెయిన్ లో ఓ పట్టణం వారు జరుపుకునే ‘లా టొమాటినా’. వివిధ సంస్కృతుల మధ్య పైకి కనిపించని ఉమ్మడి ప్రవాహం ఉంటుందని కూడా ఈ పండగ తెలియజేస్తుంది. ఇటీవలే (1945) మొదలైనందున స్పెయిన్ ‘టమోటా యుద్ధం’ పండుగ మూలం ఏమిటో స్పష్టంగా రికార్డయింది. ఆగస్టు నెలలో చివరి బుధవారం నాడు జరుపుకునే ఈ పండుగ రోజున అక్కడ చేరిన జనం ఒక గంట పాటు టమోటాలు ఒకరిపై ఒకరు విసురుకుని ఆనందిస్తారు. టమోటాల ధర భరించలేక మనం ఏడుస్తుంటే స్పెయిన్ ప్రజలకి టమోటాలను వృధా చేయడం సరదా అయింది.
హోళీ పండగ రోజున మన ఉత్తరాది జనం ఎలా రంగులు జల్లుకుని ఆనందిస్తారో సరిగ్గా అదే రీతిలో అక్కడ టమోటాలు విసురుకుంటారు. బునోల్ పట్టణంలో జరిగే ఈ పండగ కోసం స్పెయిన్ లోని ఇతర ప్రాంతాల నుండి కూడా జనం వస్తారట. యువత ఎక్కువగా పాల్గొనే ఈ పండగ సందర్భంలో టమోటాల యుద్ధంలో దెబ్బలు తగలకుండా ఉండడానికి స్ధానిక మునిసిపాలిటీ ఒక షరతు పెట్టింది. టమోటాలను విసిరే ముందు నలిపి విసిరేయాలన్నది ఆ షరతు.
‘టమాటో యుద్ధం’ పండగ పుట్టిన తీరు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. 1945, ఆగస్టు నెలలో చివరి బుధవారం రోజున అక్కడి సాంప్రదాయం ప్రకారం ‘జెయింట్స్ అండ్ బిగ్ హెడ్స్’ పెరేడ్ జరుగుతోంది. ఈ పెరేడ్ లో కొందరు యువకులు అత్యుత్సాహంతో పాల్గొనడంతో ఒక వ్యక్తి కింద పడిపోయాడట. అతనికి కోపం వచ్చి కనపడిందల్లా చేతబట్టి జనం మీదికి విసరడం మొదలు పెట్టాడు. అలా విసురుతూనే పెరేడ్ లో పాల్గొంటుండగా దారిలోని మార్కెట్ లో ఒక టమోటా బండి కనపడింది. ఇక అతను ఆ టమోటాలు కూడా తీసుకుని విసరడం మొదలు పెట్టాడు. మిగిలిన జనం కూడా టమాటోలు విసరడం మొదలు పెట్టారు. స్ధానిక పోలీసులు వచ్చి చెదరగొట్టేవరకూ అది కొనసాగింది.
అదీ మొదలు! ఆ తదుపరి సంవత్సరం యువకులు తామే కూడబలుక్కుని ఉత్తుత్తి తగాదా పడ్డారు. ముందుగా అనుకున్న ప్రకారం తమ ఇళ్ల నుండి తెచ్చిన టమాటోలను విసురుకుని సరదా చేసుకున్నారు. ఈసారి కూడా పోలీసులు వచ్చి దాన్ని ఆపేశారు. ఆ విధంగా ప్రతి యేడూ యువకులు ఇదే వరస కొనసాగించారు. 1950లోనూ 1975 లోనూ పోలీసులు, మునిసిపాలిటీ వాళ్ళు ‘లా టమోటినా’ ను నిషేదించారు. కానీ ఆ నిషేధాలేవీ యువకుల్ని బెదరగొట్టలేదు. ఏదో సందు చూసుకుని టమాటోలు విసురుకునేవారు. ఇక లాభం లేదని మునిసిపాలిటీ వాళ్ళు కొన్ని షరతులు విధిస్తూ పండగకి ఆమోదం తెలిపారు. క్రమంగా ఇది టూరిస్టులకు అట్రాక్షన్ గా మారడంతో అధికారిక పండగ అయింది.
అధికారిక పండగ అయ్యాక పండగ కోసమే టమోటాలని అధికంగా పండించడం మొదలు పెట్టారు. ఈ పండగ కోసం పండించే టమోటాలు అంత రుచికరంగా ఉండవట. అది నిజమో లేక వృధా చేస్తున్నారన్న విమర్శల వల్ల అలా చెబుతున్నారో తెలియదు. పండగ మొదలైనప్పుడు ఇళ్ల నుంచి టమోటాలు తెచ్చుకోగా, ఇప్పుడు మునిసిపాలిటీ వాళ్ళే టమాటోలను ట్రక్కుల్లో తెచ్చి సరఫరా చేస్తున్నారు. పండగ ముగిశాక సిటీ సెంటర్ ని శుభ్రం చేసుకోవడం తలకు మించిన పని అవుతుందిట.
టమాటో పండగ కోసం కొన్ని నియమాలను బునోల్ మునిసిపాలిటీ, పోలీసులు అమలు చేస్తారు. టమాటోలను విసురుకోవడానికి ముందు పాత సంప్రదాయం ప్రకారం గ్రీజు పూసిన ఒక స్తంభం పైన హ్యామ్ (ఆహార పదార్ధం) ఉంచుతారు. స్తంభం ఎక్కి హ్యామ్ ని పడగొట్టడానికి యువకులు ప్రయత్నిస్తారు. ఎవరన్నా హ్యామ్ ని పడగొట్టాక పోలీసులు ఒక సైరన్ మోగిస్తారు. టమాటో యుద్ధం మొదలు పెట్టవచ్చని ఆ సైరన్ సూచిస్తుంది. దాంతో యుద్ధం మొదలవుతుంది. ఒక గంట సేపు యుద్ధం జరిగాక మళ్ళీ సైరన్ మోగించడమో లేదా తుపాకి లాంటిది పేల్చడమో చేస్తారు. ‘ఇక చాలు’ అని అది సూచిస్తుంది. ఆ విధంగా యుద్ధం ముగుస్తుంది.
హ్యామ్ వ్యవహారం కూడా మన హోళీ పండగనే పోలి ఉండడం గమనార్హం. ఎత్తులో ఓ కుండను వేలాడగడితే దానిని పగలగొట్టడానికి కొందరు ప్రయత్నించడం, వారి ప్రయత్నాలను నిరోధించడానికి కొందరు నీళ్ళు జల్లడం ఇక్కడ జరుగుతుంది. దేశంలో ఈ సంప్రదాయం ఒక్కో చోట ఒక్కో రీతిలో పాటిస్తున్నారు. గ్రీజు పూసిన స్తంభం ఎక్కి హ్యామ్ ని పడగొట్టడానికి మన హోళీ కుండ పగల గొట్టడానికి మధ్య పోలికలు గమనించవచ్చు. బహుశా మన హోళీలో రెండు అంశాల్ని (రంగుల బదులు టమాటో విసరుకోవడం, కుండ బదులు హ్యామ్ ని పడగొట్టడం) వారు అనుకరిస్తున్నారని భావించవచ్చేమో!
ఈ ఫోటోలను బోస్టన్ పత్రిక అందించింది.
Photos: Boston dot com & some other websites















