నెల వాన ఒకేసారి, మట్టిదిబ్బల కింద హిరోషిమా -ఫోటోలు


11, 2 సం.ల వయసు గల సోదరులు నిద్రలోనే సమాధి అయ్యారు. ఒక పిల్లాడి ఎర్ర స్కూల్ బ్యాగ్ బురదలో కూరుకుపోయి కనిపిస్తోంది. ఇక్కడ ఉండాల్సిన ఇల్లు కూలిపోయి, కొట్టుకుపోయి 100 మీటర్ల దూరంలో సగం తేలి కనిపిస్తోంది. బురద ప్రవాహం బలంగా దూసుకురావడంతో ఇళ్ళగోడలు చెల్లా చెదురై కొట్టుకుపోయి శిధిలాల కుప్పలై తేలాయి. మూడు మీటర్ల మందం ఉన్న భారీ రాళ్ళ కింద సగం కనిపిస్తున్న మానవదేహాలు భయం గొలుపుతున్నాయి. ఇటీవలే పెళ్లి చేసుకున్నా కొత్త జంట ఆచూకీ లేదు. ఆకాశం బద్దలయిందా అన్నట్లు కురిసిన జడివాన అనంతరం హిరోషిమా కొండవాలుల్లో కనిపించిన దృశ్యాలివి. 

రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అమానవీయ అణు దాడికి గురయిన హిరోషిమా నగరం ఆగస్టు 20 తేదీన ప్రకృతి విలయం కింద నలిగిపోయింది. నెల రోజుల వాన ఒకే రాత్రి కుమ్మరించడంతో కొండవాలుల్లో ఉన్న మట్టి చరియలు విరిగిపడి ఇళ్లను ఊడ్చేసాయి. రానున్న ప్రమాదం పసిగట్టి హెచ్చరించడంలో వాతావరణ శాఖ ఆలస్యం చేయడంతో పలువురు పౌరులు మట్టి దిబ్బల కింద సమాధి అయ్యారు. 70 మంది సజీవ సమాధి అయ్యారని జపాన్ అధికారులు ఇప్పటివరకు లెక్క తేల్చారు. 18 మంది జాడ ఇంకా తెలియలేదు.

తెల్లవారు ఝామున 3 గంటల వ్యవధిలోనే 240 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని, ఇది సాధారణంగా ఆగస్టు నెలలో, నెల రోజులలో కురియాల్సిన వర్షం అని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో మళ్ళీ సగం వర్షం అర గంటలో కురిసిందని తెలిపింది. అప్పటికే కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాన్ని మట్టి కొండలు తమలో ఇముడ్చుకుని ఉన్నాయని, ఆగస్టు 20 తేదీన ఒక్కసారిగా కుండపోత వాన కురియడంతో ఆ బరువును మోయలేక మట్టి చరియలు ఒక్కుమ్మడిగా నగరంపై విరుచుకుపడ్డాయని జపాన్ అధికారులు తెలిపారు.

కాస్త జాగా కూడా కరువైన జపాన్ లో జనం కొండల మీద కూడా ఇళ్ళు కట్టుకుని నివసించడం పరిపాటి. హిరోషిమా ప్రజలు కూడా అనేకమంది కొండ వాలుల్లో నివసిస్తున్నారు. జలప్రళయం ప్రధానంగా కబళించింది వారినే. మట్టి పెళ్ళలు ఎంత శక్తితో విరుచుకుపడ్డాయంటే ఆ బురద ప్రవాహం గంటకు 40 కి.మీ వేగంతో ఇళ్లపైకి దుమికింది. ఫలితంగా అనేక ఇళ్ళు 100 మీటర్ల దూరం వరకు కొట్టుకుపోయి చితికిపోయాయి. గోడలు, సామాన్లు చెల్లా చెదురు కావడమో బురద కింద కూరుకుపోవడమో జరిగింది. పెద్ద పెద్ద రాళ్ళు కొట్టుకుని వచ్చి మరింత నష్టం కలిగించాయి.

మొదటి మట్టి చరియ విరిగి పడిన గంట తర్వాత గానీ కొండల ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించలేదు. అప్పటికే ఆలస్యం కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పలేదు. “పరిస్ధితి విశ్లేషణలో ఎక్కడో తప్పు జరిగింది. ప్రమాదానికి ముందే హెచ్చరించడంలో మేము విఫలం అయ్యాము. దీనిని మేము సవరించుకోవాలి” అని నగర అగ్నిమాపక విభాగం అధికారి చెప్పడం బట్టి పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ఇంత భారీ వర్షాన్ని తాము ఎన్నడూ చూడలేదని పలువురు నివాసులు పత్రికలకు, ఛానెళ్లకు చెప్పారు. 1999లో కూడా ఇదే చోట భారీ వర్షం వల్ల మట్టి చరియలు విరిగిపడి 31 మంది చనిపోవడం గమనార్హం.

ప్రస్తుతం 3,000 మందికి పైగా సహాయ, రక్షణ సిబ్బంది మృత దేహాల వెలికి తీతలో నిమగ్నం అయ్యారు. విపత్తు సంభవించిన వెంటనే సజీవంగా ఉన్నవారిని హెలికాప్టర్లతో సురక్షిత ప్రాంతాలకు చేర్చడంతో మరింత నష్టం తప్పిందని తెలుస్తోంది. నగర కేంద్రానికి 5 కి.మీ దూరంలో సంభవించిన ఈ విపత్తు వల్ల అక్కడి అస్ఫాల్ట్ రోడ్లు బాగా దెబ్బతిన్నాయి.

ఈ ఫోటోలను బోస్టన్ పత్రిక ప్రచురించింది.

Photos: Boston dot com

 

వ్యాఖ్యానించండి