ముఖ్యమంత్రుల ఎగతాళికి బి.జె.పి సమర్ధన! -కార్టూన్


Booing and Heckling

“నా ప్రియమైన ఎగతాళి మరియు వెక్కిరింపుల్లారా…”

***

మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు బి.జె.పి యేతర పార్టీలకు చెందినవారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ హుడాలు కాంగ్రెస్ పార్టీ నేతలు కాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నాయకుడు.

ఇటీవల ఈ ముగ్గురితో కలిసి ప్రధాని పాల్గొన్న సభల్లో ప్రేక్షకుల్లో కొందరు పని గట్టుకుని ముఖ్యమంత్రులను వెక్కిరింపులతో వేధించే ప్రయత్నం చేశారు. మోడి ప్రసంగాన్ని చప్పట్లతో, ఈలలతో ఆమోదించి ముఖ్యమంత్రులు లేచిందే తడవుగా ఆపాలని, ఇక చాలని, దిగిపోవాలని నినాదాలు చేస్తూ, ‘బూ’ అంటూ ఎగతాళి శబ్దాలు చేస్తూ అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డారు. దానితో మోడి సభకు ఇక హాజరు కాబోమని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రకటించేశారు. హేమంత్ సొరేన్ కూడా బి.జె.పి/మోడి అభిమానుల ప్రవర్తనను నిరసించారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిర్ణయం అనంతరం సరైన నాయకుడైతే ఏం చేయాలి? వారు ఏ పార్టీ వారైనా కొందరు ప్రేక్షకుల ప్రవర్తనను తప్పు పట్టాలి. అభిమానం దురభిమానంగా మారకూడదని హితబోధ చేయాలి. అధికారిక కార్యక్రమాల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదని హెచ్చరించాలి.

కానీ బి.జె.పి నేతలు ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఇంకా తమ ఓటమి భావన నుండి కోలుకోలేదని ఎదురు దాడికి దిగుతున్నారు. ప్రజలు వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని, అది తట్టుకోలేకే ఇలా శపధాలు చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా మోడి అభిమాన గణం ప్రవర్తనను వెనకేసుకొచ్చారు. ఒక్క హోమ్ మంత్రి మాత్రం కాంగ్రెస్ సి.ఎంలు తమ నిర్ణయాన్ని సమీక్షించాలని అభ్యర్ధించారు గానీ ఆయన కూడా తమ కార్యకర్తల ప్రవర్తనను ఖండించినట్లు లేదు.

బి.జె.పి నేతృత్వం లోని ఎన్.డి.ఏ కూటమి 1999 లో కూడా 5 సం.లు దేశాన్ని ఏలింది. ‘అంతా బాగుంది’, ‘దేశం వెలిగిపోతోంది’ అని చెప్పుకుంటూ 5 సం.లు పూర్తి కాకుండానే ఎన్నికలకు పిలుపునిచ్చారు. తీరా 2004 ఎన్నికల్లో ఎన్.డి.ఏ ని అధికారం నుండి ప్రజలు తప్పించారు. మళ్ళీ 2009 ఎన్నికల్లో కూడా ఎన్.డి.ఏ కి పట్టం కట్టడానికి ప్రజలు నిరాకరించారు. బి.జె.పి నాయకుల ప్రకారం 10 యేళ్లూ బి.జె.పి ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని చెప్పాలా? ఆ పదేళ్లూ కాంగ్రెస్ కార్యకర్తలు బి.జె.పి నేతలను ఎగతాళి చేసి ఉండాలా?

“నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!” అని జనం మళ్ళీ ఎన్.డి.ఏ/బి.జె.పి లకు పాఠం చెప్పే రోజులు రాకపోవు. ఎందుకంటే కాంగ్రెస్, బి.జె.పి నేతృత్వంలోని రెండు కూటములూ అనుసరిస్తున్నది ఆ విదేశీ కంపెనీ అనుకూల నూతన ఆర్ధిక విధానాలే. ఈ విధానాలు ప్రజలకు చెరుపు చేసేవే గానీ మంచి ఎప్పుడూ చేయలేదు. ప్రత్యామ్నాయం లేని పరిస్ధితుల్లో ప్రజలు మాసిపోయిన చొక్కాని మార్చుకుని మరో మాసిన చొక్కాని తొడుక్కుంటున్నారు. సరికొత్తగా మాసిన చొక్కా స్ధానంలో పాత మాసిన చొక్కాని తొడుగుతున్నారు. ప్రజలకు మరో దారి కనపడకుండా పోయింది మరి.

కాంగ్రెస్ విధానాలనే మరింత తీవ్రంగా కొనసాగించే రాజకీయ పార్టీ/కూటమి ఏదైనా మళ్ళీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ఆ రోజున జనానికి మళ్ళీ పాత మాసిన చొక్కా మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ఎగతాళి చేసే అవకాశం అభిమాన గణానికి రాకపోవచ్చు. కాస్త తెలివి, మర్యాద, సంస్కృతి ఉన్న నాయకులు అసభ్య వర్తన ఎక్కడ జరిగినా ఖండించడం అలవర్చుకోవాలి. లేకపోతే అది తమకే బూమరాంగ్ అయ్యే పరిస్ధితి ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కార్టూన్ లో నేత పేరు చెప్పకుండా ఆ నేత ఎవరో కార్టూనిస్టు సూచించారు. ఆయన పాల్గొంటున్న సభల్లో ఎగతాళి, వెక్కిరింపులు తప్ప ప్రసంగాలు విని తెలుసుకునే బాపటు ఎవరూ లేరని కార్టూనిస్టు సూచిస్తున్నారు. దానితో నేత కూడా ‘ప్రజలారా’ అనడం మానేసి వారి స్వభావాన్ని సంబోధిస్తూ ప్రసంగం మొదలు పెడుతున్నారని కార్టూనిస్టు సూచిస్తున్నారు.

వ్యాఖ్యానించండి