మిస్సోరీ రాష్ట్రంలోని ఫెర్గూసన్ పట్టణంలో తెల్లజాతి పోలీసు ఒకరు, యువ నల్లజాతి పౌరుడు మైఖేల్ బ్రౌన్ ను కాల్చి చంపడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులపై పోలీసుల అణచివేత సైతం తీవ్ర స్ధాయిలో కొనసాగుతోంది. పట్టణంలో ఎవరినీ ఒక చోట నిలబడనీయకుండా పోలీసులు తరిమి కొడుతున్నారు. నేషనల్ గార్డ్ బలగాలు పట్టణంలో దిగి మిలట్రీ తరహా పాలనను అమలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఫెర్గూసన్ లోని పోలీసు, మిలట్రీ హింసపై విచారణ చేయడానికి అంతర్జాతీయ కమిషన్ ను నియమించాలని రష్యన్ పార్లమెంటు ఐక్యరాజ్య సమితిని డిమాండ్ చేసింది.
ప్రజాస్వామ్యానికి స్వర్గంగా తమకు తాము చెప్పుకునే అమెరికా ప్రభుత్వం మిస్సోరీలో ప్రజల ప్రజాస్వామిక ఆందోళనను పాశవికంగా అణచివేస్తోందని రష్యన్ పార్లమెంటు ఉప స్పీకర్ సెర్గీ నెవరోవ్ దుయ్యబట్టారు. వివిధ అంతర్జాతీయ సంస్ధలు కలిసి అంతర్జాతీయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఫెర్గూసన్ ఆందోళనలను అమెరికా అధికారులు అణచివేస్తున్న తీరుపై విచారణ జరిపి ప్రపంచానికి నిజాలు తెలియజేయాలని నెవరోవ్ డిమాండ్ చేశారు.
రష్యా దిగువ సభలో ‘యునైటెడ్ రష్యా’ పార్టీకి నాయకత్వం కూడా వహిస్తున్న నెవరోవ్ అమెరికా నగరంలోని సంక్షోభ పరిస్ధితి పట్ల అంతర్జాతీయ సమాజం ప్రేక్షక పాత్ర వహించడం సమంజసం కాదని, వెంటనే తగిన చర్యల ప్రక్రియ చేపట్టాలని కోరారు. “మిస్సోరీలో జరుగుతున్న వరుస ఘటనలను బట్టి చూస్తే అమెరికాలో జాతి వివక్షకు సంబంధించి తీవ్రమైన సమస్యలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది” అని నెవరోవ్ అన్నారని ఇజ్వెస్తియా పత్రిక తెలిపింది.
ఐరాస, PACE (పార్లమెంటరీ అసెంబ్లీ ఫర్ ద కౌన్సిల్ ఆఫ్ యూరోప్) తదితర అంతర్జాతీయ సంస్ధల ప్రతినిధులతో కలిసి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని యునైటెడ్ రష్యా పార్టీ సూచించింది. ఫెర్గూసన్ ఆందోళనకారులను సంప్రదించి అమెరికా పోలీసు అధికారులు, ఇతర భద్రతా బలగాలు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సమాచారం రాబట్టేందుకు ఈ కమిషన్ కృషి చేయాలని సూచించింది. అంతర్జాతీయ వ్యవహారాలను పర్యవేక్షించే రష్యన్ ఎం.పి అలెక్సీ పుష్కోవ్ తమ తరపున అంతర్జాతీయ కమిషన్ లో పాల్గొనేందుకు ప్రతిపాదిస్తున్నామని రష్యన్ డ్యూమా డిప్యూటీ స్పీకర్ నెవరోవ్ విలేఖరులకు తెలిపారు.
అల్లర్లు, అణచివేతలతో అట్టుడుకుతున్న ఫెర్గూసన్ కు శాంతి మిషన్ ను పంపించాలని రష్యన్ మానవ హక్కుల సంస్ధ కొద్ది రోజుల క్రితం ప్రతిపాదించింది. “అమెరికా తన సొంత ప్రజలపై సాగిస్తున్న హత్యాకాండను కాస్తయినా అడ్డుకోవడానికి ఇది దోహదపడుతుంది” అని మానవహక్కుల సంస్ధ ప్రతినిధి ఇగోర్ బోరిసన్ ప్రకటించాడు. ఈ ప్రతిపాదన ఎంతవరకు ఆచరణలోకి తెస్తున్నదీ వివరాలు వెల్లడి కాలేదు.
అమెరికా లోని ఆధునిక సమాజంలో విభిన్న రూపాల్లో నెలకొని ఉన్న తీవ్ర స్ధాయి ఉద్రిక్తతలకు ఫెర్గూసన్ ఆందోళనలు ప్రతిబింబిస్తున్నాయని రష్యా విదేశీ మంత్రిత్వ శాఖలోని మానవ హక్కుల ప్రతినిధి కానిస్టాంటిన్ దొల్గోవ్ వ్యాఖ్యానించాడు. కర్ఫ్యూ విధింపు, ప్రదర్శనలను హింసాత్మకంగా తరుముకోవడం, నేషనల్ గార్డ్ బలగాలను పట్టణంలో మోహరించడం… ఇలాంటి చర్యలన్నీ గతంలో అమెరికాను కుదిపేసిన జాతి వివక్షా ఉద్రిక్తతలు తిరిగి తలెత్తుతున్నాయనడానికి గట్టి సూచన అని దొల్గోవ్ తెలిపాడు.
“ఇతర దేశాలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు గ్యారంటీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలపై అణచివేతను ఆపాలని సుద్దులు చెబుతారు. కాని స్వదేశంలో మాత్రం అమెరికా అధికారులు అసమానతలపై వ్యక్తం అవుతున్న వ్యక్తీకరణలను ఏ మాత్రం సహించరు. వ్యవస్ధలో భాగం అయిన వివక్ష, రెండో తరగతి పౌరులుగా పరిగణించడం తదితర సామాజిక పెడ ధోరణుల పట్ల చురుకైన కార్యకలాపాలను వారు సహించలేరు. విలేఖరులు తమ వృత్తిగత విధులను నిర్వర్తించడానికి కూడా పోలీసులు అనుమతించని ఘటనలను మనం ఇప్పుడు చూస్తున్నాం” అని దొల్గోవ్ అమెరికా ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టాడు.
ఫెర్గూసన్ ఆందోళనలను కవర్ చేస్తున్న అమెరికన్ విలేఖరులను అక్కడి పోలీసులు, నేషనల్ గార్డ్ బలగాలు అనుమతించడం లేదు. విలేఖరుల పైనా, ఫోటోగ్రాఫర్ల కెమెరాల పైనా తుపాకులు గురిపెడుతూ వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలని లేదా కాల్చి చంపేస్తామని బెదిరిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఆందోళనకారులపైకి మృగాల్లా లంఘిస్తూ మూకుమ్మడిగా దాడులు చేస్తూ పెడరెక్కలు విరిచి కట్టివేస్తూ అనేకమందిని అరెస్టు చేస్తున్నారు. అక్రమ అరెస్టులపై సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారు. దానితో ఫెర్గూసన్ లో ప్రజలు శాంతించడం లేదు. పోలీసులు చంపింది నీగ్రో యువకుడినే అయినప్పటికీ తెల్లజాతి ప్రజలు సైతం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలలో పాలు పంచుకుంటున్నారు.







