ఎ.పి బడ్జెట్: నేల విడిచి సాము -1


Yanamala Ramakrishnudu

విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ నేల విడిచి సాము అనడం చిన్నమాట. విభజన వల్ల ఎంతో నష్టపోయామని తెలుగు దేశం ప్రభుత్వ మంత్రులు, నాయకులు ఇప్పటికీ కన్నీళ్లు పెట్టడం మానలేదు. భారీ మొత్తంలో రెవిన్యూ ఆదాయం కోల్పోయామని, హైద్రాబాద్ నగరాన్ని వదులుకోవడం వల్లనే ఈ నష్టం సంభవించిందని చెబుతూనే 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు రు. 1,11,824 కోట్ల బడ్జెట్ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది కాకుండా వ్యవసాయ బడ్జెట్ పేరుతో మరో రు. 13,110 కోట్ల వ్యయాన్ని వ్యవసాయ మంత్రి ప్రతిపాదించారు. రెండు బడ్జెట్ లు కలుపుకుని రు. 1,24,934 కోట్ల వ్యయాన్ని 2014-15 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదించారు.

ఇంత వ్యయానికి తగ్గ విశ్వసనీయమైన ఆదాయం చూపారా అంటే అదేమీ లేదు. కేంద్రం హామీ ఇచ్చిన ప్రత్యేక రాష్ట్ర హోదా, తద్వారా వచ్చే అదనపు నిధులపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ‘ఆలూ లేదు, చూలూ లేదు’ అన్నట్లు ప్రత్యేక హోదా ఇస్తున్నామని కేంద్రం బడ్జెట్ లోనూ చెప్పలేదు, బైటా చెప్పలేదు. అదేమని అడిగితే చట్టాన్ని మాత్రం చూపిస్తున్నారు. అంకెల గారడీ, నీటి మాటల మూటలు, వాగ్దానాల వరద తప్పించి ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ లో ప్రజలకు నిర్దిష్టంగా ఉపయోగపడే ప్రతిపాదనలు ఏమీ లేవు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 1.83 లక్షల కోట్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదించింది. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ లో విభజనానంతర ఎ.పి బడ్జెట్ దాదాపు 68 శాతం ఉండడం బట్టి ఆంధ్ర ప్రదేశ్ పాలకులు ఏ స్ధాయిలో అరచేతిలో స్వర్గం చూపుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. రెవిన్యూ ఆదాయంలో అత్యధిక భాగం తెలంగాణకు కోల్పోయామని ముఖ్యమంత్రి చెప్పని రోజంటూ లేదు. శ్వేత పత్రాల పేరుతోనూ, విజన్ 2029 పేరుతోనూ, 100 రోజుల పధకం పేరుతోనూ ముఖ్యమంత్రి ప్రధానంగా విభజన వల్ల జరిగిన నష్టం గురించే పదే పదే బాధపడ్డారు. అంత బాధపడిన వారు ఉమ్మడి రాష్ట్ర వ్యయంలో ఏకంగా 68 శాతాన్ని ఎలా వ్యయం చేయగలరు? బడ్జెట్ పేరుతో వాపు చూపిస్తూ బలుపు అని మోసం చేయడం తప్ప మరొకటి కాదు.

1,11,824 కోట్ల సాధారణ బడ్జెట్ లో రెండు నెలల ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్, 10 నెలల విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ కలిసి ఉన్నాయని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఆర్ధిక సంవత్సరంలో అప్పుడే 5 నెలలు గడిచిపోయాయి. మిగిలింది 7 నెలలే. ఈ 5 నెలల్లో ఎంతమేరకు ఆదాయం వసూలయిందో, ఎంతమేరకు వ్యయం చేశారో, చేసిన వ్యయం ప్రతిపాదిత బడ్జెట్ లో ఎంతమేరకు భాగంగా ఉన్నదో చెప్పే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. తద్వారా తమ మాటల్లోని నిజాయితీ ఎంతో ప్రజలకు రుజువు చేసుకునే అవకాశం వచ్చింది. కానీ బడ్జెట్ వ్యయం ఒకటి ప్రతిపాదించి ఆచరణలో తమకు అవసరమైన చోటికి నిధులు తరలించడానికి అలవాటు పడిన ప్రభుత్వాలు ఇలాంటి అవకాశాలను వినియోగించుకోలేవు.

రెవిన్యూ లోటు రు. 6,064 కోట్లు గానూ బడ్జెట్ లోటు/ఫిస్కల్ డెఫిసిట్ 12,064 కోట్లుగానూ ప్రభుత్వం చూపింది. నికర రెవిన్యూ వసూళ్లు అంచనా వేసినదాని కంటే తగ్గితే అది రెవిన్యూ లోటుగా తేలుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన నికర రెవిన్యూ వసూళ్ల కంటే 6,064 కోట్లు తక్కువగా వసూలు కావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బడ్జెట్ ఖర్చులు, మొత్తం ఆదాయాన్ని మించితే ఆ తేడా బడ్జెట్ లోటు/ఫిస్కల్ డెఫిసిట్/కోశాగార లోటు అంటారు. గడిచిన 5 నెలలు, రానున్న 7 నెలల మొత్తానికి గాను అంచనా వేసిన ఆదాయం కంటే రు. 12,064 కోట్లు ఎక్కువ ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ప్రజలకు చెబుతోంది.

ఘోరం ఏమిటంటే ప్రణాళికా వ్యయం కంటే ప్రణాళికేతర వ్యయం 3 రెట్లు కంటే ఎక్కువే ఉండడం. రు. 26,673 కోట్ల ప్రణాళిక వ్యయం ప్రతిపాదించిన ప్రభుత్వం రు. 85,151 కోట్ల ప్రణాళికేతర వ్యయాన్ని ప్రతిపాదించింది. ప్రజలకు ఉపాధి కల్పించే వ్యయం కాకుండా వృధా ఖర్చులకే ఎక్కువ పెట్టడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నదని ఈ అంకెలు చెబుతున్నాయి. 12 వేల కోట్ల భారీ లోటుతో భారీ ప్రణాళికేతర వ్యయం చూపడం అంటే ప్రజలపై పెను భారం మోపడానికి ప్రభుత్వం సిద్ధం అయిందని స్పష్టం చేయడమే.

ప్రణాళికేతర వ్యయం విషయంలో ఐక్య ఏ.పి మిగులు రెవిన్యూను కలిగి ఉండేదని విభజన తర్వాత ఏ.పి ఈ విషయంలో భారీ లోటుతో మిగిలిందని బడ్జెట్ లో మళ్ళీ చెప్పారు. “ఐక్య ఏ.పి రెవిన్యూ ఆదాయంలో విభజనానంతర ఏ.పి రెవిన్యూ (పన్ను మరియు పన్నేతర) ఆదాయం 47 శాతం మాత్రమే ఉంటుంది. అర్ధవంతమైన ప్రణాళికా వ్యయం చేసేందుకు రాష్ట్రంలో సకారణమైన వనరులు ఏమీ మిగల్లేదు” అని ఆర్ధిక మంత్రి బడ్జెట్ లో చెప్పారు. కానీ ముఖ్యమంత్రి పొద్దున లేస్తే చెబుతున్నది ఇందుకు పూర్తి భిన్నం. విస్తారమైన కోస్తా ప్రాంతం ఉన్నదని, లెక్కలేని సహజవనరులు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామని, ఇంకా ఏవేవో చేస్తామని చెబుతున్నారు. అర్ధవంతమైన ప్రణాళికా వ్యయం చేయలేని వనరుల లేమితో ఇవన్నీ ఎలా చేస్తారో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు చెప్పవలసి ఉంది. ఆర్ధిక మంత్రి రాతపూర్వకంగా చెబుతున్న వాస్తవాలు ముఖ్యమంత్రి ఆకాశ విహరణకు ఎందుకు భిన్నంగా ఉన్నాయో ప్రభుత్వం చెప్పాల్సి ఉంది.

………. ఇంకా ఉంది

1 thoughts on “ఎ.పి బడ్జెట్: నేల విడిచి సాము -1

  1. “ప్రణాళికేతర వ్యయం విషయంలో ఐక్య ఏ.పి మిగులు రెవిన్యూను కలిగి ఉండేదని విభజన తర్వాత ఏ.పి ఈ విషయంలో భారీ లోటుతో మిగిలిందని బడ్జెట్ లో మళ్ళీ చెప్పారు”

    అంటే ఇన్నేళ్ళు తెలంగాణా రాబడితో ఆంద్రకు ఖర్చులు పెట్టామని ఒప్పుకున్నట్టే.

వ్యాఖ్యానించండి