“… జనాబ్ మోడీజీ, మీతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి మేము గీత దాటితిమి.
ఇప్పుడు చూడండి ఏం జరుగుతోందో…”
***
ప్రస్తుతం పాకిస్ధాన్ రాజధాని ఇస్లామాబాద్, ముఖ్యంగా పార్లమెంటు ప్రాంతం ఆందోళనలతో రగులుతోంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ, మరో మతగురువు నేతృత్వంలోని సంస్ధ రెండూ పాకిస్ధాన్ పార్లమెంటు మీదికి దండెత్తి వచ్చారు. తమ ఆందోళనకు వారు చెబుతున్న కారణం నవాజ్ షరీఫ్ ప్రభుత్వం రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చిందని. అక్రమ ప్రభుత్వం కనుక వెంటనే రాజీనామా చేసి ఎన్నికలు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది పైకి క(వి)నిపిస్తున్న కధ.
అసలు కధ వేరే ఉంది. అదేమిటంటే నవాజ్ షరీఫ్ పార్టీ అధికారంలోకి రావడం అక్కడి సైన్యానికి ఇష్టం లేదు. గతంలో నవాజ్ ప్రభుత్వాన్ని కూల్చే పర్వేజ్ ముషర్రాఫ్ నేతృత్వంలోని సైనిక ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఏదో ఎన్నికల తంతు ముగించి ముషార్రాఫ్ దాదాపు ఏడేళ్ళు అధ్యక్షుడుగా పాలించాడు. ఇప్పుడు మళ్ళీ అదే షరీఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అదే సైన్యం పూనుకుంది. కాకపోతే ఈసారి నేరుగా రంగంలోకి దిగకుండా ఇమ్రాన్ ఖాన్, తహీరుల్ ఖాద్రిలను అడ్డం పెట్టుకుని మంత్రాంగం నడిపిస్తోంది.
పాకిస్ధాన్ లో పాలక వర్గ గ్రూపులు ప్రధానంగా రెండు శిబిరాల కింద చేరారు. ఒక గ్రూపుకు సైన్యం, కోర్టులు నాయకత్వం వహిస్తున్నాయి. మరో గ్రూపుకు పౌర ప్రభుత్వాలుగా అధికారంలోకి వస్తున్న పి.పి.పి, ముస్లిం లీగ్ పార్టీలు నాయకత్వం వహిస్తున్నాయి. ఈ పార్టీలలో ఏది అధికారం నెరపాలన్నా సైన్యం అనుమతి ఉండాలి. సైన్యాన్ని కాదని ఏమన్నా చేయదలిస్తే ఇప్పుడు షరీఫ్ ఎదుర్కొంటున్న పరిస్ధితినే ఎదుర్కోవలసి వస్తుంది.
ఇండియాతో చర్చలు జరపడం పాక్ సైన్యం కింద ఉన్న పాలక గ్రూపుకు ఇష్టం లేదు. ఇరు దేశాల సరిహద్దు నిత్యం ఘర్షణలతో ఉంటేనే సైనిక పెద్దలకు, వారి వెనుక చేరిన పాలకవర్గ గ్రూపులకు తగిన బడ్జెట్ కేటాయింపులు, కాంట్రాక్టులు లభిస్తాయి. సరిహద్దు ప్రశాంతంగా ఉంటే సైన్యం ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇండియాతో సామరస్య సంబంధాలు నెలకొని వాణిజ్యం పెరిగితే ఇక సైనిక పెద్దలకు నిద్ర పట్టదు. అందుకే ఒక పక్క మోడి, షరీఫ్ లు చర్చల కోసం ఏర్పాట్లు చేసుకుంటుంటే మరో పక్క సరిహద్దులో పాక్ సైన్యం అనేకసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఇంకా ఉల్లంఘిస్తోంది. కాల్పుల ఉల్లంఘన (ఒకవైపు నుండే జరుగుతోందని భావించనవసరం లేదు.)
ఇండియా-పాక్ సామరస్య సమంబంధాలు పాకిస్ధాన్ లో కొన్ని శక్తులకు ఇష్టం లేనట్లుంది అని ఆర్ధిక, రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానం చేయడం ఈ నేపధ్యంలోనే. కానీ చర్చలు రద్దు చేయడం ద్వారా పాకిస్ధాన్ లోని ముస్లిం మత శక్తులకు, సైనిక పాలకవర్గాలకు సానుకూల వాతావరణాన్ని మన ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయింది. ఇప్పుడు వాళ్ళు ‘చూసారా, మేము చెప్పినా వినలేదు’ అని అక్కడి జనానికి చెప్పుకుంటున్నారు. మన రక్షణ మంత్రి మాత్రం సరిహద్దులో మన వాళ్ళు దీటుగా జవాబు చెబుతున్నారని దేశానికి చెబుతున్నారు.
నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి అధికారం లోకి వచ్చింది. 342 సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలో 190 సీట్లు కైవసం చేసుకుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎటువంటి అవకతవకు చోటు చేసుకోలేదని అంతర్జాతీయ పరిశీలకులు సర్టిఫికేట్ ఇచ్చారు కూడా. అయినా షరీఫ్ ప్రభుత్వం రాజీనామా చేస్తే తప్ప ఆందోళనలు విరమించబోమని ఇమ్రాన్, ఖాద్రిలు ప్రకటించారు. పార్లమెంటు వద్ద బ్యారీకేడ్లు తొలగించడానికి ఆందోళనకారులు క్రేన్లు, బోల్ట్ కటర్లు తెచ్చినా పోలీసులు, సైన్యం చూస్తూ ఉండిపోయింది. ప్రదర్శకులు సైన్యం జోలికి వెళ్లకూడదని, వారికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వకూడదని, వారివైపు చేయి కూడా చూపకూడదని ఖాడ్రీ ఆదేశాలు ఇచ్చాడు. లేనట్లయితే ప్రదర్శనలో ఉండనవసరం లేదని ఆయన హెచ్చరించాడు కూడా. దాన్ని బట్టే ఆందోళన వెనుక ఎవరు ఉన్నారో తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వం, ఆందోళన ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో సైన్యం డిమాండ్లే ముందుకు వస్తాయి. వాటిని ఆమోదిస్తే సరే సరి. లేకపోతే ఆందోళన తీవ్రమై హింస చెలరేగే అవకాశం హెచ్చుగా ఉంది.






