TAPI గ్యాస్ పైప్ లైన్: ఫ్రెంచి కంపెనీ ఆసక్తి


TAPI pipline

ఫ్రాన్స్ కు చెందిన బడా బహుళజాతి చమురు & సహజవాయువు కంపెనీ టోటల్ (TOTAL) భారత్ కు గ్యాస్ తెచ్చే పైప్ లైన్ పై ఆసక్తి ప్రదర్శిస్తోంది. తుర్క్ మెనిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్-పాకిస్ధాన్-ఇండియా (T-A-P-I) దేశాల మీదుగా సాగే ఈ పైప్ లైన్ నిర్మాణంలో తానూ భాగం పంచుకుంటానని టోటల్ ముందుకు వచ్చింది. ఇరాన్ నుండి గ్యాస్ ను తెచ్చే పీస్ పైప్ లైన్ (ఇరాన్-పాకిస్ధాన్-ఇండియా) నుండి వెనక్కి తగ్గి అమెరికా ఒత్తిడితో TAPI పైప్ లైన్ వైపు మొగ్గు చూపిన ఇండియాకు నిధుల కొరత వలన అది కూడా ఇంతవరకు సాకారం కాలేదు. టోటల్ ఆసక్తి ఆచరణ రూపం దాల్చుతుందో లేదో చూడాలి.

మధ్య ఆసియా దేశం తుర్క్ మెనిస్తాన్ లో భారీ సహజవాయువు నిల్వలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ల మీదుగా పైప్ లైన్ నిర్మాణం చేస్తే దాని ద్వారా గ్యాస్ సరఫరా చేయడానికి తుర్క్ మెనిస్తాన్ ముందుకు వచ్చింది. ఇరాన్ పైప్ లైన్ ను పక్కన బెట్టడానికి అమెరికా ఈ పధకాన్ని ప్రతిపాదించింది. అయితే ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్ మిలిటెన్సీ తమకు సమస్య అవుతుందని ఇండియా భావిస్తూ వచ్చింది.

కానీ చైనా ఇప్పటికే తుర్క్ మెనిస్తాన్ నుండి ఒక పైప్ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని రెండో పైప్ నిర్మాణానికి కూడా పూనుకోవడంతో భారత ప్రభుత్వానికి చురుకు పుట్టింది. గత సం.ము నవంబర్ లో భారత విదేశీ శాఖ, ఇంధన శాఖకు చెందిన అధికారులు తుర్క్ మెనిస్తాన్ వెళ్ళి TAPI పైప్ లైన్ గురించి తీవ్రంగా చర్చించారు. కానీ 8 నెలలైనా అతీ గతీ లేదు. ఫ్రాన్స్ కంపెనీ రంగంలోకి దిగుతానని చెబుతోంది కనుక ఇప్పుడన్నా భారత ప్రభుత్వం కదులుతుందని ఆశిస్తున్నారు.

ఇంధన భద్రతను అన్నీ దేశాలు ప్రాధాన్య అంశంగా పరిగణిస్తాయి. అమెరికా లాంటి దేశాలైతే ఇంధనం కోసమే మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని అగ్ని గుండంగా మార్చింది. చైనా ఆర్ధిక శక్తి గెంతులు వేస్తూ ముందుకు సాగుతున్న నేపధ్యంలో ఆ దేశ ఇంధన అవసరాలు అదే వేగంతో పెరుగుతున్నాయి. దానితో దాదాపు ఇంధన వనరులు ఉన్న దేశాలన్నింటిలోనూ పెట్టుబడులు పెడుతూ ఇంధన భద్రతను గ్యారంటీ చేసుకుంటోంది.

TAPI పైప్ లైన్ కోసం నిధులు సమకూర్చడం సమస్య కావడంతో ముందుకు సాగలేదని, ఆఫ్-పాక్ మిలిటెన్సీ పెద్ద సమస్య అనీ వివిధ కారణాలు భారత అధికారులు చెబుతున్నారు. ఈ కారణాలు వాస్తవమే అయినా ఇతర దేశాల పైప్ లైన్ నిర్మాణాలు మాత్రం ఆగలేదు. “ఈ ప్రాజెక్టుకు అవసరమైన పెట్టుబడి సమకూర్చడానికి ఎవరూ ముందుకు రావడం లేదు” అని భారత ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారని ది హిందు తెలిపింది.

TAPI నిర్మాణానికి ఒక కన్సార్టియం ఏర్పాటు చేయాలని గతంలో అనుకున్నారు. ఈ కన్సార్టియంకు తాను నాయకత్వం వహిస్తానని ఇప్పుడు టోటల్ ముందుకు వచ్చింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు మద్దతును టోటల్ తీసుకోనుంది. కీలకమైన సలహా సంప్రతింపులు నిర్వహించడం, ప్రాజెక్టు ప్రారంభం కావడానికి ఏర్పాట్లు చేయడం లాంటి బాధ్యతలను ఏ.డి.బి నిర్వహించనుందని తెలుస్తోంది.

TAPI పైప్ లైన్ తుర్క్ మెనిస్తాన్ లోని యోలోటన్ ఉస్మాన్ సహజవాయు క్షేత్రం నుండి గ్యాస్ సరఫరా కావడానికి ఉద్దేశించారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ లోని హెరాత్, కాందహార్ ల గుండా పాక్ లో ప్రవేశిస్తుంది. పాక్ లో క్వెట్టా, ముల్తాన్ ల గుండా ప్రయాణించి ఇండియా-పాక్ సరిహద్దులోని ఫజిల్కా వద్ద ఇండియాలో ప్రవేశిస్తుంది. 2010లో ప్రతిపాదించబడిన ఈ పైప్ లైన్ నాలుగు దేశాల ప్రభుత్వాల అనుమతి పొందింది. నిర్మాణ ప్రారంభం మాత్రం ఇంకా జరగలేదు. ఆరంభం కావడానికి తగిన ప్రక్రియలను ఏ.డి.పి పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

“TAPI పైప్ లైన్ పశ్చిమ దేశాలు ప్రతిపాదించినది. ఎవరు ప్రతిపాదించినా మనకు గ్యాస్ అందినంతవరకు దానితో మనకు ప్రమేయం లేదు” అని భారత అధికారి చెప్పడం గమనార్హం. 1735 కి.మీ మేర నిర్మించవలసిన పైప్ లైన్ మొదట అనుకున్నదాని ప్రకారం 2017 నాటికి పూర్తి కావాలి. తుర్క్ మెనిస్తాన్ లో వాణిజ్య పరంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న టోటల్ కంపెనీకి TAPI ఒక అందివచ్చిన అవకాశం. ఇరాన్ అణు కార్యక్రమం సాకు చూపి ఇరాన్-పాక్-ఇండియా పైప్ లైన్ ను అడ్డుకోవడం ద్వారా పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీలు ఈ విధంగా లబ్ది పొందుతున్నాయి.

ఇరాన్ అణు కార్యక్రమంను పశ్చిమ దేశాలు సమస్యగా చూపడం తమ వాణిజ్య అవసరాల కోసమే అని ఈ సందర్భంగా అర్ధం చేసుకోవాల్సిన విషయం. ఇరాన్ తన చమురు, సహజవాయువు సంపదలను వెలికి తీసేందుకు పశ్చిమ దేశాలకు అనుమతి ఇవ్వదు. తామే తమ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుని సమ సంపదను తామే అనుభవించడం ఇరాన్ అనుసరిస్తున్న విధానం. అనగా ఇరాన్ ప్రభుత్వం అచ్చమైన స్వతంత్ర జాతీయ ప్రభుత్వం అన్నట్లు. ఇది పశ్చిమ కంపెనీలకు నచ్చలేదు. తమకు అవకాశం ఇవ్వనందుకు కక్ష గట్టి ఇరాన్ వద్ద లేని అణు బాంబును సాకుగా చూపి దశాబ్దాలుగా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అంతర్జాతీయ రౌడీయిజం సాగిస్తున్నాయి.

అమెరికా, ఐరోపా దేశాల పెత్తనానికి లొంగిపోయిన భారత పాలకులు చౌక ధరలకు లభ్యమయ్యే నాణ్యమైన ఇరాన్ చమురు, సహజవాయువులను వదులుకుని తమ మాస్టర్లు ప్రతిపాదించిన TAPI వైపు మొగ్గు చూపారు. ఆఫ్-పాక్ మిలిటెన్సీ వల్ల ఎప్పటికైనా సమస్యే అని భారత పాలకులు ఇప్పటికీ అభిప్రాయపడుతున్నా తదనుగుణంగా ప్రాధామ్యాలను మార్చుకునే శక్తి వారికి కొరవడింది.

One thought on “TAPI గ్యాస్ పైప్ లైన్: ఫ్రెంచి కంపెనీ ఆసక్తి

  1. పీస్ పైప్ లైన్ నిర్మణంలో అడ్డంకులు తొలగించుకో వలసిన అవసరం ఇరాంతో పాటూ భారత్ కూ ఉన్నది.ఇరాన్ ఈవిషయంలో ఎంతచొరవతీసుకుంటుందో కూడా తెలుసుకోవలసిన అవసరం ఉన్నదికదా!(అంతర్గతం ఐనప్పటికీ) మరీముఖ్యంగా జాతీయవాద ప్రభుత్వమైన ఇరాన్ ఈవిషయంలో చొరవతీసుకోవలసిన అవసరం ఎంతోఉన్నదికదా!
    ఈ విషయానికి సంభంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా?

వ్యాఖ్యానించండి