గాజా విధ్వంసం: బిగ్ బెన్ ముందు వినూత్న నిరసన -ఫోటోలు


గాజా విధ్వంసకాండపై బ్రిటన్ స్వచ్ఛంద సంస్ధ ఆక్స్ ఫాం వినూత్న నిరసన చేపట్టింది. గాజా ప్రజల దీన పరిస్ధితిని తెలియజేస్తూ 150 మంది కార్యకర్తలు చేసిన ఈ ప్రదర్శన ప్రపంచాన్ని ఆకర్షించింది. చిన్న చెక్క పెట్టెలను బ్రిటిష్ పార్లమెంటు మైదానం ముందు ఉంచి అందులో ఇరుక్కుని కూర్చోవడం ద్వారా ఆక్స్ ఫామ్ గాజా ప్రజలు అత్యంత చిన్న ప్రదేశంలో ఇరుక్కుని బతుకుతూ కూడా ఇజ్రాయెల్ దురహంకార అణచివేతను ఎదుర్కొంటున్నారని ప్రదర్శన ద్వారా తెలిపారు.

బ్రిటన్ పాలనా కేంద్ర స్ధలం అయిన వెస్ట్ మినిస్టర్ లో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. గురువారం జరిగిన ఈ ప్రదర్శన ద్వారా దేశవ్యాపిత నిరసనలకు శ్రీకారం చుట్టామని ఆక్స్ ఫాం తెలిపింది. ఆక్స్ ఫాం సంస్ధ గాజాలో స్వయంగా 4 ఆసుపత్రులు నిర్వహిస్తోంది. ఈ ఆసుపత్రులన్నీ ఇజ్రాయెల్ బాంబుదాడుల్లో ధ్వంసం అయ్యాయని సంస్ధ తెలిపింది.

నిరసనకారులు ఇరుక్కుని కూర్చున్న చెక్కపెట్టెల మధ్య గాజా అక్షరాలను ప్రదర్శించారు.

గాజాను దిగ్బంధించడం వలన దాడులు ముగిసిన తర్వాత కూడా అక్కడి ప్రజలు పూర్తిగా కోలుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదని ఆక్స్ ఫాం ప్రతినిధులు చెప్పారు. “గాజాలోని పాలస్తీనా ప్రజలపై ఇంకా దిగ్బంధనం కొనసాగితే, దానిని అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకుంటే అది తన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడమే అవుతుంది” అని ఆక్స్ ఫాం ప్రతినిధి నిషాంత్ పాండే అన్నారు.

లక్షమందికి పైగా గాజన్ల ఇళ్ళు పూర్తిగా ధ్వంసం అయ్యాయని 15 ఆసుపత్రులు, 16 క్లినిక్ లు పనికిరాకుండా నాశనం చేశారని ఆక్స్ ఫాం తెలిపింది. 200 పాఠశాలలపై దాడులు చేశారని వాటిలో 25 పాఠశాలలు పూర్తిగా ధ్వంసం కాగా మిగిలినవి పునరుద్ధరించడం ఇప్పట్లో సాధ్యం కాదని తెలిపింది.

ఇవే కాక ప్రజల జీవనాధార వసతులను కూడా ధ్వంసం చేశారని సంస్ధ తెలిపింది. డజన్ల కొద్దీ బావులు, పైప్ లైన్లు, రిజర్వాయర్లు ధ్వంసం కావడంతో 18 లక్షల మంది గాజన్లు శుభ్రమైన నీరు లేకుండా పోయిందని తెలిపింది. ఇప్పుడు గాజా ప్రజలకు 5 రోజులకు ఒకసారి కాస్త నీరు మాత్రమే ఇవ్వగలుగుతున్నారని తెలియజేసింది. డ్రైనేజి వ్యవస్ధ మొత్తం నాశనమై మురుగు నీరు మొత్తం బైటికి వచ్చి దాడుల వల్ల ఏర్పడిన గుంటలు, గోతుల్లో నిలవ చేరిందని ఫలితంగా తీవ్ర ఆరోగ్య సంక్షోభం ఏర్పడనుందని తెలిపింది.

“ప్రస్తుత సంక్షోభానికి ముందు కూడా గాజా దిగ్బంధనం వల్ల ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా కుచించుకుపోయింది. దీనిని ఎత్తివేయించే అవకాశాలను అంతర్జాతీయ సమాజం వదిలేస్తోంది” అని నితిశ్ పాండే ఆరోపించారు.

ఈ కింది ఫోటోలను రష్యా టుడే పత్రిక అందించింది.

 

వ్యాఖ్యానించండి