పాకిస్తాన్ పై తప్పుడు సలహాలు -ది హిందు సంపాదకీయం


Modi in Leh

(Ill-advised on Pakistan శీర్షికతో ది హిందూ ఈ రోజు సంపాదకీయం రాసింది. దానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)

నరేంద్ర మోడి అసలు స్వరూపం ఏమిటి? ఎన్నికల విజయం నాటి ఆరంభ పుష్టితో ఇస్లామాబాద్ కు స్నేహ హస్తం చాచి, తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించి, ఆయనతో తమ తమ తల్లుల కోసం దుశ్శాలువలు, చీరలు ఇచ్చిపుచ్చుకున్న వ్యక్తా? లేక “సంప్రదాయ యుద్ధం చేయగల సామర్ధ్యాన్ని పాకిస్ధాన్ కోల్పోయింది. కానీ ఉగ్రవాదం లాంటి పరోక్ష యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది” అంటూ మంగళవారం అపహాస్యం చేసిన వ్యక్తా? యధార్ధత విషయానికి వస్తే, ప్రధాని నరేంద్ర మోడి చెప్పిన సంగతులు అవాస్తవాలేమీ కాదు. భారత దేశం పైకి ఐ.ఎస్.ఐ ఉగ్రవాద గ్రూపులను ఉసిగొల్పిందని పాకిస్తాన్ లో కూడా ఒప్పుకోలు ఉంది. కొద్దివారాల క్రితమే, అధికారిక స్ధాయి చర్చలను పునఃప్రారంభించాలన్న నిర్ణయం ప్రకటించడం ద్వారా సమస్యాత్మక పొరుగు దేశాన్ని సంభాషణల్లోకి దించాలన్నదే మోడి ప్రభుత్వం లక్ష్యం అయితే గనుక, ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం అందుకు మంచి ప్రారంభం కాదు.

రాజకీయ నేతలు తమ శ్రోతలకు తగినట్లుగా తమ ప్రసంగాలను మలుచుకునే ధోరణివైపు మొగ్గు కనబరుస్తారు. ప్రధాన మంత్రి వ్యాఖ్యలు లే లో సైనికులతో సంభాషించిన సందర్భంగా ఉబికి వచ్చాయి. అవతలివైపు అదే తరహా శ్రోతలతో మాట్లాడిన సందర్భంగా నవాజ్ షరీఫ్ కూడా అదే తరహాలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఉండవచ్చు. మినహాయింపు ఏమిటంటే ఆయన అలా మాట్లాడలేదు. గతవారం జాతీయ భద్రతపై ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ, శ్రోతల్లో ఆర్మీ చీఫ్ జనరల్ రషీద్ షరీఫ్, ఐ.ఎస్.ఐ బాస్ లెఫ్టినెంట్ జనరల్ జహీరుల్ ఇస్లాం, ఇతర భద్రతా బలగాల సభ్యులు, పౌర అధికారులు తదితరులు ఉండగానే,  భారత దేశంతో సత్సంబంధాలు లేనందుకు ఆయన విచారం ప్రకటించారు. ఇండియాతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఇదే మంచి సమయమని ఆయన చెప్పారు.

నవాజ్ షరీఫ్ చేతులను శక్తివంతం చేయడానికి రాయబార పరంగా భారత దేశం చేయగలిగినదంతా చేయాలని సాధారణ పరిజ్ఞానం (కామన్ సెన్స్) డిమాండ్ చేస్తుంది. లేదా కనీసం ఆయనను బలహీనపరిచే విధంగా ఏమీ మాట్లాడకపోవడం అన్నా చెయ్యాలి. లడఖ్ లో మోడి మాట్లాడుతుండగానే సరిహద్దుకు ఆవల 400 కి.మీ దూరంలో, ఇస్లామాబాద్ లో, పాకిస్ధాన్ ప్రధాని తన ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి పోరాటానికి సిద్ధం అవుతున్న సంగతి ఆయనకు తెలియకుండా ఉండదు. రాజకీయ సాహసంలోకి దూకిన మతపెద్ద తాహిర్ ఉల్ ఖాద్రి, రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చేతులు కలిపి షరీఫ్ ను పదవీచ్యుతుడిని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇది సాధించడానికి ప్రపంచ వ్యాపితంగా అంగీకరించబడిన మార్గం ఎన్నికలు. ఆగస్టు 14 స్వతంత్ర దినం రోజున తమ అనుచరులతో లాహోర్ నుండి పాకిస్ధాన్ రాజధాని పైకి దండెత్తి, షరీఫ్ దిగిపోయే వరకూ ముట్టడి చేస్తామని వారు పధకం వేసుకున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వం రాజధానికి దారి తీసే అన్ని మార్గాలను మూసివేసింది. శాంతి భద్రతలు కుప్పకూలే అవకాశాలు పొంచి ఉన్నాయి. తాము జోక్యం చేసుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలుస్తున్నామని పాక్ మిలట్రీ ప్రకటించింది. మిలట్రీకి షరీఫ్ పైన ప్రేమానురాగాలు ఏమీ లేవు. ఆయన ఇండియాతో సత్సంబంధాలు కాంక్షిస్తున్నందుకే ఆయనపై ప్రత్యేకంగా అపనమ్మకాన్ని పెంచుకుంది. న్యూ ఢిల్లీని ప్రసన్నం చేసుకోవడానికి పాకిస్ధాన్ సాగిలపడుతోందంటూ ఆ దేశంలో ఉన్న ఒక అభిప్రాయాన్ని మోడి ప్రకటన మరింత బలీయమే కావిస్తుంది. షరీఫ్ ను కూలదోయాలని భావిస్తున్నవారిని శక్తివంతం చేస్తుంది. అంతిమంగా, ఇండియా-పాకిస్ధాన్ సంబంధాలను సాధారణ స్ధితికి తేవాలన్న లక్ష్యానికి వ్యతిరేకంగా మాత్రమే అది ఉపయోగపడుతుంది.

 

One thought on “పాకిస్తాన్ పై తప్పుడు సలహాలు -ది హిందు సంపాదకీయం

  1. హిందూ పేపర్లో ఇటువంటి సలహాలు ఎన్నో ఇస్తూంటారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన తరువత జరిగిన సంగతేమిటి? పాక్ పంజాబ్ అసెంబ్లిలో భారత ప్రభుత్వనికి వ్యతిరేకం గా చర్చలు, తీర్మానాలు జరీగాయి. పాక్ పంజాబ్ ముఖ్యమంత్రి నవాజ్ షరీఫ్ సోదరుడే. ఆయనే కాదు ఇంకా చాలా మంది భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. వాళ్ల మేసేజ్ వాళ్లు పంపారు. అక్కడితో పైస్థాయి దౌత్యం అయిపోయింది.
    పాకిస్తాన్ లో ఎన్నికల సమయం లో భారి ఎత్తున రింగింగ్ జరిగిందని ఇమ్రాన్ ఖాన్ మొదటనే ఆరోపించాడు. నవాజ్ షరిఫ్ గారికి మిలటరి వారి అండదండలు ఉన్నాయని కూడా ఆరోపణలు చేశారు. వారి అండ లేకుండా అక్కడ ఎమి జరగదు. పైకి ఎన్ని మాట్లాడినా అసలు కీలక పాత్రధారులు వారే! ఆ దేశం లో తుమ్మితే ఊడిపోయేలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. అక్కడ ప్రజాస్వామ్యం ప్రజలకొరకు కాదు. మాది ప్రజాస్వామ్య దేశం అని ఇతరదేశాలకు చెప్పుకోవటానికి. ఇక మోడి గారు అధికారం ఎవరి చేతిలో ఉందో వారికే మెసెజ్ పంపారు. ఎందుకంటే ఆ దేశం లో మిలటరి వ్యవస్థ పాదుకొని పోయింది. అక్కడ వారే శాశ్వత పాలకులు !

వ్యాఖ్యానించండి