ఇంకెవరు, రాజవంశమే. దృతరాష్ట్రుడు గుడ్డివాడయినందుకు ఆయన్ని సింహాసనానికి దూరం చేశారా? పోనీ జనంలో ఇంకా ఎవరన్నా ఉద్దండుడు ఉన్నారా అని వెతికారా? లేదు కదా! ఆయన తమ్ముడు పాండు రాజుచేత బాధ్యతలు నిర్వర్తింపజేస్తూ ఆ గుడ్డాయన్నే కుర్చీలో కూర్చోబెట్టారు.
సో కాల్డ్ ప్రజాస్వామ్యం లోనూ అదే తంతు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో రాజకీయ పార్టీలకు నాయకత్వం ఎక్కడి నుండి వస్తుంది? కార్యకర్తల నుండే రావాలి. కింది స్ధాయి నుండి సంస్ధాగత ఎన్నికలు జరిపించాలి. ఆ ఎన్నికల్లో నెగ్గిన వారిలోనుండి మరికలను ఎన్నుకోవాలి. ఆ మెరికలంతా కలిసి తమలో ఒకరికి బాధ్యతలు అప్పగించాలి. ప్రాజాస్వామ్య వ్యవస్ధలో నిజమైన నాయకుల కోసం వెతికే పద్ధతి అదే.
మనది ప్రజాస్వామ్య వ్యవస్ధ కాదని, మనల్ని ఇంకా రాజవంశాలే పాలిస్తున్నాయని తెలియడానికి ప్రబల సాక్ష్యం కాంగ్రెస్ పార్టీయే. తరతరమ బేధాలతో మిగతా పార్టీలూ అదే బాటలో నడవడం వేరే సంగతి!
యువరాజు గారి నాయకత్వం కాంగ్రెస్ నాయకులకు నచ్చడం లేదు. దానితో ప్రత్యామ్నాయం ఎవరా అని తర్జన భర్జనలు పడుతున్నారు. ఆ పార్టీలో నిజంగా ప్రజాస్వామ్యం అన్నది ఏడిస్తే ప్రత్యామ్నాయం కోసం పార్టీలో వెతకాలి. అంత చరిత్ర గల పార్టీలో నాయకులు లేకపోవడం ఏమిటి? కాకపోతే పార్టీలో వెదకడానికి బదులు, ఆ కుటుంబంలోనే వెతికితే ఎవరు కనిపిస్తారు?
మళ్ళీ ఆ రాజవంశీయులే కనిపిస్తారు. ఇప్పుడు రాహుల్ వల్ల కావడం లేదు గనక ఆయన చెల్లెలు ప్రియాంక రంగంలోకి దిగాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వలోపాన్ని అంతం చేయగల యంత్రంగా గోడకు తగిలించబడి సిద్ధంగా ఉన్నారామె. ఆమె సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు గానీ, గోడకు తగిలించబడి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఉపయోగపడేలా సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నాయక గణం ఆశిస్తోంది.
కాంగ్రెస్ నాయకగణమే కాదు, కాంగ్రెస్ అధినేత్రి, ఆమె వారసుడు కూడా అదే ఆశిస్తున్నారని ఈ కార్టూన్ సూచిస్తున్నట్లు కనిపిస్తోంది.
