స్టేటస్ కో కోసమే జ్యుడీషియల్ కమిషన్ బిల్లు


supreme court of india

సుప్రీం కోర్టు, హై కోర్టుల జడ్జిల నియామకాలకు సంబంధించి యు.పి.ఏ చేయలేని పనిని ఎన్.డి.ఏ సాధించేవైపుగా పరిణామాలు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టులకు, హై కోర్టులకు జడ్జిలను నియమించే అధికారం ప్రస్తుతం పూర్తిగా సుప్రీం చేతుల్లో లేదా న్యాయ వ్యవస్ధ చేతుల్లో ఉంది. దీనిని మార్చేవైపుగా ఎన్.డి.ఏ ప్రభుత్వం నూతన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ఈ రోజు ప్రవేశపెట్టింది. ఫలితంగా యు.పి.ఏ పదేళ్ళలో చేయలేని పనిని ఎన్.డి.ఏ సాధించనుంది.

నూతన ఆర్ధిక విధానాలలో భాగంగానూ, ప్రపంచ బ్యాంకు, ఐ.ఏం.ఎఫ్ లు బలవంతంగా రుద్దిన వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమంలో భాగంగానూ  అమలు చేస్తున్న ఆర్ధిక సంస్కరణల పురోగతిని కోర్టు నిర్ణయాలు ఆటంకంగా మారాయని రాజకీయ వ్యవస్ధ భావిస్తోంది. ఈ నేపధ్యంలో జడ్జిల నియామకంలో అధికారాలన్నీ సుప్రీం కోర్టు చేతుల్లో కేంద్రీకృతం అయిన పరిస్ధితిని మార్చాలని యు.పి.ఏ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ న్యాయ వ్యవస్ధ ఎక్కడికక్కడ బ్రేకులు వేయడంతో యు.పి.ఏ ప్రయత్నం ముందుకు సాగలేదు.

ఎన్.డి.ఏ కు పూర్తి స్ధాయి మెజారిటీ చేకూరడంతో ఎన్.డి.ఏ తాను అనుకున్నదే తడవుగా న్యాయ వ్యవస్ధ లో సంస్కరణలు తేవాలన్న రాజకీయ పాలనా వ్యవస్ధ చిరకాల కోరికను నెరవేర్చే పనిలో ముందుకు సాగుతోంది. తాజా రాజ్యాంగ సవరణ ఆమోదం పొందితే ఇక నుండి జడ్జిల నియామకంలో రాజకీయ ప్రభుత్వం (executive wing) పాత్ర ఉండబోతోంది.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సుప్రీం కోర్టు, హై కోర్టులలో జడ్జిల నియామకంలో కొలీజియందే ప్రధాన పాత్ర. ప్రభుత్వ పాత్ర కూడా ఉన్నప్పటికీ అది నామమాత్రం. నూతనంగా నియమించదలుచుకున్న జడ్జిల పేర్లను కొలీజియం ప్రతిపాదించి ప్రభుత్వానికి పంపుతుంది. సదరు పేర్లను ప్రభుత్వం ఆమోదించవచ్చు లేదా అభ్యంతరం ఉంటే తిరిగి కొలీజియంకు జాబితాను తిప్పి పంపవచ్చు. అభ్యంతరం ఉన్న పేర్లకు తగిన కారణాలు చూపాల్సి ఉంటుంది. ఈ అభ్యంతరాలను కొలీజియం పరిశీలిస్తుంది. మళ్ళీ అవే పేర్లను కొలీజియం సిఫారసు చేస్తే వాటిని ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోద ముద్ర వేయాల్సిందే.

ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్ధకు మధ్య సంబంధాలు సరిగ్గా ఉంటే ఇరువురికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులే జడ్జిలుగా నియమితులవుతారు. కానీ సంఘర్షణ పరిస్ధితులు ఉన్నప్పుడు కోర్టులదే పై చేయి అయ్యే పరిస్ధితి కొలీజియమ్ వ్యవస్ధలో నెలకొని ఉంది. ఈ పరిస్ధితిని మార్చాలని శాసన వ్యవస్ధ, బ్యూరోక్రసీలను నియంత్రిస్తున్నా పాలక వర్గాలు సంకల్పించాయి. యు.పి.ఏ ద్వారా నెరవేర్చుకోలేని ఆ పనిని ఎన్.డి.ఏ ద్వారా నిర్విఘ్నంగా నెరవేర్చుకోనున్నాయి.

ప్రతిపాదిత 121వ రాజ్యాంగ సవరణ ప్రకారం 6గురు సభ్యులతో కూడిన జ్యుడీషియల్ కమిషన్ జడ్జిల నియామకాలను నిర్వహిస్తుంది. కమిషన్ కు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వం వహిస్తారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ (ఎన్.జె.ఏ.సి) గా పిలిచే కమిషన్ లో మరో ఇద్దరు సీనియర్ జడ్జిలు సభ్యులుగా ఉంటారు. విశిష్ట వ్యక్తుల పేరుతో ఇద్దరినీ బైటి నుండి సభ్యులుగా నియమిస్తారు. ఆరో సభ్యుడిగా న్యాయా శాఖ మంత్రి ఉంటారు.

ఇద్దరు విశిష్ట వ్యక్తులను ఎవరు నియమిస్తారు? సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు లేదా అత్యధిక సీట్లు దక్కిన ప్రతిపక్ష పార్లమెంటరీ నేత లతో కూడిన కొలీజియమ్ ఇద్దరు విశిష్ట వ్యక్తులను ఎన్నుకుంటుంది. ఇద్దరిలో ఒకరిని షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలు, లేదా ఓ.బి.సిలు లేదా మహిళలు లేదా మైనారిటీల నుండి తప్పనిసరిగా నియమిస్తారు. ఈ ఇద్దరి పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుంది.

కమిషన్ సభ్యుల పొందికను భవిష్యత్తులో ప్రభుత్వాలు మార్చకుండా ఉండడానికి కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పిస్తారు. అనగా కమిషన్ సభ్యుల పొందికను మార్చాలంటే మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి తప్ప సాధారణ సవరణతో సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణకు 2/3 వంతు మెజారిటీ అవసరం అవుతుంది. సాధారణ సవరణకు సాధారణ మెజారిటీ చాలు. నూతన చట్టం కోసం న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రెండు బిల్లులు ప్రవేశపెడతారు. ఒకటి రాజ్యాంగ సవరణ కోసం, రెండు ఎన్.జె.ఏ.సి-2014 బిల్లు కోసం.

యు.పి.ఏ చేయదలుచుకుని కూడా చేయలేకపోయిన, ఎన్.డి.ఏ సాధించనున్న ఈ చట్టం (చట్ట సవరణ) ద్వారా రాజకీయ వ్యవస్ధ ఏం సాధించదలుచుకుంది? ఇప్పుడున్న కొలీజియం వ్యవస్ధతో రాజకీయ నాయకులకు ఉన్న సమస్య ఏమిటి?

రాజ్యాంగ నిర్మాతలు రాజ్యంలోని మూడు వ్యవస్ధలకు సమాన అధికారాలను అప్పగించారు. పార్లమెంటు, అసెంబ్లీలు (చట్టాలను తయారు చేసేవి), ఎక్జిక్యూటివ్ లేదా బ్యూరోక్రసీ (చట్టాలను అమలు చేసేది), న్యాయ వ్యవస్ధ (చట్టాలను సమీక్షించేది)… ఈ మూడింటికి సమాన అధికారాలు అప్పగించడం ద్వారా భారత ప్రజాస్వామ్యం నిస్పక్షపాతంగా పని చేస్తుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారని ప్రజాస్వామ్య ప్రియులు తరచుగా చెప్పేమాట.

అయితే ఆచరణలో ఈ మూడు వ్యవస్ధలను అంతిమంగా పార్లమెంటును గుప్పిట్లో పెట్టుకున్న శక్తులే శాసిస్తూ వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో కుంభకోణాలు వరుసగా వెల్లడవుతూ అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో నిరసన ప్రబలడంతో న్యాయ వ్యవస్ధ తన అధికారాలను కాస్త ఉపయోగించడం ప్రారంభించింది. ఇది రాజ్యాన్ని చేతుల్లో పెట్టుకున్న వర్గాలకు కంటగింపు అయింది. కోర్టులు క్రియాశీలకం అయినప్పుడల్లా ఎగ్జిక్యూటివ్ అధికారాల్లోకి కోర్టులు చొరబడరాదని ప్రభుత్వనేతలు అభ్యంతరం చెప్పడం పరిపాటి అయింది.

నిజానికి న్యాయ వ్యవస్ధ క్రియాశీలత (judicial activism) అనేది భారత దేశంలో ఒక మిధ్య మాత్రమే. కోర్టుల క్రియాశీలత అంటూ ప్రభుత్వాలు చెపుతున్న అభ్యంతరం వాస్తవంలో కోర్టులు ఇన్నాళ్లూ చేయలేని పనిని కాస్తన్నా చేయడం వల్ల కనిపిస్తున్నదే తప్ప రాజ్యాంగం అప్పగించిన బాధ్యతను మీరడం వల్ల వ్యక్తం అవుతున్నది కానే కాదు.

ఆర్ధిక సంస్కరణల పేరుతో రెండున్నర దశాబ్దాలుగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న నూతన ఆర్ధిక విధానాలు దేశ వనరులను విస్తృతంగా, పచ్చిగా దోపిడీ చేసే అవకాశాలను ఏర్పరిచాయి. దేశ ప్రజలకు చెందిన సహజ వనరులను ప్రజాస్వామ్యం పేరుతోనే ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా అప్పజెప్పడం మొదలయింది.

ఫలితంగా ప్రజల్లో వివిధ రూపాల్లో వ్యవస్ధ పట్ల వ్యతిరేకత ప్రబలుతూ వస్తోంది. ప్రజలు విస్తృతంగా పోరాటాల్లోకి రావడం జరుగుతోంది. ఈ పోరాటాలను అనేక చోట్ల కంపెనీల కనుసన్నల్లో పని చేసే ఎన్.జి.ఓ సంస్ధలు నిర్వహించడం ఒక అపభ్రంశం. అపభ్రంశం అయితే కావచ్చు గానీ ఎన్.జి.ఓ ల పోరాటాలను సైతం భారత పాలకవర్గాలు సహించలేకపోతున్నాయి. ప్రజల పోరాటాలపై అమానుషమైన చట్టాల క్రింద కేసులు నమోదు చేస్తూ వేలాది మంది గిరిజనులను, మత్స్యకారులను జైళ్ళలోకి నెట్టాయి. దానితో మరింత ప్రజా వ్యతిరేకత ప్రబలిపోతోంది.

గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్ లాంటి చోట్ల మత కల్లోలాలు రెచ్చగొట్టి ప్రజల్లో చీలికలు తేవడం, ఆ వంకతో పోలీసుల చేత, మతోన్మాదుల చేత కార్మిక వర్గ ప్రజానీకంపై ఊచకోతలు అమలు చేయడం కూడా ప్రజా పోరాటాల అణచివేతలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. గుజరాత్ మారణకాండ అనంతరం ఆ రాష్ట్రంలో అత్యంత వేగంగా, అత్యంత కఠినంగా కంపెనీలకు అనుకూలమైన విధానాలను అమలు చేయగల శక్తిని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సంపాదించింది.

ముస్లిం ప్రజలపై హిందూ కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టి ఊచకోతలకు పురిగొల్పడం ద్వారా ఒకవైపు ముస్లిం కార్మిక వర్గాన్ని భయాందోళనలకు గురి చేశారు. మరోవైపు హిందూ కార్మిక వర్గానికి తాము విజయం సాధించామని, ఆధిపత్యం పొందామని ఒక కృత్రిమమైన ఊరడింపు భావనలకు గురి చేశారు. ఈ ఊరడింపు రంధిలో గుజరాత్ ప్రభుత్వం తమ ప్రయోజనాలను కూడా హరించివేసే ఆర్ధిక సంస్కరణలను అమలు చేసిందని, స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు రాష్ట్ర భూములను వనరులను అప్పగించి తమకు మొండి చేయి చూపారని గ్రహించలేకపోయారు.

ఈ పరిస్ధితుల్లో న్యాయ వ్యవస్ధ తానున్నానంటూ రంగంలోకి దిగింది. తనకున్న అధికారాలను వినియోగిస్తూ గుజరాత్ కేసులను తిరగదోడింది. సాక్ష్యాలు లేవంటూ కొట్టివేసిన కేసుల్లో పదుల సంఖ్యలో దోషులకు తీవ్ర శిక్షలు పడేలా చేసింది. స్వయంగా విచారణను పర్యవేక్షించడం ద్వారా రాజకీయ నేతల జోక్యానికి అడ్డుపడింది. ఒక మాజీ మంత్రికి, సంఘ్ పరివార్ లోని ఒక సంస్ధ నాయకుడికి సైతం శిక్ష పడడంతో న్యాయ వ్యవస్ధ పని చేస్తోందన్న అభిప్రాయాన్ని ప్రోది చేయగలిగింది.

కానీ ఈ క్రమంలో అత్యంత ముఖ్యమైన దోషి అని ప్రజలు భావించిన వ్యక్తిని నిర్దోషిగా సర్టిఫికేట్ ఇవ్వడంలో సుప్రీం కోర్టే ముఖ్యపాత్ర పోషించడం విస్మరించరాని అతి ముఖ్యమైన పరిణామం. సుప్రీం కోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేక కేసులలో దోషులను గుర్తించిన ఖ్యాతి దక్కించుకున్నప్పటికీ అసలు దోషులను మాత్రం విడిచిపెట్టిందని గుజరాత్ ముస్లింలు భావించడం పరిశీలకుల దృష్టిని దాటిపోలేదు. సిట్, తన నివేదికలో చేసిన కొన్ని వ్యాఖ్యలు, పరిశీలనలు గమనించినట్లయితే, ముఖ్యమైన దోషులను తప్పించడానికే సిట్ పని చేసిందా అన్న అనుమానం కలగక మానదు.

అవినీతి కేసుల్లో సైతం న్యాయ వ్యవస్ధ తనంతట తానుగా (సు మోటో) ప్రారంభించిన కేసులు నత్త నడక నడుస్తున్నాయి. మహారాష్ట్రలో 70,000 కోట్ల ఇరిగేషన్ కుంభకోణంలో ప్రధాన దోషి అయిన శరద్ పవార్ బంధువు ఇప్పటికీ పదవులు అనుభవిస్తున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ కేసు రాజకీయ వర్గాల రాజీతో అటకెక్కే దశకు చేరుకుంది. ప్రాసిక్యూషన్ లాయర్లే నిందితులయిన కంపెనీలతో కుమ్మక్కై కేసును నీరు గార్చడంతో 2జి కుంభకోణం కేసు తేలిపోయే దశలో ఉంది. బొగ్గు కుంభకోణంలో బి.జె.పి, కాంగ్రెస్ నేతలు ఇరువురూ దోషులే కావడంతో ఆ కేసు కూడా నీరు గారిపోనుంది. అసలు తవ్వకాలే జరగనప్పుడు నష్టం ఎలా వస్తుందన్న వాదనతో పాలక, ప్రతిపక్షాలు రెండూ ఏకీభవిస్తున్నాయి. ఇక కోర్టులు చేయడానికి ఏమీ మిగల్లేదు. ఒకవేళ మిగిలినా కోర్టులు చేసేది కూడా ఏమీ ఉండదని 2జి, గుజరాత్ అల్లర్లు, గుజరాత్ బూటకపు ఎన్ కౌంటర్లు లాంటి కేసుల విచారణ ద్వారా తేలిపోయింది.

కోర్టులకు అధికారాలు ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్ధితిలో అవి ఉన్నాయి. అయినప్పటికీ అప్పుడప్పుడూ కోర్టులు ప్రదర్శిస్తున్న కాస్త క్రియా శీలత సైతం సమస్యగా ఎగ్జిక్యూటివ్ భావిస్తోంది. కోర్టుల వల్ల అటవీ హక్కుల చట్టాన్ని కాస్త పట్టించుకోవలసిన అవసరం ప్రభుత్వాలకు ఏర్పడింది. భూ సేకరణ కోసం గ్రామ సభల అనుమతి తప్పనిసరిగా తీసుకోవలసిన పరిస్ధితి ఏర్పడింది. గ్రామ సభల అనుమతి తప్పనిసరి కావడం వల్ల వేదాంత బాక్సైట్ పరిశ్రమ ప్రాజెక్టు రెండో దశకు అనుమతి రద్దు చేయవలసి వచ్చింది. పోస్కో ఇనుము ఉక్కు కర్మాగారం పదేళ్లుగా ప్రతిష్టంభనకు గురయింది. బళ్లారీ ఇనుప గనుల తవ్వకాలు ఆగిపోయి ఆ ప్రభావం ఇతర గనుల తవ్వకాలపై కూడా పడింది. దానితో గనుల తవ్వకాల్లో ప్రతిష్టంభన ఏర్పడి జి.డి.పి అమాంతంగా పడిపోయింది.

దేశ ప్రజలకు చెందవలసిన సహజ వనరులను విచ్చలవిడిగా తవ్వి తీసి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా జి.డి.పి వృద్ధి నమోదు చేసుకుని అదే దేశ అభివృద్ధిగా చెప్పుకున్న దళారీ పాలకవర్గాలకు కోర్టుల కనీస క్రియాశీలత వలన ఆ అవకాశం లేకుండా పోయింది. ఆ విధంగా పాలకుల ఆదాయం పడిపోయింది. అవినీతి ఆదాయం తగ్గిపోయింది. ఇదంతా కేవలం నామ మాత్రంగానే. కానీ ఈ మాత్రపు క్రియాశీలత కూడా ప్రజల్లో చైతన్యాన్ని ప్రేరేపించడం పాలకవర్గాలకు ఎదురవుతున్న అసలు సమస్య. ప్రజల చైతన్యం ప్రాధమిక దశలో ఉన్నా సమస్యగా పాలకవర్గాలు భావిస్తాయి. ఒక చోట మొదలైన చైతన్యం క్రమంగా అదుపు చేయలేని దశకు చేరుతుందని వివిధ ప్రాంతాల్లో చెలరేగిన ప్రజా పోరాటాలు పాలక వర్గాలకు కనువిప్పు కలిగించి ఉండవచ్చు.

ఈ నేపధ్యంలో న్యాయ వ్యవస్ధను నియంత్రించ వలసిన అగత్యం ప్రభుత్వాలకు వచ్చి పడింది. యు.పి.ఏ ప్రభుత్వం ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించింది. కూటమి పరిమితుల వల్ల వాటిని పూర్తి చేయలేకపోయింది. జి.డి.పి వృద్ధిని మేఘాల వెంట పరుగెత్తిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన ఎన్.డి.ఏ/బి.జె.పి/మోడి ప్రభుత్వం సరిగ్గా ఆ లక్ష్యం కోసమే సుప్రీం కోర్టు, హై కోర్టు జడ్జిల నియామకాలలో చొరబడడానికి చట్టం చేయబోతోంది. కమిషన్ లో ఉండే 6గురు సభ్యులలో సగంమంది న్యాయ వ్యవస్ధ నుండే ఉన్నప్పటికీ నియామకాలు క్రమంగా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తున్నందున వారి చెప్పు చేతల్లో నడిచే జడ్జిల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఆ విధంగా జడ్జిలు కూడా ప్రభుత్వం మాట ప్రకారం పోయే రోజులు వస్తాయి. తద్వారా న్యాయ వ్యవస్ధను చేతుల్లో పెట్టుకోవడం ప్రభుత్వాలకు ఇప్పటికన్నా ఇంకా తేలిక అవుతుంది.

ఒక సంగతి మాత్రం విస్మరించరాదు. కోర్టులు ప్రదర్శిస్తున్న కనీస క్రియాశీలత కొంతమంది దోషులకు శిక్ష పడేలా చేయవచ్చు గానీ అది వాస్తవంలో యధాతధ స్ధితిని (status quo) కాపాడేందుకే దోహదం చేస్తుంది. అనగా వర్తమాన అంతరాల అన్యాయ వ్యవస్ధను కొనసాగించేందుకు, దానిపై ప్రజల నమ్మకాన్ని పెంచేందుకు దోహదం చేస్తుంది. రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ ఎంతగా దిగజారి, మకిలి పట్టి, కృశించి పోయినప్పటికీ, ఎంతగా ప్రజలను పీడిస్తున్నప్పటికీ వారిని సరి చేయడానికి న్యాయ వ్యవస్ధ ఉంది అన్న భ్రమలను కలిగించడానికే ఆ కాస్త క్రియాశీలత దోహదం చేస్తుంది తప్ప వ్యవస్ధలోని మౌలిక లోపాలను అది ఎంత మాత్రం సరి చేయలేదు. అటువంటి నామమాత్ర క్రియాశీలతను సైతం పాలకులు భరించలేని స్ధితిలో ఉన్నారంటే మునుముందు ప్రజలు ఎటువంటి దారుణాలను ఎదుర్కోవలసి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

One thought on “స్టేటస్ కో కోసమే జ్యుడీషియల్ కమిషన్ బిల్లు

  1. సరిగ్గా ఈ పాయింట్‌ దగ్గరే యు.పి.ఎ. విపలమైంది. ధరలు పెరగడం, ఆర్దిక ప్రగతి కుంచించుక పోవడం ఎంత మాత్రం కాదు. ఒక రాజా, కనిమొళి, బళ్ళారి సోదరులు, జగన్‌ మోహన్‌ రెడ్డి లాంటి వారు జైలుకు వెల్లడం వంటి సంఘటనలు భారత పాలక వర్గాలకు మింగుడు పడలేదు. తమ వద్ద అధి కారం ఉండి దాన్ని వినియోగించుకోలేక పోవటం వారికి ఎంత మాత్రం సహించలేని పరిస్తితి. దీని వల్లనే యు.పి.ఎ. ని ఎడమ కాలితో నెట్టెశారు. అది ప్రజలి చేసిన పని భ్రమలు కల్పిస్తున్నారు. ఇందుకే కార్ఫొరేట్‌ మధగజాలు తమ శక్తినంతా వినియోగించి ఈ పల సాయాన్ని సాదిస్తున్నారు. పాపం యు.పి.ఎ!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s