తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల మీద అమానుషంగా దాడి చేస్తున్న ఉక్రెయిన్ ప్రభుత్వం ఉక్రెయిన్ యువకులను బలవంతంగా యుద్ధ క్షేత్రానికి తరలిస్తోంది. ఉక్రెయిన్ సైన్యాలు ఫైటర్ జెట్ లతో ఇళ్ళు, భవనాలు, పాఠశాలలు, హోటళ్లు, కాలేజీలు… ఇలా కనపడిందల్లా కూల్చివేస్తుండడంతో డొనేట్స్క్, లుగాన్స్క్ రాష్ట్రాలు తీవ్రమైన మానవతా సంక్షోభం (humanitarian crisis) లో ఉన్నాయి. పెద్ద మొత్తంలో ప్రజలు సరిహద్దు దాటి శరణార్ధులుగా రష్యాకు తరలిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తూర్పు ఉక్రెయిన్, ఉక్రెయిన్ కు మరో గాజా గా మారిపోయింది.
సంక్షోభ పరిస్ధితుల దృష్ట్యా ఐరాస నుండి తూర్పు ఉక్రెయిన్ వాసులకు సహాయం అందించాలని రష్యా ఐరాసను కోరింది. కానీ ఐరాస రంగంలోకి దిగకుండా అమెరికా అడ్డు పడింది. ఇ.యు-అమెరికా అనుకూల ప్రభుత్వంతో సహకరించనందుకు చస్తే చావాలి గానీ ఐరాస సహాయం చేయడానికి వీలు లేదని ఆ విధంగా అమెరికా చాటింది.
ఉక్రెయిన్ సైనికులకు సరైన వేతనాలు లేవు. ఇచ్చే వేతనాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. అసలు ఇస్తారో లేదో కూడా అనుమానమే. ఉక్రెయిన్ ప్రజలు యుద్ధాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. తమకు ఆందోళనలతో సంబంధం లేదని, ఇ.యు వ్యతిరేక, అనుకూల ఆందోళనలో ఎన్నడూ పాల్గొనలేదని, తమ మానాన తమను వదిలేస్తే అదే పదివేలని వారు మొరపెట్టుకుంటున్నారు.
యువకులను రిక్రూట్ చేసుకోవడానికి తాఖీదులు తెచ్చిన రిక్రూటింగ్ సెంటర్ అధిపతి ముందే తమ మగవాళ్ళకు వచ్చిన తాఖీదులను తగలబెడుతున్న దృశ్యాన్ని ఈ కింది వీడియోలో చూడవచ్చు. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అధికారులు మాత్రం యువకుల్ని తీసుకెళ్తారని సదరు అధికారి చెబుతున్నారు. వీడియోలోని ఉక్రెయిన్ భాషను ఒక వెబ్ సైట్ (బిఫోర్ ఇట్స్ న్యూస్) ఆంగ్లంలోకి అనువాదం చేసింది. ఈ అనువాదాన్ని వీడియోలో కూడా చూడవచ్చు. సంభాషణను తెలుగులోకి అనువదించి ఇక్కడ ప్రచురిస్తున్నాను.
ఉక్రెయిన్ సైన్యాధికారితో మహిళ: మీరు ఎవరు?
అధికారి: స్ధానిక రిక్రూటింగ్ సెంటర్ అధిపతిని.
మహిళ: మిలట్రీ తాఖీదులు ఎందుకు తెస్తున్నారు?
అధికారి: ఇవి పైనుండి వచ్చిన ఆదేశాలు. వివరాలన్నీ నేను చెప్పలేను. ఇంటర్నెట్ లో వాటిని చూడవచ్చు.
అధికారి: తాఖీదులు మీకు ఎప్పుడు అందాయి?
మహిళ (తీవ్ర అసంతృప్తితో): నిన్న సాయంత్రం.
మరో మహిళ: ఇది ఇటీవల అందింది.
అధికారి: అవును, రిక్రూట్ చేసుకోగల వారిని మేము కంట్రోల్ లో ఉంచుకోవడానికి వాటిని పంపాము.
ఇంకో మహిళ: మాకు అది అవసరం లేదు. మాకు యుద్ధం వద్దు.
(మరింత మంది మహిళలు అదే మాటను అధికారితో చెప్పారు.)
అసంతృప్త మహిళ: తాఖీదులపై సంతకం చేయనివారి సంగతి పోలీసులు చూస్తారని మాకు చెప్పారు. ఏమిటి దానర్ధం?
అధికారి: మొత్తం అందరిని కదిలించాలని పై నుండి ఆదేశాలు అందాయి.
మరో మహిళ: ఇలాంటి కధలు మాకు చాలా చెప్పారు. యుద్ధానికి వెళ్లనివారిని 5 సం.లు జైలులో పెడతామని హెచ్చరించారు.
అధికారి: ఒకటి చెప్పండి, ఇప్పటి వరకు ఎవరినన్నా యుద్ధానికి తీసుకెళ్ళామా?
మహిళ: ఎవరో ఒకరిని తీసుకెళ్లేసరికి మాకిక బాధపడే సమయం కూడా ఉండదు.
మరో మహిళ: మేము ఎప్పుడూ మైదాన్ (రాజధాని కీవ్ లో మైదాన్ -ఇండిపెండెంట్ స్క్వేర్- లో జరిగిన ఆందోళనలకు ఇది ప్రస్తావన) లోకి రాలేదు. మేము ఎవరిని ముట్టుకోలేదు. మాకు యుద్ధం వద్దు.
అధికారి చేతిలోకి పుస్తకం తిరగేస్తుండగా…
పెద్దాయన (కోపంతో): మీ రిక్రూట్ జాబితా వెనక్కి తీసుకెళ్ళండి. ఇక్కడి నుండి ఎవర్నీ యుద్ధానికి తీసుకెళ్లకుండా చూసే బాధ్యత మీదే.
అధికారి (నిజం అంగీకరిస్తూ): మీ కుమారులను వాళ్ళు ఎలాగైనా తీసుకెళ్తారు.
పెద్దాయన: ఎవరు తీసుకెళ్తారు?
అధికారి: రాజ్యం (ప్రభుత్వం).
పెద్దాయన: మీ దేశంతో మాకసలు సంబంధమే లేదు పొండి. మీరూ, మీ యుద్ధమూనూ.
అక్కడ ఉన్న జనం అంతా కలిసి తాఖీదులను సేకరించి తగలబెట్టేశారు. చివరి కాగితం కాలేవరకూ వాళ్ళు అక్కడే ఉన్నారు.
(తెలిసి చేసినా, తెలియక చేసినా ఉక్రెయిన్ మహిళలు సామ్రాజ్యవాద ప్రాక్సీ యుద్ధంలో తమ మగవారిని భాగం చేయడానికి నిరాకరిస్తున్నారు. వారికి అభినందనలు!)
